Site icon Sanchika

అనుబంధ బంధాలు-3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]”ఏం[/dropcap]టి విజయమ్మా! అట్టా నిలబడిపోయేవు? ఎటు పోతున్నావు? ఎప్పుడొచ్చినవు?” అని సారయ్య అడిగినపుడు ఉలిక్కిపడి చూసి, “ఆఁ! ఆఁ! ‘అని’ – “మీరా! నేను మామయ్యగారింటికి పోతున్నాను!” అని ‘బావున్నారా’! అంది నవ్వి.

‘ఓఁ! భేషుగ్గా ఉన్నాను తల్లీ!’ అని విజయ దగ్గరిగా జరిగి “అమ్మలూ! నాకు తెలీని సంగతి ఒకటి అడుగుతా చెప్తావా?” అన్నాడు.

అడగమన్నట్లుగా తల ఊపింది.

“చెప్తావు గదా!” అన్నాడు తిరిగి.

“ఓఁ!”

అయితే చెప్పు – అసలు – ‘బాగు’ అంటే ఏంటి? దాని పరిధెంత ?

“ఇది పూర్తిగా మనస్సుకు సంబంధించింది” అంది నవ్వి.

“అంటే?”

“చెపుతా! కాలిలో ముల్లు విరిగిందనుకోండి – ఒకడు ఆపసోపాలు పడి మొత్తుకుంటాడు. ఒకడు మంగలిని పిలిచి జాగ్రత్తగా తీయించుకుంటాడు. ఆ తరువాత కూడా డాక్టర్ను కలిసి సెప్టిక్ కాకుండా మందులు వాడతారు. ఒకడు ముల్లు గుచ్చుకుందని అర్థమవగానే ఆ కాలును అలానే నేలకు రాచి ఆగక నడుస్తూనే ఉంటాడు. మరొకడు ఇంటికెళ్ళి మల్లు తీసుకొని కాపడం పెట్టుకుంటాడు. ఒకడు ఆ ‘వీధి’నంత ఒక్కటి చేసేంతగా హడావుడి చేస్తాడు.

విరిగింది ముల్లే-

ఒకొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతారు, వారి వారి మానసికపు పరిస్థితిని బట్టి.

అలాగే –

అందమైన అమ్మవారి విగ్రహాన్ని (శిల్పాన్ని) ఎదురుగా ఉంచుకొని

‘తల్లీ! మాతా!’ అని మైకంలో కొలుస్తాడోకడు.

‘విగ్రహము అందంగా ఉందే’ అనుకుంటాడొకడు.

‘ఈ రాతి బొమ్మకు దండం పెట్టడం అనవసరం. మూఢత్వం తప్ప’ అనుకుంటాడొకడు.

అమ్మవారి బొమ్మే అయినా –

ఇప్పటి అందమైన స్త్రీ కొలతలలా రొమ్ములు, నడుం, పిరుదులు బాగా చెక్కాడు అనుకుంటాడు ఒకడు.

‘అమ్మ నీయమ్మ, రంభ లెక్కన ఉంది. ఇట్టాంటి ఎందరు గుంటల్ని- ఆపాదమస్తకం చూడందే ఇలా చెక్కగలిగారంటావు?’ అంటాడొకడు.

కనిపించేది అదే!

కానీ-

ఇలా-

ఎందరి మనస్సులకు ఎన్ని విధాల భావనలు!

అలాగే ఈ ‘బాగు’కు ఎన్నెన్ని అరలున్నాయో ?

“అంటే నేను అనుకునే ‘బాగు’ కూడా ఇక్కడే ఎక్కడో చిక్కుపడి ఉందటావా?” అడిగాడు.

నవ్వుతూ తల ఊపింది విజయ.

“అత్తయ్య ఎదురు చూస్తుంటది, వెళ్ళొస్తా” అని నడవసాగింది.

విజయ చేరేసరికి శాంతమ్మ ఆరుబయట కూర్చుని బియ్యంలో రాళ్ళను ఏరుతూ కనిపించింది.

విజయ మెల్లగా శాంతమ్మ వెనక్కెళ్ళి – గట్టిగా కండ్లు మూసింది.

ఉలిక్కిపడ్డది శాంతమ్మ మొదట.

ఆ వెంటనే గమనించి, “వచ్చావన్న మాట. ఇప్పటికి గానీ నా దగ్గరకి రావాలనిపించలేదు ఏం?” అంది ఆప్యాయంగా – చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ.

విజయ ఎదురుగ వచ్చి “నా పైన అంత ద్యాస ఎందుకు?” అంది వంగి.

“మాకు ఇంకెవరున్నారే? నువ్వు ఎక్కడున్నా మా మనస్సు నీ చుట్టూరానే ఉంటుంది. ఈ కట్టెలదేముంది? ఎక్కడున్నా ఒక్కటే” అని విజయను దగ్గరకు తీసుకొని శ్రద్ధగ చూస్తూ “ఏంటి? ఇలాగయ్యావు? ఎంత పరీక్షలయితే మాత్రం కూడు కుమ్ము లేకుండా చదివావా?” అని తడిమి చూసింది. “ఏం చదువులో ఏమో? ఆడపిల్లల్ని రోడ్డెక్కిస్తున్నారు” అంది కళ్ళలో నీరు నింప్పుకొంటూ.

“చదవాలి గదా. ఒక వేళ్ళ నేను పరీక్ష తప్పానే అనుకో, నువ్వే మూతి ముక్కు విరుస్తూ ‘దీన్ని అనవసరంగా చదువుల పేరుతో పట్నం తోలారు. మంచి పిల్లడ్ని చూసి కాపురానికి పంపితే పండంటి బిడ్డ నయినా ఇచ్చేది!’ అని అంటావు.”

“ఆఁ! ఆఁ! మన సుబ్రమణ్యం కొడుకును చూసాక నాకయితే నువ్వు చెప్పిన పద్దతే మంచిదనిపించింది” అంది.

“ఎవరా సుబ్రమణ్య స్వామి? ఏమా కథ? చెపుతావా?” అంది బుంగమూతితో ఎదురుగా కూర్చొని.

“చెపుతాను, చెప్పాలి కూడా. అదిగో, ఆ ఎందురింట్లోనే ఉంటాడు. ఎం.ఎ. చదువుతున్నాడంటారు. సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది నెలలు ఇక్కడే కనిపిస్తాడు. ఇక్కడ ఉన్నంత కాలంలోనూ చేత పుస్తకాలు కనిపించవు.

నిలువెత్తు అద్దం కనిపిస్తుంది. ఎప్పుడూ దానిలో తలదూర్చి కుస్తీ పడుతుంటాడు- దినమంతా అలా చూసుకుంటూ ఎలా ఉంటాడో? ఎందుకు మొహం మొత్తదో? బొత్తిగా అర్థంగాదు. పాపం బిడ్డడు వేళకి ఇంత తింటున్నాడో లేక అ చూసుకోవడంతోనే కడుపు నిండుతుందో – నీళ్ళు త్రాగిన జాడ లేదు. ఎదురుగా ఉన్న ‘అద్దం’ పగిలిపోయేలా దాని వైపే చూస్తూ అదో లోకాలలోనికి వెళ్ళిపోయి అక్కడే చాలా సేపు సెటిల్ అయ్యేలా ఉంది.”

“అంత అందగాడా?”

“అనే అతని భావన. అంతకాలం అలా చూసుకొనగలగడం అంటే ఎంతో కొంత అందం లాంటిది ఉంటుంది గదా! నాకు అతగాడు అద్దం నుంచి మొఖం తీసిన అతి కొద్ది సందర్భాలలో కనిపించాడు. ఆంజనేయుడంత దృడత్వం ఉన్నవాడిలా అనిపిస్తాడు. బాగా కసరత్తూ గట్రా ఆ అద్దం ముందే చూసుకుంటూ చేస్తాడేమో. అయితే ఆంజనేయస్వామి కంటే అందగాడేమీ కాదు. మూతి మరీ అంత పొడుగు కాకపోయినా చాలా వరకు అలాగే ఉంటుంది. పెద్ద ఎఱుపు కాదు – ఆ స్వామి రంగే. ఇట్లా పొద్దస్తమానం పోలికలెందుకు గానీ- ఒక్క రకంగా పక్కాగా చెప్పలంటే – అచ్చు ఆంజనేయస్వామి తమ్ముడ్ని చూసినట్లుగానే ఉంటుంది.

అయితే – ఆయనకు పురాణపు గెటప్ ఉండడాన, పైగా చేతిలో గదా గట్రా ఉండడాన కిరీటం మోస్తూండడాన, రామభక్తుడవడం మూలానా ఓ.కె. అంటాం.

సోషియల్ గెటప్‌లో ఆంజనేయుణ్ణి బొత్తిగా చూడలేం గదా.

ఇక పోతే- అసలు ‘చదవడం’ అనే ప్రక్రియ ఈ మహానుభావుడు చేస్తున్నదే అయితే దీన్ని అర్జంటుగా తెల్లవాళ్ళను దేశాన్నుంచి తరిమినంత బాధ్యతగా వెళ్ళగొట్టాల్సిందే” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా –

“అత్తమ్మా! నువ్వు ఇంతగా చెప్పాక అతగాడ్ని ఓ చూపు చూస్తాను గానీ, మామయ్య ఏడి?” అంది పరిసరాలను గమనిస్తూ.

“మీ ఇంటి వైపు రాలేదా?”

ఇంటిలోకి నడుస్తూ – “మీ మామయ్య వస్తాడు గానీ, నీ చదువు ఎలా సాగింది?” అంది.

‘బాగానే సాగిందేలే’ అంటూ నడిమి ఇంట్లో వాలు కుర్చీ కనిపించడంతో దాని దగ్గరి కెళ్ళి… “అత్తమ్మా! మామయ్య దీనిలో కూర్చుని ఇంకా గజి బిజి అవుతూనే ఉన్నాడా?” అంది.

“అవక ఏం చేస్తాడు రా! నీకు ఆ బాధేమిటో అంతగా తెలీదు. మనం పెంచిన పిల్లలు మన చేతుల మీదిగా పోకూడదు. అలా పోవడమంత నరకం మరొకటి లేదు. ఈ పరిస్థితి ఎంతటి పగ వారికి కూడా రావాలని కోరుకోనకూడదు’ అని కళ్ళు వత్తుకంది.

“అత్తమ్మా! మీ ఇద్దరికీ ‘బావ’ ధ్యాస వదలదు. కనీసం ఇద్దరూ అటూ ఇటూ తీర్థయాత్రలయినా చేసి రావచ్చుకదా! వాతావరణం మారి మరుపును ఇవ్వలేకపోయినా అహ్లాదాన్నిస్తుంది.”

“ఈ మాత్రం చెప్పే వాళ్ళయినా ఉండాలి గదా!” అని “ఈసారి ఫస్టున ప్యాసవుతావా?” అంటూ లేచి, “కొద్దిగా కాఫీ కలుపుతా! ఇద్దరం త్రాగుదాం!” అంది.

తల ఊపింది విజయ ఆమెనే చూస్తూ.

ఇద్దరు కాఫీ త్రాగడం ముగించుతుండగా దీక్షితులు లోనికొచ్చాడు. విజయను చూసి “అమ్మడూ! నేను నీ కోసం ఇంటికి వెళ్ళివస్తున్నారా!” అన్నాడు.

“నేను వచ్చానని తెల్సుగదా! ఇంటి దగ్గర కనిపించకపోతే ఇక్కడే గదా” అంది నవ్వుతూ.

“ఆ మాట నాకు తెల్సు. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తావని అనుకున్నాను. కూతురుగా ఉండిపోతావనీ. నా ఊహ, నా తలపు, నా ఆశ, భ్రమ అని చెప్పాడు భగవంతుడు. నా కలలన్నీ ఏమయ్యామో? నేను చేసుకున్న పాపం ఏమిటో తెలీదు. అమ్మా విజయా ఎవ్వరికీ అపకారం చేసిన వాణ్ణిగాదురా. నాకీ శిక్ష ఎందుకు? ఆ భగవంతుణ్ణి అడుగదామని ఆయన గుళ్ళలో, గోపురాలలో ఉంటాడని ఆవేశంగా వెతికాను. నాకు ఎక్కడా భగవంతుడనే వాడు ఉన్నట్లుగా అనిపించలేదు, కనిపించలేదు. ఒట్టి రాళ్ళు తప్ప. వాటి పైన నిష్ణాతులైన శిల్పులు తపం ‘దీక్ష’ కనిపించింది.

చరిత్రన ఆ మధ్య వచ్చిన నడమంత్రపు పాలకులు ఆ రాళ్ళనూ కూర్చారు” అని ఆగి, “అమ్మడూ ఈ సృష్టి లోని అందాల్ని చెడపాలనే తలంపు కల్గిన ఎవరినైనా మనం మనిషీ అనలేం! అలాంటి సిద్ధాంతమున్నా, అనవసరమైనదే గదా. ఒక వేళ వాడ్ని మనం మనిషి అంటే మిగిలి ఉన్న పశువుల్ని ఏమనాలి?” అంటుండగా….

“మామయ్యా! నేను వచ్చింది నిన్ను చూద్దామనీ, నీతో సరదాగా ప్రశాంతంగా, కాలక్షేపము చేద్దామనీ. అత్తమ్మ ఏదో ఒకటి వండి పెడితే ఇంత తిని పోదామని. ఆశగ స్పందించడం మనిషి లక్షణం. కాదంటారా?” అంది.

“నాకు సుద్దులు చెప్పడానికి వచ్చావన్నమాట భడవా!” అన్నాడు దగ్గరికి జరిగి.

ఏదో అనబోతుండగా, “దానితో వాదనేమిటీ?” – అంటూ కాఫీ కప్పు చేతిలో పెట్టింది.

“విజయకిచ్చావా?” అంటూ అడిగాడు దీక్షుతులు.

“దాన్నే అడగండి” అంటూ లోనకెళ్ళింది.

కాఫీ త్రాగుతూ కుర్చీలో కూర్చున్నాడు దీక్షితులు.

త్రాగడం పూర్తి అయ్యాక, కప్పు అందుకుని – “మామయ్యా! కాఫీ త్రాగావా? అని నన్ను అడగలేదేం?” అంది విజయ.

“నాకు కాఫీ ఇచ్చింది మీరే గదా! ఇంకా అడగడమేందుకూ?” అన్నాడు.

‘విజయా’ అని లోన నుంచి శాంతమ్మ పిలచింది.

“వస్తున్నా” అంటూ లోనకెళ్ళింది.

వెళ్తూ వెళ్తూ ‘చిటిక వేసేలోపు వస్తాను’ అని సైగ చేసింది.

అన్నట్లుగానే వెంటనే రయ్యిన బయిటకొచ్చి దీక్షితులు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని “మామయ్యా, ఒక్క మాట అడుగుతాను చెప్తావా?”.

“కానియ్.”

“మన జాలయ్య బాబాయి పరిస్థితేమిటి?” అంది.

“ఏముంది? ‘దేశమో – దేశమో’ అని దాని వెంట పడ్డాడు. స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అని బాపూజీ వెంట పరుగెత్తాడు. ఉన్న గుమాస్తాగిరి వదిలేసాడు. పెద్ద కుటుంబం గదా! పైగా పరువుగా బ్రతికినవాళ్ళు. వ్యవసాయం చేసుకోలేరు. ప్రజాసేవకే టైం చాలలేదు గదా! అందుకని ఏటా ఇంత అమ్ముకుంటూ బత్రికారు. అన్నదమ్ములు అయిదుగురు కదా! మిగిలింది వాళ్ళకు వదిలేసాడు.

‘మరి నువ్వు?’ అని అడిగితే, ‘నాకెందరున్నారురా! ఒక్క మగపిల్లాడు.’ చదువంటే వాడికి ప్రాణం – అంతు లేని ఆసక్తి. డొక్క సుద్ది ఉంటుంది కనుక – బండ మీద నైనా ఇన్ని గింజలు పుట్టించి బ్రతకగలడు అన్నాడు. అన్న ప్రకారం పిల్లవాణ్ణి పోస్ట్ గ్రాడ్యుయేట్‌ను చేసాడు. వాడి ఉద్యోగం కోసం తిరిగాడు.

ఆ తిరుగులాటలో వాడు తెచ్చిన స్వాతంత్ర భారతపు తీరు కొంత కొంత అవగతమైంది. పైరవీల పేరుతో- అధికారం పేరుతో – లంచాల పేరుతో – రిజర్వేషన్ల పేరుతో – ‘ఉద్యోగం’ అన్నచోట జరిగేది కళ్ళారా చూశాడు.

అసలు ఉన్న స్థితేమిటో అవగతమైంది. ‘నా కొడుక్కు ర్యాంకు కూడా వచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం రాదు. చదివిన ఇన్ని సంవత్సరాల చదువూ ఉద్యోగపరంగా నిరర్థకం. తన తెలివి తేటల్ని ఎలా వినియోగించుకోవాలా? అని తను మాత్రమే వినియోగించుకోడు’. మరి ఎందుకీ చదువులు? ఏ ఆశ కనపడక అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెక్కిరిస్తుంటే నిరాశావాదానికి లోనయి, ఎందరో నిష్కారణంగా అవాక్కవడం మన కళ్ళెదుటే కొందరు అడవులకు వెళ్ళి తిరగబడటం జరుగుతుంది కదా!!

ఇక అసమర్ధులూ – అవివేకులూ – స్వార్ధపరుల పాచికల సాయంతో అధికారయంత్రాగంలో జొరబడి తలా ఒక లేబుల్ సాయంతో- ఈ వ్యవస్థను ఎలా పునాదులతో సహా పెకిలిస్తున్నారో చూసాక నిజాన్ని ఎన్ని ముక్కలుగా చేస్తున్నారో అర్థమయ్యాక-జీవనాడి సంగతి తెలిసాక దీనికేదో ఒక పరిష్కారాన్ని కనుగొనాలి, ఆల్యమయితే అధః పతనం తప్పదు అని తల పగిలేలా ఆలోచన…

ఇక్కడా ఒంటరి ప్రయాణం. దిక్కు కనిపించలే. ఆశక్తతతో కొట్టుమిట్టాడు, ఏడుస్తూ చతికలబడే ఓపిక లేక సమాజం మొత్తం మీద కక్ష పెంచుకుని ఎదురు నడక మొదలిడితే –

ఏడాది క్రితం పొలీసు కాల్పులలో మరణించాడు. కథ కంచికిపోయే మన వ్యవస్థ –

పెంచి పెద్ద చేయాల్సిన మన బిడ్డను చంపుకుందని తెలిసాక – ఈ స్వాతంత్య్రం కోసమా ఇంత జీవితాన్ని నిర్ధాక్షిణ్యంగా ఖర్చుచేసింది? అని గుండె అవిసి పోయేలా ఏడ్చాడు. కనీసం ‘ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగే మనిషి మిగల్చని దిక్కుమాలిన స్వాతంత్ర్యం ఇది’ అని పూర్తిగా అర్ధమయ్యాక గుండె పగిలి ఉన్న మనస్సు ఆగక పిచ్చివానిలాగయిపోయాడు.

ఇది ఇట్లా ఉంటే.

ఈ పిచ్చాడిని నక్సలైటుకు తండ్రని పోలీసులు పట్టుకున్నారు.

“అతను నక్సలైటేంటి మామయ్యా?” అంది ఆశ్చర్యపోతూ విజయ.

“అవునమ్మా జరుగుతున్న నిజాల్ని-

భరించలేని నిజాల్ని-

నడిరోడ్డు మీద ఎండకడుతుంటే-

విన్నవాళ్ళు తుపుక్కున ఉమ్మేస్తారుగదా !

ఇలా ఉమ్మేయించుకోవడం ఇష్టం లేని నేతలు-

ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తారు గదా!

అందుకే నక్సలైటు పేరు పెట్టి తీసుకెళ్ళిన మన పోలీసులు- తెల్ల పోలీసుల కంటే నికృష్టంగా – వ్యవహరించారు.

నీ కొడుకెక్కడ? (చంపింది వాళ్ళే)

నీ అనుయాయులు ఏరి?

నీ స్థావరము ఎక్కడ?

నీ కొడుకు ఏ వర్గం నుంచి తిరుగుబాటు ప్రారంభించాడు?

మీ ‘ఖజానా’ ఎక్కడ?

మీరు దాచిన ఆయిధాలు ఎక్కడవి?

ఏ దేశస్థులతో మీకు సత్సంబంధాలున్నాయి?

వాళ్ళను పట్టివ్వు?

అని

ఎవరు ఎవర్ని కొడుతున్నారు?

ఎవరు ఎవర్ని హింసించుతున్నారు?

ఎవరు ఎవర్ని చంపుతున్నారు?

ఎవరు ఎవర్ని ఎందుకు దోచుకుంటున్నారు?

ఎవరు ఎవర్ని అవమానిస్తున్నారు?

చివరకు ఈ వ్యవహారాన్ని ఒప్పుకొనలేక – సత్యాగ్రాహం చేద్దామంటే – గాంధీ…..

అయినా ఎవరిపైన మన యుధ్ధం?

తుపాకీ యుద్ధంలో వచ్చిన స్వాతంత్రం కాదే ఇది?

మరి ఈ తుపాకీ రాజ్యమేంటి?

తుపాకి తోనే స్వరాజ్యం అన్న – ఇవతల వాళ్ళ మాటేమిటి?

అసలిదంతా ఏమిటి?

మేం కన్న కలలేమైపోయినయి?

అని అన్నం నీళ్ళు మానేసాడు.

పెదవి విప్పదామంటే అయోమయపు వ్యవస్థ.

మనస్సా ఛిద్రమైంది.

చివరకు –

పిచ్చి చూపులు చూస్తూ ఉండి పోయాడు.

అయిదారు నెలలు మన పోలీసువారు ఇంటరాగేషన్ పేరుతో ….

ఇతగానికేమీ తెలియదని గ్రహించినవారై నడి రోడ్డుపైన వదిలేసి వెళ్ళిపోయారు. అట్టా మిగిలిపోయాడు…

ఆ తరువాత పాపం పాముకాటుకు గురయ్యాడు.

కాలు సగం తీసేయ్యల్సి వచ్చింది.

ఇప్పుడతని పైన పోలీసు ఆంక్షలు మాత్రం లేవ్వు.

కాని మన పోలీసుల పుణ్యమా అని చూసేందుకే మనిషిలా కనపిస్తాడు.

ఈ మధ్యన ఈ ప్రభుత్వానికేమయిందో ఏమో గానీ సొమ్ము వచ్చిన నడిరోడ్డున పడిపోయినట్లు అకస్మాత్తుగా స్వాతంత్య్ర సమరయోధులకు పించను ఇవ్వాలనుకుంది.

స్వతంత్ర్యం వచ్చిన ముప్పై అయిదేళ్ళ తరువాత- ఆ కోటాలో ఇతనికీ పించను మంజూరుయింది.

ఈ లోపు ఇతనికి తోడుగా ఉన్న ఇల్లాలు పోయింది. కొడుకు కనిపించకపోయినా కంటతడిపెట్టనివాడు- ‘ఇల్లాలి’ చావును తట్టుకోలేకపోయాడు. గుండె బండ చేసుకొని బ్రతుకీడుస్తున్నాడు” అని ఆగాడు దీక్షితులు.

“ఇంత జరిగినా మేం అప్పుడు చేసిందానికి ఈ ప్రతిఫలమేమిటి?” అంటున్నాడు.

శాంతమ్మ రెండు ప్లేట్లలో పకోడీలు పెట్టుకొని వచ్చి ఇద్దరి చేతులలోను పెట్టింది. ఇద్దరిలోను తిందామనే ఆతృత లేదని గమనించింది.

తాను ఎంత కోరికతో చేసింది? వాళ్ళిద్దరు తింటుంటే చూద్దామని ముచ్చటపడింది.

వాళ్ళ వాళ్ళ ధోరణిని వదలక అరకొరగా తింటూంటే –

ఏమిటి వీళ్ళు ఇంత తిని ఆలోచనలోకి వెళ్ళవచ్చును గదా! అనుకుంది లోనకెళ్ళింది – కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. తీసుకున్నారు.

వాళ్ళ ధోరణి నుండి బయటపడి మాత్రం కాదు.

రెండు గుక్కలలో మింగింది.

‘మనిషి ఏమిటి’? అని అడుగుతున్నాడు దీక్షితులు.

సమాధానం కోసం ఆలోచిస్తుంది విజయ.

ఖాళీ కప్పుల్తో లోనికి నడిచింది శాంతమ్మ.

(సశేషం)

Exit mobile version