అనుబంధ బంధాలు-5

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 5వ భాగం. [/box]

[dropcap]తూ[/dropcap]రుపురేఖలు-

బూజర బూజరగా ఉన్న ‘కావురు’ను విడగొడుతూ ఎఱ్ఱబారుతున్నాయి.

గుడి గంట కూడా అడపాదడపా మ్రోగుతూనే ఉంది.

పక్షులు గూళ్ళను విడచి పెట్టి రెక్కలు ఆడిస్తు బ్రతుకు బాటను వెతుక్కుంటుంటే గూళ్ళలో ఉన్న పసికూనలు కిచకిచలు ప్రకృతిలో కలసిన వేళ అబ్బురంగా అనిపిస్తుంది.

నీరెండ చారలు – నీడల దొబుచులాటల – వింత అందాల్ని పరపంజుతున్నాయి.

జనావాసము… మేలుకొంది.

పశుపక్షాదుల వలే వాళ్ళు దైనందిక కార్యక్రమాల వరవడిని నెమరేసుకుంటూ ఎవని తోవను వాడు ఎగేసుకొని నడక ప్రారంభించారు.

కావురు చిక్కదనం వెలుగు రేఖల వెచ్చదనానికి విచ్చుకుంటున్నది.

ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని ప్రకృతి తన ఒడిలో ఎలా భద్రంగా కాచుకుంటూ వస్తుందో ప్రొద్దుపొడుపు చూస్తే అర్థమవుతుంది.

దీని సృష్టికర్తయైన భగవంతుడు.

ఆయన ప్రేమగా తాకిన ఉడుతా – ఎక్కి స్వారి చేసిన పులీ – పిపీలికమూ- అంతా ఈ ప్రకృతి ఒడిలో సేదదీర్చుకోవల్సిందే.

ప్రకృతి నడకను ఆధారం చేసుకొని దాని ఆలంబనతో మంచిగానో తప్పటడుగులతో నడవాల్సిందే.

మనకున్న ‘అహం’ మనిషే సర్వస్వం అన్న భావన ఎంత పరిమితమైనదో?

ఒక్కసారి మనస్సు పెట్టి పరికించి చూస్తే చాలు తేటతెల్లమవుతది.

పిల్లి పొంచుతూ బయటకొచ్చి మ్యావ్ – మ్యావ్ అంటూ బుడతడి ముందు నుంచి కోళ్ళ గుంపు వైపుగా పరుగెత్తింది. అప్పటి దాకా ఠీవిగా నిర్భయంగా కన్పించి కనపడ్డ పురుగునల్లా పొడుచుకు తింటున్న కోళ్ళు పిల్లి రాకను గమనించి కకావికలై క్-క్-క్-క్ అంటూ చెట్టు కొకటి పుట్టకొకటి అయినయి.

ఆగింది పిల్లి.

పరిసరాల్ని అవగాహన చేసుకుంటూ పొంచి చూసింది. అందుబాటులో ఒక కోడి పెట్ట కనిపంచింది. నోరూరింది దాని చూడగానే.

దూకుదామనుకొంది మాటు నుంచి లేచింది.

ఇంతలో ఎక్కడి నుంచో ఓ కుక్క ఎదురుగా వస్తూ కనిపించింది

ఆగింది పిల్లి.

ఎదురుగా ఉన్న కోడి పెట్ట వదిలేసి కుక్క నుంచి దాని కంట పడకుంటా ఎలా తప్పు కోవాలా? అని వెనక్కి మళ్ళి కాళ్ళకి బుద్ది చెప్పింది.

కుక్కకు అందనంత దూరం …

ప్రకృతి ఒడిలో – సేద దీర్చుకొనే ప్రతి జీవి తమ ఆకలిని తీర్చుకొనేందుకు తమ కంటే బలహీనమైన మరో జీవిని తినాల్సిందే.

ఎంత సింహమయినా… ‘మృగరాజు’ అని బిరుదున్నా… ఎన్ని రోజులు పస్తులుండగలదు.

ఆకలి ముందు సింహమైన, చలి చీమైన ఒక్కటే.

ఆకలి తీరడానికి నిత్యం కొన్ని ప్రాణులు బలి అవుతానే ఉండాలి. ఆకలి తీరకపోతే అసలీ సృష్టే ఎలాగో అవుతుంది.

ఆకలి అవ్వాల్సిందే. దాన్ని తీర్చుకుంటూ బ్రతకాల్సిందే.

ప్రకృతి ఈ జీవరాశికి ఇచ్చిన పర్మిషన్ ఇది.

దీని అర్థం?

నిత్యం చంపుతూ చంపడాలు అనివార్యమని.

అయితే –

ఈ జీవకోటిలో మనస్సు, మేథస్సు ఉన్న మనిషి మంచి చెడులను ధర్మాధర్మాలను జోడించి ‘క్రమం’లో బ్రతికే తీరును తన పరిధిలో ఏర్పాటు చేస్తూ వచ్చాడు.

కాలగమనంలో ఇంకా కొన్ని హంగులను తయారుగా ఉంచుకొని ప్రకృతినే జయించాలని ప్రయత్నించాడు.

‘జయించాను’ అనుకున్న అంశాలు ఉన్నవి.

ఏది ఏమైనా ప్రకృతిని జయించి అదుపు చేసుకొనే ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉంటుంది.

***

“అమ్మయిగారూ! ‘దాయ’ గట్టి లేగనొదిలాను, పాలు తీద్దురుగాని బేగిరండి. ఆలస్యం చేస్తిరో దాని కదిలిక చన్ను గాక రెండవది కూడా చీకెస్తది” అన్న బుడతడి మాట విని…

“చెప్పా చెయ్యకుండా ‘లేగ’ విడవడమేనట్రా” అంటూ పాల చెంబుతోనే బయటకొచ్చింది విజయ కోపంగా.

ఆవు పొదుగు దగ్గర కూర్చుని “నేను మరో పనిలో ఉంటే ఎలా? పాలు కుడిచిపోతది గదా!” అంది.

“దాని అమ్మ పాలేగదా అమ్మాయిగారూ! ‘కుతి’ తీర ఒక్కనాడన్నా తాగుతది, పిచ్చి ముండ” అన్నాడు నవ్వుతూ…

“ఓరి భడవా మీరు తేరగా తినేందుకు ఎక్కడ నుంచి వస్తదిరా! దాని పాలు అది తాగి నా తిండి నువ్వు తిని కూర్చుంటే నడిసేదెట్రా!” అంది పాలు పితుకుతూ.

“అవును అమ్మాయిగారన్నది నిబద్దే. ఒక్కొళ్ళకొళ్ళం సాయం చేసుకుంటుపోతేనే సుఖంగా ఉండేట్టుంది” అనుకొని లేగను నిమురుతూ నిల్చున్నాడు. పాలు పితికి లేచి లోనకెళ్తూ బుడతడి వంక చూసింది విజయ.

వాడు లేగ దూడ వంక చూస్తూ కనిపించాడు.

ఇంతలో సీతమ్మ బయటకొచ్చి బుడతడ్ని చూసింది.

లేగ దూడ తోక మట్ట లేపుకొని ఆవు పొదగును మట్టెతో కుదుపుతూ పాలకోసం చన్నులను గతుకుతుంటే పాల నుఱుగు దాని మూతి నిండా గజిబిజిగా కనిపించింది. ఆనందంగా అనిపించిందా దృశ్యం.

ముచ్చటగా చూసి “ఇదిగో నాలుగు బొక్కినలు నీళ్ళు తోడి కుడితి గాబులో పొయ్యి” అంది.

“ఊ వస్తున్న” అంటూ బలవంతంగా కదిలాడు.

పాలు తాగినంతకాలమే ఈ ఆవులకూ, లేగలకూ మమకారానుబంధం. పాలు వట్టి పోతే చాలు…

అలవాటు చేత లేగ ఎంత ఆశగా పొదుగు చేరినా.. దగ్గరికి చేరనివ్వదు.

‘తన దూడే’ అనే దాన్ని మరచి ఝాడించి తంతాయి.

అంటే ఇంక నా దగ్గర పాలు దొరకవు, ‘మేత’కు అలవాటు పడు. లేకపోతే డొక్కమాడి చస్తావు అని మందలించడం.

‘ఇట్లా ఉండాలిరా నాయనా’ అని మన అమ్మానాన్నలు చెప్పడం లేదూ?

పులి కూడా దాని పిల్లలను పాలు మరువగానే మాటేసి వేటాటమంటుదేమో? అమ్మో వాటి జోలిమనకెందుకు అనుకుంటూ… చేద బావి దగ్గరకు చేరాడు బుడతడు.

బావిలోనికి బొక్కెన వదిలాడు.

“అరేయ్ ముఖం కుడుక్కున్నావా?” అడిగింది సీతమ్మ.

“ఆ! పుల్ల నమిలి పారేసిన, గాబుకు నీళ్ళు నింపి కడుక్కుంటా” అన్నాడు.

“తొందరగా తెములు, ఇంత తిందువుగాని” అంది.

“అట్టనే” అన్నాడు.

నీళ్ళ పని మొఖం పని ముగించి తినే కంచం శుభ్రంగా కడుక్కుని, “వచ్చిన” అని కూర్చోబోతుంటే బయట పిల్లల మాటలు వినిపించినాయి. కంచాన్ని అక్కడ వదిలేసి మొత్త దగ్గరికి ఉరికాడు.

కప్పల్ని పట్టుకొని వెళ్తున్నారు పిల్లలు.

వాళ్ళను కొద్ది సేపు చూసి తిరిగి పరుగున వచ్చి కంచం ముందు కూర్చుని “అమ్మగారు” అని పిలిచాడు.

“వచ్చావా?” అంటూ సీతమ్మ బయటకొచ్చి తొంగిచూసి మళ్ళీలోని వెళ్ళి అన్నం కూర పట్టుకొని వచ్చి బుడతని కంచంలో పెట్టింది.

“అమ్మా” అన్నాడు బుడతడు..

“ఏంట్రా”

“కప్ప నోరు తెరిచి గాలి పీలిస్తే చస్తుందట నిజమేనా?”

“ఊ..”

“ఎందుకు? మనకు జలబు చేస్తే నోటితో గాలి పీల్చుతున్నంగదా! కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది గాని చావంగదా!” అన్నాడు.

“అట్టా కాదు. కప్ప నోరు తెరచి ఉంచితే దానికి ఊపిరి ఆడదు. నోరు మూసుకొని ఉంటేనే దాని శ్వాస ప్రక్రియ సక్రమంగా నడుస్తుంది. అందుకే నోరు తెరచి ఉంచితే కప్ప చస్తుంది” అని, “ఇదిగో తిను. లేని పోని అనుమానాలు నీకెందుకు?” అని కసిరింది.

కూర అన్నం పూర్తయ్యాక మజ్జిగ పోస్తుంటే “అమ్మా” అన్నాడు తిరిగి.

“మళ్ళీ ఏ మొచ్చిందిరా” అంది కోపంగా చూసి.

“దుక్కిటెద్దు ఇరవై ‘దుక్కుల’తో ఎనకపడతది, ఏదో ఒకటి తప్ప అంతకు మించి బ్రతకదు. ఏనుగులు మనిషి కంటే ఎక్కువ కాలం బ్రతుకుతాయని అంటారేంటి?” అనడిగాడు.

“అయితే ఏం చేద్దాం? మనమేమైన తగ్గించగలమా?” అని, “నువ్వు మొదట కంచంలోది తిని గొడ్లను విడువు. నువ్వు కంచం ముందు కూర్చున్నాక ఇలాంటి అనుమానాలు అడిగావా తాట వలుస్తాను. ఆఁ” అంటూ లోనకెళ్ళింది.

‘ఇప్పుడు తప్ప మీరు నా దగ్గరికి రారు గదా’ అన్నాడు అమాయకంగా..

నిజంగా ముచ్చటేసింది చూస్తుంటే. ‘వీడ్ని చదివిస్తే బాగు’ అనిపించింది. వెనక్కి మళ్ళి అన్నం తింటున్న వాని దగ్గరకి వచ్చి “చిన్నోడా నీకు చదువుకోవాలని ఉందట్రా?” అనడిగింది.

తల ఊపాడు.

“అమ్మాయి ఇంకా మూడు నెలలుంటుంది. ఇంట్లో పలక ఉంది. ఇవాళ్ళి నుంచి పని తీరగానే అక్షరాలు నేర్చుకో. అమ్మాయితో నే చెప్తా” అంది.

తల ఊపాడు బుడతడు.

నేర్చుకోవాలని ఉన్న వాళ్ళందరికి అవకాశం ఇవ్వలేని సమాజం ఇది. అందువల్ల చాలా కోల్పోతుంది.

ఎవరెవరి ఆసక్తిని బట్టి… అవకాశం ఉంటే ఎంతగానో ఎదగగలరు గదా! ఎవరు ఎంతటి వాళ్ళవుతారో కూడా చెప్పలేం.

ఈ అవకాశం లోపించబడమంటే ఎంత కష్టమో అంచనా కట్టలేం. కాని… దీన్ని గుర్తించే తీరిక ఉన్న ‘నేత’ లేరి?

“సీతా” అన్న దశరథంగారి పిలుపు.

“వస్తున్నా” అని కదిలింది.

“ఏదో పరధ్యానంలో ఉన్నట్లున్నావు?”

“కాఫీ కలిపి ఇస్తాను. ఒక్క క్షణం” అంది.

“అమ్మడు ఇచ్చింది.”

“మరి…”

“అమ్మాయిని ఇంకా చదివిద్దామంటావా?” అడిగాడు కూర్చుంటూ.

“దాన్నడగండి చదివినా మానుకున్నా అది కదా” అంది నవ్వుతూ.

“దాన్ని అడగకుండా చేసేదేముంది గానీ…”

“కానీ..” అంది దగ్గర కొస్తూ.

“రఘుపతి గారని ఒకాయన ఉన్నాడు. తహశీలుదారుగా చేసి రిటైరయ్యాడు. మన ప్రక్కన ఉన్న నెమలి వారి గ్రామం.”

“నాకెందుకు చెపుతున్నారు?” అంది.

“వినదగు నెవ్వరు చెప్పిన అన్న పద్యం నువ్వు పంతులమ్మవయినా నీకు వచ్చినట్లు లేదు. మొదట నేను చెప్పింది సాంతం వినరాదూ?” అన్నాడు.

తల ఊపింది.

“ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరికి పెళ్ళిళ్లు అయినాయి. వారికి చిన్నవో చితకవో ఉద్యోగాలు ఉన్నాయి. చివరి వాడు బి.కామ్ పాసయ్యాడు. ఈ సంవత్సరం పెళ్ళి చేస్తారట. పిల్లవాడు చూసేందుకు బాగానే ఉన్నాడు. బుద్దిమంతుడని విన్నాను.”

“ఊఁ…”

“అమ్మాయి చదువు ఆపుతానంటే సంబంధం గురించి ప్రయత్నంచవచ్చు. మన దీక్షితులతో మొన్న చెప్పాను – వాళ్ళ పరిస్థితు లేమిటో పూర్తిగా వాకబు చేయమని…”

“మొదట మీ తండ్రి కూతుళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారో తేల్చుకోండి… ఆ నిర్ణయాన్ని బట్టి తరువాత చూడవచ్చు” అంది.

“ఆఁ.. అవును. అలాగే. అమ్మాయిని కదిలిస్తాను. అదే మంచిది” అంటూ బయటకు మళ్ళాడు.

గడపదాటుతూ “అమ్మాయేది” అనడిగాడు.

“స్నానం చేస్తుంది.”

“సరే” అంటూ తోవన పడబతుంటే “నమస్తే మాష్టారు” అంటూ ఓ కుఱ్ఱవాడు ఎదురుగా వచ్చాడు.

ఎవరో గుర్తులోకి రాలేదు.

“నేను సార్ అబ్రహంను. మీ విద్యార్థిని సార్” అన్నాడు.

“ఓ నువ్వా అబ్రహం” అని గుర్తుకు తెచ్చుకొని

“అవును మీ నాన్నగారు ఇప్పుడే చర్చిలో ఉన్నాడు పాలెం నుంచి వెళ్ళిపోయారట గద! అంతా బాగున్నారుగదా” అని అర క్షణం ఆగి “అబ్రహం నువ్వు బోర్డరు సెక్కూరిటి ఫోర్సులో సెలక్టయ్యావని అన్నారు.”

“అవును సార్.”

“అయితే శెలవులపై…?”

తల ఊపాడు.

“రా కూర్చోని మాట్లాడుకుందాం” అంటూ వరండాలో కొచ్చి మంచం వాల్చాడు. దగ్గర కొచ్చాడు గాని కూర్చోలేదు.

“అబ్రహం పర్వాలేదు కూర్చో. మీరు మా అంత అయ్యారు. చిన్న పిల్లలు కాదు కదా. ఇప్పుడు మనం న్యాయంగా స్నేహితులం. పైగా బాద్యతాయితమైన ఉద్యోగంలో ఉన్నావు” అన్నాడు.

మాటను తీసి పుచ్చలేక మంచం చివరన ఇరుకుగా కూర్చున్నాడు.

“మంచిగా కూర్చో. ఎంత దూరం నుంచి వస్తున్నావో? కొంచెం రిలాక్స్ అవు” అని లోనకు చూసి “ఇదిగో ఒక కప్పు కాఫీ కలుపు” అని చెప్పాడు.

“మీరు త్రాగుతారా?” అంది.

సమాధానం చెప్పలేదు దశరథం.

అబ్రహం వైపు మళ్ళి “నువ్వు ప్రస్తుతం…” అడిగాడు

“కశ్మీరు వ్యాలీలోని మూడో రెజిమెంటులో” అని చెప్పి, “విజయగారు ఇప్పుడు ఫైనల్‌కు వచ్చిందా?” అడిగాడు.

“అవును” అని తలాడించి, “శెలవులుగదా ఇక్కడే ఉంది” అన్నాడు.

“అంతా బావున్నారా మాష్టారూ?” అడిగాడు.

“ఆఁ. ఇప్పటికి బాగానే ఉన్నట్లు లెఖ్ఖ” అన్నాడు.

“విజయగారు బాగా చదువుతున్నారు గదా, ఆవిడ కోరుకున్న సబ్జక్టు దొరికిందన్నారు?”

“నీ క్లాసుమేటా?”

“కాదు సార్. రెండు సంవత్సరాలు జూనియర్.”

“అది సరే గానీ నువ్వు ఉండే చోట పరిస్థితులేంటి? ఆఁ అక్కడి వార్తలు సెన్సారయి వస్తాయట! అంటుంటారు. నిజంగా అక్కడ స్థితిగతులు నీకు బాగా తెల్వాలి! మీ సెక్యూరిటీ వాళ్ళు ఎన్నికలు అయింతరువాత కూడా అక్కడ ఉండాల్సి ఉంటుందా?” అడిగాడు.

తల ఊపాడు అబ్రహం.

రెండు నిముషాలు కళ్ళు మూసుకొని ఏదో చేదుకున్నాడు.

అతని ముఖంలో అప్పటి దాకా ఉన్న ప్రశాంతత చెదరినట్లుగా అనిపించింది.

అబ్రహం మంచం నుంచి లేచి నాల్గు అడుగులు వేసి వెనక్కి తిరిగి, “మాస్టారు” అన్నాడు.

“ఆఁ!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here