Site icon Sanchika

పరిణత కథలవాణి ఆలూరి

[డా. ఆలూరి విజయలక్ష్మి గారి ‘అంతర్ముఖం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీలక్ష్మి.]

 

[dropcap]“వ్యా[/dropcap]పార వైద్యంలో సేవాభావం నేతి బీర!” అంటూ నేటికాలంలో కవితలు రాసుకుంటున్న మనకి “వైద్యుడు మేధస్సుకు హృదయాన్ని కలిపి వైద్యం చేయాలి. డాక్టర్‌కి రోగి పట్ల నిజాయితీ, సహానుభూతి ఉండాలి” అన్న మాటలను, ఒక కథలోని ఒక పాత్ర నోటి నుంచి విన్నప్పుడు, ఆసుపత్రులంటే భయపడుతున్న మనకి గొప్ప ఊరట కలుగుతుంది. జీవితం ఆశాజనకంగా ఉన్నట్టు, పోతున్న ఊపిరి ఆడుతున్నట్టు ఉంటుంది. తాను స్వయంగా డాక్టర్ అయిన సుప్రసిద్ధ రచయిత్రి, 60 ఏళ్లకు పైబడి అలుపెరుగక రాస్తున్న కలం ఆలూరి విజయలక్ష్మి గారిది. 60 సంవత్సరాల క్రితం డాక్టర్ కోర్సులో చేరిన పూర్వ విద్యార్థులందరూ కలిసిన అపురూప సందర్భాన్ని వివరిస్తూ రాసిన ఒక చక్కని కథ ‘అంతర్ముఖం’. అందులోని వేణు అనే డాక్టర్ పాత్ర అన్న మాటలను మరో డాక్టర్ గుర్తుచేసుకుంటుంది. అందుకే వైద్యులు దేవుళ్లతో సమానం అంటూ ఉంటారు. ఈ మాటల ద్వారా ఆలూరి గారు తోటి డాక్టర్లందరికీ తమ కర్తవ్యాన్ని సున్నితంగా గుర్తు చేశారు.

ఆరు దశాబ్దాలుగా ఒక చేత్తో వైద్య వృత్తిని చేపట్టి, మరో చేత్తో సాహితీసేద్యం చేస్తూ రెండింటినీ విజయవంతంగా నిర్వహిస్తున్న సీనియర్ రచయిత్రి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి లేటెస్ట్ కథాగుచ్చం ‘అంతర్ముఖం’. గతంలో తాను రాసిన సాహిత్యం పేరుతో చలామణీ అయ్యే రచయిత కాదు విజయలక్ష్మి గారు. ఎప్పటికప్పుడు తన చుట్టూ మారుతున్న సమాజపు రాజకీయ, ఆర్థిక పరిణామాల్ని, నేటి హైటెక్ యుగంలోని యువత తీరుతెన్నులతో సహా నిశితంగా గమనిస్తూ రాసిన కథలివి.

యువతను పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో డ్రగ్స్ వాడకం ఒకటి. ఊబి లాంటి ఈ అలవాటు యువతని ఎలా పెడదారి పట్టిస్తుందో ‘ఊబి’ కథలో చక్కగా చెప్పారు. అలాగే తాగుడు మైకంతో యాక్సిడెంట్ చేసి తన తప్పు తెలుసుకున్న  యువకుని కథ ‘దిశ’. బతుకు లోతులకు అద్దం పట్టిన కథ ‘పరిమళం’. కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా రోగులకు వైద్యం చేసిన డాక్టర్లకి నిజంగా ఆ సమయం, యుద్ధభూమిలో యుద్ధం చేస్తున్న సైనికుల పరిస్థితే. ఈ విషయాన్ని ‘యుద్ధభూమి’ కథ చెబుతుంది.

ఈ కథల సంపుటిలో మరో మంచి కథ ‘ధిక్కారం’. తాయెత్తులను, శాంతి పూజలను, బాబాల మహిమలను నమ్మి కర్తవ్యం మరిచి పోయే వారిని విమర్శిస్తూ ఉంటుంది శ్యామల అనే అమ్మాయి. ఆమెకు నయం కాని ఆరోగ్య సమస్య ఉన్న బిడ్డ పుట్టాక, ఏదో ఒక మహిమ వల్ల తన బిడ్డ ఆరోగ్యం బాగవు తుందేమోనని ఆశపడిన శ్యామల, చివరికి తన బలహీనతను గుర్తెరిగి, ఆ భయం చీకటి నుండి బయటపడి ధైర్యం వెలుగు వైపు నడుస్తుంది.ఎంతో హేతువాదులం అనుకునే వారు కూడా తమ కుటుంబం విషయంలో నెమ్మదిగా మూఢనమ్మకాల వైపు ఒరగడం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఈ కథ ఎందరికో కనువిప్పు.

తీసుకున్న ప్రతి కథావస్తువును గురించిన పూర్వాపరాలను విశదంగా చర్చించారీమె. జెండర్ చైతన్యం లేని ప్రభుత్వాల గురించీ, ఆడవారిని మాయలో పడేస్తున్న మార్కెట్ విన్యాసాల గురించీ, కౌమార దశలో ఉన్న యువతీయువకులకు రకరకాల వలలు వేస్తూ పెడదారి పట్టిస్తున్న ఆకర్షణల గురించీ, సోషల్ మీడియా గురించీ, మొత్తంగా మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జీవన వేగం గురించీ కూలంకషమైన వివరణ ఇస్తూ, పాఠకులని ఎడ్యుకేట్ చేసే దిశగా సమకాలీన సమస్యాత్మక సబ్జెక్టులను ఎన్నుకుని వాటిని కథలుగా మలిచారు రచయిత్రి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథల సంపుటి ఇది.

***

అంతర్ముఖం (కథా సంపుటి)
రచన: డా. ఆలూరి విజయలక్ష్మి
ప్రచురణ: విజయ సమీరా పబ్లికేషన్స్
పేజీలు: 132
వెల: ₹150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
Sri Sri Holistic Multispecialities Hospitals
Nizampet Road, Kukatpally, Hyderabad – 500072.
E mail: drvijayaaluri@gmail.com
Mobile: 9849022441
~
ఆన్‍లైన్‌లో
https://www.amazon.in/ANTARMUKHAM-Dr-Aluri-Vijaya-Lakshmi/dp/B0CNWZT6B4

~

డా. ఆలూరి విజయలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ లింక్:

https://sanchika.com/special-interview-with-dr-aluri-vijayalakshmi/

Exit mobile version