అనుబంధ బంధాలు-19

0
2

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. [/box]

[dropcap]“నా[/dropcap]న్నా మనం ఎవరితో పోటీ పడడం లేదు. నా పెండ్లికి ఆరాటమూ లేదు. ‘మనకు తగ్గ సంబంధం మనకు దొరుకుతుంది’ అన్నాను.

అమ్మ కోపంగా ఏదో అనబోయింది. నాన్న వారించాడు. నేను గదిలోకి వెళ్ళాను.

నిన్న చదివిన ‘అసమర్థుని జీవయాత్ర’ కనిపించింది. చదువుతూ పోయాను. చాలా లోతయిన నవల.

సీతారామయ్య చనిపోవడం… అదే ఆత్మహత్య చేసుకోనడం… అద్భుతమైన థ్రిల్‌ను ఇచ్చింది.

అది న్యాయానికి అతని చావు గాదు. మనిషిలో పెరుకొని ఉన్న అసమర్థత యొక్క చావు.

ఈ సమాజపు నీడలో…. మనిషి ఎంత బేలగా మిగిలి పోతున్నాడో… అసమర్థుడిగా మారుతున్నాడో…

ఆత్మహత్య సదృశంగా జీవిచింతూ, చావలేక నరకయాతన పడుతున్నాడో సీతారామయ్య ఆత్మహత్య సన్నివేశంలో…. అంతర్లీనంగా అద్భుతంగా చత్రీకరించాడనిపించింది.

తన గొంతు తానే పిసుక్కొని చావడం అదీ బీభత్సంగా…

ఈ నాటి సమాజపు స్థితి…

ఎంతో కాలంగా ఉన్న సంబంధాలను అనుబంధాలను సంపాధన కాంక్ష ఎలా మారుస్తుందో చూసాక నవలపై అంతులేని గౌరవం పెరిగింది.

ఇదో నియోరిచ్ రేస్…

ఎలా సంపాదించావు? అనే ధర్మనిబద్ధత ఇక్కడ ఉండదు. ఎలా సంపాదించావు? అన్నదొకటే ఇక్కడ కావల్సింది. దీనికి పగ్గాలుండవు తెగింపు రాక్షసం తప్ప.

ఎలా సంపాదించవచ్చు. ఎలాగైనా సంపాదించవచ్చు. లోకంలో ఉన్న లేని ఏ అక్రమ మార్గాన్నయినా సంపాదించవచ్చు. చివరకు మనిషిని చంపుతూ కూడా…

ఎలాగైయితేం డబ్బు సంపాదించడం ముఖ్యం.  That is only the goal.

అదే గౌరవం…

నవ్వు వచ్చింది.

నాన్నకు స్వయాన అక్క. తోబుట్టువు. ఆవిడ బాగుపడటం కోసం ఈయన అనేకం చేసాడు. నేను పుట్టిన నాటి నుంచి వారి పిల్ల అనుకున్నారు.

డబ్బు కోసం ఛ…

మళ్ళీ నిద్ర పట్టింది.

మూడున్నరకు ఎవరో తట్టి లేపినట్టుగా మెళకువ వచ్చింది. బరువుదించినట్లు fresh‌గా హాయిగా అనిపించింది. తలుపులు తెరచుకొని బయటకొచ్చాను.

చందమామ కనిపిస్తున్నది.

అమ్మ మంచం వైపుగా దృష్టిపోయింది. అమ్మ మంచం పై లేదు. కాలు మడవడానికి వెళ్ళిందేమోననుకొని నాన్న మంచం వైపు తిరిగాను… ఆయనా లేడు…

భయమైంది.

‘ఎక్కడికి వెళ్ళి ఉంటారని’ అనుకుంటుండగా లోననుంచి మాటలు వినిపించినయి. పడమటింట్లో ఉన్నారు ఇద్దరూ.

‘మన బంధువర్గమంతా దీనికి వాడితో పెళ్ళి అయినట్టుగానే అనుకుంటున్నారు. వాళ్ళు శుభలేఖలు పంపాక అవి చూసి ఎమనుకుంటారో ఏమో?’

‘మనం దీనికి పెండ్లి చేయగలమా?’ అంటుంది అమ్మ.

“తోడబుట్టిన దాన్ని ఎలా అనుమానించేదే?”

“ఇక దాన్ని వదిలెయ్యి, మనకు నల్గురిలో తల ఎత్తుకొని తిరిగే రోజులు చెల్లినయి. పిల్లది ఏమనుకుంటుందో తెలీదు. ముభావంగా ఉంది. దాన్నెమన్నా పిలిచి చెబుదామన్నా అర్థం గావడం లేదు” అని ఏడుస్తుంది అమ్మ.

“మొన్నటకి మొన్న రామానుజం ఎదురుపడి అమ్మాయి పెళ్ళి చేస్తున్నావుగదా! మీ అప్పగారబ్బాయేనన్నారు. ‘శుభశ్యశ్రీఘ్రం’ కానీయ్ అన్నాడు. రేపటి నుంచి మెట్టు దిగిన దగ్గరి నుంచీ ఎందరికని సమాధానం చెప్పను. ఈ నరకం అనుభవించే కంటే చిటికెడు విషం మింగడం మంచిదనిపిస్తుంది. మనసాగడం లేదు” అంటున్నాడు నాన్న.

‘ఏమిటా మాటలు దాని రాత ఎలా ఉంటే అలా అవుతది’ అంది అమ్మ.

“రాతేమిటో కనిపిస్తూనే ఉంది గదనే” అని అదోలా నవ్వి “‘చూద్దాం’ ఆఁ పిల్లదాని ముందు బెంబోలు పడకు ఇక పడుకో” అన్నాడు.

ఈ పరిణామం ఎక్కడికి పోతుందో? ఎక్కడ ఆగుతుంది? కని ఆపురూపంగా సాకిన తల్లిదండ్రులను ఈ భాద నుంచి బైట పడేయడమెలా?

ఎదురు పడిన వెధవ నెవరినైనా కట్టుకున్నా బ్రతుకంతా నరకమే గదా! మరేం చేయాలి. దీనికి పరిష్కారం ఏమిటి?

నాన్న బజూరుకెళ్ళకుండా ఉండడనూ లేడు. వెళ్ళాక దీన్ని భరించనూ లేడు.

నన్ను కన్న నేరానికి ఆయన నిత్యం ఈ నరకయాతన పడాల్సిందేనా? ఇదా నేనిచ్చే ప్రతిఫలం.

ఇలా ఎందుకు జరుగుతుంది మంచి చెడులేమిటి అన్నది కాదు ప్రశ్న తన వల్లనే కదా జరిగేది.

తను లేకపోతే ఈ ప్రశ్నలకు ముగింపు దొరుకుతుందా? అవును వస్తుందేమో అనిపించింది

మళ్ళీ మనస్సు పెట్టి నాలుగు విధాలుగా ఆలోచించి చూసాను.

ముగింపు అర్థమైంది.

అందుకే విజయా నేను ఇక కనిపించను.

బహుశా నీకీ ఉత్తరం చేరేప్పటికి నా భౌతిక కాయాన్ని కూడా చూడలేవేమో?

విజయా స్నేహం ఎంత తియ్యటిదో నువ్వు కలిసాకనే తెల్సిందే!

అలాంటి నిన్ను….

విడిచి పోవాలంటే బాధగా ఉంది.

కానీ….

విజయా!

తల్లిదండ్రులను క్షోభ నుంచి బైటపడవేయడం కూతురిగా నా బాధ్యత గదా!

కాదంటావా? అందుకే…

నన్ను క్షమించు.

క్షమిస్తూ గుర్తుంచుకో.

విజయా ఒక్క మాట…

అమ్మ మరి పిచ్చిదిరా నేను లేని క్షణాన్ని ఊహించుకోలేదు. బ్రతకదేమోనే!

నువ్వు వచ్చి అమ్మను సముదాయించాలి.

అవసరమైతే వారం రోజులుండి అయినా నేను లేని లోటును భర్తీచేయాలి.

ఇది నా చిట్టచివరి కోరిక తప్పక తీరుస్తావు గదా!

ఏ కోరిక తీరింది గనుక అని నువ్వు అనుకోవద్దు please…

విజయా నీ కంటే నా కేవరున్నారే ‘నా’ అని చెప్పుకునేందుకు

ఉన్నాడనుకున్న ‘బావ’ ఎలా చేసాడో చూడు.

ఉంటాను.

అమ్మ జాగ్రత్త.

నాన్నను మన్నించుమని నువ్వు చెప్పు.

ఈ లోకాన్ని లెఖ్ఖ చేయకుండా తిరగమను ఏం.

– నీ రాధ

ఉత్తరం చదవడం దీక్షితులు గారికి పూర్తి అయ్యేసరికి కొన్ని కాగితాలు నేల మీద పడినాయి.

దీక్షితులుకు మనసంతా బిక్కచచ్చిపోయింది. కళ్ళ నుంచి నీరు.

ఏంటీ? పిల్ల.

తల్లిదండ్రుల కోసం ఇలా?

భగవంతుడా ఏమిటయ్యా ఇది అనుకొని క్రింద పడిన కాగితాలు ఏరి మడచి విజయకు అందించి.

“అమ్మా, నీ స్నేహితురాలి చివరి కోరిక తీర్చివచ్చావా?” అన్నాడు కళ్ళుతుడుచుకుంటూ

తల ఊపింది విజయ.

‘ఎలా ఉంది?’

నోరు పెగల లేదు విజయకు చెప్పడానికి.

“తండ్రి?…..”

‘ఉన్నాడు మామయ్యా వరండా సెప్టాకానుకొని ఎటో చూస్తూ కనిపంచాడు.’

“ఆ రోజుల్లా అక్కడే అన్నం నీళ్ళు ముట్టక కూర్చుని ఉన్నాడు. నల్గురయిదుగురు పలకరిస్తే ఒకిరిద్దరితో ఆఁ ఊఁ అని మాత్రం అన్నాడు ఆయన కళ్ళ నుంచి నీరు ఆగడం లేదు. ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో?”

“వాళ్ళ అప్పా వాళ్ళు వచ్చారటనా?”

“రాలేదన్నారు.”

“ఆ పిల్ల బావ కూడా?”

“రాలేదుట అప్పగారి భర్తవచ్చాడట.”

“అరేయ్ నీకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడరు లేరా!’ అని ఏడుస్తూ  ఇదిగో ఎవరెవరికి ఏం చెసుకున్నారోగానీ ఇందరం ఉండి ముక్కు పచ్చలారని కుందనపు బొమ్మను చదువుల సరస్వతిని నిష్కారణంగా చంపుకున్నాం రా! అరేయ్ చంపుకునే హక్కు మనకెక్కడిదిరా! పోయిన ఒక్కళ్ళని తేగలమా చెప్పండిరా?”

‘నేరానికి శిక్ష ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అన్నీ తెలిసి మనం వెయ్యలేక పోయినా శిక్ష తప్పదురా’ అని పెద్దగా ఏడుస్తూనే వెళ్ళిపోయడుట.

సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళి “ఒసేయ్ మహంకాళీ ఆ పసిదాని ఆయుషు కూడా నువ్వే పోసుకొని లంఖిణిలాగా కలకాలం బ్రతకవే. కాకులు బ్రతుకుతున్నాయి. ఇక నీ బ్రతుకు మండ. ఇదిగో అనుకుంటున్నావేమో నీకు గొంతెమ్మ కోరికలు ఎన్ని ఉన్నా నిన్ను తగులబెట్టేది నేనేనే. నీ మురిపాల మూట అని మురిసి చూస్తున్నావే ఆ ముద్దుల కొడుకు వచ్చే మూటలతోనే వాడు పోతాడే. మంచి మనిషికి అరక్షణం చాలే మంచి అనిపించుకోవడానిక ,నీ లాంటోళ్ళకు మాత్రం నూట ఏభై ఎళ్ళు కూడా చాలవు” అని పిచ్చివానిలా మొత్తుకున్నాడట.

ఆ పరమాత్మడు ఎవరి రాత ఎలా వ్రాశాడో? క్షణం ముందు కూడా తెలీదు.

అసలేలా బ్రతకడం అన్నది కల్పించి దాన్ని మరిచి పోయోలా చేయడం అంతులేని ఆనందం హేలలో విషాదాన్ని నింపడం. నిండు విషాదములో హాస్యానికి చోటివ్వడం కసాయితనంలో కరుణను చూస్తూంటే మనిషి అర్థం కాడు.

అంతా తెలుస్తూనే ఉంటుంది.

తెలిసినట్టే ఉంటుంది.

ఏమిటి తెల్సింది అంటే అర్థం గాదు.,

“అంత మన చేతిలోనే ఉందనుకుని మనం లేనిది నడవదనుకుని ధీమాతో నడవటం కుప్పకూలడం ఉందే దాన్ని ఏమనాలో” అని ఆగిపోయాడు దీక్షితులు. మళ్ళీ నాలుగుడుగు వెనక్కి వచ్చి ఆగి “సీతా, వీళ్ళ అనుబంధం ఏమిటో మనకు అర్ధమైంది. తీపి స్నేహం చేసారు. ఆ ముద్ర మనమనుకున్నంత త్వరగా చెరగదు. కానీ మరచిపోవాలి. ఇలాంటివి మరవక చేసేదేముంది. ఇది నిజమే కానీ ఇక్కడ ఉన్నప్పటి బంధాలు అనుబంధాలు అంత త్వరగా ఇదీ తెల్సు” అని నవ్వి, “ఈ తెల్సిన దాంట్లోని తెలియనితనాన్ని వెతుకులాడడమేనమ్మా భగవంతుడంటేనూ” అని ఆగి…

“విజయా ఎల్లుండే పెళ్ళివారు నిను చూసేందుకు వస్తున్నది. ఇవ్వాళ్ళ ఎట్టాగూ నడచేపోతున్నది. ఒక్కటంటే ఒక్కరోజు ఉంది మధ్యన” అన్నాడు.

“పిల్లదాని పరిస్థితి బాగోలేదు. వచ్చేవాళ్ళకు మరో రోజు చూసుకుని రమ్మనమని కబురు చేయడం భావ్యంగా ఉండదు. పైగా అనవసరపు అనుమానాలకు హేతువవుతది. ఇదోగో పులి అంటే అదిగో తోక అనే స్వభావము మనది. పెళ్ళంటే నూరేళ్ళ పంట. ప్రారంభంలోనే ఇలాటివి రారాదు.”

తల ఊపింది సీతమ్మ.

అక్కడి నుంచి తోవలో కొచ్చాడు దీక్షితులు

తలంతా దిమ్ముగా అనిపించింది. స్నేహం ఎంత బలమైందో ఎలాంటి ముద్రను వేస్తుందో వీజయను చూస్తే స్పష్టపడింది. దీన్ని వదలి బంధుత్వాలు, తెగలు, కూలాలు అంటారు.

మరి విజయ రాధల కులాలేంటి?

ఇవి బూటకం పచ్చి trash అనిపించింది.

మనుషులు కలవడం స్పందించడం మాత్రమే నిజాలు.

అదే ప్రేమ.

తన ఇల్లు ఉన్న మలుపు దాటి నడచినట్లనిపించింది.

ఆగాడు. నిజంగానే ఇల్లు దాటి అడుగుపడింది.

కనిపించలేదే కళ్ళు తెరచి ఉన్నాను గదా, పైగా నిత్యం ఉండే ఇల్లు గదా, స్పృహలో లేకున్నా ఇటు మళ్ళాలి గదా. అంత అలవాటయే. మరుపా, మరుపు అనుకుంటే నడక సక్రమంగానే నడుస్తాను గదా. నడక సక్రమంగా ఉంటూ మనస్సు పని చేస్తూ కనిపించకపోవమేమిటి? – ఇలా ప్రశ్న పరంపర తలలోకి జారబడనయి.

శాంతమ్మ ప్రశాంతంగా ఎదురవడంతో ఇవి ఆగినయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here