[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం. [/box]
[dropcap]రా[/dropcap]జయ్యకు ఇద్దరు భార్యలు – ఇద్దరు కొడుకులు.
మొదటి భార్యకు సంతులేని కారణాన రెండో వివాహం చేసుకున్న కేసు కాదిది.
మొదటావిడకు ఒక కొడుకున్నాడు. పేరు గోపాలం. అతగాడు పోలీసు శాఖలో పని చేస్తున్నాడు. శ్రీనుకంటే పెద్ద, వివాహితుడు.
రాజయ్య రెండో పెళ్ళి అప్పుడే మొదటావిడ విడిపోయింది. ఈ శ్రీనివాసు రెండో భార్య కొడుకు.
ఇప్పుడీవిడ ఈ లోకంలో లేదు. కూరగాయలు కోస్తుంటే చిటికిన వ్రేలుకు గాయమై అది సెప్టికై ధనుర్వాతం వచ్చి చనిపోయిందట.
ఆ తరువాత కూడ రాజయ్యకు వయస్సు టిమి చావకున్నా వివాహం చేసుకొనే ఆలోచన చేయలేదు. పెళ్ళిళ్ళ పేరయ్యలు కొందరు తిరిగారు గానీ ఎందుకో ‘నాన’లేదు.
శ్రీనివాసంటే రాజయ్యకు అంతు మాలిన ప్రేమ. అయితే శ్రీనివాసు పై చదువులకు పట్నం చేరాక, మరీ వంటరివాడై దాన్ని వదిలించుకొనే ప్రయత్నంలో ఓ అనాథ విధవరాల్ని వంటావార్పు చూసేందుకు తెచ్చుకున్నాడు.
ఆవిడ పేరు మాణిక్యం. అంత పెద్ద చూపరి కాకపోయినా ఆరోగ్యం గల మనిషి. పర్వాలేదన్నట్లుగా ఉంటుంది.
ఆవిడలో చలికాలం చలిమంటలా… వళ్ళు కాచుకుంటాడని ఆలావాలా వినికిడి ఉంది.
ఏది ఏమైనా ఆవిడను చూస్తే మాత్రం అలా అనిపించదు. ఇంట్లో ఉండాల్సిన మనిషే అనిపిస్తుంది. మర్యాద మట్టూ తెలీడమేగాక ఇంటిని నీటుగా ఉంచుతుంది. గడపదాటే ప్రయత్నం చెయ్యరు. వ్యవసాయం పనులు గట్రా పాలేళ్ళకు పురమాయించగలదు కూడా. దీనితో రాజయ్యకు ఇంటి బాధ తీరింది.
“చదువు తరువాత ఏం చెద్దామని ఉంది?” అడిగాడు దీక్షితులు.
“నౌకరి వస్తే ఏం లేదు. లేదా రిసర్చిలో చేరతాను. కొంత ఆసరాగా ఉండి మనం చేసుకునే ఉద్యోగ ప్రయత్నాలకు ఆలంబనగా కూడా ఉంటుంది. ప్రస్తుతం నాకు ఉన్న అభిప్రాయం అది” అన్నడు.
“ఇల్లు చూద్దురు గాని” అంటూ రాజయ్య లేచాడు.
దీక్షితులు దశరథం ఆయన వెంట నడచారు.
ఇల్లుంతా చూసి వస్తుండగా మాణిక్యం ఎదురు పడి, వినయంగా పక్కకు తొలగి ఒదిగి నిల్చుంది.
“మాకు వంటా వార్పు చూస్తుంది” అని చెప్పాడు రాజయ్య.
వరండాలో కొచ్చారు. ఎవరి సీటులో వారు కూర్చున్నారు.
“లాంఛనాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు వివరంగా మాట్లాడుకుంటే మంచిది గదా” అన్నడు దీక్షితులు ప్రారంభిస్తూ.
“మాములుగా ఇక్కడున్న పద్దతులు మీకు తెల్సు. అలాగే చేద్దాం” అన్నడు రాజయ్య.
“అరకొరగా ఉండకూడదు. పెళ్ళి ఇది. ఆనక నిష్ఠూరాలు వస్తాయి. శుభకార్యం అంతా శుభంగా పొరపొచ్చెం చింతాకంతా రాకుండా జరగాలి” అన్నడు దశరథం నవ్వుతూ.
“అలాగే” అని దీక్షితులు వైపుగా చూసాడు రాజయ్య. ఆ తరువాత వారందరిని చూస్తూ “కట్నం విషయం చెప్పాను” అన్నడు.
“ఏమని?” అడిగాడు దశరథం.
“లక్షా యాభయి వేలు ఇస్తామని రెండు సంబంధాలు వచ్చినాయి. కాకపోతే ఆడ పిల్లల చదువు విషయంలో కుదరలేదు.”
“మేం లక్షాపాతిక వేలకంటే ఎక్కువ తూగలేం.”
“ఆడ బిడ్డ కట్నంగా అయిదు వేలు….”
“మీకు ఆడ పిల్లలున్నట్లుగా చెప్పలేదు.”
“నాకు లేరు. మా అన్నగారికి ఉన్నారు. నా దగ్గరే పెరిగిన పిల్ల అది. మా వాడికి చెల్లెలు గదా” అన్నడు నవ్వి.
“ఇక బట్టలు ఎవరివి వారే తీసుకుంటే మంచిది.”
“ఆడపిల్లకు అదనంగా అవుతాయిగదా” అడిగాడు దీక్షితులు.
“అవి మేం ఇస్తాం” అన్నడు రాజయ్య.
“మంచిది” అన్నడు దీక్షితులు నవ్వుతూ.
“దాదాపు మా వాడి చదువుకు డెబ్బయి వేలు అయినాయి. మేం ఏదో పుచ్చుకుంటున్నాం అని తప్ప, న్యాయానికి మా పెట్టుబడిని రూపాయి వడ్డితో ఒప్పుకోవడం అవుతుంది. పిల్లకు నగలు పెట్టాలిగదా” అన్నడు రాజయ్య.
“పదహాలు సంవత్సరాల చదువు పూర్తి అయిందన్నమాట” అని నవ్వి…
‘చదువుకునే ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం వారు దాదాపు ఎనభై వేలు ఖర్చు పెడుతున్నారు. మనం పెట్టేది కాక ఇంత అయ్యాక ఈ చదవరి నిరుద్యోగిగా కనిపిస్తున్నాడు.
చదువుకు సరిపడా ఉద్యోగాలు బొత్తిగా లేవని తెల్సినాక నిజంగా ఈ చదువు ఎందుకు ఇందరెందుకు. ఈ చదువు చదవాలి అనిపించక మానదు.
మన చదువులను బట్టి చేయాలంటే అవకాశం రాదు. దీని కంటే పేపరు చదవడం వరకు చదివి ఎదో ఒక వృత్తిలోకి జొరబడటం క్షేమం అనుభవమూ వస్తది. సంపాదన తరుగుండదు. తన కాళ్ళ పైన తను నిలబడతాడు. అంతే కదూ’ అన్నట్లుగా దీక్షితులు వైపు చూసాడు. అతని మనోగతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో పడి –
“ఇప్పుడున్న పరిస్థితి ఇది. దీనిని మనంగా చెయగలగింది అయితే ఏమి లేదు. ఒక వేళ చేస్తే అబద్దాలతో మభ్యపెట్టి రాజరికం వెలగపెడుతున్న పాలకులు కొంతలో కొంత చేయవచ్చు. వారికే అవకాశం ఉంది. కానీ పాపం, వాళ్ళు సంతానానికి బంధువులకూ తెగబడి చేయడానికే టైం చాలడం లేదు. అదీ గాక వాళ్ళు పాపం అనుక్షణం తమ సీటును పక్కోడు గుంజుకోనకుండా కుక్కకంటే కనా కష్టంగా కావలి కాచుకోవాలి కదా. ఈ పదవేమో మంచి బెల్లం లాంటిదాయె. బెల్లం ఉన్నాక చీమల ప్రయాణం ఆగదు.
అందుచేత ఈ పాలకులు మనను కానీ, మన ఆర్థిక పరిస్థితిని గానీ దేశాన్ని గానీ పట్టించుకోలేరు. తీరదు. వారి ఆర్థిక పరిస్థితులే వారికి వున్నాది. ప్రధానం అయినా తమ వాటినే తాము సరిగ్గా చూడలేని వారు, దేశాన్నేం చూస్తారు.
అందుకే ఈ దేశం నిండా అసంతృప్తి.
మరి వీటిని వ్యక్తం చెయాలిగదా.
ఎలా వ్యక్తం చేయాలో సరిగ్గా అర్థంగాక తలా ఒక పంధా వెంట పరుగు. ఒకరు తుపాకీతో అంటే ఒకడు కొడవలితో అంటే, సుత్తే మంచిదని మరొకడు ఎలుగెత్తి అరిస్తే, ఒకడు మతంలోనే అంటే, ఒకడు కులంతోనే అంటాడు. ఒకడు నాగలంటే ఒకడు రోకలి…
ఇందులో ఎవరికెవ్వరూ తోడుగా ఉండరు.
ఎవరికి వారే…
ఎవరి సమస్యలు వారివే…
ఎవరి ఆవేశాలు వారివే…
ఎవరి ధోరణి వారిదే…
ఎవరి ఆశయం వారిదే….
ఒక్కటే పరుగు… అంతు మాలిన పరుగు… ఆగని పరుగు….
వీరి వెంట మాత్రం ఎవరు వస్తారో చెప్పలేం.
మరి ఎవరి కోసం వారి తపన…. వారి పార్టీల కోసము….
అందుకే….
ఎవర్ని గురించి ఏ సమస్య గురించి అరక్షణం ఆగి ఆలోచించినట్టుగా అనిపించదు. కనిపిస్తారు అంతా… పచ్చ కామెర్ల రోగి తంతు.
పది మంది వెధవలలో ఒక మంచి వెధవకు పర్వాలేదనుకొని జనం అవకాశం ఇస్తున్నారు. అంటే ఎన్నికయి పాలనార్హుడయిన వాడు కూడా వెధవే అని….
ఇలాంటి అప్రజామామ్యపు, ప్రజాస్వామ్యంలో, బానిసత్వం ముగిసినా దారి కినిపించదు.
ఈ వ్యవస్థలో మంచి అన్నది కరదీపికతో వెతకాలి.
ఎవడి ఇగో వాడిదే…
ఎవడి అజం వాడిదే…
ఎవడి తంతు వాడిదే…
ఎవని అభిజాత్యం వానిదే…
ఎవని మాయ వానిదే… కానీ….
ఈ త్రాష్టులందరూ కలసి పాలన కోసం ఆ క్షణం వరకు కలసి ఆ తరువాత దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. తెల్లవాడు ఈ దేశాన్ని శ్మశానం చేసిపోలేదు.
శ్మశానం కావడానికి పాదవేసి కొందరు వెదవల్ని దువ్వి ఉసిగొల్పి వెళ్ళిపోయాడు.
అంతకు ముందున్న పాలకులు ఈ జాతి సంస్కృతిని కాల గర్భంలో…..” అని ఆగాడు దశరథం.
దీక్షితులు విచిత్రంగా చూసాడు – ‘ఏమిటిది? ఎందుకిలా మాట్లాడేడు?’ అనుకొని.
రాజయ్య వైపు చూసాడు.
దశరథం మాట్లాడింది రాజయ్యకు బొత్తిగా అర్థమయిన జాడ లేదు.
‘బక్కనాడా నీతి తప్పుకు బొక్కలో పడుతావు.
బలిసినోడా నీతి ముట్టకు ‘జోలి వాడ’ కు దారికడతావు.
అని రేడియో నుంచి పాట వినిపిస్తుంది.
“మంచి రోజులు చూసి మేం ఎప్పుడొచ్చేది కబురు చేస్తాం” అన్నడు రాజయ్య సంతోషంగా.
“పిల్లని చూసుకునేందుకే గదా” అడిగాడు దీక్షితులు.
అది కూడా అన్నట్లుగా తల ఊపి “అంతా బావుంటే ఆ వేళ కూర్చుని పూర్తిగా మాటాడుకుందాం. ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో కూడా అక్కడే నిర్ణయించుకోవచ్చు” అన్నడు.
అలాగే అన్నట్లుగా తల ఉపాడు దీక్షితులు.
“కట్నం విషయం మొదటే చెప్పాను. అంతా విన్నారు గదా నా స్థితి అది” అన్నడు దశరథం.
“దానిదేముంది, సాంప్రదాయమైన కుటుంబమయి, అనుకూలమైన పిల్లది. మా ఇంటి కోడలుగా వస్తున్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలను గురించి అంత ఇదిగా చూడంలేండి” అన్నడు రాజయ్య నవ్వుతూ.
“మీకా మంచి మనస్సు ఉన్నా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది కదా” అనగానే, “బావగారు గట్టిగారు… పట్టు విడవరు. ఇద్దరం కొంచెం జరగే ప్రయత్నంలో ఉంటేనే గదా దగ్గరయ్యేది. ఏదో ఒకటి అనుకుందామన్నా కుదరుదు” అన్నడు రాజయ్య.
“లేనిది చెప్పుకోవడం ఆవేళ అభాసు కావడం నాకు మంచిది కాదు.
మనం చిరంజీవుల మంచి కోరే వారమే గనుక ఈ పరంగా చిన్నారుల మనస్సుకు గానీ మనకుగానీ మాట పట్టింపు రాకుడదనే నా భావన.
కొంచెం నన్ను సహృదయంతో అర్థంచేసుకోండి.”
“ఇక ఆగు ఎన్ని సార్లు చెపుతావు?” అని దీక్షితులు రాజయ్యవైపు తిరిగి “మీరు వస్తున్నారు గనుక అక్కడ ఎదో ఒకటి మమ అనుకోవచ్చును లెండి” అని; “ఆఁ ఇక్కడకు ఇప్పుడే పంతులుగార్ని పిలిచి మీరు వచ్చేందుకు మంచిరోజు నిర్ణయించుకుంటే పోతుందేమో మళ్ళీ మేము మీ కబురు కోసం ఎదురు చూడకుండా పోతుంది గదా” అన్నడు.
“అవును ఇది బాగానే ఉంది. అట్లాగే చూద్దాం” అన్నరు పెద్దలు.
రాజయ్య సరే అన్నడు.
“శుభం పంతులుగారికి కబురు చేయండి” అన్నడు దీక్షితులు.
“కబురంపుతా ఈలోగా మీరు భోజనాలు కానియండి” అన్నడు రాజయ్య.
“కతికితే అతకదంటారు” అడిగాడు దీక్షితులు.
“అదీ చూద్దాం” అన్నడు రాజయ్య నవ్వుతూ.
అంతా ఆనందంగా నవ్వుకుంటూ బోజనానికి లేచారు.
బోజనాలు పూర్తి చేసారు.
తాంబుల సేవనం కూడా జరిగింది.
ఈలోపు పంతులుగారి కోసం వెళ్ళిన మనిషి ‘అయ్యగారు సత్యనారాయణ వ్రతంలో ఉన్నారు. సాయంత్రం వచ్చి కలుస్తారట’ అని చెప్పాడు.
‘మంచిది మేం చెప్పి పంపుతాం లెండి’ అని దీక్షితులు దశరథం వెంట బస్సుస్టాండు దాకా నడచారు.
బస్సు ఎక్కి కదిలిందాకా ఉన్నారు.
వీరిద్దరూ ఇంటికి చేరేసరికి బాగా పొద్దుపోయింది.
(ఇంకా ఉంది)