[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ భాగం. [/box]
[dropcap]ఆ[/dropcap] వేళ బోజనాలయ్యాక పడుకోబోయే ముందు విజయను అడిగాడు దశరథం – “అమ్మా ఒకటి రెండు సంబంధాలు నా ఎఱుకయినవి ఉన్నాయి. నువ్వు పెళ్ళికి సుముఖముగా ఉన్నావో లేదో చెప్పితే నా ప్రయత్నంలో నేను ఉంటాను” అని.
తండ్రి చెప్పింది విని ‘మీ యిష్టం’ అంది తలదించుకొని…
విజయ మనస్ఫూర్తిగా ఈ మాట అన్నదా? లేదా? అనేది పూర్తిగా అర్థం గాక బిడ్డ మొహంలోకి పరిశీలనగా చూసాడు.
అసంతృప్తి ఛాయలేదు. ‘మంచిది’ అనుకున్నాడు.
చదువరులైన పిల్లల మనోగతం తెలుసుకోవడం తేలిక కాదనిపించింది, వారుగా బయటపడితే తప్ప…
తెల్లవారాకా దీక్షితులు ఇంటికెళ్ళాడు.
దారిలో చెప్పు ఉంగటం తెగింది.
‘పెండ్లి పూర్తియ్యేసరికి ఎన్ని చెప్పులు తెగిపోతయ్యో’ అనిపించింది. నవ్వు వచ్చింది.
తెగిన ‘చెప్పు’తో ఈడ్చుకుంటూ నడిచేకంటే చెతపుచ్చుకొని నడవడం మంచిదనిపించి చేత పట్టుకున్నాడు.
ఆనందంగా నడిచాడు.
తెగిన చెప్పును చేత పుట్టుకొని అంత ఆనందంగా నడవడం శివానందం కంటపడింది.
ఎదురుగా వెళ్ళాడు.
ఆగి ‘చెప్పుతెగినట్లున్నది?’ అనడిగాడు.
‘చెప్పు కాదు ఉంగటం’ అన్నాడు.
‘చెప్పులోది కాదా ఉంగటం? ఉంగటం తెగితే చెప్పు తెగింది అనగూడదా’ అడిగాడు ఉక్రోషంగా!
‘శరీరములో ముక్క తెగిందనుకో ఒళ్ళు తెగింది అంటామా? శరీరంలోదే ముక్క గనుక అలా అంటే అర్థం అవుతదా? ఏదో ఊకొడుతుంటే పెద్ద తెల్సిన వాళ్ళలా… ప్రతివెధవను కా గుణింతము, డొక్కలో కెక్కపోయినా’ అన్నాడు విరుచుకపడుతూ.
శివానందానికి నోరు వప్పళించి చూడటం తప్ప సమాధానం దొరకలేదు.
అయినా సమర్ధించుకునేందుకు ఏదో మొదలెట్టబోయాడు.
దశరథం మాట్లాడనివ్వలేదు.
ధశరథం గుడి మలుపు తిరుగుతుండగా అడుక్కునే ఒకరిద్దరితో పాటు పాత చెప్పులు కుట్టేవాడు కనిపించాడు.
సీదా అతని దగ్గరికే వెళ్ళి ‘ఉంగటం’ తెగిన చెప్పును అతని చేతిలో పెట్టి… ‘ఇది చూడు’ అన్నాడు.
చూసి ‘ఉంగటం ఊడింది’ అన్నాడు.
‘తెగలేదన్నమాట’
తల ఊపాడు.
ఊడిన బాగాన్నిలోనికి నెట్టి శీల తీసి కొట్టి సరిచేసి ఇచ్చాడు.
కాలికి వేసుకుని చూసి లోగా మాదిరే కుదురుగా ఉన్నందుకు సంతోషపడి ‘ఏమి ఇవ్వను?’ అనడిగాడు.
‘రూపాయి’ అన్నాడు దించుకున్న తల ఎత్తకుండా.
ఎంత నిర్లక్ష్యం? అనిపించింది. పైగా రూపాయా అనుకొని, ‘ఒక్క శీలేగా వేసింది?’ అన్నాడు. జేబు కొట్టేసే వాడ్ని చూసినట్లుగా చూస్తూ.
‘అవును’ అన్నట్లుగా తల ఊపాడు. తల ఎత్తలేదు.
ఇంత public గా దోచుకోవడమేగాకుండా… ఇంత బేఫికర్‌గా ఒప్పకోవడం… అమ్మో అమ్మో అనుకొని గుఱ్ఱుగా చూసి… ‘శీల ఖరీదు ఎంత’ అనడిగాడు.
‘ఇది తెలిని వెధవన్నర వెధవ్వు కాబట్టే చెప్పును రెండు చేతులలో పట్టుకొని వచ్చావు’ అనుకొని మొదటి సారి తల ఎత్తి చూసి ‘అయిదు పైసలకు రెండు’ అన్నాడు పెద్దగా.
‘ఒక శీల కొట్టి రూపాయి అడుగుతావా? ఇంత కంటే అన్యాయం ఇంకేముంది. public గా దోచుకోవడమే గదా’ అని ఉక్రోషపడి ‘అర్ధ రూపాయి ఇస్తాను’ అన్నాడు తగ్గుస్వరంతో.
‘లెవ్వా!’ అన్నాడు ‘లేకపోతే ఏం చేస్తావులే’ అన్నట్లుగా చూసి…
ఇది మరీ భరించరానిదైంది. అదోలా అయిపోయాడు.
లెవ్వా! అంటాడేంటి అనుకొని…
“ఇదిగో! నా దగ్గర పైసలు ఉన్నాయి… కానీ నేను అర్ధరూపాయి ఇస్తాను” అన్నాడు.
దశరథం వాలకం చూసి తన పని లోనికి తలదించుకుని ‘బాబూ ఇస్తే రూపాయి ఇవ్వు లేకపోతే పొండి. నేను రోడ్డుపైన గదా కూర్చుంది. ఇలాంటి బేవార్సు ఖాతాలు రోజుకు ఒకటో రెండో తగులుతూనే ఉంటాయి’ అన్నాడు.
తలతీసి పారేసినట్టయింది దశరథానికి
శివానందం గాడు ఎదురు తగలకపోతే ఇలా ప్రవర్తించేవాడు కాదేమో.
రూపాయి బిళ్ళ తీసి అతని పైన వేసి ముందుకు నడిచాడు.
“కోక డాబులేంది ఏ యాపారమూ నడవదు. విలువగా చూడరు. పెద్దషాపులో ‘రిపేరు’ అంటే వాడు వేసినంత బిల్లు చచ్చినట్లు కట్టి ఎదవ నవ్వు నవ్వి ఎల్లిపోతారు. ఇక్కడ మాత్రం బేరం చేస్తారు. ఏం మనుషులో” అనుకున్నాడు అతడిని చూస్తూ…
‘ఇంకా ఎంత దూరం వీడి ఇల్లు?’ అనుకున్నాడు దశరథం మొదటిసారి.
‘ఇంటిదాక నడవంది ఎలా వస్తుంది?’ అనిపించి నవ్వు వచ్చింది.
‘నడుస్తూనే ఉన్నాను గదా’ రోజు ఇంతకంటే ముందే వచ్చినట్లుగా అనిపించింది. ఇవాళ్ళ ఇంత ఆలస్యం ఎందుకు జరిగినట్లు?
ఒక వేళ ఆలోచనలో ఉండి అడుగులుగాని చిన్నవి వేయడం లేదు గదా! అనుకుని అడుగులు భారీగా వేస్తూ నడిచాడు.
‘అదిగో వచ్చేసింది’ అనుకొని పరుగులాంటి నడకతో లోనికి చేరాడు. శాంతమ్మ స్నానం చేసి అరకొరగా ఉన్న బట్టలతో గదిలోకొస్తూ కనిపించి, ఆగాడు.
వెనక్కి తిరిగి ‘దీక్షితులున్నాడా?’ అని అడిగాడు.
‘కూర్చో. ఇప్పుడే వస్తాను’ అంది.
‘దీక్షితులు ఉన్నాడా? లేడా?’ అడిగాడు మళ్ళీ.
నేను అడిగింది దీక్షితుల్ని, వాడు ఉన్నాడో లేడో చెప్పక నేను వస్తాననటం ఎక్కడైన సమాధానం అవుతుందా? అనిపించింది.
ఉంటే నా మాట వినిపిస్తుంది గదా! వినిపించాక రాకుండా ఉండగలడా ?
ఛ అస్సలు అడిగినదానికి సూటిగా సమాధానం ఇవ్వరేం. మన దగ్గర చాలా మందికి తెల్సిచావదు. వారిచ్చే అపసవ్యపు సమాధానం ఎంత బాధపెడుతుందో అనుకుంటూ ఉండగా శాంతమ్మ బయటికొచ్చి ‘కూర్చోలేదేం?’ అంది.
‘దీక్షితులు కోసం వచ్చాను’ అన్నాడు.
‘విజయ వచ్చిందా?’ అంది.
అసలు నేను అడిగింది వినపడడం లేదా? చెవుడా? లోగా లేదే? మరి ఎందుకిలా మాట్లాడుతుంది? అనుకొని – ‘దీక్షితులు ఇంట్లో లేడా?’ అని కొంచెం పెద్దగా అడిగాడు.
‘నాకు చెవుడు లేదు’ అంది నవ్వుతూ చిత్రంగా చూసి.
వినిపించాక కూడా ఇలా ఎందుకు చెపుతున్నట్లు? అనుకొని అర్థం గాక
‘దీక్షితులు?’ అనడిగాడు.
‘పక్క ఊరు రామరం దాక వెళ్ళారు.’
‘ఎప్పుడూ?’
‘పొద్దుట.’
‘ఎపుడొస్తాడు?’
‘రాత్రికి వస్తానన్నాడు.’
‘అంటే ఇప్పుడు ఇంట్లో లేడన్నమాట’ అని తోవ వైపు నడిచాడు.
ఏమిటి మనిషి?
అలా వెళ్ళిపోతాడెందుకు?
ఏమిటో ఒక్కసారి బొత్తిగా అర్థంగాడు అనుకుంది.
దశరథం నడక గుడి దాక చాలా వడిగా సాగింది….
అక్కడ ‘రుద్రయ్య’ కనిపించాడు.
‘అంతా క్షేమమే గదా’ అని పలకరించాడు ఎదురుగా వచ్చి.
తల ఊపాడు, కాని ఆగలేదు దశరథం
‘ఎక్కడికా పరుగు’ అన్నాడు పెద్దగా.
ఆగాడు.
వెనక్కి తిరిగాడు.
రుద్రయ్య కనిపించాడు మళ్ళీ..
‘రే నువ్వటరా! ఎప్పుడు రావడం? ఇంటికి గానీ వెళ్ళి రావడం లేదు గదా’ అన్నాడు దగ్గర కొచ్చి కౌగలించుకున్నంత పని చేసి.
‘రాగానే గుడికెళ్ళాలని పించింది. వెళ్ళి క్రిందకు దిగుతుంటే నువ్వు కనిపించావు అంతే.’
‘ఇవ్వాళ్ళ ఉంటున్నావా? ఇంటికి పోదాంరా!’ అన్నాడు.
‘వేళకి పని అయితే వెళ్ళిపోతాను, కాకపోతే నీ ఇంటికే వస్తాను.’
‘అంతా బావున్నారు గదా…’
‘ఆ!’ తల ఊపాడు.
‘చిన్నది బాగా నడుస్తుందా?’
‘ఆ!’
‘ఉంటే, రాత్రికి మాట్లాడుకుందా! ఏం?’ అంటూ వెళ్ళిపోయాడు.
చిన్ననాటి స్నేహితుడు. ఎదురు పడి పిలిచినా అర్థం గాని స్థితి. ఎందుకొచ్చింది?
అసలేం జరిగింది? ఏం జరగలేదే? బాగానే ఉన్నానుగదా!
మరి?
దీక్షితులికి ‘విజయ’ విషయం చెపుదామని కదూ బయలుదేరింది?
ఛ! అనుకొని మెల్లగా నడచాడు.
‘శాంత’ తోనూ ఇలాగే మాటాడానేమో?
సిగ్గనిపించింది… ఇంటి వైపు నడిచాడు… అదిగో ఇల్లు…
గౌరయ్య భార్య ఎదురుపడింది… నీటుగా కుదురుగా అనిపించింది.
చేతుల్లో పసికందు ఉంది.
‘ఎవరి పిల్లో?’ అనుకుంటుండగానే, ధశరథం దగ్గరికేవచ్చి ‘మనవరాలు’ అని చూపించింది.
ఆశీర్వదించాడు.
ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకోగాని మనసంతా ప్రశాంతంగా అనిపించింది.
గౌరయ్య భార్య వైపు చూసాడు ఆమెలో తన్మయత కనిపించింది.
ఏమిటి మమకారం? ఎందుకింత వాత్సల్యం? ప్రేమంటే ఇదేనా? అనిపించింది.
పాపను తీసుకొని ముందుకు నడిచింది…
ఈవిడికి ఇప్పుడే మనమరాలా?
అమ్మ అయిందన్నా నమ్మలేనంత వయసుకత్తెలా ఉంది. దేవతలు అమృతంగానీ ఓ పురిషెడు దీని కిచ్చారా? అలా కానప్పుడు వయస్సును ఏమార్చే ఈ సొగసరి తనమేమిటి? అనిపించింది.
ఇంతలో మనసు లోపల మనిషి ‘ఛ ఏమిటిది? పసిదాన్ని ఆశీర్వదించడం వరకే నీ పని. ఇంకా ముందుకు పోకు’ అని ఆపాడు.
మనసు పోకడను ఆపి…
ఇంటికి చేరుకునేపటికి ఎప్పుడూ వచ్చేకుంటి జంగమయ్య… శంకు ఊదుతూ కనిపించాడు. సీతమ్మ వంటింట్లో ఉన్నట్లుంది.
‘అమ్మ’ అని పిలిచాడు శంఖును ఆపి
‘ఇక్కడికే వస్తావు గదా, వెళ్ళిరా’ అంది సీతమ్మ లోనుంచే…
‘ఇవ్వాళ రాను … నేను ఒక్కడిని కాను. భోక్తలు ఇంకా నల్గురున్నారు.’
‘దేవాలయములో అన్నప్రాసన ఉంది. అక్కడకు వెళ్తాం. పిల్లాడికి ఆశీస్సులు చెప్పి వారు పెట్టింది స్వీకరించి… అక్కడే ఉన్న చింత చెట్ల కింద భుక్తాయాసం తీర్చుకొని పక్క ఊరికి వెళ్తున్నాము. ఈ మాట చెప్పి వెళ్ళేందుకే వచ్చాను’ అని జంగమయ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు.
దశరథం ఎదురుపడ్డాడు.
నమస్కారం చెప్పాడు జంగమయ్య. ‘వెళ్తున్నావేం…’ అడిగాడు దశరథం…
‘వెళ్ళాలి, ఇంకా ఉన్నారు. వారం దినాలలో తిరిగివస్తాను’ అంటూ నడిచాడు. ఎక్కడున్నా తమ క్షేమాన్ని కాంక్షించేవాడు జంగమయ్య.
ఇతనికి దశరధం చేసేదల్లా ఒక్కటే. రాత్రిళ్ళు వచ్చినప్పుడు ఓ పూట ఇంత పెట్టడం. పడుకునేందుకు చోటు ఇవ్వడం. పగలు వస్తే అతగాడే తెచ్చుకున్నది తినేటప్పుడు ఇన్ని మంచి నీళ్ళు ఇవ్వడం.
దశరథం గడపలో కాలు పెడుతుండగా సీతమ్మ ఎదురొచ్చి… ‘ఎక్కడికెళ్ళారు’ అని అడిగింది.
‘విజయ ఏది’ అడిగాడు.
‘నేనడినదానికి సమాధానం కాదది’ అనుకుంది.
‘విజయ పక్కింటికి వెళ్ళింది. పిలువనా’ అంది.
అక్కర్లేదులే, ఊర్కే అడిగాను అన్నట్లుగా చూసి ఎడమటింటిలోకి నడచాడు.
‘దేముడి గదిలో ఏముంది’ అడిగింది సీతమ్మ.
మాట్లాడలేదు దశరథం. నడి మంచాన కూర్చుండిపోయాడు.
(ఇంకా ఉంది)