Site icon Sanchika

అనుబంధ బంధాలు-34

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 34వ భాగం. [/box]

[dropcap]గొం[/dropcap]తు జీరపోయింది.

అసలు ఇది తన భార్య ‘శాంతేనా?’ అన్నది చాలా సేపటి దాక అర్థం గాలేదు దీక్షితులుకి.

‘శాంతా’ అని పలకరించడానికి జంకు కల్గింది మొదటిసారి. రెండు నిముషాల నిశ్శబ్దం తరువాత శాంతమ్మ దీక్షితుల్ని చూసి “ఇదిగో ఈ నిర్వాకాలకేం గానీ మనకున్నది అదొక్కటే. మన పిల్లవాడు ఉంటే నేనెలాగో సర్దుకునేదాన్ని. దాన్ని ఎక్కడ అప్పగించి బాధ్యతలు పూర్తి అయిపోయినదని చేతులు కడుక్కున్నారు. అదేమో లోకజ్ఞానం ఎక్కువగా ఉన్న పిల్ల. మనసు ఎదిగింది. దాన్ని అర్థం చేసుకని ఏం చేయాలో ఆలోచించండి. మీ పద్ధతులు, వాలకం చూస్తే దాన్ని కూడా దక్కకుండా చేసేలా ఉన్నారు. కన్న కొడుకు తల కొరివి పెట్టే యోగం ఎట్టాగూ అర్థాంతరంగా పోయింది. ఇదయినా మనం కన్ను ముసే వరకు సుఖంగా కనిపించేలా చూడండి. విజయ సంతోషంగా మన మధ్య తిరుగాడుతుండాలి. ఆఁ” అని లేచి విసురుగా లోనకెళ్ళింది.

దీక్షితులుకు నిజంగా చలనం పోయినంత స్థితికి దిగిపోయాడు. మబ్బు లేకుండా పిడుగుల వర్షం పడి అకస్మాత్తుగా వెలసి పెళపెళ ఎండ కాచినట్టుగా అనిపించింది.

‘ఆడాళ్ళు’ అమాయకులు కాదు, తెలివితేటలు ఆలోచనా ఎవ్వరి సొత్తు కాదు. ‘అమ్మ’ అని తల విదిలించుకని శాంతమ్మ చేతి కిచ్చిన కాఫీ చల్లారిపోగా అక్కడే వదిలేసి కండువా భుజాన వేసుకొని దోవ వెంట నడచాడు.

“దశరథాన్ని కలవాలి” అనుకున్నాడు నడకన. ‘నేను ఇప్పుడు వచ్చింది అక్కడి నుంచే గదా!’ అని గుర్తుకొచ్చింది.

‘అయినా కలవాలి. ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయానికి రావాలి. పిల్లది ఆనందంగా ఉండాలి’ అనుకున్నాడు.

పూజారయ్య ఎదురు పడి “ఊళ్ళనే ఉన్నావా” అడిగాడు.

“నేనా? నేను ఉన్నాను” అన్నాడు ముక్తసరిగా నడచే ప్రయత్నంలో పడి.

“దీక్షితులూ, నేను పూజారయ్యను. నాతో మాటాడలని పించడం లేదా? ” అన్నాడు నవ్వుతూ.

“ఓఁ మీరా? ఆఁ, మీరే గదూ. ధ్యాసలో లేను” అన్నాడు.

“గుడి దాకా రా! మనస్సుకు మందు దొరుకుతది” అన్నాడు నడుస్తూనే.

వెంట నడుస్తూ తల ఉపాడు దీక్షితులు అనాలోచితంగా.

గుడిదాకా మాట మంతి లేకుండా నడిచారు. గుడి ముందర ఉన్న చప్టా మీద కూర్చున్నారు ఎదురు బొదురుగా.

“ఏమిటి? విషయం? చెప్పు. నాకు తోచినది చెప్తాను” అన్నాడు పూజారయ్య

ఏం చెప్పాలో తోచి చావలేదు.

కొంచం ఆగమన్నట్టగా సైగ చేసాడు పూజారయ్య.

‘ఇంకా కుదుటపడ లేదు మానవుడు’ అనుకున్నాడు. అసలేం జరిగి ఉంటుంది? అనుకుంటుండగా వెనక నుంచి ‘రాం రాం రాం రాం’ అన్న శబ్దం వినిపించింది. అయితే అది ఎక్కడి నుంచో ఇద్దరూ గమనించ లేదు. పూజారయ్య లేచి చుట్టురా చూసాడు. బాగా దరికి వచ్చాడు. ప్రక్కన వంపులో ఉన్న ఇరిక చెట్టు నీడన ఎవరో సాధువు కళ్ళు మూసుకొని ‘రాం రాం రాం’ అంటూ ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. వెంటనే ఆ ప్రక్క ఇళ్ళ వాళ్ళను కలిసి విషయం తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం వచ్చాడట. ఇప్పటి దాకా లేచిన జాడ లేదంటున్నారు. ‘రాం రాం’ అనే మాట మాత్రం వినిపిస్తునే ఉంది.

విచిత్రమనిపించింది. దీక్షితులుని పిలచి “అక్కడి దాకా వెళద్దాం రా” అన్నాడు. సరే నంటూ వెంట నడచాడు.

ఇరిక చెట్టు దగ్గరికి నడిచారు. కూర్చొని ఉన్న వ్యక్తి బాగా వృద్ధుడు. ఒంటి పైన గోచీ తప్ప ఏం లేదు. ధ్యానంలో కనిపించాడు. బయట ప్రపంచంపు ధ్యాస అతన్ని అంటడం లేదు. ఇద్దరూ దాపుకెళ్ళి ఆయనకు నమస్కరించారు. అతనిలో చలనం కనిపించలేదు. మాములుగానే ‘రాం రాం’ అంటున్నాడు. ఎవరితను? ఎందుకిలా? ఇక్కడికి చేరాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇలాంటి అనేకానేకమైన ప్రశ్నలు ఇద్దరి తలలోనూ మొలచినయి.

ఇద్దరూ మెల్లిగా మొదటి చోటుకే నడచారు. కూర్చున్నారు. కానీ ఎవరి నెవరు పలకరించుకోన లేదు. ఎవరి ఆలోచనలో వారే ఉన్నారు. వారిలా ఉండగా జాలయ్య వచ్చాడు.

“ఏమిటలా కూర్చున్నారు?” అన్నాడు సరసన కూర్చుంటూ.

‘అబ్బెబే, ఏం లేదు’ అన్నట్టుగా ఇద్దరూ చూసి “కూర్చో” అన్నారు.

కూర్చుని తన ధోరణిలో తన వ్యవహారం ప్రారంభించాడు. “ఈ దఫా కమిటిలో చాలా మంది బయటపడేలా అనిపిస్తుందయ్యా. వీళ్ళు దొంగలా దొరలా అనే విషయాన్ని ఆలోచించడం మానేసాం. పైరవికారులుకున్న ఫైళ్ళలో ఎవరివి ఎన్ని బయటపడతాయి అనే దౌర్భాగ్యపు స్థితికి దిగజారాం. న్యాయానికి మనిషి అయితే మనస్సూ మానవత్వం చింతాకంతయిన ఎదవ శరీరంతో ఉంటే అప్లికేషన్ పెట్టాడు. ఇలాంటి అడవిజాతి పిచ్చిగా పెరిగిపోతుంది. నిజానికి ఇప్పుడున్న లిస్టున కూడా సగానికి పైగా దొంగలే ఉన్నారు. వీరి కోసం మనం ఫైట్ చేయాలి. అంతే కాని దొంగలెవరు దొరలెవరు అని విశ్లేషిస్తూ కూర్చుంటే న్యాయమైన వాళ్ళ అడుగుకుపోయే ప్రమాదం ఉంది. అందుచేత న్యాయమైన వాటిని ముందుంచి మిగిలినవి మందలో కలిపేస్తాను.”

అక్కడ అప్పటి దాకా వారి తలలో ఉన్న ఆలోచన వేరు. అతగాడు వెళ్ళగాక్కింది వేరు కావడంలో చెప్పింది మనసుకెక్క లేదు.

“ఇక్కడో సాధువు రామనామం జపిస్తూ మొన్నటి నుంచి కూర్చున్నాడు. అన్న పానీయాలు ముట్టడం లేదు. బాహ్య ప్రపంచపు ధ్యాస లేదు” అన్నాడు దీక్షితులు.

“ఎవరట?” అడిగాడు.

“సాధువు.”

“ఏడీ?”

“అడిగో.”

కళ్ళజోడు సరి చేసుకొని అటుగా పార జూచి చూపు సరిగ్గా ఆని చావక చప్టా దిగి చెట్టు క్రిందకు నడచి సాధువును చూసి వచ్చి ఆశ్చర్యంతో తికమకయి, దీక్షితులు వైపు వేగంగా అడుగులు వేసి “ఇతగాడూ నేనూ మొన్నటి బస్సులో ఇక్కడే దిగాం” అన్నాడు.

“నీకు తెలుసా ఇతడెవరో?” అనడిగాడు పూజారయ్య.

“తెలీదు, కాకపోతే ఒకే బస్సులో వచ్చాం. ఇక్కడ దిగాం. ఆ తరువాత ఇలా… ”

“ఇక్కడే తిష్ఠ వేస్తాడేమో…” అన్నాడు పూజారయ్య.

“ఎందుకు అలా అనుకుంటున్నారు?” అన్నాడు జాలయ్య.

“అలా అనిపించడం లేదు నాకు” అన్నాడు దీక్షితులు.

“మనం అనుకొనగానే సరిపోదు” అన్నాడు జాలయ్య.

“ప్రతిదీ మనం ఎందుకు ఆలోచించాలి. ఉపేక్షించి చూడవచ్చును గదా?” అన్నాడు దీక్షితులు.

“అట్టా చూసే సగం మంది దొంగ వెధవలకు స్వాతంత్య్ర సమరయోధుల పట్టాలిచ్చారు. గనుక వాళ్ళు డబ్బు పెట్టి వీటిని కొనుక్కున్నారు గనుక No1 యోధులుగా ముద్రపడింది.”

“అంతా ఇలాగే ఉందంటారా?” అడిగాడు దీక్షితులు.

“కాక?” అన్నాడు పూజారయ్య.

“నీ పూజ కూడా ఇలాగే ఉంది” అన్నాడు ఠక్కున జాలయ్య.

పూజారయ్య మొఖం ఠక్కున వివర్ణమైంది. కోపంతో ఒక్క క్షణం ఊగిపోయాడు.

దీక్షితులు ఇది గమనించి ఎలాగో దీన్ని సర్దేయ్యాలని లేచాడు.

ఇంతలో జాలయ్య “పూజారయ్యా ఈ ఒక్క మాట నిన్ను ఎలా చేసిందో చూడు. నువ్వు నిష్ఠగా చేస్తున్న క్రతువును నేను చెడిపేలా చెప్పడం దోషమే కానీ మేం ఈ దేశం కోసం సర్వం ఒడ్డి చేసిందాన్నిఎంత హేయంగా చూస్తూన్నారోఁ. ఈ దగుల్బాజీ పైరవీకార్ల వల్ల దాన్ని మేం ఎలా భరిస్తున్నామో ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించి చూడు” అన్నాడు.

“నాకు వేళయింది” అన్నాడు పూజారయ్య లేస్తూ.

“నేను వెళ్తాను” అన్నాడు జాలయ్య.

అలా ఎవరి తోవకు వారు బయలుదేరారు.

***

విజయ శాంతమ్మతో కబుర్లాడుతుంది. పొద్దు కూకుతుంది. సూర్యుడు అప్పుడే భూమిలోనికి దిగిపోయాడు.

వెలుగు రేఖలు దూరమయినయి. ఎఱుపుదనం తగ్గింది. చీకటిన నక్షత్రాలు వెలుగు నింపుకుంటున్నాయి.

దీక్షితులు శాంతమ్మతో ఏదో చెపుదామని లోనికొచ్చి… విజయను చూసి “నువ్వెప్పుడొచ్చావే?” అని అడిగాడు నవ్వుతూ

“ఏమిటట నవ్వుతూ వస్తున్నారు? కోతులాటగానీ ఉందా తోవలో?” అంది శాంతమ్మ.

“అది పసితనపు ఆట. నవ్వులాట కాదు. మనం ఇప్పుడు పసి వాళ్ళము కాదు” అన్నాడు ఉక్రోషంగా

“ఆ సంతోషంలో కూడా కొద్దిగా పాలు ఎక్కువ ఇవ్వవచ్చుగదా?”

“కాదని ఎవరన్నారు?”

“చెప్పంది ఎలా తెలుస్తుంది?”

“రాములమ్మ మొగుడొచ్చాడు అని మన ‘సీతాపతి’ అంటుంటే, పాపం అసలు వాడి పేరునే మన ఊరు మరిచిపోయిందిరా అన్నాడు గోపాలం. అంతటితో ఆగినా బాగుండును. వాడే ‘నేను నిజంగా మరచిపోయాను గానీ రాములమ్మ మొగడి పేరేంటి?’ అని అడగబోయాడు. అందుకొచ్చింది నవ్వు. అలాగే లోనికి వచ్చాను సరేనా” అన్నాడు దీక్షితులు.

“విజయా విన్నావా?” అన్నది శాంతమ్మ,

తల ఊపింది.

“వినిపించడం కాదే వెఱ్ఱిమొఖమా, ఆ రాములమ్మ మొగుడు అన్న మాట అసహజంగా ఉందని అనరాని మాట అనీ, రాములమ్మ మొగుడు వెధవ కాబట్టే అలా అన్నారనీ అంటున్నారనీ ఎద్దేవా కనిపించడంలేదూ?”

“ఎందుకు కనపించదు, స్పష్టంగా అర్థమవుతుంటే” అంది విజయ.

“నన్ను దీక్షితులుగారి భార్య అంటున్నారు. మీ అమ్మను దశరథంగారి పెళ్ళాం అంటున్నారు. ఇది సహజం, గౌరవనీయం మనకీ వాళ్ళకీను. రాములమ్మ మొగుడు అనడం మాత్రం అసహజం దాని మొగుడు అంతే వాడు దాని మొగడే గదా. కాడా? వాడి పెళ్ళాం వీడి పెళ్ళాం అంటే అర్థం మారడం లేదు గదా.”

“అవును” అన్నాడు దీక్షితులు అదోలాగయి.

“అర్థం ఒక్కటయినపుడు అది సహజం, ఇది అసహజం ఎలా అయినయి? ఈ సమాజపు తలలను బ్రెయిన్ వాష్ చేసారు. దాని మొగుడు అనడంలో మగాడు బలహీనుడు అసహజం, అయన పెళ్ళాం అనడంలో ఆడది మగాడి చాటు మనిషి సహజం అనేలా ముద్ర వేసారు. రాములమ్మ మొగుడు అంటే అతగాడు వెఱ్ఱి వెధవనీ; దశరధంగారి భార్య అంటే మగడి క్రింద ఉన్న ఆడది గనుక ఉత్తమ ఇల్లాలు అనేనా? దీని అర్థం మాత్రం ఆడది కీలుబొమ్మనే కదా. అలా ఆడాళ్ళ అనుకోనకుండా ఉంటే ‘ఉత్తమ ఇల్లాలు’ అన్నారు. ఆడవాళ్ళు ఆ శక్తులుగా ఉంటేనే ఉత్తమం అని అర్థం.

మగవాడు తక్కవగావడానికి వారి అహం ఒప్పుకోదు. రాములమ్మ తన భర్తను మంచిగా చూసుకుంటూ సంసారాన్ని చక్కదిద్దుకున్నా సరే మగవాడేదో కోల్పోయినట్లు జాతి కొంగు చాటు క్రిష్ణుడి కింద లెఖ్ఖ. దీక్షితులుగారి పెళ్ళాం అంటే లాంటి భావన రాదు. ఇలా మనుషులను తయారుచేసారు.

భర్త చేసే దేన్నయినా భరించేది పతివ్రత, సాధ్వి పైగా మరో జన్మకు కూడా అతగాడే భర్త అవాలని ఆవిడ ప్రార్థన చేయాలి. అప్పుడు ఇంకా ఉత్తమ ఇల్లాలవుతది. ఆరాధనీయంగా మారుతది. మగాడు ఎంత త్రాష్టుడయినా ఇదేం పనిరా పింజారీ వెధవా అని నిలదీయదు. మగాడు వాడికేం అంటారు. ఈయనకేదో అదనపు అస్థిత్వం ఉన్నటు. ఇదేంటి అని అడిగితే చాలు తెగులు మొదలవుతది.

పతివత్ర కాదు. ఉత్తమ ఇల్లాలు అసలే కాదు. మగాడు చేసిన తప్పును ఇది తప్పు అని అడగరాదు. భరించాలి.

ఇదేం పాపం అలా చేయవచ్చునా అంటే భర్తను ఎదిరించడమే అవ్వ! ఇదీ పతి భక్తి! పాతివ్రత్యం గల స్త్రీలు ఇలా ఎప్పుడైనా చేసారా? చేస్తారా? వీళ్ళనేం అనాలి?”

‘ఛ’ అని విజయ “ఇది మగసమాజం ఆఁ” అంది.

దీక్షితులు తెల్లబోయి చూసాడు.

అసలు ఈ మధ్య కాలంలో శాంతమ్మ మాట తీరు చూస్తుంటే మతి పోతుంది. ఏం అంటే ఏం మాటాడతదోనన్న భయం మొదలవసాగింది. మరి విజయ కాపురానికెళ్ళి వచ్చినప్పటి నుంచీ ఇది పెరిగింది. ఇది ఎక్కడిదాక వెళ్తుందో అనిపించింది.

కానీ ఆ వేళ ‘దాని కాపురం కుదుట పడేలా చూడండి’ అని కంట తడిపెట్టుకున్న తీరును దీక్షితులు నిజంగా మర్చిపోలేదు. అంతగా విజయ మంచిని కోరుకునే మనిషి అనుకుని వింటూ కూర్చున్నాడు.

“విజయా మనం కొంచం ఎదురొచ్చినా ఈ మగాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకుండదంటే నేతి బీరకాయలోని నెయ్యంత సమదృష్టి వీళ్ళకు ఉంటుంది. గనుక నువ్వు బాగా గమనిస్తూ పో. భవిషత్తు ఉన్న దానివి చిన్న దానివో ఇది పూర్తిగా మగ దురహంకార ప్రపంచం. ఇక్కడ ఆడది అమ్మే అయినా వాళ్ళ చేతిలోని కీలుబొమ్మే. దీనికి తోడు డబ్బు తోడయితే కోతికి కొబ్బరి కాయ దొరికినట్టు.

మగవాళ్ళకు మంచి దృష్టి సమదృష్టి తాము కన్నకూతురు పైననే ఉండదు. అంతటి గొప్పవాళ్ళు వారు చెప్పింది వేదమని గొఱ్ఱెలా తల ఊపితే బేష్ అంటారు, గౌరవిస్తారు మన వెధవవాయిత్వన్ని. ‘మీరు చెప్పింది అసంబద్దంగా ఉంది గదా’ అను, వాళ్ళకు చలి జ్వరం ప్రారంభమవుతది. విదిలించుకొని ఎదురు దాడికి సిద్దమవుతారు” అని నవ్వింది.

“స్నానానికి నీళ్ళు పెడతావా, ఇలా నీ ఉపన్యాసం వింటూపోనా?” అన్నాడు దీక్షితులు.

“ఇదిగో ఇట్టా ఉంటుంది వీళ్ళ వరుస” అని లేచింది శాంతమ్మ.

“నువ్వు ఉండు, నేను నీళ్ళు తోడి వస్తాను” అని లేచింది విజయ.

“నువ్వెందుకు? దానికేమయిందట? నాకు, కాలు చెయ్యి సక్రమంగా ఉండగానే మగడంటే ఇలా ఉంది. పైగా ఎవరో ఎవర్ని రాచి రంపాన పెడుతున్నారని, తేరగా కూర్చుని తిని, కచేరీలు వినిపిస్తున్నది” అన్నాడు అక్కసుగా.

మూతి మూడు వంకర్లు తిప్పుతూ శాంతమ్మ నీళ్ళు తోడేందుకు సందుకు నడిచింది ‘ఈ సంబడం తెలియంది కాదు గదా’ అనట్లు.

(ఇంకా ఉంది)

Exit mobile version