చీమలు

0
1

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా చీమల గురించి, చీమలలోని రకాల గురించి, మానవాళికి అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

వరండాలో ఆడుకుంటున్నారు ఆర్యన్, పరి. ఉన్నట్లుండి కెవ్వుమని అరిచి, “అమ్మమ్మా!” అని ఏడవటం మొదలుపెట్టింది పరి. చేస్తున్న పని మాని వాళ్ళ దగ్గరకువచ్చింది అమ్మమ్మ అంబిక.

“ఏమైంది?” అంటూ దగ్గరకు వెళ్లింది. ఇద్దరూ అరచేతులు పట్టుకుని ఏడుస్తున్నారు. చేతులు విదిల్చి దేన్నో వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మమ్మ ఇద్దరి చేతులు తనచేతిలోకి తీసుకుని చూసింది.

రెండు గండు చీమలు వాళ్ళ అరచేతులు గట్టిగా పట్టుకుని వదలటం లేదు. పిల్లలు నొప్పితో భయంతో ఏడుస్తున్నారు.

అమ్మమ్మ ఆ చీమలను బలవంతానా లాగి పడేసింది. చేతుల్లో ఇద్దరికి చీమకోరికిన చోట ఎర్రగా రక్తంలా కందిపోయి దద్దురు వచ్చింది.

“అమ్మమ్మా నొప్పిగా ఉంది”.

“ఉండదా మరి? గండు చీమ కొరికితే. లోపలికి రండి పసుపు పెడతాను. ఐస్ పెడతాను” అంటూ, “అయినా ఆర్యన్ మీరెందుకు చీమల దగ్గరకు వెళ్లారు? చీమ ఎలా కొరికింది?” అడిగింది.

“అమ్మమ్మా! మేమిద్దరం వరండాలో కూర్చుని ఆడుకుంటున్నాము” అని ఆర్యన్ ఇంకా చెప్పబోతుంటే పరి “నువ్వు ఆగు అన్నా! అమ్మమ్మా! మేము గోడ పక్కగా వరుసగా వెళ్తున్న చీమల్ని చూసి దగ్గరకు వెళ్ళామా? అవి ఎక్కడినుండో ఫుడ్‌ని తీసుకువెళ్తున్నాయి…” అంది.

“నువ్వు ఇంక చెప్పింది చాలు. ఆగు…” అని ఆర్యన్ విషయం చెప్పాడు.

“అమ్మమ్మా! మేమిద్దరం అదే ముందు నేను… నన్ను చూసి పరి… చీమలు ఏమి తీసుకువెళ్తున్నాయో చూడాలని దగ్గరగా వెళ్లి వాటిని పట్టుకున్నాము. అంతే స్టుపిడ్.. బాడ్ చీమలు మా ఇద్దరి చెయ్యి కరిచి నువ్వు తీసే దాకా వదలలేదు” అన్నాడు.

“అయ్యో! అదా జరిగింది” అంటూ ఇద్దరికి చేతికి పసుపు పూసి ఐస్ పెట్టింది అంబిక.

“అమ్మమ్మా! తాతకు చెప్పి చీమల్ని చంపించేద్దాము” అన్నాడు ఆర్యన్ కోపంగా.

“మీరు చేసిన తప్పుకి వాటిని ఎందుకు చంపాలి? మీరు అనవసరంగా వాటి పనిలో చెయ్యి పెడితే అవి మిమల్ని శత్రువులనుకుని కుట్టాయి” అంది అమ్మమ్మ. వాళ్ళని సమర్థించనందుకు కోపంతో, చీమ కాటు నొప్పితో ఇద్దరు బుంగమూతితో గదిలోకి వెళ్లిపోయారు. వాళ్ళ దగ్గరకు వెళ్లిన అంబిక “పిల్లలూ… ఇవ్వాళ మీకు కథ నేను చెప్పను. చీమ చెబుతుంది” అంది. అది విన్న పిల్లలు “హే! చీమ కథ చెబుతుంది” అని సంతోషంతో అరిచి స్టోరీ టైం కోసం ఎదురుచూస్తున్నారు.

వాళ్ళు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. గదిలోకి అమ్మమ్మ చీమ బొమ్మతో వచ్చింది.

“హాయ్! కిడ్స్! బాగున్నారా? మా సైనిక చీమలు మిమల్ని గట్టిగా కుట్టినట్టున్నాయి… పాపం!” అంది చీమ.

దాన్ని గుర్రుగా చూస్తూ పరి “ఇంతకీ నువ్వు ఎవరు?” అంది.

“పరి పాపా! నన్ను గుర్తుపట్టలేదా? నేను చీమని.”

“అది తెలుసు. చీమల్లో నువ్వెవరివి? పేరేంటి?” అన్నాడు ఆర్యన్.

“నేను చీమలకి రాణిని. నాపేరు మాచి. మీకు నా గురించి చెప్పమని నన్ను మీ అమ్మమ్మ పిలిస్తే వచ్చాను. వినండి నా/మా సంగతులు” అంటూ చెప్పసాగింది.

“మీరు నన్ను అదే చీమలను మీ ఊళ్ళో చూశారు కదా!”

“లేదు మా ముంబైలో చూడలేదు నిన్ను. మా మమ్మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుతుంది. అక్కడ చీమలు ఉండవు. నీకు తెలియదా?” అన్నాడు గొప్పగా ఆర్యన్.

“అవునా? నీకు తెలుసా… మా చీమలు ప్రపంచం అంతా ఉంటాము ఒక్క ధ్రువాల వద్ద తప్ప” అంది చీమ రాణి మాచి.

“అంతే కాదు, జంతు కీటక ప్రపంచంలో మా అంత వైవిధ్యం కలిగి అంటే వెరైటీ ఉన్న సమర్ధవంత ఫ్యామిలీస్‌లో మేము మొదటగా ఉంటాము. చీమల్లో రకాలు… టైప్స్ తెలుసా?” అని అడిగింది రాణి చీమ మాచి.

“నల్ల చీమ, ఎర్ర చీమ, గుండు చీమ… నో… నో… గండు చీమ ఇంకా….” అని ఆలోచిస్తున్న ఆర్యన్‌తో-

“నేను చెబుతాను. నమ్మలేని నిజం. 12000 రకాలున్నాయి. ఒక్కో చోట అక్కడి పర్యావరణ పరిస్థితిని బట్టి రకాలుంటాయి” అంది రాణి చీమ గర్వంగా.

“అమ్మో!” అని గుండె మీద చెయ్యి వేసుకుంది పరి.

“అంతే కాదు మమ్మల్ని చాలా సమర్ధవంతమైన పని నిర్వహణ కల సమూహాలుగా మెచ్చుకుంటారు తెలుసా. అంత బాగా పనిచేస్తాయి చీమలు. ఒక చీమల పుట్టలో లక్షల చీమలు ఉండి పనిచేస్తాయి. ఒక్కో చీమ దాని బరువుకన్నా 20 రెట్లు/టైమ్స్ ఎక్కువ బరువు మొయ్యగలదు. నువ్వు మొయ్యగలవా?” అని అడిగింది చీమ రాణి మాచి.

“అమ్మో! 20 టైమ్స్? నో!” అన్నారిద్దరు.

“మా చీమల పుట్ట చూసావా?” అని ఫోటో చూపిస్తే ఇద్దరు కోరస్‍గా “అది పాము పుట్ట!” అన్నారు.

“కాదు. మా చీమల పుట్ట. మాకు ఆహారం దొరక్కపోయినా, ఒక్కోసారి పాము, ముంగిస లాంటి శత్రువులు మా పై దాడి చేస్తే అవి పాముల పుట్టలు అవుతాయి” అంది దిగులుగా రాణి చీమ మాచి.

అది విన్న పిల్లలు ‘పాపం! చీమలు’ అనుకున్నారు.

“మేము మా ఆహారం దాచుకోవటానికి కట్టుకునే ఇళ్ళు భూమి లోపల ఉంటాయి. మేము మట్టిని తవ్వి నేలమీదకు తెచ్చి వదులుతాము. అందువల్ల నేల ఎంతో బలంగా తయారయ్యి పంటలు బాగా పండుతాయి. చీమలు వాటి సైజ్‌ని బట్టి సైనిక చీమలు, మెగా చీమలు, కూలి చీమలు, అన్నింటి కన్నా గొప్పది, నాయకురాలు రాణి చీమలుగా ఉంటాయి. రాణి చీమ 30 ఏళ్ళు బ్రతికితే, కూలి చీమలు 3 ఏళ్ళు, మెగా చీమలు కొన్ని వారాలు బ్రతుకుతాయి.”

“అన్నా! విన్నావా? చాలా ఏళ్ళు బ్రతుకుతాయిట.”

“విన్నాను. మన అమ్మ స్ప్రే చేసి చంపేస్తుంది. మనల్ని కుట్టాయి కదా! అయినా వీటితో మాకేమి ఉపయోగం?” అన్నాడు కోపంగా ఆర్యన్.

ఆర్యన్ మాటలికి రాణి చీమకు కోపం వచ్చింది. చిన్న పిల్లలకు మా గురించి తెలియదులే పోనీ అని తిరిగి చెప్పటం మొదలుపెట్టింది.

“మీ తప్పుకాదు మీలా చాలామందికి మా గురించి తెలీదు. మమ్మల్ని చీడపురుగులా చూస్తారు. మేము మీకు, పర్యావరణానికి ఎంతమేలు చేస్తామో తెలుసా?”

“ఏమిటా మేలు?” అన్నాడు ఆర్యన్ ఎక్కిరింతగా.

“చనిపోయిన, కుళ్లిపోయిన జంతువులు, చెట్లు, ఆకులు ఇతర వ్యర్థ పదార్ధాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో నేలలో కలిపి నేల సారవంతంగా అవటానికి సాయపడతాము. అంతే కాదు మీకు కీడు చేసే చెదపురుగులు, నల్లులు, అనేక ఇతర క్రిములు, పంటలను పాడుచేసేవాటిని మేము చంపి పుణ్యం కట్టుకొంటాము.”

“ఆర్యన్ మీకు ఉన్నట్టే చీమలకు సమాచార వ్యవస్థ ఉంది. అంటే కమ్యూనికేషన్.”

“ఎలా? మేము సెల్‌లో మాట్లాడుకుంటాము మరి మీరు?” అంది వింతగా పరి.

“మేము ఫుడ్ వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఇతర చీమలకు మేము ఎటు వెళ్ళామో తెలిసేలా దారివెంట ఫెరొమోన్స్ అనే రసాయనాన్ని జల్లుతాము. ఆ వాసనతో మిగిలిన చీమలు కూడా ఆహారం తెచ్చి పుట్టలో దాస్తాయి. చీమలు ఇంటికి, ఫుడ్ ఉన్న చోటికి వెళ్లి తిరిగిరావటానికి కొన్ని బండ గుర్తులు, సూర్యుడి గమనం ఆధారంగా వెళ్తాయి. ఒక్కోసారి వాటి దోవలో ఏదైనా అడ్డంకి వస్తే అంటే నీళ్లు పోయటం, రాయి పడటం లాంటివి జరిగితే దారి మార్చి ఫుడ్ ఉన్న చోటికి వెళ్తాయి.”

“మీ మనుషుల్లో ఎవరైనా కొడితే ఏమిచేస్తారు?”

“పిల్లలు పెద్దవాళ్లకు చెబుతారు. పెద్దవాళ్ళు అయితే పోలీస్‍కి చెబుతారు అంతే!” అంది పరి చేతులూపుతూ.

“అలాగా !మా చీమలకు ఇతర జీవుల్లా రక్షణ పద్దతులున్నాయి. ఎవరైనా మా మీద దాడికి ప్రయత్నిస్తే మేము తప్పించుకోవటానికి వాళ్ళని గట్టిగా అందిన చోటల్లా కుడతాము.”

“ఓహ్! పొద్దున్న మా ఇద్దర్ని మీ చీమలు రక్తం వచ్చేలా కుట్టాయి” అన్నాడు ఆర్యన్.

“అవును. మీరు మా వాళ్ళ ని ఇబ్బంది పెట్టారు. అందుకే మా సైనిక చీమలు మీ మీద దాడి చేసాయి. కొరకడం, కుట్టటం, రసాయనాలను చర్మంలోకి వదలటం లాంటివి చేస్తాం. సాధారణంగా చీమలకు రెక్కలుండవు. నడక మాత్రమే తెలుసు ఒక్కోసారి. పెద్ద సంఖ్యలో ఆకులాంటి ఆధారంతో నీటిని దాటటం చూసుంటారు. కప్ప, సాలీడు, పక్షులు, ముంగిస లాంటి ఎన్నో జీవులకు మేము ఆహారం. కొన్ని చోట్ల మనుషులు కూడా మమ్మల్ని, మా గుడ్లు, లార్వాని తింటారు. మందుల్లో వాడతారు. అనేక ఆఫ్రికన్ పురాతన తెగల మనుషులు మమ్మల్ని దేవుని దూతలుగా పూజించారు. ఇంకొందరు స్థానిక అమెరికన్ తెగవారు తొలి జీవిగా పిలిచారు. అనేక మంది రచయితలు, కళాకారులు మా గురించి చెప్పారు. మార్క్ ట్వైన్ తన ‘గ్రోస్‌హాప్పర్ అండ్ అంట్స్’లో మా గురించి చెప్పాడట. ఆర్యన్ నువ్వు చదివావా?” అని అడిగింది రాణి చీమ మాచి.

“చాలామంది ఇప్పటికి మా చీమల జీవితం గురించి తెలుసుకుని చాలా ఉత్తేజాన్ని పొందుతారు. ఆర్యన్, పరి నాదొక విన్నపం, request. పర్యావరణానికి మంచి చేస్తున్న మమ్మల్ని చంపవద్దు. మేము చిన్ని జీవులమే కావచ్చు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో భాగస్వాములం. మీకు మిత్రులం. కాలితో నలిపి చంపనని మాట ఇవ్వండి” అని రాణి చీమ చెయ్యి చాచి అడిగింది దీనంగా.

సిగ్గుతో ఆర్యన్, పరి “చీమలను చంపము, చంపనివ్వము” అని చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చారు.

రాణి చీమ ఆనందంగా తన ఇంటి, పుట్ట దారిపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here