[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 38వ, చివరి భాగం. [/box]
[dropcap]”ఇ[/dropcap]ప్పుడెక్కడికే?” అడిగింది సీతమ్మ, బయలుదేరుతున్న విజయను చూసి.
“అత్తయ్య దగ్గరకు.”
“రమ్మన్నదా?”
“నిన్ననే వెళ్దామనుకున్నానమ్మా.”
“స్నానం చేసి శుభ్రంగా వెళ్ళచ్చుగదా?”
“మరీ ఆలస్యమయితే అక్కడే చెస్తానులే” అంటూ నడచింది.
“నిజంగానే నువ్వు ఆ ఇంటి కోడలవయి ఉంటే మమ్మల్ని మరిచేపోయేదానివి” అంది వెళ్తున్న విజయను.
ఆగింది విజయ. వెనక్కి తిరిగి అమ్మ కళ్ళలోకి సూటిగా చూస్తూ “అందుకే ఇలా జరిగిందంటావా అమ్మా” అంది.
“‘ఛ’ అదేం మాటే ఊర్కే గుర్తుచెదరక అన్నాను. నువ్వు శాంతమ్మ కోడలివి అయినా కాకపోయినా ఏం లేదు. నువ్వుంటే ప్రాణం. నేను నిన్ను కన్నా దానంత ప్రేమను నేనివ్వలేదు. విజయా నీ కాలిలో ముల్లు విరిగిందని తెలిస్తే దాని కళ్ళు నీళ్ళకుండలవుతయి. భగవంతుడు ఎందుకు మమ్మల్నిలా కలిపాడో అర్ధాంతరంగా ఎందుకు విడదీసాడో అర్థం గాదు. పూర్వజన్మ అనుబంధాలంటే ఇవే కావచ్చు” అంది.
గేటు దాంటిది విజయ. నడుస్తుంది.
దీక్షితులుగారింటి వైపుగా ఉన్న పెద్ద దోవ నుంచి మళ్ళుతుంటే… ‘అమ్మో దేముడో’ అన్న కేకలు వినిపించినయి. దాని వెంట ఏడుపు ఆగి అటు చూసింది విజయ.
పది ఇళ్ళ అవతల ఆడమనిషి దోవన పడి మొత్తుకుంటుంది. మగాడొకడు పలుపు తాడుతో గొడ్డును బాదినట్టుగా తోవలో పడేసి పొర్లించి బాదుతున్నాడు. దెబ్బకో వాత తేలుతుంది శరీరం పైన. గజ గజ వణుకుతుంది. నల్గరయిదురుగురు దాపులనే ఉండి చూస్తున్నారు. ఆపడం లేదు. ఇంతలో ఆరేళ్ళ పోరడు “అమ్మా అమ్మా” అంటూ వచ్చి ఆమె మీద పడ్డాడు. ఆ పిల్లవాడ్ని రెక్కపుచ్చుకొని దూరంగా విసిరేసాడు. హృదయం అదోరకంగా ఉందా దృశ్యం.
అలాగే బాదితే ఆవిడ చనిపోతుందేమో ననిపించింది.
అక్కడకు పరుగెత్తింది విజయ ఆవేశంగా. బాదుతున్న అతని చేతిని గట్టిగా పట్టుకొని “అసలు నువ్వు మనిషివేనా?” అని అరచింది పిచ్చిదానిలా.
గస పెడుతునే ఉరిమిని చూసాడు.
‘విజయమ్మ పంతులుగారి అమ్మాయి’ అని గమనించి ఒక్క తోపు తోసేద్దామనుకున్నాడు ఆగిపోయాడు.
“ఎందమ్మాయిగోరు? మీరెళ్ళండి. మొగడూ పెళ్ళాల మధ్యకి మీరెందుకు?” అన్నాడు దాన్ని చేతిని వడిసి పట్టుకుంటూ.
“ఎందుకలా కొడుతున్నావు? తోటి మనిషి అనయినా చూడకుండా ఏంటిది? ఇలా పడేసి బాదటానికి సిగ్గు లేదా? ఎవరిచ్చారు నీకీ అధికారం?”
“నా పెళ్ళాం అది, నా యిష్టం” అన్నాడు పిచ్చిదాన్ని చూసినట్టు చూసి.
“నీ పెళ్ళామే అయినా ఇలా పశువుని బాదినట్లు బాదవచ్చునా? మనిషి చేసే పనా ఇది? ఛ.”
“నా పెళ్ళాన్ని ఏలుకోవడానికీ తన్నుకోవడానికీ ఒకడిచ్చే అధికారమేంది? తాళికట్టినంక అది నా లెఖ్ఖలో పడి ఉండాల్సిందే. నోరు విప్పితే నరికి పోగులు పెడతా” అని అదోలా నవ్వి విజయ వైపు తిరిగి “అమ్మాయిగోరు ఇది నా ఆలి, కట్టుకున్నది” అని, “పగలల్లా పని చెయాల, వండి పెట్టాల, వద్ద పండాల, పోరగాళ్ళని కనాల, నేనింత తెచ్చినా తేకున్నా ఇల్లు చూసుకోవాల, అట్ట ఉంటేనే ఉంటది. ఏడ చింతాకంత తేడా వచ్చినా దాని తాతలాంటోళ్ళనే తెస్తా గంట పట్టదు మనువాడేందుకు ఆఁ…” అంటూనే,
“మీరు పొండి గీ సంగతులు అంతు పట్టవు” అని చేతిలో ఉన్న పలుపును దాని మీదనే వేసి నడచాడు. క్రింద పడి పొర్లి ఏడుస్తున్నావిడ మీద పడ్డ పలుపును తీసుకొని ఏడుస్తున్న పోరడి దగ్గర కొచ్చి వాడిని చంకనేసుకొని అసలేమి జరగనట్టే తోవనపడి ఎల్లిపోయింది ఎక్కక్కిపడుతూ…
ఆవిడ వెళ్తున్న తీరును విజయ తలనిండా అనేకానేక ఆలోచనలు మొలిచినయి. ఆవిడ మనస్థత్వమూ అర్థం గాలేదు. అట్టా కుక్కిని పేనులా ఉండమే ఆడతనమా? అలా ఉండేదే ఆడదా? ఇదేమిటి అని నోరు విప్పే హక్కు వీళ్ళకు లేదా? నడుస్తున్నదంతా ఇంత దగానా? ఈ సృష్టికే తల్లి అయిన ఆడదాని గతి ఇంత అధోగతా?… కనీసం ‘మనిషిగా’ వర్తించే అవకాశం లేదా? ఎప్పుడొస్తుంది? అసలు వస్తుందా? నాగరికపు వ్యవస్థలో కూడా ఇదేంటి. ఇలాంటి వ్యవస్థలో మనుగడ సాగిస్తున్న మగవాడు నేను మగాణ్ణి గదా అనుకవడంలో తప్పేముంద? ఈ ‘ఆడ’ ‘మగ’ లు మనుషులుగా కారా? ఆడ అంటే బానిస అనీ?… మగ అంటే సర్వం దోచుకునే దోపిడి దారుడనీ… స్త్రీ రోదన ప్రపంచం మొత్తం నుంచి వినిపిస్తున్నట్టు అనిపించింది.
ఎందుకు? ఈ ఆగని కన్నీరెందుకు? ఈ అడ్డుకట్టలెందుకు? మరి అలాగే ముక్కుతూ, చీదుతూ బ్రతుకుతున్నారెందుకు? నిజంగా వీరి కన్నీరంతా ఒక్క చోట చేరిస్తే సముద్రమయ్యెదేమో? అసలదే సముద్రమా అందుకే సముద్రం ఉప్పగా ఉందా? ఆకాశమంత బాధ, అంతకుమించిన దయనీయత.
అయినా still they are wailing, అది ఎలాంటి బ్రతుకైనా గానీ మగవాని ఆటవికతకు దౌష్టానికి బలిపశువులుగా నిత్యం ఎర అవుతూ భగవంతుడా ఏమిటిది?
ఇతగాని ఆనందానికి ఆడది కావాలి. ఆహ్లాదానికి ఆడది కావాలి. ప్రయత్నానికి ఆడది కావాలి. బాధను పంచుకోవడానికి ఆడది కావాలి. హింసించడానికి ఆడది కావాలి. పుట్టక నివ్వడానికి కావాలి. సాకటానికి కావాలి. ఇంత పెట్టడానికి కావాలి. ఇతగాని ప్రతి ఆటు పోటులనూ సేద దీర్చడానికి కూడా ఆడదే కావాలి.
కానీ….
ఆ ఆడది ఇతగాని చేతిలో మట్టి ముద్దగానే మిగిలి ఉండే. ఎన్నియుగాలు మారినా తరాలు మారినా మట్టి ముద్ద మైనపు ముద్దయిందే తప్ప నేను అన్న కేక వినిపించలేదు.
ఆడదాని అవసరం కల్గినపుడల్లా… గోవును పూజించునట్లుగా…. ఆమ్మోరికి దండం పెట్టినట్టు… జాతరనాడు పాము పుట్టకు పాలు పోసినట్టు…. చేయడం.
ఆనక నిర్దాక్షిణ్యంగా ….. ఇలా చేసేందుకు జొజ్జరకట్టడం.
యజ్ఞ పశువును బలిచ్చినట్టు తయారు చేయడం…. ఆది పరాశక్తి అని భజనలు చేయడం. అష్టోత్తరానామాలు చదవడం… టెంకాయలు కొట్టడం… వ్యక్తిగా అంతటి ఆడ మనిషికి మామూలుగా తోటి మనిషిలా చూడలేకపోవడం. ఇవ్వాల్సిన స్వేచ్చనివ్వడానికి ససేమి అనడం (ఇవ్వాళ కూడా) ఇదేమిటని తలెత్తి కాలు కదిపితే నోరు విప్పితే కీచక సైంధవులను మరిపించే అనుభవాలలో చావలేక బ్రతికేందుకు సిగ్గు పడుతూ ఉంటే… ఇంటికి వచ్చాకే చెడింది అని ముద్ర వేసి… తిరిగి మెడపెట్టి బయటకు గెంటడం… అసలిదేమిటి?
ఇది మానవ సమాజమేనా? భగవంతుడా నువ్వు నువ్వు చెప్పు…. ఇలా జరిగే దాన్ని అసలు ఏమందాం… మరి ఎందుకు దీన్ని మానవ సమాజం అంటున్నారు. ఈ మానవ సమాజంలో సగం మంది ఆడవారున్నారు గదా అలాంటప్పుడు… మగవారితో కలసి ఉంటూ సరిగ్గా ఎందుకు లేరు. ఉన్న సగం ఎన్ని బ్రూణహత్యలో తరువాత గుడ్డుగా ఉన్నపుడే గమనించి చంపుతున్నా చెత్తకుండీ పాలు చేస్తున్నా… అక్కడి నుంచి కుక్కలెత్తుకొనిపోతున్నా… ఆత్మహత్యల పాలవుతున్నా…. అమ్ముకున్నా…. మగవాని చేతిలో చిత్రహింసలు పడిచస్తున్నా… దిక్కులేని అనాథగా దయనీయంగా బ్రతుకలేక చావలేక ఉంటున్నా ఇంకా… ఇంకా… మనసు పెట్టి ఎవరైనా ఈ విషయాన్ని ఆలోచించగల్గితే చాలా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తది. ఉన్నవారూ ఏది దిశగ… అర్థం ఉండీ అపార్థాల పాలవుతూ…. జ్ఞానం ఉండి కించపరచబడుతూ… మౌనంగా ఉండి అవమానాల పాలవుతూ అరిటాకు… ముల్లులా…. క్షణక్షణం బితుకు బితుకుమంటూ…. అతి తక్కువ సుఖాల్ని కూడా కబళించే దుఃఖపు దినాలను లెక్కిస్తూ కాలకూట విషాన్ని కంఠంలో బంధించిన పరమశివునిలా తాము జన్మనిచ్చి… సాకి సంబాళించి జ్ఞానమిచ్చిన వానికి బందీలయి… ఇల్లాలయి… ఆట బొమ్మలై…. మళ్ళీ తల్లులై… అక్కలై… చెల్లెలై… బిడ్డలై… మగదాహానికి మంచినీళ్ళయి… ఇంకా ఉన్నారు…. ఉంటున్నారు… ఉంటారు. ఇందులో నూటికి ఒక్కరు స్వచ్ఛంగా నవ్వలేరు. అసలు నవ్వడమేమిటో తెలిని జాతి చాలా ఉంది. మగాడు నవ్విస్తే నవ్వుతూ (ఎందుకో తెలీకపోయినా) ఏడిపిస్తే ఏడుస్తూ… తంతే పడుతూ… తీర్చితే సమిధలవుతూ… గుడ్లురిమినపుడు బిక్క చచ్చిపోతూ… ఉంటూనే ఉన్నారు.
ఎంత చిత్రమిది? మతం, సంస్కృతి, జాతి, దేశం, ప్రపంచం, సమానత…
ఆడవాళ్ళ నిజస్థితి గమనించాక కూడా… ఇంకా నాగరీకులమే అని చెపుకోగల్గడం. సహజీవనం చేద్దాం…. మరణందాకా… కష్ట సుఖాలలో ఒక్కటిగా ఉందాం అని పేపైన అనగల్గిడం? అసలు మగాడు మరతాడా?…
‘నేను నా భర్త దగ్గరికి వెళ్తే’ అనుకొంది అకస్మాత్తుగా విజయ. ఉలిక్కిపడ్డట్టయింది. వెన్నులో చలి.
అసలిలా ఎందుకు అనిపించింది? మగాడంటే భయం కలిగా? జాలా? దయా? దాష్టికమా? లేక మగాడితోడు తోనే ఆడది శోభిస్తుందేమొనన్న భావనా? ఏమిటిది?
NO NO NO
అనుకుంటూ ఆలోచనలను చీల్చేస్తూ కదలుతుండగా…. ఎదురుగా కుదురుగ నడిచివస్తూ… పలుపు తాడుతో కొట్టినతనూ… రక్షించండి అని గగ్గోలుగా ఏడ్చిన అతని ఇల్లాలూ… విసరిపారేయబడిన పోరడు ఒక్కచోట కూర్చుని మాటాడుకుంటూ కనిపించారు. అట్టాగే చూస్తూ ఉండిపోయింది విజయ.
ఏమిటి అనుభంధం? అసలిది అనుబంధమేనా?… దీనినేమనాలి? అర్థం కాలేదు.
పెద్దావు రెండు రోజులు నరకయాతన పడి దూడను కని… ఆ బాధంతా మరిచి దాన్ని నాకడం దాని ఛాయలకు ఎవ్వరూ వెళ్ళినా కొమ్ములతో కుమ్మేందుకు మీదికి రావడం తెలుసు.
కష్టం వెనుక సుఖం.
సుఖం వెనుక కష్టం.
No… no… something wrong is going on
అనుకొని చికిలించి మరీ చూసింది.
అవును.
Yes… Yes…. వాళ్ళే అయితే ఏమిటిది? పిరికితనమా? అనాథగా మిగులుతాననే భయమా?
అసలీ ఆడ పుట్టుక ఏమిటి?
తలపోటొచ్చింది. కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది.
వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. పోరడు మగాడి భుజానెక్కాడు.
దీక్షితులుగారింటికి చేరింది నెమ్మదిగా అడుగులు వేస్తూ.
కనిపించింది శాంతమ్మ.
మంచానికి అడ్డం పడి మాగన్నుగా ఉన్నాడు మామయ్య. వెళ్ళి శాంతమ్మ పక్కన చతికిలపడింది.
“ఏంటే ఇట్టావచ్చావు? అలా ఉన్నావేంటి?” అని నుదురు పట్టుకొని చూసి…
“ఇదిగో పిల్ల వొళ్ళు కాలిపోతుంది లే” అని…
“ఇట్లా ఉండి ఏం మునిగి పోయిందని ఇక్కడికొచ్చావే… రా ఇట్టా పడుకుందువుగాని. ఈలోపు కషాయం పెడతాను” అంటూ మంచం పై పడుకోబెట్టి తలగడ ఇచ్చింది.
“మీ అమ్మ చూడలేదా?” అంటూ ప్రక్కన కూర్చుంది.
దీక్షితులు గాబరాగా లేచి విజయను చూసి… “అమ్మా ఏంటే?” అని ఇంకా ఏదో అనబోయాడు చేతిని పట్టుకొని…
“వెళ్ళి ఆచారిని తీసుకురండి” అంది.
అక్కర లేదన్నట్లుగా చేతి సైగ చేసింది విజయ.
దీక్షితులు గబగబా బయటకు వెళ్ళిపోయాడు.
“ఇదిగో నీళ్ళు త్రాగు” అని తీసుకుని వచ్చి ఇచ్చింది. మారు మాటడక తాగింది.
కళ్ళు ముసుకుంది, కాదు మూతలు పడినయి.
విజయ నుదుట వంటి మీద పట్టిన చెమటను పైట చెంగుతో అద్దింది. వాటర్ బ్యాగ్‌లో వేడినీళ్ళు నింపి అద్దుతూ కూర్చుంది. శాంతమ్మ ఆప్యాయతకు మనసంతా ఎలాగో అయింది. అమ్మయినా ఇంత కంటే ఎక్కువ చేయగలదా అనిపించింది.
శాంతమ్మ చేతి స్పర్శ అంతులేని ప్రశాంతత నిచ్చింది.
ఇంతలో…
ఆచారిని వెంట పెట్టుకొని హడావిడిగా వచ్చాడు దీక్షితులు.
స్టెతస్కోపు చెవులోకిరికించుకొని పరీక్షించాడు. నెమ్మదిగా బయటకొచ్చి “నీరసంగా ఉంది. అంతే మరేం లేదు. ఈ మాత్రలు దగ్గరుంచండి” అని నాలుగు మాత్రలిచ్చి “వీటిని అప్పుడొకటి అప్పడొకటి చప్పరించమనండి చాలు” అన్నాడు.
“కాఫీ ఇవ్వవచ్చునా” అంది శాంతమ్మ వచ్చి.
“ఇవ్వండి త్రాగుతానంటే” అన్నాడు వెళ్ళిపోతూ.
“నాకూ కాఫీ ఇస్తావా?” అడిగాడు దీక్షితులు.
“ఇదిగో నిముషంలో కలిపిస్తాను. అదేం భాగ్యం?” అంది.
“నేను దశరథానికి చెప్పి వస్తాను” అన్నాడు.
“అక్కర లేదు కాఫీ త్రాగనివ్వండి చూద్దాం” అంది.
“అలాగే” అని విజయ మంచం పైనే కూర్చున్నాడు. నుదుట చేయి ఉంచాడు. దీక్షితులు కళ్ళలోకి నీరుబికింది. పిల్లది చూస్తుందేమోనని తుడుచుకున్నాడు.
దీక్షితుల్ని చూసింది.
“ఏంటమ్మా? ఏమయిందరా? ఏం?” అన్నాడు దగ్గరిగా జరిగి. గొంతులో జీర.
“నేనెంత అదృష్టవంతురాల్ని మామయ్యా” అంది.
“అదేంటిరా?” అన్నాడు అర్థం గాక.
“ఇంత ప్రేమను నేను భరించలేననే భగవంతుడు నా బావను తీసుకెళ్ళాడు. అంతే కదూ” అంది కళ్ళలో నీరు నిండుతుండగా, బావురుమంటూ.
“విజయా, అమ్మా ఏంటి? ఎందుకిలా మాటాడుతున్నావురా? అసలు నీకేమైంది? ఇలా ఉండి ఇంటి నుంచి ఎందుకు బయలుదేరావు? ఇంట్లో వాళ్ళకు బుద్ధి ఏమైంది? అట్టా రావచ్చునా? అయినా అమ్మా నువ్వు ఒక్కదానివేరా మా కంటికి వెలుగు. ఆ వెలుగుకు ఏమైనా అయితే బ్రతకగలమా చెప్పు” అంటూ… పసివానిలా ఏడ్చాడు.
శాంతమ్మ బయటకొచ్చి చూసి “మీరేమిటి దాని పక్కన ఏడుపలా? అసలే అది అదోలా ఉంటే… వయసొచ్చింది గానీ బొత్తిగా ఏం తెలీదు. అసలిక్కడ నుంచి లెండి” అంది కసిరినట్టు.
“అత్తయ్యా” అంటూ నెమ్మదిగా లేచి కూర్చుని కళ్ళు తుడుచుకొని “మామయ్యనేమంటున్నావు. నేన కూర్చోమన్నాను” అంది విజయ శాంతమ్మ చేయిపట్టుకొని.
“విజయా, నువ్వు మాటడక పదినిముషాలన్నా కళ్ళు మూసుకొని పడుకో” అని గద్దించినట్టుగా అని పైట చెంగుతో కళ్ళు వత్తుకుంది.
అలాగే అనట్టు తల ఊపి కళ్ళు మూసుకంది కూర్చునే.
శాంతమ్మ, దీక్షితులు ఏదో మూగ సైగలతో మాటడుకోబోయారు. తరువాత అన్నట్లు సైగ చేసింది శాంతమ్మ. మంచిది అన్నట్టుగా చూసి అక్కడే కూర్చుండిపోయాడు దీక్షితులు.
***
ఇది పూర్తి కాదు.
ఈ ‘అసంపూర్తి’ నడుస్తూనే ఉంటది. ఎంత నడిచినా ‘సంపూర్ణత’ ఉండదు. ఇది ఈ నేల మీది మనిషి కథ గనుక.
మనకు దాని తుది ‘దొరకదు’ గనుక.
‘తెలీదు’ గనుక.
(సమాప్తం)