అనుబంధ బంధాలు-32

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 32వ భాగం. [/box]

[dropcap]వి[/dropcap]జయ ముగ్గేస్తుంది. దీక్షితులు పెనగడ దగ్గరకొచ్చి విజయనే చూస్తూ ఆగాడు.

ఇంకా పొద్దు పొడుపు ప్రారంభం కాలేదు…. ఎఱుపుదనం మాత్రం లేతగ కనిపిస్తూంది.

దీక్షితుల్ని చూసి ముగ్గు బుట్ట క్రింద పెట్టి లేచి ‘మామయ్యా నువ్వాఁ?’… అంది విజయ.

“రావాలనిపించింది రా, వచ్చాను రాకూడదనిగానీ ఫలానా వేళ్ళలో ప్రవేశము ఉందని గాని ధశరథం ఇంట్లో ఏమన్నా నాపై ఆంక్షలుంటే చెప్పు” అన్నాడు నవ్వుతూ.

“నాన్న లేచాడు” అంది.

“అంటే వెళ్ళవచ్చుననే” అని లోనకి నడచాడు.

‘భగవద్గీత’ పారాయణం చేస్తూ కనిపించాడు దశరథం.

“ఇదేప్పటి నుంచి…”

“మనశ్శాంతి ఎప్పుడు లోపించినట్లనిపిస్తే అప్పుడులే” అని “ఎటైనా ప్రయాణం అయిరాలేదు గదా” అన్నాడు.

“ఇక్కడికే.”

తుర్పు వైపుగా మళ్ళి, “ఇటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇది తూరుపే అనుమానం లేదు. కానీ ఇలా జరగరాదే” అన్నాడు.

“సరే గానీ మాట” అని ఆగి, “ఇల్లు బేరం పెట్టావట. ఆదిశేషయ్యతో అన్నావా? ఇది నిజమే అయితే నువ్వు ఎక్కడ ఉందామని?” అడిగాడు.

“స్కూటరు కొనివ్వాలి గదరా!”

“అయితే!”

“నీకు తెలియకుండా నా దగ్గర అంత డబ్బెక్కడిది రా? బాకీకి నెల నెలా వడ్డీయే వెళ్ళడం లేదు.”

“నేను గుర్తుకురాలేదా? అంత కాని వాడిలాగా అనిపించానా నీకు? దీక్షితులు అనే స్నేహితుడొకడుండాలి? వాడు పోయాడా?”

“ఛ అదేంటిరా, పొద్దుటే ఏం మాటలవి? మతిగాని పోయిందా?”

“సరే నేను మాటడటం అనవసరం గానీ వెళ్తున్నాను” అని లేచి “నేను ఎందుకు వచ్చానో అర్థం చేసుకో అది చాలు. ఇంకో మాట విజయ నీకే కన్నబిడ్డ కావచ్చు. కాదనను కనీ నాకు అది బిడ్డే కదరా. పిచ్చోణ్ణి నేను అలాగే అనుకుంటున్నాను. బిడ్డగా నీకు కల్గినా కోడలిగా నా గడపలోకే వస్తుందనే ధీమాలో బ్రతికాను. నేను భగవంతుణ్ణి నమ్మాను కనుక పరీక్షించే ప్రయత్నంలో నా పిల్లాడ్ని తీసుకెళ్ళాడు. అది నాకు శాపమయింది. ఆడపిల్లకు ఈడొచ్చాక పెళ్ళిచేయడం ధర్మం. ఆ ధర్మాన్ని కూడా నువు గుర్తు చేసిందాకా నేను ఆగలేదు. తగిన సంబంధాలను చూసాను” అని ఆగి…

“నువ్వు దాన్ని నాకు పరాయిదాన్నిగా చేసినంత మాత్రాన ఏమవుతుంది?” అన్నాడు.

“అంటే నువ్వుగాని స్కూటరు ఇస్తానని చెప్పావా వాళ్ళతో?”

“అనలేదు. కానీ నోరు తెరచి అడిగారు కనుక ఇస్తాను. ఇవ్వగలను గదా.”

“అందుకు నువ్వు రహస్యంగా ఇల్లు బేరం పెట్టాల్సిన పని ఉందా. ఇందులో నీ యిష్టాయిష్టాలను నేను గౌరవించలేదని అనుకోవద్దు కానీ నాకు కొన్ని యిష్టాలుంటాయి నీ మాదిరిగానే అందుచేత నా మనస్సుకు ఏది తోస్తే అది చేస్తాను. ఆఁ” అంటూ చక చకా ముందుకు నడచాడు.

దశరథం ఏదో చెప్పబోయాడు కానీ దీక్షితులు వినిపించుకోలేదు. విజయ ఎదురు పడింది. ఆగాడు.

“వెళ్తున్నావా? అమ్మ కనిపించిందా? కాఫీ త్రాగవా?” అడిగింది

తల ఊపాడు.

“స్కూటరు కొనిస్తావా?”

“నాకు తెలియందే నేనేం చేయను. నీ యిష్టంతో పని, నీ కాపురానికి సంబంధించినది. అక్కడ తేడాలు రాకూడదు కదా” అన్నాడు విజయ తల పై చేయి ఉంచి.

“రేపు ఇంకేమైనా అడిగితే?”

ఆగాడు. సూటిగా విజయ కళ్ళలోకి చూస్తూ, “అమ్మా అతను అలా అడిగేవానిగా నీకు అనిపించాడా? అతనితో కలసి కాపురం చేస్తున్న దానివి నీకు తెలుస్తుంది” అన్నాడు.

“మామయ్యా కని పెంచి పెద్ద చేసిన వాళ్ళకే తమ పిల్లల స్వభావాలు అంతుపట్టకుండా పోతున్న ఈ కాలంలో వారం రోజుల కాపురంలో అర్థమవుతుందంటావా?” అంది నేలను చూస్తూ.

“అర్థమవదు. కానీ అతన్ని అనుమానించవద్దు. అయితే నేను అడగాల్సినవి ఆయన్ని అడిగాక చేద్దామేం” అంది.

నవ్వి “మంచిది” అని “అమ్మా విజయా ఆడపిల్ల ఎంత సమర్థురాలయినా, ఇంగితం ఉన్నా ఇది పూర్తిగా మగ సమాజం. నీ సమర్థత అర్థం గాక హర్షించకపోగా మరోలా భావిస్తారు. కాపురం సరిగ్గా ఉంటే ఆ గుట్టు మట్టూ వేరు. ఏ చిన్న పేచీ బయటకొచ్చినా ఇద్దరినీ లోకంలో ఎద్దేవా చేస్తారు. అది నేనుగా ఇష్టపడను. పిల్లవాడు ఎందుకో అడిగాడు. తొందరపాటు కావచ్చు. మనం మూడో కంటివానికి తెలియకుండా ఇచ్చేయాలి. అలా అనుకుంటున్నాను” అన్నాడు అనునయంగా.

“మంచిది” అంటూ తలవూపింది.

“నా పద్దతిన నడిస్తే ఇప్పటి కాలానికి సరిపోతుందేమో. అందుకే నాన్నను ఎదిరించి అయినా ఈ సంబంధం చేద్దామనిపించింది. ఇందులో నాకున్నా పట్టుదలేం లేదు. కానీ నాకు మంచిదనిపించిందమ్మా. నువ్వు సుఖంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతదన్న నమ్మకం. మేము కోరుకునేది కూడా అదే గదా. అంతకు మించి మాకు కావాల్సింది ఏముంది?” అని “నా తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అంతే” అంటూ నడిచాడు. విజయ పెనగడ దాటి వెళ్తున్న దీక్షితుల్ని చూస్తూ ఉండిపోయింది. ఏమిటి ప్రేమ అనుకుంది. కళ్ళలో నీళ్ళు నిండినయి. మనసులో నమస్కరించుకుంది. అది ఆయనిచ్చే ప్రేమకు సరిపోదని అనిపించింది. కళ్ళు తుడుచుకుని వెనక్కి మళ్ళింది.

***

శ్రీనివాసు స్కూటరు పైననే అత్తగారింటికి వచ్చాడు. అది చూడగానే ‘మామయ్యే స్కూటరు ఇప్పించి ఉంటాడు’ అనుకుంది విజయ.

“రా రావయ్యా, ఎప్పుడు బయలుదేరావేంటీ?” అని పరామర్శించాడు దశరథం. స్కూటరు దిగి స్టాండు వేసిందాకా ఆగి సాదరంగాలోనికి తీసికెళ్ళాడు.

విజయ అంతా గమనిస్తూనే ఉంది గానీ కిటికీ దగ్గర నుంచి కదలలేదు. సీతమ్మ అల్లుడి కాళ్ళకు నీళ్ళందించి కండువా ఇచ్చింది.

శ్రీనివాస్ లోనికొచ్చి మఖం తుడుచుకుంటూ… “విజయేది?” అనడిగాడు.

“ఇక్కడే ఎక్కడో ఉంది. పుస్తకం పుచ్చుకొని..” అని “విజయా ఎవరొచ్చారో చూడు” అంది బిగ్గరగా.

ఓ నిముషం తరువాత విజయ బయటకొచ్చి శ్రీనివాస్‌ని చూసి దగ్గరకెళ్ళి సరసన కూర్చుని “అంతా బావున్నారా? ఇప్పుడేనా రావడం?” అంది.

తల ఊపాడు. విజయను చూసాడు. అంతులేని కోరిక కనిపించింది తన కళ్ళల్లో. భుజం పై చేయి వేసి “నువ్వెలా ఉన్నావు?” అన్నాడు.

“ఎదురుగానే ఉన్నాను” అంది నవ్వి.

“ఇవ్వాళ్ళ మంచిదట, మనం వెళ్దాం” అన్నాడు నడుం పై చేయి వేసి.

“మా నాన్నా స్కూటరివ్వలేదు గదా? అదిలేంది రా అక్కరలేదన్నారు గదా” అంది నెమ్మదిగా.

“జోకులు చాలు గాని బయలుదేరు.”

“నాకు జోకులు చాతకావు బాబూ” అంది గారాలుపోతూ.

“కాకపోతే మరేంటి మొన్న మీ మామయ్యగారు వచ్చి నన్ను తీసుకెళ్ళి షోరూంలో దీన్ని కొనిపెట్టారు గదా” అన్నాడు శ్రీనివాస్.

“నాకు నిజంగా తెలీదు” అని భర్త ముఖంలోకి సూటిగా చూసి “అయినా ఎవరేమయితే మనకేం? మనకు కావాలనుకున్నది వచ్చేసింది” అంది.

తల ఊపాడు అవునన్నట్లు.

“నాన్నగార్ని అడుగుతాను” అని ‘నాన్నా’ అని పిలిచింది.

“ఆఁ విజయా నన్నేనా?” అన్నాడు దశరథం.

“మిమ్మల్నే ఒకసారి ఇలా రండి” అంది.

“ఏమిటో చెప్పరాదుటే” అన్నాడు.

“స్కూటరు ఎంతయింది?” అడిగాడు.

“స్కూటరేమిటి” అన్నాడు తెల్లబోతూ.

“మీ అల్లుడుగారు ఎక్కి వచ్చింది.”

“నాకెలా తెలుస్తుందమ్మా?” అని “ఇరవైవేల పైనే అవుతందంటున్నారమ్మా, కనుక్కని గాని వచ్చాడా ఏం” అన్నాడు గుబులు పడుతూ.

“నువ్వే పంపావంటున్నారు గదా” అంటూ బయటకొచ్చింది.

“నేనా? ఎవరితో?”

“దీక్షితులు మామయ్యతో.”

“అయితే కొనిచ్చాడన్నమాట.”

“ఇంత అయిందని కూడా చెప్పలేదా?”

“నాకు తెలిస్తేనే గదా అడిగేందుకు?”

తల ఊపి పరిస్థితిని గమనించి లోనకువెళ్ళింది.

గదిలోకి రాగానే తలుపులు మూసి వెనుకనుంచి వాటేసుకున్నాడు శ్రీనివాస్. మెడ, భుజాలు, ముద్దులతో నింపేసాడు కోరికగా.

విజయలో మమైకం గానీ తన్మయతగానీ కనిపంచలేదు. మైనం బొమ్మలా నిల్చుండిపోయింది. అరక్షణం తరువాత మెల్లిగా విదిలించుకొని “స్నానం కూడా కాకుండా ఏంటిది? పైగా అంత దూరం నుంచి వచ్చారు” అంది.

“అసలు నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావోయ్. నాకయితే పొద్దు వాలుతుంటే అక్కడ మతిపోతుంది. నీతో చెప్పడానికేంగానీ ఒకనాడు ఈ బాధ వేగలేక అపరాత్రి ఆరుబయటకు వచ్చాను. వెనకాతల ఏదో చప్పుడయినట్లుగా అనిపిస్తే నెమ్మదిగా సందుకెళ్ళి తలుపు తీసాను. మార్వాడి వాళ్ళ రాంబాయి. అదే నిరుడు యాక్సిడంట్‌లో పోయినతని ఇల్లాలు, కనిపించింది రతీదేవిలా. వయస్సులో ఉన్న మనిషిగదా నాలాంటి బాధతోనే వేగలేక తిరుగాడుతుండ వచ్చు. నేను తలుపు తీసిన శబ్దానికి వెనక్కి తిరిగి చూసింది. ముఖ పరిచయం ఉంది గదా, నవ్వాను.”

“ఇప్పుడు మెళుకువగా ఉన్నావేంటి?” అడింది.

“ఏదో చప్పుడయితే ఎవరోనని వచ్చాను.”

“నేనే” అంది.

“ఆవిడ కళ్ళలో అంతులేని కోరిక ఉంది. నన్నే చూస్తుంది. నాకు ఎందుకో గానీ ఆవిడ పైన అకస్మాత్తుగా కోరిక కల్గింది. నువ్వు లేవు గదా. నడుద్దామనుకున్నాను, నడుస్తూ నవ్వాను. అలాగే చూస్తుంది నిల్చుని. అంటే మీ ఇష్టం ‘రండి’ అనే గదా. నడుస్తున్నాను. బెదిరినట్టుగా చూసింది. ‘భయం ఎందుకు, ఇక్కడ మనిద్దరం తప్ప ఎవ్వరూ లేరు గదా’ అని చెపుదామనిపించింది. మన తలుపులు దాటాను, అంతే గుబుక్కున లోనికెళ్ళి ధడేల్న తలుపులు మూసుకుంది. నేను ఇంకొంచం ఉత్సాహపడి అడుగులు వేస్తే నా ముఖం పచ్చడయిపోయేది. నాకు కల్గిన కోరిక చప్పున చల్లారిపోయింది.

వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు. అప్పుడే బయలుదేరి రావాలనిపించింది. ఒట్టు” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా… “స్కూటరు రాలేదు, వెళ్తే ఎలా అనుకున్నారు” అంది విజయ.

“ఏంటా మాటలు?” అని “చూడు విజయా ఇప్పుడు గాకపోతే ఇచ్చేదెప్పుడు. మనం ముసలాళ్ళమయ్యాకనా ఈ ప్రేమ మనపై ఎంత కాలముంటుందని? నీ భ్రమ. ముద్దుగా అనిపించినప్పుడే చంక ఎక్కాలి. అందుకోసం అడిగాను తప్ప మీరు ఇబ్బందులలో ఉంటే అడుగుతానా. నాకా మాత్రం తెలియదా?” అన్నాడు భుజం పై చేయివేసి దగ్గరకు తీసుకుంటూ.

“అవును మేం happy గా ఉన్నామని మీరు కలకన్నారు” అని అరక్షణం ఆగి ఎదురుగా వచ్చి “ఆడపిల్ల పెళ్ళి అంటే అసలు మీకు తెలుసా? ఈ సమాజంలోనే ఉంటూ దీన్ని గమనించలేకపోవడం చాలా pity అనిపిస్తుంది. నా పెళ్ళికి ఉన్నదంతా అయిపోగా ఇల్లు కుదవపెట్టారు. దాని పైన మీకేమో స్కూటరు కావాలి. అదు అడగడమంటే – ఇంటిని అమ్మించాలనేగా? ముద్దు వస్తే చంక నెక్కడానికి మా వాళ్ళకు ముద్దు రాలేదు. మొద్దు వచ్చింది నెత్తికి. దాన్ని తలకెందుకు ఎత్తుకున్నారో తెలుసా? నన్నుకన్న నేరానికి. నా సుఖం కోసం. వాళ్ళు ఇప్పుడు చివరి దశలో ఉన్నారు. వాళ్ళకు మన ఆసరా అవసరం. అలాంటిది వాళ్ళు తల దాచుకునే నీడను కూడా అమ్ముకుంటే వాళ్ళ గతేమిటి? మన కోసం ఇంత కాలం కష్టపడ్డవారి ఋణం తీర్చుకోవడం ఇదేనా?” అని ఉబుకుతున్న కన్నీళ్ళను అపుకొని “ఈ స్కూటరును ఎక్కకపోతే మనకొచ్చే నష్టమయితే లేదు. ఇది కొనిచ్చి వాళ్ళు తమ నీడను పోగొట్టుకుంటారు. పోతేపోయింది. వాళ్ళకి నేను ఒక్కదాన్నే సంతానం. వాళ్ళ బ్రతుకంతా నా కోసం వెచ్చించారు గద, అలాంటి వాళ్ళను వదలి ఎఱ్ఱగా బుఱ్ఱగా మొగడు దొరికాడని వెంటబడి నడవడమేనా సంతానం బాధ్యత? అంతటితో తీరేనా?” అని లేచి “మీ అమ్మనాన్నలు మీతోనే ఎందుకుంటున్నారు? అలాగే మా వాళ్ళ ఉండే వీలు లేదా?” అంది.

“ఎక్కడైనా ఉందా ఇది?” అన్నాడు అదోలా చూస్తూ విజయనొదిలి.

“ఎందుకుంటుంది? ఉండదు. మేం మగాళ్ళ గాదు గదా. మగాళ్ళయితే ఉంటుంది. ఆడా మగా కలిస్తేనే ‘మనిషి’ అనే దాన్ని తీసేసారుట గద. మీరు మగవారు, సంపాదనాపరులు. మేం మీపైన ఆదార పడేవాళ్ళం. శారీరకంగా అర్భకులం. అందుకే మాకు బాధ్యతలు తప్ప హక్కులు లెవ్వు. అదీ మీరు నిర్ణయించిన బాధ్యతలే మాకు వరాలు అంతేనా?” అంది.

“విజయా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అంత దూరం నుంచి నేను నీ కోసం వచ్చాను. నువ్విలా మాటాడడం…” అన్నాడు.

“నేను మనిషిననుకొని, నా భర్త మనిషే అన్న భావనతో మాటాడాను” అంది తలొంచుకునే.

“అంటే…?”

“మనం మనషులమే అయినప్పుడు మగవారికున్న హక్కులు ఆడవారికి ఉంటాయిగదా. పిల్లలు పెద్దవాళ్ళను తమ దగ్గర ఉంచుకొనడం బాధ్యత గాదా? మరి ఇందులో తేడాలెందుకు. మగవారి తల్లిదండ్రులకు మాత్రమే సంరక్షించే హక్కు న్యాయమైంది అన్న భావననూ ఈ సమాజం మొదట నుంచి తీసివేయడం మాత్రమే నాగరీకమవుతందని చెపుతున్నాను. అది నాగరికం కానపుడు ఆడా మగా సమానం సమాన హక్కులు ఉన్నయనడం బూటకం కాదంటారా్?”

“పక్క దగ్గరికొచ్చాక కౌగిలిలో కరిగిపోవాలిగానీ ఇదేం ఆలోచనలు? నీ మనస్సు బాగలేనట్టుంది” అనుకుంటూ అసహనంగా లేచి నేల చూపులు చూస్తూ బయటకు నడచాడు.

“ఆగండి” అంది విజయ.

“ఏమిటి?” అంటూ ఆగాడు.

“మీరు వచ్చింది ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికా?”

తల ఊపాడు అవునని.

“అయితే నాతో పాటు మా అమ్మానాన్నా కూడా వస్తారు ఇల్లు అమ్మి… వారు లేకుండా నేను రావడం న్యాయం కాదు. ఇక మీరు ఎప్పుడు బయలుదేరమంటే అప్పుడు బయలుదేరుతాం” అంది.

“మీ అమ్మా నాన్నలను జీవితాంతం నేనందుకు పోషించాలి? ఏదో నెలో రెండు నెలలో అంటే ఏం లేదుగానీ…”

“నాకయితే ఆ బాధ్యత ఉందంటాను.”

“ఉండొచ్చు?”

“నేను మనం అయ్యాక మనం ఇద్దరిని చూడాలి గదా ఒక్క మీ వాళ్ళను ఉంచుకోవడం ధర్మమా?”

“ఈ సమాజంలో ఉన్న పద్థతి అది.”

“సమాజంలో చెడు ఎందుకో ప్రవేశించింది గనుక ఆ చెడును చెడు అని తెలిసినాక కూడా భరించడం న్యాయమేనా?”

“కాదు.”

“మరింకేం.”

“ఇది నావల్లకాదు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిది” అన్నాడు.

“అయితే నేన మీ వెంటరాను. మా వాళ్ళకు ఆసరా చూడకుండా రావడం వారికి ద్రోహం చేయడం అవుతది కదా.”

“మరి నన్నెందుకు పెళ్ళి చేసుకున్నట్లు” అన్నాడు కోపంగా.

“పెళ్ళి ఎవరైనా ఎందుకు చేసుకుంటారు. అందరిలానే నేనూ” అంది.

“అంటే నువ్వు రానంటున్నావు గదా?”

“నా కది న్యాయం అనిపించక.”

“సమాజంలో లేని న్యాయం కదా” అంది.

“చెప్పాను గదా”

“జరుగుతున్నది తప్పు దాన్ని సరి చుసుకుందామని.”

“ఒక్క నువ్వు తప్ప ఇలా ఎవ్వరూ ఇంత వరకు అనలేదు.”

“మీ చెప్పుచేతులలోని వాళ్ళు గదా మిమ్మల్నేలా కాదంటారు?”

“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు?” అని మీద కొచ్చాడు.

“మీరే మనుకున్నా ఫర్వాలేదు.”

“అంటే నాతో రావన్నమాట” అన్నాడు సీరియస్‌గా.

“నేను అనలేదు. అలా అనలేదు”

“అయితే వెళ్తాను” అంటూ నడచాడు.

మాటాడలేదు. చూస్తుండింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here