Site icon Sanchika

అంతర్మథనం-3: తథాస్తు

[box type=’note’ fontsize=’16’] “సత్యవంతుని నోటి అనుగ్రహంతో వచ్చిన మాట వరమైతే, ఆవేశంతో వచ్చిన మాట శాపమవుతుంది” అంటున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు. [/box]

[dropcap]శు[/dropcap]భం పలకరా పెళ్ళికొడకా అంటే ఏదో అన్నాడట. మాట వరుసకి ఏదో అంటే అయిపోతుందా చాదస్తం గానీ అని చాలామంది తేలిక చేసి మాట్లాడటం పరిపాటి. కారణం వారికి మాట విలువ తెలియకపోవడం. పాత ఒక రోత అని భావిస్తూ పుక్కిట పురాణాలని సాంప్రదాయవాదాలని కొట్టేస్తూ వ్యక్తిత్వ వికాసం కోసం క్రొత్త పాఠాలు నేర్చుకోవాలని తహతహలాడేవారికి పై సామెత ఎంత గొప్ప పాఠాన్ని చెబుతుందో ఎలా అర్థమవుతుంది? వ్యక్తిత్వ వికాసంలో చెప్పే మొట్టమొదటి పాఠం సాధారణంగా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోమనే చెబుతుంది.. పై పాత కాలం నాటి సామెతా అదే చెబుతోంది. పూర్వీకులు మాట వరసకి కూడా అశుభం పలకడానికి ఇష్టపడరు. కారణం వారికి వాక్శుద్ధికి ఉన్న శక్తి తెలిసుండటం. యథాలాపంగా ఏదో ఏదేదో మాట్లాడడానికి వారు ఇష్టపడేవారు కాదు. తథాస్తు దేవతలుంటారని, వారు మన మాటలని నిజం చెయ్యడానికే చూస్తారని వారి విశ్వాసం… బద్ధ శత్రువుల మధ్య తరతరాలనుంచీ వస్తున్న వైషమ్యాన్నీ చెరిపివేసే శక్తి ఒక చిన్న మాటకున్నది. అలాగే ప్రాణమిత్రులను కూడా ఒక చిన్న మాట దూరం చేయగలదు. కట్టడం ఎప్పుడూ శ్రమతో కూడుకొన్నదే… పడగొట్టడం చాలా తేలిక. ఎవరి నోట వెంట ఏ మాట వచ్చినా ‘తథాస్తు’ అని తథాస్తు దేవతలు దీవించేస్తూ ఉంటారు. జరగకూడనిది జరిగితే చక్కదిద్దుకోవటం కష్టం గనుక, అవాంఛనీయమైనదానిని అభిలషించొద్దని మాట వరుసకి కూడా అశుభం పలకొద్దని చెప్పారందుకే.

శుభం పలకడం, శుభాన్ని కోరుకోవడం కన్నా గొప్పదైన ‘సానుకూల దృక్పథం’ ఉంటుందా? ‘అంతా మన మంచికే’ అనుకోవడం జ్ఞాని లక్షణం. చెడు జరిగినా సరే, మన మంచికే అనుకొని సాగిపొతారు. జరగకూడనిది జరిగాక జరిగినందుకు ఏడుస్తూ కూర్చోక తదుపరి కర్తవ్యం గురించి ఆలోచించమంటాడు జ్ఞాని. మన ఏడుపులు గతాన్ని మార్చలేవు. కాని మన తలపులు భవిష్యత్‌ని తీర్చిదిద్దగలవు. అందుకే పుణ్యకార్యాలన్నీ సంకల్పంతో ప్రారంభిస్తారు. సంకల్పం అంటే శుభ సంకల్పం అని వేరే చెప్పనవసరం లేదు. అయితే సంకల్పించినంత మాత్రానా పనులు జరిగిపోతాయా అనేది సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుంది. పనులు ప్రారంభించటం అందరూ చేస్తారు… దృఢ సంకల్పం కలవారే పనులు పూర్తి చేయగలుగుతారు. సంకల్పం కేవలం స్వవిషయాలకే పరిమితం కాదు. ఇతరుల విషయాలకీ వర్తిస్తుంది. ఇతరుల కోరికలు ఫలించాలని కానీ, ఇతరులకేమి కావాలని నీవు కోరుకుంటావో అది కుడా ఫలిస్తుంది. ఇతరులకు శుభం కలగాలనే  నీ ఆకాంక్షయే దీవెన అవుతుంది. నీ దీవెనను ప్రతిఫలింపజేసేది నీ సత్యసంధతే. అది నీ వాక్కును సిద్ధింపజేస్తుంది. అదే వాక్కు ప్రతికూల ఫలితాలను ఇవ్వగలదు. సత్యమే దైవం కదా. సత్యమున్న చోట దైవబలం ఉంటుంది. అందుకే పుణ్యకార్యాలు తలపెట్టినప్పుడు వాక్శుద్ధి కలిగిన పురోహితులను ఆశ్రయిస్తారు. వారి నోటి మాట ఫలిస్తుందని నమ్ముతారు. సత్యసంధులు ఆచి తూచి మాట్లాడుతారు. స్థూలంగా చెప్పాలంటే అధిక ప్రసంగీకుల మాటలు ఫలించవు.

ముండకోపనిషత్తు నుంచి స్వీకరించబడిన మన జాతీయ నినాదం ‘సత్యమేవ జయతే’ – సత్యానిదే జయం అని చెబుతోంది. సత్యవంతుని నోటి అనుగ్రహంతో వచ్చిన మాట వరమైతే, ఆవేశంతో వచ్చిన మాట శాపమవుతుంది. తపోదీక్షలో ఉన్న తనను తాకి తన ఏకాగ్రతను భగ్నం చేశాడని తాకినవాని శిరస్సు మరునాడు సూర్యుడు ఉదయించగానే ముక్కలై పోవాలని మాండ్యవ మహాముని శపిస్తాడు. తాకినది పతివ్రత అయిన సుమతి భర్త. రోగిష్టి అయిన భర్త కామవాంఛను తీర్చడానికి నడవలేని భర్తను గంపలో కూర్చోబెట్టి తీసుకువెళుతుండగా అనుకోకుండా జరిగిన సంఘటన అది. తాను పతినే దైవంగా భావించి సేవించే ‘సతినే’ అయ్యుంటే సూర్యుడు ఉదయించకుండుగాక అని సంకల్పిస్తుంది. సూర్యోదయం ఆగిపోతుంది. ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది. ఆ విపత్తు నుంచి కాపాడమని అనసూయను వేడుకొంటారు. పతివ్రత అయిన అనసూయ సుమతికి నచ్చజెప్పి తన ప్రతినను వెనక్కి తీసుకునేలా చేసి సూర్యుడిని ఉదయింపజేసి, మరణించిన ఆమె భర్తని తిరిగి బ్రతికిస్తుంది తన సంకల్పంతో. అనసూయ ప్రాతివత్య మహిమను విన్న త్రిమూర్తులు ఆమెను పరీక్షించదలచి, అన్నార్తుల వలె ఆమె ఆశ్రమానికి వెళ్ళి యాచించి నగ్నంగా వడ్డించమంటారు. త్రిమూర్తులను పసిపాపలుగా మార్చివేసి జగన్మాతలను భర్తల కోసం ప్రాధేయపడేలా చేసుకొంటుంది. ఆ ప్రతివతలకు ఆ శక్తి వారి ధర్మనిరతే ప్రసాదించింది.

శ్రవణకుమారుని తల్లిదండ్రుల శాపమే లేకపోతే రామాయణ కథే లేదు. పొరబాటున శబ్దభేదితో శ్రవణకుమారుని ప్రాణాలు హరించిన పాపానికి దశరథుడు పుత్ర వియోగంతో అలమటించిపోవాల్సివచ్చింది. సత్యసంధులైన తన భక్తుల నోటి మాటను నెరవేరేలా చూడడానికి పరమాత్ముడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మాన్యులు శాపాల్నే కాదు, వరాలను ఇస్తారు. అయితే శాపం మన ప్రమేయం లేకుండానే వారు అనుభవంలోకి వస్తుంది. అయితే వరాన్ని ఫలించమని కోరుకుంటేనే ఫలిస్తుంది. దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్ష చేయబోయి కుంతి చిక్కుల్లో పడింది. లేకపోతే కర్ణుడు ఉండేవాడు కాదు. కర్ణుడు లేని భారతమెక్కడుంటుంది? ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని ఋజువు చేయడానికి శ్రీకృష్ణుడు ఎన్నో లీలలను ప్రదర్శించాల్సి వచ్చింది. ధర్మసూక్ష్మాన్ని గ్రహించలేని వాళ్ళ చేత నిందలు కూడా పడవలసి వచ్చింది కృష్ణుడికి. అధర్మ పక్షాన నిలిచిన భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి వీరులను పడగొట్టడానికి హద్దులు మీరాల్సి వచ్చింది కూడా. నేటి కలియుగానికి కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు త్రేతాయుగంలో రామాయణం జరగడం వలన శ్రీరాముడు రామబాణంలా తిన్నగా దూసుకుపోయాడు. కాని కలియుగానికి కేవలం కొన్ని సంవత్సరాలకు ముందే ద్వాపర యుగం జరిగి యుండడంతో ధర్మదేవత కేవలం రెండు పాదాల మీదే నడయాడుతుండడం వలన, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు కొన్ని మాయలను చేయాల్సివచ్చింది. ఈ శాపాలు, వరాలు, మాయల నుంచి మనం గ్రహించవలసింది ఏమిటంటే – మనలో సత్యసంధత ఉంటే మన నోటి మాట నెరవేర్చడానికి భగవంతుడు తోడ్పడుతాడని; అందుకే ‘సకుటుంబ ఆయురారోగ్యాల’తో బాటు, ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే అనాలి. ఒక వేళ మనము న్యాయబద్ధంగానే ఉన్నా మనకి అవరోధాలు కలిగిస్తున్నవారిని ఆవేశంలో తూలనాడితే అవి ఫలించడం మాట అటుంచి, ముందు అప్పటివరకు మనం కూడగట్టుకున్న శక్తంతా ఆవిరైపోతుందని గ్రహించాలి; ఇందుకు ఉదాహరణ విశ్వామిత్రుడు. ఆవేశంలో ఏదో అనేసి శక్తినంతా ఆ శాపానికి వినియోగించేయడం వలన మరలా శక్తిని సముపార్జించటం కోసం మరల మరలా తపస్సు చేయవలసి వచ్చేది. ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు మాత్రమే దుర్మార్గులను నిరోధించడానికి ఆపద్ధర్మ సూత్రాన్ని వాడవచ్చని; అయితే ఏ ఉద్దేసంతో చేసినా చిత్రగుప్తుడి చిట్టాలో తప్పు, ఒప్పు అనే రెండు పుటలు మాత్రమే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఉద్దేశం ఆయన చూడరు. తప్పయితే తప్పు పుటలోనే నమోదు చేసేస్తారు.  తరువాత ఎప్పుడో ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుందని మరువకూడదు.

Exit mobile version