అనుబంధ బంధాలు-16

0
2

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దు పొడిచింది…

సూర్యుని లేత కిరణాలు ప్రయాణంలో ఉన్నాయి. ఆలయంలో గంటలు వినిపిస్తున్నాయి.

ఆంబోతు హడావుడీ పడుతూ ఎదురయింది. ముందు ‘ఎదావు’ కనిపించలేదు. దోవన వస్తున్న జాలయ్య ఆంబోతుకు ఎదురు పడి చాలా జాగ్రత్తగా పక్క సందులోకి తప్పుకున్నాడు… దాని తాడు తెగ అది జాలయ్య తప్పుకుని నిల్చున్న సందులోకే వేగంగా వచ్చింది. దిక్కు తోచక పాడుబడ్డ బ్రాహ్మణుల ఇంటి దగ్గర అవకాశముంటే దాన్లో దురాడు.

ఆంబోతు ప్రక్క నుంచి పరుగెడుతుంటే గుండె గుబులయితది. అది పూర్తిగా వెళ్ళిపోయిన తరువాత లేచి దోవకెక్కాడు. బ్రతుకు జీవుడా అని….

దీక్షితులు గారు జాలయ్యకు ఎదురు పడ్డాడు.

“ఎక్కడిదాకా వెళ్తున్నావేం?” అడిగాడు దీక్షితులు

‘ఢిల్లీ’ దాకా అన్నాడు సర్దుకుంటూ.

“ఎందుకట?”

“చెప్తాను. నాతో పాటు ఇక్కడ మునివాకిట ఉన్న గూడెంలో రత్తాలు అనే ఓ ఆడ మనిషి ఉంది. నిజంగా ఆ రోజులలో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొన్న మనిషి. ఆవిడ అప్లికేషన్ డిల్లీ ఆఫీసులో ఉంది. దాని పరిస్థితి కనుక్కొని న్యాయసమ్మతమైన కేసు అని చెప్పించి వద్దామనీ.”

“అసలు రత్తాలు ఎవరు?” అడిగాడు దీక్షితులు నడుస్తూనే.

“పరంథామయ్యగారి కోడలు.”

“ఓఁ ఆవిడా, చాలా వృద్ధురాలు కదూ.”

తలూపాడు జాలయ్య.

“అవును. ఆవిడ వెనకట నవాబు పాలన రోజుల్లో, రజాకార్లు వాళ్ళు ఊరు నుంచి జనాన్ని తోలుకెళ్ళి పాశవికంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకు ఎదురు నిలచిందన్నారు, అసలావిడ అక్కడెందుకుంది?”

“వాళ్ళ పుట్టినూరు అదే. చాలా ధైరస్తురాలుగ, గుండె బలం ఉన్న మనిషిగా చెపుతారు. నిజంగా మనం అలాంటి వాళ్ళను చూసి గర్వపడాలి. జనం కోసం ఆడదయి ఉండి ఎదురు తిరగడమంటే అదీ నవాబుకు – మాములు విషయమా అని చెయ్యెత్తి నమస్కరించడం తప్ప మన ఏం ఋణం తీర్చుకోగలం. అయితే ఆవిడకు పింఛను రాకపోవడమేమిటి” అంటూ ఆశ్చర్యపోయాడు.

“న్యాయంగా ఆనాడు ‘సూర్యాపేట అమీను’ ఊళ్ళ మీద రజాకార్లులో పడి లూటీలు చేసి వస్తూ వస్తూ వయస్సు పిల్లలను బలవంతంగా ఎక్కించుకొని వచ్చి సూర్యాపేట చేర్చాడు. పొద్దు గూకింది. మందు గానా బజాన ప్రారంభమైంది. ఈ పట్టుకొచ్చిన ఆడపిల్లలనందరిని అక్కడికి తీసుకురమ్మని హుకుం చేసాడు. పట్టుకొచ్చారు. గొర్రెల మందలో పడ్డ తోడోలులా వాళ్ళతో క్రీడ ప్రారంభించాడు. అందిన అమ్మాయిని వాటేసుకోనడం, కొరకటం, కలపడం, ముద్దెట్టుకోవడం, కొంచెం ఎదురు తిరిగి తోసివేసిన పిల్లకు, బట్టల్ని లాగేసి నగ్నంగా నిలబెట్టడం ఇలా అర్ధరాత్రి దాటేసరికి తీసుకెళ్ళిన ఆడాళ్ళందరినీ నగ్నంగా చేసి చుట్టురా ఉంచి మధ్యలో కూర్చుని త్రాగుతూ వినోదించే సమయాన రత్తాలు మగవాళ్ళ పిరికిపారి ఉంటే వాళ్ళను తిట్టి ఆడాళ్ళనే పోగేసుకొని కారం రోకలి బండలతో వెళ్ళి అమీను క్యాంపు పై దాడి చేసి వాళ్ళను చితకతన్ని ఆడవారిని రక్షించుకొని తెచ్చింది. అట్టాంటి తల్లికి పింఛను ఇమ్మని పైరవి చెయాల్సిన దుస్థితి ఈ దేశనకనక కల్గింది. సిగ్గనిపిస్తుంది. మరి ఆవిడకు ఇవ్వక ఏం చేస్తున్నట్లు” అడిగాడు దీక్షితులు.

“ఎవరు నిజమైన స్వతంత్ర్య సమరయోధుడో ఎవడు కాదో తెల్సికోలేనంత అయోమయాన కమెటీ ఉంది. ఈ పైరవీకార్లుననేదేముంది. దీక్షితులు గారూ, నీతి నియమాలకు సమాధి కట్టింది మన మంత్రులే గదా. వారి చంచాలే ఈ పైరవికార్లు. వీళ్ళకి మంచి చెడులూ మానాభి మానాలు బొత్తిగా లెవ్వుగదా. అందుచేత ఈ ఫించెనుకు ఒక రేటు FIX చేసారు. యోధుల పైరవీ ప్రారంభించారు కథలల్లి”

“అది సరేగాని జాలయ్యా, రత్తాలు గతం తెలుసుకోవాలనుంది. బస్సు ఎక్కిందాకా చెప్పరాదు.”

“మంచిది నడుస్తూ చెపుతాను. త్రివర్ణ పతాకం దేశం నాల్గు చెదనులా ఎగిరింది, స్వాతంత్య్రం మా జన్మహక్కు అన్న నినాదానికి ఫలితం అందింది. ఈ దేశంలోని అన్ని సంస్థానాలకు స్వాతంత్య్రం వచ్చింది. వారు జాతియ జండా కిందకు వచ్చారు. ఇక్కడ నిజాం ప్రభువు రాలేదు. తెలుగు మాట్లాడే రెండొంతుల ప్రాంతంలో స్వాతంత్ర్యం ఉంది. స్వేచ్చా వాయువు తిరుగాడుతుంది. ఎందుకో తెలుసా? అంతుకు ముందే రాయలసీమను ఒక సారి కోస్తా జిల్లాలకు ఒకసారి వాడి అబ్బసొమ్ములా బ్రిటిష్ పాలకులకు నజరానాగా ఇచ్చాడు. ఇక్కడ అదిరాకపోగా… ఖసీంరజ్వీ ఇక్కడే కాక ఢిల్లీ కోటపైన కూడా తనకు రహీంకాంపు జండాను ఎత్తుతానని రజకార్లను రెచ్చకొట్టాడు. బంగారం లాంటి తెలంగాణను రావణకాష్టంగా మార్చాడు. రక్త శిక్తం చేసాడు. ఒక వైపు తెలంగాణ ఉద్యమకారులు దీని విముక్తికై జనంలో కెళ్ళిపోయారు. జనం అవసరాలకు ఆసరా అవుతూ ప్రజా ఉద్యమాల నిర్మాణం ప్రాణాలకి తెగించి ప్రారంబించారు. దీనికి జనం కొండంత అండగా నిలచారు.”

“గొప్ప చరిత్ర గల రత్తాలును స్వాతంత్ర్య సమరయోధురాలుగా ఈ ప్రభుత్వమ్ గుర్తించకపోవడమే సిగ్గుతో తలవంచుకోవాల్సిన స్థితి” చెప్పాడు జాలయ్య.

“అయితే దాని మీరు పైరవి?” అంటుండగా బస్సు వచ్చింది.

“వచ్చాకా కలుస్తాను” అని బస్సెక్కాడు.

***

సూర్యోదయమైంది. ఎఱ్ఱ ఎఱ్ఱగా పై పైకి జరుగుతుంది నిప్పు ముద్ద. పక్షుల రెక్కల విదలింపు. మనుషుల జీవయాత్ర ప్రారంభమయినది.

పరమయ్య బుడతడిని వెంట పెట్టకొని దశరథం దగ్గరి కొచ్చారు.

అప్పటికి సీతమ్మ కసువు చిమ్మింది.

బుడతడ్ని చూసి “ఏంద్రో, ఇప్పుడా రావడం?” అంది కోపంగా చూస్తూ…. “రానని మొరాయించి ముడుచుకుంటే బలవంతంగా లాక్కొస్తున్న” అన్నడు పరమయ్య.

“ఒంట్లో బాగా లేదా? చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ?”

మాట్లాడలేదు బుడతడు.

“ఇక ఉంటడు లెండి. నేపోతున్న” అంటూ వెళ్ళిపోయాడు పరమయ్య.

“ఇవ్వాళ కుంపు చేద్దామనుకున్నావా గొడ్ల పిల్లలంతా ఎటైన వెళ్దామనుకున్నారేంటి. ఆఁ మొన్న శెట్టికి ఊసబియ్యం అమ్మారట ఎవడి చేలో తెచ్చారు?” అడిగింది.

“అదేం లేదు. మా పెద్దమ్మ ఊర్నుంచి వచ్చింది” అన్నాడు బుడతడు

“పెద్దమ్మంటే…..”

“పెద్దమ్మే. రామగిరి పెద్దమ్మ.”

“రామగిరా అదెక్కడరా?”

“అదా భద్రాచలం ఉందా అది దాటినాక శబరి గోదావరిలకలుస్తది పడవలో పోతే కూడా రాంగిరి వస్తది” అని “ఆఁ అగో వాళ్ళ ఊళ్ళో పెద్ద గుంట్ట ఉంది. దాని మీద శీతారాములున్నారు. ఆడ నుంచి కిందకు చూస్తే….

 బలేగుంటదమ్మ గోదావరి రెండు పాయలుగా పోతుంటది” అన్నాడు.

“గుడి ఉందట్రా…”

“ఆఁ నేను చూసిన గద” అని దండం పెట్టుకున్నాడు.

“మన బద్రాద్రి రాముడి కంటే బావున్నాడా ఏం?”

“నేనీయన్ని చూడలేదుగదా” అని పొరక భుజానేసుకొని పాకవైపు నడిచాడు.

వీడికి అక్షరం ముక్కరాదు. రామకథ తెలీదు. రాముడంటే ఎందుకింత ప్రభావితుడైనట్టు. పసి మనస్సుపైన అంత ముద్రవేయగలగడం చిత్రం అనుకని “అరే అబ్బీ మన అమ్మాయిగారి పెండ్లి పూర్తి చేసి అందరం కలిసి పోదాంరా ఆ స్వామిని చూద్దాంలే: అంది.

“నిజం” అన్నాడు బుడతడు ఉత్సాహం కట్టలు తెంచుకుంటుండగా…

“నిజం రా వెళ్దాం, మీ పెద్దమ్మను కూడా చూసి పలకరించి వద్దువుగాని…”

“అట్టాగే” అంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిలో పడ్డాడు.

రోజుటి కంటే ముందు బట్టెను విడిచాడు.

***

“అమ్మా కాఫీ” అన్న విజయ పిలుపుకు…

“వస్తున్నా తల్లీ” అంటూ లోనికి చేరింది.

దశరథం బయట నుంచి వచ్చి బుడతడ్ని చూసి ‘హమ్మయ్య’ అనుకున్నాడు.

“నీ కోసమేరా వెధవా వెళ్ళి వస్తున్నాను. నువ్వు ఎటునుంచి వచ్చావు?”

“దోవంటే వస్తిని గదా!”

“అంటే నేను గొందులెంట!… భడవఖాన!”

“నేను వచ్చిన తోవను చెప్పిన!… చెప్పమంటిరి గదా” అన్నాడు.

“ఇంత సేపేం జేసినవు?”

“పెద్దమ్మొచ్చింది.”

“వస్తే?…”

“కుంపు చెద్దామనుకున్నాం…”

“ఎందుకొచ్చినావు మరి?”

“ముసలోడు భుజానెక్కించుకొని వచ్చినడు గదా!”

“అదన్నమాట అసలు సంగతి” అని దగ్గరకొచ్చి “మీ పెద్దమ్మతో మాటాడడానికి జీతం కాడ కుంపు చేయాలట్రా నీ పిచ్చి దొంగలు తోల!…”

“దాన్నొకటి అడగాలనుకున్నా!”

“ఏంటో?”

“నేను ఆడికి పోయినప్పుడు గుట్టెక్కిన. ఆడ రాముడున్నాడు గదా. ఇప్పుడెట్ల ఉన్నాడోనని?”

“ఎవరూ?”

“రాముడు అదే గుట్ట మీద రాముడు.”

“భద్రాద్రి కదరా రామయ్య ఉన్నది.”

“అదేం కాదు. ఆడొక రాముడున్నాడు. నేను చూసిన. బాగున్నాడు.”

“ఓరి నీ తల తిక్క పాడు గాను” అని “సర్లే దూడని విడువు.”

“ఇడిచారటగదా.”

“ఆఁ నామతి మరుపు మండిపోనూ. రోజు నువ్వె ఇడుస్తావు గదా. ఆ ధ్యాసలో ఉన్నానులే. వేళయితంది గానీ ఇంత తిని గొడ్లని ఇడువు.”

***

“దీక్షితులు లేడు, ఊరికెళ్ళాడట” అన్నాడు సీతమ్మతో.

“ఎప్పుడు?”

“రాత్రి.”

“ఎప్పుడొస్తాడట?…”

“ఈ రాత్రికి.”

“పిల్లవాని తరవునుంచి కబురేమైనా వచ్చిందా?”

“ఆఁ….”

“ఎప్పుడట?”

“ఆదివారం.”

“ఈ ఆదివారమేనా?”

“ఆఁ….”

“దీక్షితులు అన్నయ్యకు తెలుసా?”

“ఆఁ….”

“అయితే వెతుకులాట ఎందుకూ ఎంత పని ఉంటే వెళ్ళాడో?”

“అసలు చింతాకంత అవకాశం ఉన్నా ఈ వార్త మనకు చెప్పకుండా పోడు గదా. ఏమిటో అంత పని?” అని,  “అన్నయ్యకేమైనా టౌనులో వ్యాపారాలు గట్రా ఉన్నాయా?” అంది.

“ఉన్నాయి.”

“ఏమిటో?”

“నిర్వ్యాపారం…”

“హాస్యానికయినా హద్దు ఉండాల” అంది మూతి ముడుచుకొని.

“ప్రస్తుతం మేమంతా నిర్వ్యాపారులమే. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం ఏం ఉంది?”

“రండి. కాఫీ చల్లారి పోతుంది.”

“అమ్మయి కిచ్చావా?”

“ఎప్పుడో త్రాగింది. దానికి ఊరు మీద బలదూర పనులేముంటాయి. ఇంటి పట్టున ఉండే పిల్ల గదా!”

“ఎవరి బాధ వాళ్ళుకు తెలుస్తుంది. నిన్ను అని ఏ లాభం?”

“ఇవి బాధలు అని గుర్తించిన వాడికి కదా.”

“అంటే?”

“కాఫీ త్రాగండి. తరువాత మాటాడుకుందాం.”

“అంటే మాటడకు అని చెప్పడమా?”

“అట్లాంటిదేం లేదు. కాఫీ పూర్తి అయ్యాక మాటాడదామన్నాను గదా.”

“అలాగే” అని కాఫీ త్రాగడంలో తలదూర్చాడు.

***

విజయ వచ్చి, “నాన్నా నిన్న గోపాలం మాష్టారుగారి అబ్బాయి వచ్చి బ్రహ్మవయస్సు ఎంతో చెప్పగలవా అక్కా” అని అడిగిపోయాడు. ఇవాళ్ళ రాత్రికి గానీ వాడు రాడు. నీకేమైనా తెలిస్తే చెప్పు? అంది.

“అసలా వెధవను ఈ ప్రశ్న అడిగిందెవడట?” అన్నాడు నవ్వుతూ.

“తెలీదు. నేనడగలేదు.”

“కాన్వెంటు చదువుల వల్ల ఇంట్లో మాటడే తెలుగు కూడా కొండెక్కుతుంది. అసలు మనమేమిటి, మనకున్న సంస్కృతి ఏమిటి అనేది అవగతంకాకుండా పోతున్నయి. ఇది ఇలా సాగితే ఎవరేమిటో పిల్లలకు తెలీదు. వాళ్ళ పిల్లలోచ్చేసరికి అయోమయం. చదువు పేరుతో మనం ఎంత నష్టపోతున్నామో మనం గమనించ లేకపోతున్నాం. ఎన్నో శతాబ్దాల తరువాత బానిసతనం పోయినా మనని గురించి మనం ఆలోచించడం ఇంకా ప్రారంభించలేదు.”

అని ఒక క్షణం ఆగి “విజయా మొత్తం ఈ జీవిరాశి పుట్టకకు మూలం బ్రహ్మ. మన పద్దతి ప్రకారం ఇప్పటికి మూడు కాలాలు నడచినవి. ప్రస్తుతం కలియుగం మొదటి పాదంలో ఉన్నాం.

ప్రతి యుగానికి కాలపరిమితి ఉంది.

కృత యుగం                        17,28,000 సంవత్సరాలు.

త్రేతా యుగం                       12,96000 సంవత్సరాలు.

ద్వారయుగం                       8,64000 సంవత్సరాలు.

కలియుగం                          4,32,000 సంవత్సరాలు.

ఈ నాలు యుగాలను కలిపితే ఒక మహాయుగం.

మహాయుగం కాలమానం ఈ నాల్గింటినీ కలిపితే తెలుస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here