Site icon Sanchika

అనుబంధ బంధాలు-2

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

[dropcap]నా[/dropcap]లుగు నిముషాలలో బస్సుస్టాండుకు చేరారు. జనం రద్దీగా ఉన్నారు ఎండ ముదురుతున్నది.

పల్లెటూరు గనుక వేపచెట్టూ అవీ ఉండటాన వెళ్ళిపోతుంది గానీ లేక పోతే వయసు మళ్ళినవారికి, పసివాళ్ళకూ కష్టమే అవుతుంది అనిపించింది దీక్షితులుకు.

బస్సు వచ్చిన జాడ లేదు.

ఎదురు వెళ్ళాల్సినవి బకటి రెండు వెళ్తున్నాయి. బటానీలు, చెనగకాయలు అమ్మే కుర్రోణ్ణి అడిగాడు దశరథం. అతగాడు చెప్పబోయేసరికి మన బుడతడే వచ్చి ‘రాలేదు’ అన్నాడు.

నవ్వుకున్నాడు దీక్షితులు.

“మీరు వస్తారని నాకు తెల్సు” అన్నాడు బుడతడు దీక్షితుల్ని చూస్తూ.

“వీడికి తెల్సినంత దశరథంకు తెలీకపోయే” అనుకుని “ఆ చెట్టు క్రిందకెళ్దాం రా” పిలిచాడు దీక్షితులు.

ఇద్దరూ చెట్టు క్రిందికి చేరారు.

“శాంత తీర్థయాత్రలకు వెళ్తానందా?” అడిగాడు దశరధం.

“నీకు తెలియనిదేముంది. నన్ను ఒంటరిగా వదిలి అదెక్కడికి పోదు. కాని దశరథం అది ఇక్కడ ఉండలేకపోతుందిరా. పోయిన పిల్లవాణ్ణి మరచిపోలేక, వాడు ఆడిపాడినవి, కళ్ళముందు కనిపిస్తుంటే; ఆ అల్లరి మాటలు గుర్తుకొచ్చి ఎగ తడుతున్న గర్భశోకాన్ని భరించలేక మనశ్సాంతిని వీడి అదో దుర్భర స్థితిలో బ్రతుకీడుస్తున్నదిరా. నేనే ఒకనాడు అడిగాను ‘తీర్థయాత్రల బస్సు వెళ్తుంది, మన ఊరువాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదీగాక మన కామాక్షమ్మగారి కుటుంబమంతా వెళుతుంది. ఇరవై రోజులు దక్షిణ దేశమంతా చూపుతారు. నువ్వు వెళ్ళిరారాదూ’ అని.”

“మెల్లిగా నవ్వి నన్ను పిచ్చివాణ్ని చూసినట్లుగా చూసింది. దగ్గరి కొచ్చి, నన్ను వాటేసుకొని బావురుమన్నది. దాన్ని సముదాయించడం పూట పట్టింది. ఈ లోపు నేనెన్ని సార్లు ఎడ్చానో” అని ఆగి. “దశరథం ఈ ఆడవాళ్ళకు గుండె పగిలేలా ఏడ్చే స్వేచ్ఛ అన్నా ఉంది. మనకదీ లేదురా. ఏదీ ఏమైనా ఇంటిని వదిలేస్తే బాగు అనిపిస్తుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా కట్టించుకున్నానో నీకు తెల్సు, అయినా పోయిన కొడుకు తిరుగాడిన చోటుగదా మమ్మల్ని గుర్తులు వేటాడుతున్నాయి.

చోటు మారితే నన్నా ఎంతో కొంత ప్రశాంతత దోరుకుతుందేమో కాని బొమ్మరిల్లు లాంటి ఆ ఇంటిని ఇంత క్షోబలోను వదలాలనిపించదు దశరథా. పిల్లవాడు చాలా అన్యాయం చేసి వెళ్ళాడురా” అని ఆగి కళ్ళు అద్దుకొని “పిల్లలు కలగనంతకాలం ఒక్కడైనా ఉంటే బాగు అనుకునేవాణ్ణి. లేక లేక వీడు కలిగాక భగవంతుడు ఎంతో దయామయుడని నా కోరిక తీర్చాడనీ సంబరడ్డాను. వాడు ఎదుగుతుంటే నాకు ఆసరా అవుదాడని ఆశపడ్డాను. పది ప్యాసయ్యాక నీ పిల్ల నిచ్చి పెండ్లి జరపాలనుకున్నాను. వాడినో ఇంటివానిగా చూడాలని మక్కువపడ్డాను. అందుకేకదరా ఆ వేళ పరుగెత్తుకొచ్చి నిన్ను అడిగంది. నా పిల్లాడికి పిల్ల దొరకదని గాదు. ఎందుకోగాని విజయే నాకు కోడలయినా కుతురయినా అనిపించింది.

అంచేతనే మగ పిల్లాడి తండ్రినై ఉండి – నువ్వు అందుకోలేని అంతస్తున ఉండి కూడా – నీ చేతులు పట్టుకొని ‘నేను నిన్నేమి అడగనురా – విజయను నాకు కోడలిగా పంపు చాలు’ అన్నది.”

ఇస్తానన్నావు. అదీ విజయ ఉండగా. దాని మొఖంలోనూ ఈమాట విన్నాక కాంతి కనిపించింది. ఆనందం మెదిలింది. నాకు నువ్వు వరాలిచ్చిన దేవునిలా కనిపించావు. నేను విజయ దగ్గరికి కెళ్ళి అమ్మా ఇక నుంచి నువ్వు నాకు కూతురువే. అలా నా దగ్గర ఉండాలి అంటే పిచ్చిది పారిపోయింది.

దశరథా నిజంగా నాకావేళ కల్గిన ఆనందం చెప్పలేనురా. హిట్లరు కోరిక ప్రకారం ప్రపంచ విజేత అయి ఉంటే కలిగే సంతోషంలా ఉంది. బుద్దునికి మనిషి ఎందుకు జరామరణాలకు లోనవుతున్నాడు, అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే కల్గేటువంటి ఆనందం అయితే నా ఆనందాన్ని చూసాక ఆ భగవంతునికే కన్ను కుట్టినట్టుంది. వీడేమిటి ఇంత ఆనందం ఏమిటి ఆదీ ఒక మనిషకి ఇంతనా, NO అనిపించినట్లుంది.

ఎదిగిన బంగారం లాంటి కొడుకును నిష్కారణంగా తీసుకెళ్ళాడు. ఎవడో చెరువులో కొట్టుకుపోతుంటే…. వాణ్ణి రక్షించేందుకు వీడు నీళ్ళలో దూకి వాణ్ణి ఒడ్డుకు నెట్టి వీడు సుడిగుండంలోకి జారిపోవడమేంటి. ఊపిరి పోయిన కట్టెగా బయటకి రావడం. నేనేం పాపం చేసాను. మనసా వాచా నమ్మిన వాళ్ళను ఇలా…” అంటున్నవాణ్ణి ఆపి దగ్గరికి తీసుకొని “అరెయ్ దీక్షితులు, నిన్నే! ఏమిట్రా ఇంకా ఎన్నేళ్ళురా? ఇక్కడ నుంచి పోయిన ఎవ్వడైనా మళ్ళీ వచ్చాడట్రా? నువ్వు నేను ఏడిస్తే వస్తాడా? చావుపుటుకలు ప్రకృతి ధర్మం. మనమూ పోతాం కాస్త వెనకో ముందో. అలా అని మనతో పాటు ఈ లోకం వస్తుందా. మరొకరితో పాటు మనం వెళ్తామా, అగుదామా. పుట్టుక ఉందంటేనే గిట్టడం ఉందని అర్దం. కనిపించేదంతా నశించేదే. ఆగదు. చివరకు సూర్యచంద్రులతో సహా. ఇది తెల్సిన వాడివీ ఇలా బాధపడడం…

నిన్ను నువ్వు నిబ్బర పరచుకోవాలి. నువ్వే ఇలా ఉంటే ఆ పిచ్చది శాంత సంగతేంటి? దాన్ని ఓదార్చేదెవరు? సేద దీర్చడమెలా” అని సముదాయిస్తూ తనలో నుంచి బయటకుబుకుతున్న ఆవేదనను బలవంతంగా ఆపుకున్నాడు దశరథం.

దీక్షితులు తల ఊపుతూ కళ్ళు తుడుచుకొని చెట్టు మొదట కూర్చున్నాడు. దశరథం కూడా ఎదురుగా కూర్చోబోతుండగా – బుడతడు “బస్సోస్తందోచ్” అని అరిచాడు చప్పట్లు చరుస్తూ.

దీక్షితులు గబగబా లేచి “అరెయ్ బస్సు వస్తుందట. శుభ్రంగా మొఖం తుడుచుకో. దాన్ని పలకరిద్దువు గాని” అని పైకండువాతో తను గట్టిగా మొఖం తుడుచుకొని అడుగు కదిపాడు. దశరథం వెంట నడిచాడు మొల్లగా.

బస్సురానే వచ్చింది. స్టేజి దగ్గరగక కొంచెం ఎడంగా ఆగింది. బస్సు ఎక్కేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ సామానులతో చంకనున్న పసిపిల్లలతో ఎగబడ్డారు.

“చాలా మంది దిగుతున్నారు. ఖాళీ ఉంది. మొదట క్రిందకి దిగనివ్వండి” అని చెప్పాడు కండక్టరు. అయినా ఎవ్వడూ విన్న జాడలేదు. ‘మీ చావు మీరు చావండి’ అనుకుంటూ క్రిందకి దిగాడు. అతని వెంట అయిదారుగురు దిగారు. ఆ వెనక విజయ దిగింది. దిగగానే తండ్రిని, దీక్షితులునూ చూసింది. బుడతడు విజయ కెదురుగా జొరబడి సూట్‌కేస్ అందుకొని నెత్తిన పెట్టుకొని, “బావున్నారా అమ్మాయిగారు” అన్నట్లు చూసాడు.

“ఆరి భడవా నువ్వు వచ్చావా?” అని ఇద్దరి చేతులను పట్టుకొని “బావున్నారు గదా” అంది. తలూపారు.

“ఇక వెళ్దాం” అన్నాడు బుడతడు ముగ్గుర్ని చూస్తూ. “పదండి” అంది విజయ. వెంట నడచారు.

సీతమ్మ వరండాలో నిల్చుని విజయ రాక కోసం ఎదురుచూస్తూంది. విజయ కన్పించగానే పరుగున దగ్గర కొచ్చి చేతులలోనికి తీసుకుంది.

“అమ్మా అద్దం చూసుకుంటున్నావా, అలా చిక్కపోయావేం?” అంది.

“బాగానే ఉన్నాలేవే, నీ సంగతే తెలీక బెంగగా ఉంటుంది.”

“అమ్మా మొదట స్నానం చేసి రా, అనక మాట్లాడుకుందాం” అంది సీతమ్మ. తల ఊపింది విజయ.

***

“అమ్మా అత్తయ్యను కలిసి వస్తాను” అంటూ బయలుదేరింది విజయ.

“కాఫీ త్రాగి వెళ్ళవచ్చుగదా.”

“అక్కడ త్రాగొచ్చు. కాఫీ ఇవ్వకుండా పంపదుగదా.”

“నీ ఇష్టం తల్లీ” అని “త్వరగా రా. అట్టానే దిగబడిపోయేవు. ఆ దీక్షితులు మావయ్యగానీ ఇంటిపట్టున ఉంటే నాన్నగారు రమ్మన్నారని చెప్పు. మరిచిపోకేం.”

తల ఊపుతూ గడపదాటింది విజయ.

తోవలో నలురయిదుగురు ఆడంగులు ఎదురుపడి పలకరించారు – “ఎప్పుడొచ్చావు, పరీక్షలు అయిపోయాయా, శెలవులా?” అని. తల ఊపి నడిచింది.

నాలుగుడగులు వేసాక “అమ్మా విజయమ్మా” అన్న మాట వినిపించింది ఆగి పిలిచిందెవరా అని వెనక్కి తిరిగి చూసింది.

కాముడుతాత గొంతది. చిన్నతనం అంతా ఆయన చేతుల పైన భూజాలపైన గడిచిపోయింది. కడుపు నొప్పి వచ్చి తల్లి బాధపడుతున్న రోజులలో పక్క ఇంట్లో ఉంటున్న ఈయనకు బాగా మాలిమయింది. కామయ్య తాత వ్యవసాయపు పనిలో ఉండే కాలం తప్ప ఎప్పుడూ ఆయనతోనే ఉండేది.

ఆయనే దగ్గరి కొచ్చి తేరిపారా చూసి “అమ్మా నువ్వేనా? నువ్వే కదా” అన్నాడు.

“ఆ ఆ నేనే తాతా” అంటూ దగ్గరకెళ్ళి ఆయన గుండెలకు తల ఆన్చి భుజాలు పట్టుకొని ముఖంలోకి చూస్తూ “తాతా ఎలా ఉన్నావు. నేను ఇవ్వాళ్లే వచ్చాను. దీక్షితులు మామయ్య ఇంటికి వెళ్తూతుంటే నీ గొంతు వినిపించింది. గుర్తుపట్టాను” అని అరక్షణం ఆగి “తాతా నీ మాట నివిపించాలే గానీ ఊపిరి విడచేప్పుడయినా సరే నీవైపు మళ్ళకుండా ఉండగలనా” అంది కళ్ళు చెమ్మగిలుతుండగా.

“నా తల్లే అంత మాటనకు. నేనుగా నీకు చేసిందేముందమ్మా? మీ అమ్మ బాధతో మెలితిరిగిపోతుంటే నిను చేరదీసి జొజ్జరకొట్టిన. పసిదానవుగదా దగ్గరయినావు” అన్నాడు.

“అంతేనా తాతా” అంటూ సూటిగా కళ్ళలోకి చూసింది.

గొంతు కొంచెం జీరగా వినిపించింది. “అంటే తల్లీ తోటి మనిషిగా పసివాళ్ళలో దేవుడంటాడనే నమ్మకంతో దగ్గరకి తీసాను. ఆపద ఏదీ చెప్పిరాదు గద. అది వచ్చినపుడు మనమెంత? ఆ రామచంద్రు ప్రభువుకే తప్పలేదు. కాకపోతే ఆ ఆపదలో మన అండ గుర్తులో ఉంటుంది మనిషన్నవానికి, అది దర్మం గదా! అందుకే తల్లీ ఉడతని రామచంద్రప్రభువు ఆశీర్వదించిందీ! న్యాయంగా ఆ తండ్రికి అది చేసిన సాయంమెంత?” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. విజయ ఆత్మీయతకు కదిలిపోయాడు.

“నీ మనస్సంత గొప్పది తాతా” అని “అరే కాలికేమైంది?” అంటూ గబుక్కున నేలబారుగా వంగింది.

“ఛ లే ఏంటిది?” అని లేపి “నాలుగేళ్ళ క్రితం పాము కాటేసింది రా. నేనేమో మోటుగదా, కొడవలితో కాటేసిన కాడ చీల్చి రక్తం పీల్చిన. ఇంకా భూమ్మిద నూకలుండడాన బతికి బట్టగట్టిన న్యాయానకి నన్ను పాము కాటు ఏం చేయలేదు. కాని కొడవలితో కాసానుగదా దానికి ఉన్న చిలుము వల్ల సెప్టికి అయింది. చెడుతూ వచ్చిందేమో బాధ ముదిరి డాక్టరు దగ్గరకి చేరేసరికి మోకాలు క్రింద వరకు తీసేయ్యాల్సి వచ్చింది అన్నాడు.

“ఈ మాట నాతో ఎవ్వరూ అనలేదు తాతా. నిజంగా నాకు తేలీదు” అంది కంట తడి తుడుచుకుంటూ.

“ఛ ఊర్కో! అయినా నీ పిచ్చగానీ ఈ సంగతులు తెల్సినోళ్లు మాత్రం ఏం చేస్తారు చెప్పు?” అని నవ్వి, “అన్నీ మన చేతులలో ఉండవు కదా” అన్నాడు.

“తాతా ఇప్పుడు బాగా గడుస్తుందా?” అంది గుండె చెరువయి.

“నేను గాంధీ గారి పిలుపు విని స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గోంటిని గదా. జైలుకు కూడా తొల్తిరి. ఆ బాపతు పించను ఇప్పుడు ఆసరా అవుతున్నది. ఒకడ్ని గదా అని తల్లీ కూతురుకు చేసిన దాంట్లో ఋణం అన్న ప్రశ్న రాదు. బాధ్యత అనుబంధం ఉంటాయి. వీటి నడకనే మనం ప్రేమ అంటాం. ఆ ప్రేమకు అభిమానానికి ఖరీదు ఇవ్వాళ్ళ తీకుకుంటున్నామా అనిపిస్తుందమ్మా. ఈ పింఛను తీసుకునే జన్మ ఉండకూడదు. కాని ఏం చేయను అవిటివాణ్ణి, వయస్సు మల్లిన వాణ్ణి. పైగా ఒంటరి వాణ్ణి. దిక్కు లేక పింఛను తీసుకోవల్సి వస్తుంది” అన్నాడు బాధగా.

“అదేంటి తాతా, న్యాయంగా నువ్వు పోరాటంలో పాల్గోని జైలు కెళ్ళావు. అనేకసార్లు లాఠీ దెబ్బలు తిన్నావు. మరి ఇదంతా ప్రాణాలకు తెగించి దేశం కోసం చేసిందే గదా. ఆ పుణ్యమే ఇప్పుడు నిన్ను ఇలా ఆదుకుదేమో” అంది విజయ.

“తల్లీ నీకు తెలీదు నా బాధ. నిస్వార్ధతకూ త్యాగానికీ ఫలితం స్వాతంత్ర్య పింఛను కాదు, కానే కాదు” అని ఓ క్షణం ఆగి “అమ్మా ఇక పోతా నువ్వు శలవలయిందాకా ఉంటవుగదా. తీరుబాటుగా ఇంటికి వస్తేలే. ముచట్లాడుకుందాం. నువ్వికపో” అని చేతికర్ర సాయంతో ముందుకు నడిచాడు. తాత మలుపు తిరిగిందాకా, అక్కేడే నిల్చుని చూసి దీక్షితులుగారి ఇంటి వైపుగా మళ్ళింది అయితే బయలుదేరినప్పుడు వున్న ఉత్సాహం చప్పబడిపోయింది. మనసంతా ఆలోచనలతో నిండింది.

‘తాత ఈ దేశం నాది అనుకున్నాడు. బానిసత్వాన్ని పారద్రోలాలనుకున్నాడు. ఈ గడ్డపై పుట్టినందుకు బాపూజీ పిలుపు వెంట నడిచాడు. మృత్యువును కూడా ఎదిరించాడు మొత్తం కుటుంబానికి ఉన్న వనరునంతా ఉద్యమంలో ఖర్చు పెట్టాడు. తమ కళ్ళేదుటే తమ కలల పంట ఆయిన స్వతంత్ర్యాన్ని చూసాడు. మా జన్మ ధన్యమైందని నిండా ఊపిరిపీల్చుకున్నాడు. ఈ లోపు వయస్సు పెరిగింది, అంగవైకల్యం సంప్రాప్తించింది. ఆర్థికంగా వెనక బడాల్సి వచ్చంది. చివరకు తిండికి కూడా కటకట.

ఈయన వయస్సునూ, ఆస్తినీ ఖర్చు చేసిందెవరి కోసం? ఎవరి కోసం మన పూర్వీకులు చెట్లు నాటారు, చెరువులు త్రవ్వారు, గుళ్ళు గోపురాలు, ధర్మశాలలు, ఆశ్రమాలు ఎందుకు కట్టారు? వారి స్వార్థం కోసం కాదే. సమాజం కోసం! మనం నిత్యం బ్రతుకుతున్న ఈ సమాజ శ్రేయస్సు కోసం! మరి ఈ సమాజం వారికేమీ ఇవ్వదా?’

(సశేషం)

Exit mobile version