అనుబంధ బంధాలు-22

0
2

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం. [/box]

[dropcap]బా[/dropcap]గా రాత్రయింది. నక్షత్రాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. కాలక్షేపం అనుకుంటే వాటిని లెక్కిస్తే చాలు. ఎంత కాలమైనా గడిచిపోతది.

పూజారయ్య గుడికి తాళం వేస్తూ ‘పొద్దుపోయినట్టుంది’ అనుకున్నాడు మెట్లు దిగి. ఇంటికి బయలుదేరాడు. చేతిలో ‘లాంతరు’ ఉంది. నడుస్తున్నాడు.

ఎవ్వరు ఎదురుపడలేదు. పల్లె మాటు మణిగి కనిపించింది.

సరిగ్గా ఇంటి ముందుకు చేరుకుంటుండగా దీక్షితులు కనిపించాడు. ఆగి “ఇప్పుడు ఇక్కడ?” అన్నాడు.

‘టౌను కెళ్ళివస్తున్నాను’ అన్నాడు.

‘విజయ సంబంధం ఖాయమయినట్లేగదా!’

“ఇంకా వాళ్ళు నుంచి ఏ కబురు రాలేదు.”

“మీరేం అనుకుంటున్నారు?”

“ఎవరో ఒకరు కొంతలో కొంత సర్దుకోవాలి గదా!”

“అంటే?”

“మీకు తెలియనిదేముంది? ఇవ్వాళ్ళ నడుస్తున్న తీరు అది. మా తండ్రిగారి కాలంలో ముప్పయి ఏళ్ళు పెళ్ళి కాకుండా ఆగి మూడేళ్ళ పిల్లను వెతికి చేసుకునేవారట. మేం వచ్చేసరికి సాంప్రదాయం అనీ బంధుత్వాలనీ బేరీజు వేసుకొని పెళ్ళిళ్ళు చేశారు. ఆ తరువాత తరం వారు లాంఛనాలనీ, ఆస్తిపాస్తులనీ, స్థితిగతులనూ చూసి పెళ్ళిళ్ళు ప్రారంభించారు.

ఇప్పుడు ‘ఒక డబ్బే’ అన్నింటికీ ‘మందు’ అయింది. పిల్లను, చదువును, కుటుంబాన్ని, మంచితనాన్ని, తెలివితేటలనీ చూసే పనేలేదు.

ఎంత ఇవ్వగలడు అని తెల్సినాక అది నచ్చాక పిల్లను లాంఛనంగా చూస్తూన్నారు. ఆడపిల్ల బొగ్గుముక్కలా ఉన్నా డబ్బున్నవాడు చలామణి చేసుకుంటాడు. అలాగే మగాడు నంగిలా ఉన్నా కుబేరుడయితే సరిపోతది.

డబ్బు మొదటిగా ఎదిగింది ఈ కొద్దికాలంలో… మామూలు కుటుంబీకుడు ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే…

వెనకట చేసిన యజ్ఞయాగాది క్రతువుల కంటే కష్టమైపోతుంది. ధశరథం స్థితి గతులు మనకు తెల్సు. నేను ప్రక్కన ఉన్నాను అనుకోండి, అంతా కలిపి రెండు లక్షలవుతయి. నలబై వేలు అప్పులో పడతాడు. వాళ్ళేమో రాకపోకలు సారెలు ఇంకా ఉంటాయి గదా అన్నారు. మన విజయ బంగారు బొమ్మ. చదువుల తల్లి. చిదిమి దీపం పెట్టుకోవచ్చుగదా. దాన్ని చూసాక కూడా వాళ్ళ స్థితి గతులలోనూ మార్పు లేదు.

కట్నానికి ప్రాదాన్యత ఇవ్వడం అలా మాటడడం చూసాక మనం ఏ దిశకు దిగిపోతున్నామో అర్థమవుతుంది. అర్థమయ్యాక ఈ తలను ఎక్కడ పెట్టుకోవాల్నో తోచదు. అందుకే నేను ‘ఊఁ’ అన్నాను సర్దుదామని. దీనికి దశరథం వప్పుకోలేదు. చూద్దాం” అని… “పూజరయ్యా అసలీ సృష్టిలో డబ్బు మొదటిదా? మనిషి మొదటి వాడా? మనిషి పుట్టించింది గదనయ్యా ఈ డబ్బు… మరి ఇది మనిషిని ఇలా శాసిస్తున్నదేం? నేను లేని మనిషేమిటి అని సవాలు చేస్తుందేం?

దాని ‘అహం’ ముందు మంచి మనిషి అకారణంగా చస్తున్నాడు గదా? మంచి లేకున్నాక అసలీ లోకం ఎందుకు దేనిలో మనిషెందుకు?

ఈ డబ్బును చంపే మార్గం ఏదైనా ఉందా? ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న మూడు వంతుల దుర్మార్గం మోసం పాశవికత చచ్చిపోతయి. మనిషి మనిషిగా మిగులుతాడు, ఏమంటారు.”

పూజారయ్య నవ్వాడు.

చీకటిలో కిరోసిన్ లాంతరు గుడ్డి వెలుగులో విచిత్రంగా అనిపించిదా నవ్వు.

“దీక్షితులూ ఈ కాలగమనం లిప్తపాటు కూడా ఆగేది కాదు. జీవరాశి ఏడ్చినా నవ్వినా నరుక్కుని చచ్చినా దీనికి పట్టదు. చాలా నిర్దాక్షిణ్యమైన తత్వం దీనిది. ఒక్క గమనం తప్ప దీనికేమీ తెలీదు. నిరంతరం నడుస్తుండటమే దీని పని. అయిదు నిముషాలు ముందు వస్తే బ్రతికేవాడు అనే వైద్యశిఖామణులను నేను చాలా మందిని చూసాను. ఎక్కడి దాకా అవసరం లేదు. నా ప్రాణ స్నేహితుని ఇల్లాలు పనీ ఇలాగే అయింది. ఈ రాతి దేవుని ముందర పడి రాళ్ళు పలకవు.

వాటిలో ఆత్మ ఉందనుకోనడం భ్రమ…

మనం మన గుర్తు కోసం, భయం కోసం, ఆసరా కోసం, మనశ్శాంతి కోసం వేసుకున్నవీ రాళ్ళు…

పూజరినై ఉండి నిత్యం ఆ సేవలోనే నమ్మి ఉన్న నాకు ఆ వేళ అలా అనిపించింది” అని… అరే ‘ఇప్పుడే టౌను నుంచి వస్తున్నానన్నారు గదూ’ మాటల్లో పడిపోయాను” అన్నాడు నొచ్చుకుంటూ.

“అదేం లేదు బస్సు ఎక్కతూ నాల్గు చక్కరకేళీలు తిన్నాను. బాదం పాలు త్రాగాను. కనుక ఈ పూట బోజనం మాటలేదు..”

“అయితే రండి కూర్చుని వెళ్దురుగాని” అన్నాడు పూజారయ్య.

“పదండి” అని “ఆ పిచ్చిది ఎదురు చూస్తుందేమో? చివరి బస్సు కూడా వెళ్ళింది అని తెలిస్తే నా ధ్యాసలోనే ఉంటుంది” అని నవ్వాడు.

“అయితే మీ యిష్టం” అన్నాడు పూజారయ్య.

“పదండి, ఎవరో ఒకరు చెప్తారు లే” అని “మంచి కాలక్షేపానికి కూడా మంచి మిత్రులు కరువు ఏర్పడింది. ఈ కాలం కూడా రూపాయలు పుట్టించేందుకు పరుగెడదామనే జనం ఆలోచన” అంటూ నడిచాడు.

పూజారయ్య ఇంటి ముందున్న గేటు తెరచి ఇంటి తలుపు తాళం తీసి కిటికీలు తెరచి ‘ఇక రండి’ అన్నడు. గోడవారగా పరచిన చాపపై మందపాటి దుప్పటి పరచి దిండ్లు వేస్తూ…

దీక్షితులు దుప్పటిపైన కూర్చున్నాడు. చాలా హాయిగా అనిపించింది. పూజారయ్య మాత్రం బావి దగ్గరకెళ్ళి నాల్గు బొక్కెనల నీళ్ళు తలపై పోసుకొని తుడుచుకుని వచ్చి కూర్చున్నాడు.

“టౌనులో ఉన్న రామప్ప పంతులుగారు మీకు బంధువా?” అడిగాడు. “దూరపు బంధువే” అని “వకీలు గుమస్తా చేసే అయనే గదా?”

అవునన్నట్లు తల ఊపాడు దీక్షితులు.

“అతగాణ్ణి చూసాక మీరే పద్ధతిగా ఉన్నారనిపిస్తుంది.”

“కారణం?”

“వృత్తి పట్ల మీకున్న విశ్వాసం దాన్నే నమ్ముకున్న జీవన యాత్ర…. మనకున్న విశ్వాసాలు పూర్తిగా సడలిపోయే ఈ రోజులలో కూడా మిమ్మల్ని చూసాక… ఆ రాముడికి దండమొట్టకుండా ఎలా ఉండగలం. ఈ కాలపు తీరువు ఇంతకంటే గొప్ప విషయమేమి కావాలి?”

“ఒకటికన్నా ఒకటీంపావు పెద్ద. ఒకటింపాపు కంటే అర చాలా చిన్న. ‘అర’ కంటే చిన్నవి ఉన్నాయి. ఒక పుల్ల మన చేతిలో ఉంది అనుకోండి దాన్ని మనం కదపకుండా చిన్నది పెద్దదీ చెయ్యచ్చుగదా” అనగానే తల ఊపాడు దీక్షితులు.

“కొన్ని నిజాలను మనం ఒప్పుకుంటూనే… నిజం అని తెలిసాక కూడా ఎందుకో గానీ దానిలో ఇమడలేం. ఎంచేత నంటే నిజం పై నిలకడైన అభిప్రాయం దొరకదని” నవ్వాడు.

“అంటే?”…

“చెప్తాను. పూజారికాలు ఆలయాలలో బయటా నిర్వహించేందుకు ‘దీక్షితార్లు’ అనే వాళ్ళు ఉన్నారు. వారే ఈ కృతువుల్ని నిర్వహించాలి. కానీ మేం చేస్తున్నాం…”

“ఎందుకు?” అన్నడు దీక్షితులు ఆశ్చర్యంగా…

“దీక్షితార్లు వంశం సామాజికపు ఆటుపోటుల మూలంగా పలురకాల వృత్తులలోకి వలస పోయారు. అయితే దీక్షితార్లలో ఉన్న నియమం, నిష్ఠలు, కట్టుబాట్లు మరేవ్వరిలోనూ ఉండవు. ఆ కుటుంబాలలో పుట్టిన మన పిల్లలకు, శ్రీకారం చుట్టిన నాటి నుంచీ ఆధ్యాత్మిక బోధన, చింతన, పూజలు విధానం అత్యంత ప్రాధాన్యతనిచ్చి మరీ చెపుతారు. ఆటపాటలు, వినోదాలు స్నేహాలు చివరకు తల్లిదండ్రులను కలువడాలు కూడా ఖాళీ దొరికితేనే. ఇప్పటికీ చిదంబరం లోని నటరాజుస్వామి ఆలయంలో ఈ పాఠశాల నడుస్తుంది. కుఱ్రవాళ్ళు విభూతి రేఖలు ధరించి సిగముడులతో శుచిగా పద్మాసనం వేసుకొని కూర్చుని, శ్రావ్యంగా వేదగానం చేయడం మనం చూస్తాం. అయిదు సంవత్సరాల వయస్సు నుండి పన్నెండు, పదమూడేళ్ల వయస్సు దాకా మనకు కనిపించే, విద్యార్ధులకు ‘భగవత్ సేవా కార్యాక్రమం మాత్రమే వారి లక్ష్యంగా కనిపిస్తుంది.’

ఆలయ పూజారులుగా, ధర్మకర్తలుగా, ఆలయపు సాంప్రదాయాలనూ, మర్యాదలనూ కాపాడగలవారిగా శక్తి యుక్తులు కలిగి ఉంటారు.

సుమారు మూడువేల సంవత్సరాలకు పూర్వం స్వయంగా నటరాజస్వామే కైలాశం నుంచి దిగి వచ్చి ‘చిదంబరం’లో ఈ సాంప్రదాయాన్ని చెప్పాడని అంటారు. అక్కడ పుట్టిన పిల్లవాని దగ్గర నుంచీ ఆలయ సంభంధమైన మంచి చెడులను ఆకళింపు చేసుకుంటునే కళ్ళు తెరుస్తారు.

నిద్ర లేచింది మొదట వేదాధ్యయనం… వేదగానం… శ్లోక పఠనం… పూజారికాలు… అర్చనారీతులు… గురు శుశ్రూష వగైరాలే.

ఇవన్నీ కూడా నటరాజు స్వామి ముందర జరగాల్సిందే. అలా పూజాదికాలే సర్వస్వంగా పెరిగిన తరువాత దేవాలయాన్ని వదలడమంటే కష్టం. ఆలయాలలో ఉన్న మూర్తుల ఆత్మలు ఎక్కడుంటాయో అసలున్నాయో లేవో తెలియదుగానీ… వీరి ఆత్మలు మాత్రం ఆలయాలలోనే ఉంటాయి” అని నవ్వి…

“అయినా ఈ స్వతంత్రదేశంలో దేవుడంటే తెల్సిన వాళ్ళు, దేవుణ్ణి వదిలి రాకూడదు. కానీ?…  బయటి ప్రపంచం కూపస్థమండూకాలంటున్న కాలం… ఆర్థిక పరమైన సుఖాల గాలి… రకరకాల వృత్తులలోనికి ప్రవేశ ప్రారంభం. న్యాయానికి వీరి ఆడవారు కూడా ఈ ఆచార వ్యవహారాలలోనే పడి పెద్దదయిన నాటి నుంచీ పూజామందిరాలకూ వంటిళ్లకు ధారదత్తమవుతారు. కానీ దీక్షితులూ… వారు మన పురాతన సంస్కృతికి మచ్చుతునకలూ.. చారిత్రక అవశేషలలో దొరికే విరిగిన విగ్రహాలలా అనిపిస్తారు.

వాళ్ళను గురించి ఒక సారి ఓ పెద్దమనిషి, గమ్మత్తుగా చెప్పాడు. ఆయన హాస్యంగా చెపినా నాకు మాత్రం ‘నిజం’ అనిపించింది.

వీళ్ళు మన పురాణాలలోని ఒక రకమైన చిత్రమైన ప్రాణిలాంటి వాళ్ళు. ఈ ప్రాణి శరీరంలో సగం పక్షి, సగం చేపా… ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది నీటిలో మునిగితే పక్షి చస్తుంది. పైకెగిరితే చేప చస్తుంది. అలాంటి స్థితి.

ఈ అర్చనలను ఆరాధనలను సాంప్రదాయాలను వీరు వదులుకోలేదు. వారికదే అసాధ్యం కూడా.

కానీ…. బయట కాలాన్ని మారుతున్న తీరును చూశాక… ఎంత కాలం….. ఈ మార్పుకు అతీతంగా నిలువగలరు? ఇంతెందుకు ఒక చిన్న విషయం చెపుతాను.

గోదావరి తీరాన ‘శ్రీరామగిరి’ అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ వెలసి ఉన్న రాముణ్ణి యోగరాముడు అంటారు. పర్ణశాలలో ఉన్న రాముణ్ణి శోకరాముడిగా… భద్రాచలంలోని రామభద్రుణ్ణి భోగ రాముడిగా పిలుస్తారు. దండకారణ్య ప్రాంతంలో ఈ ముగ్గురు దేవుళ్ళు ప్రసిద్ధులు. శ్రీరామగిరిలో రామానుజయ్య అనే పూజారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. వాళ్ళిద్దరూ రెక్కలు రాగానే ‘అక్కడ భుక్తి ఒక్కడికి సరిపోయేదే’ అని గమనించారు.

‘రాముడ్ని నమ్ముకొని ఉండండిరా మీకే లోటురాదు’ అంటాడు తండ్రి. ‘నాన్నగారు మీ ఒక్కరి ఆర్తినే తీర్చలేని ఆలయమిది. మేం ఇద్దరం వేరే బ్రతుకుతాం’ అని వెళ్ళిపోయారు.

తండ్రి పిల్లల దోవకు వెళ్ళలేకపోయాడు. ఈ రామానుజయ్య వెంట ఓ శిల్పకారుల కుటుంబం కూడా మొదటి నుంచి ఉంది. అతని కుమారుడు భుక్తి కోసం ‘కిర్సనాయిలు’ అమ్మకుంటున్నాడు. వారిద్దరూ కల్సినపుడు మాటాడుకునే వారు కాదు… ఏడ్చేవారు. కళ్ళ నుంచి నీరు ఆగక వస్తుండేది.

రామా నువ్వు అసలున్నావా? నువ్విలా ఉంటావని ఎంత వాల్మీకి వ్రాసినా వాడు చూసాడా చచ్చాడా? నీకు ఈ రూపాన్నెవరిచ్చారయ్యా నేనేగదా! సర్వమంగళరామా!… ఇదేమిటి?… నిన్ను నువ్వు శిథిలం చేసుకుంటున్నావేం? ఇలా వారిద్దరి మనసుల్లో ఏమి ఉండేవో?

శిల్పాచార్యుని కొడుకును అడిగాను ఏమిటిది? అని. రాళ్ళు కొడితేనే కూలి ఎక్కువ వస్తుంది. కానీ ఉలి పట్టుకుంటే కన్నీరు ఆగడం లేదు అందుకే… ఈ వృత్తి (కిర్సనాయలు అమ్ముకొనడం) అని వెళ్ళిపోయాడు. అతనిలో జీవకళ లేదు.

ఈ జాతిలోనూ జీవకళ అలాగే లోపిస్తుందా? అనిపించింది.

న్యాయానికి తాత్కాలికంగా వీరికి ఎంతో కొంత ఎక్కువ సంపాదనే ఉండొచ్చు. అది లేకపోతే వెళ్ళకనూ పోవచ్చు కానీ…. అనువంశికంగా వస్తున్న అనితర సాధ్యమైన ‘కళ’ ఇక్కడితో ఆగిపోతుంది గదా. ఇతగాడు తన కొడుకుకు శిల్పకళ చెప్పడేమో? ఇదే నిజంగా జరిగితే శిల్పులూ, పూజారులు ఎక్కడ నుంచి వస్తారు?

ఈ లోపాన్ని పూడ్చడం వస్తున్న సమాజానికి సాధ్యమవుతుందా? డబ్బుతో మిద్దెను కొనవచ్చు. గద్దెను కొనవచ్చు కానీ ఒక శిల్పకారుణ్ణి సృష్టించగలమా?

ఈ కళారూపాలు లేకపోతే సాహిత్యం ఎలా బ్రతుకుతుంది? ఈ పతనం ఎక్కడ ఆగుతుంది? ఆలోచించండి.

వాళ్ళని మనం బ్రతికించుకొని అపురూప కళాఖండాన్ని తయారు చేయించుకోలేమా? జాతి పూర్వ అపురూప వైభవాన్ని నిలుపుకోలేమా?

ఇలాంటివన్నీ చేతి నుంచి జారిపోయాక మనం చేసేదేముంటుంది? లిపి పుట్టక పూర్వం పుట్టిన రామాయణం లిపి పుట్టిందాకా అక్షరక్రమం ఏర్పడిందాకా మనిషి మస్తిష్కంలో ఎలా నిలిచినట్లు? మన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకోలేక పోతే ఎలా? ఆనక దొరికేవి కావు ఇవి. ప్రపంచం గర్వించ దగ్గ అపర బ్రహ్మలుండి ఎందుకిలా జరుగుతుంది? మనం మన సమాజం అని ఎందుకు ఆలోచించ లేకపోతున్నారు? Individual race పెరుగుతుందేం?

ఎంత సంపాదించినా అరసోడు గింజల వాళ్ళమే గదా! మానసికంగా అబ్బుతున్న ఈ ‘డబ్బు’ జాడ్యాన్ని మాన్పడం ఎలా?

డబ్బెందుకు? జీవనాధారం కోసం, అంతే కదా! లోగా ఈ జీవనాధారం లేకుండా ఎలా బ్రతికారు? వారు ధనానికి బానిసలు కాలేదేం? నవ్వాలో ఏడ్వాలో తెలీని స్థితి.

ఎన్నో పైసలతో ఒక శిల్పం అవుతది? ఓ చిత్రాన్ని వేయగలమా? హాయిగా పాడగలమా? రామాయాణాన్ని వ్రాయగలమా? ఏ డబ్బుకోసం వ్యాస ఋషి వేదాలను క్రమబద్దం చేసి అష్టాదశ పురాణాలనూ చెప్పినట్లు?

మనస్సు పెట్టి ఆలోచించండి?

కాని కాలంలో జీవ యాత్ర నడుస్తుంది గనుక అవమానాలను భరిస్తూనే ఉన్నాం. చేయగలిగింది లేదు”

‘ఇక వెళ్తాను’ అని లేచాడు దీక్షితులు. మనసంతా అవేదనతో నిండిపోయింది. కానీ ఏం చేయాలో తోచలేదు. సముద్రంలో నీటి బొట్టంత కూడా చేయలేని అసమర్థత. నమస్కరించి ముందుకు నడిచాడు.

పూజారయ్య బైట దాక వచ్చి సాగనంపాడు అయోమయంలోనే ‘శుభం భూయాత్’ అంటూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here