[మాయా ఏంజిలో రచించిన The Last Decision అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు.]
~
[dropcap]ఈ[/dropcap] అక్షరాల అచ్చు మరీ చిన్నవిగా ఉన్నాయి
మెలికలు తిరుగుతున్న చీమల వరుస లాగా
కాగితంపై నల్లనివేవో తడబడుతున్నట్టు
నన్నెంతో ఇబ్బంది పెడుతున్నాయి
నాకు తెలుసు,
ఇది పెరుగుతున్న వయసు వల్ల –
నేనిక చదవడం మానెయ్యాలేమో,
ఎంతో ఖరీదైన ఆహారం
వేడి వేడిగా తిననీ
చల్లగా గొంతులోకి దిగనీ
ముద్ద లోపలికి జారనంటూ
తిరుగుబాటు చేస్తుంది
రోజంతా
గొంతులోనే కూర్చుంటుంది
అబ్బ.. విసిగిపోతున్నా..
నాకు తెలుసు,
వయసైపోతుందని –
నేనిక తినడం మానెయ్యాలేమో
నా పిల్లల శ్రద్ధ ఆరాటాలతోనూ
అలసిపోతున్నాన్నేను
నా మంచం పక్కనే నిలబడి
వాళ్ళంతా ఏవేవో మాట్లాడుతున్నా
ఒక్క మాటా చెవిన బడటం లేదు
వినడమే మానేస్తానిక
జీవితమెంత వేగంగా
పరుగులు తీసింది?
నన్నెంతగా మార్చింది?
ప్రశ్నలు, జవాబులు
బరువైన ఆలోచనలు
బ్రతుకులో ఎన్నో
జమలు, తీసివేతలు
హెచ్చవేతలు చూసాను
జీవన గణాంకమిపుడు
శూన్యసూచీకి చేరుకుంది
ఈ రోజు నేనిక
జీవించడాన్నే త్యజిస్తాను!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.