Site icon Sanchika

అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము]

[dropcap]సూ[/dropcap]ర్యోదయం మొదలు వంటిల్లు ఘుమఘుమలతో ఉంటుంది. మనిషి సదా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. లేవగానే, మనిషి నోట్లో కాఫీ పడాలి, అది లేకపోతే అసలు ఏ పని జరుగదు. ఈ రోజు పాలు ఇంకా రాలేదు. ఏమిటో మత్తుగా ఉన్నది.

***

శ్రావ్యకి రాత్రి సన్మానం అయింది. ఎంతో మంది అభినందిస్తూ పువ్వుల దండలు, విడి పువ్వులు ఇచ్చారు.  పువ్వులన్ని తెచ్చి కుండీలో పెట్టింది. చక్కగా మర్నాటికి కూడా సువాసన వస్తాయి.

జీవితంలో అలసట పువ్వుల వల్ల తగ్గుతుంది. కళ్ళకి పువ్వల చల్లదనం, ఎంతో హాయి కలుగుతాయి. మరింత మత్తులోకి వెడితే, గమ్మత్తుగా ఉంటుంది.

ఆడవారి ఆలోచనలలో, బాధలలో కూడా పూలతో కొంత ఆనందము వస్తుంది.

పిల్లలు విదేశాల్లో, భర్త కెనడాలో సెటిల్. తను ఉద్యోగం చెయ్యలేక లేక ఆర్థిక బాధలు పడలేక సమాజం కోసమే, పెళ్లి తరువాత కూడా జీవితాన్నికబాడీ ఆటలా గడిపింది శ్రావ్య.

ఆయా, వంట మనిషితో ఇంటి పనులు చేయిస్తుంది. పిల్లలు చదువులై ఉద్యోగాలకి వెళ్ళారు. భర్తకి కంపెనీ వారు అన్ని సౌకర్యాలు ఇస్తారు, అందుకే అతనికి అక్కడే బాగుంటుంది.

భార్య భర్త ఒకే చోట ఉండి రోజు దినచర్యలో ఆర్థిక అసంతృప్తితో కొట్టుకుంటూ విమర్శించుకుంటూ ఉండే కన్నా ఏడాదిలో రెండు సార్లు వచ్చి వెడుతూండం మంచిదన్నాడు. మనసులో ఆరాధన, స్వర్గంలో జీవితము ఉత్తమము అన్నాడు శ్రీనివాస మూర్తి.

ఎన్నో బాధ్యతలున్న శ్రీనివాస మూర్తి  పెళ్లి శ్రావ్య పూర్ణిమతో జరిగింది. ఇద్దరికీ ఇంటి బాధ్యతలు ఉన్నాయి. వాటి కోసమే ఈ ఉద్యోగస్థుల పెళ్లి అని చెప్పాలి.

ఉద్యోగ జీవితం గడిచిపోయింది. ఇప్పుడైనా భర్త వెంట విదేశాలు వెళ్ళాలి అనుకుంది శ్రావ్య.

రాత్రి రిటైర్మెంట్ ఫంక్షన్‌లో తనని ఎంతో పొగిడారు. ఈ వేడుక కోసం శ్రీనివాస మూర్తి కెనడా నుంచి వచ్చాడు. పిల్లలు జూమ్‌లో చూశారు.

ఎంత అదృష్టం, అందరూ ఎక్కడెక్కడో ఉన్నా అవిడ గొప్పదనం ఎంతో విలువైనది అని పొగిడారు.

కానీ శ్రావ్య మనసులో అసంతృప్తి.

పెళ్లి తరువాత ఇప్పుడు కూడా ఇద్దరికీ దండలు మార్పించినప్పుడు పెళ్లి నాటి స్మృతులు జ్ఞాపకం వచ్చి ఆనందమయం అయ్యింది.

నేడు భార్యభర్తల అనుబంధం ఆర్థిక బంధంగా మారింది.

ఇలా ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నది శ్రావ్య.

***

సూర్యోదయం సమయానికి మెలకువ వచ్చింది. అప్పటికే ముక్కు పుటాలకి కాఫీ వాసన సోకింది. ఆయా లేచి కాఫీ పెడుతోందా?!

ప్రక్క గదిలో లైట్ వెలుగుతు ఉన్నది. శ్రీనివాస మూర్తి ఏదో వర్క్ చేస్తున్నాడు.

ఎంత మంచివాడు, తనకి ఎటువంటి డిస్ట్రబెన్స్ కలిగించకుండా జీవితాన్ని ఎంతో బాగా గడుపుకుంటున్నాడు.

ఇప్పుడైనా తను అతనికి మంచి గృహిణిగా వెళ్ళాలి అనుకుంది.

ఆ భావనతో తన్మయత్వంలో.. పువ్వును చూసి మురుస్తూ ఉంది శ్రావ్య. పువ్వుల్ని దగ్గర పెట్టుకుని మంచి సువాసన ఆస్వాదిస్తోంది.

‘కులుకక నడవరో కొమ్మలాలా’ అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ఆనందంగా మనసులో పాడుకున్నది.

పువ్వులు ఎంతో విలువైనవి! మనిషికి ఆహ్లాద జీవితానికి ఎంతో అవసరమే కదా. జీవితమంతా చిత్రంగా విభిన్న పరిమళాలు వస్తాయి.

ఆర్థిక పరిమళాలు అన్నిటి కన్నా శక్తివంతమైనవి.

అన్నిటికీ ముఖ్యం డబ్బు కదా.

***

శ్రావ్యలో పొరలు పొరలుగా జ్ఞాపకాలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రావ్య నలుగురు ఆడపిల్లల్లో మధ్య పిల్ల. బాగా చదువుకున్నది. ఆఖరున తమ్ముడు, అందరి కంటే చిన్నవాడు.

బెంగుళూర్‌లో ఉండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ తండ్రికి తోడునీడగా ఉండి కుటుంబం నడిపి అందర్నీ చూసింది శ్రావ్య.

చాలా కాలం పెళ్లి వాయిదా వేసింది. అయినా తల్లి తండ్రి పట్టు పట్టి తమ్ముడి పెళ్లి అవగానే, కోడలి అన్నతోనే చేశారు. అది ఒక అదృష్టమే.

శ్రావ్య చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యత  నెత్తిన వేసుకున్నది. మగపిల్లాడు చిన్నవాడు. అందుకని ఆమె ఇష్టంగా ఇంటి పని చూసేది, చదువుకునేది

ముద్దుల తమ్ముడు సుహాన్ చదువు పూర్తి అయ్యాక జాబ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేశారు, తరువాత వాడు విదేశాల్లో సెటిల్ అయ్యాడు

తల్లి తండ్రి మంచి సంబంధ అని పట్టు పట్టారు. అలా చేస్తే కానీ శ్రావ్య పెళ్లి కాలేదు .

ఎప్పుడు ఆర్థిక బంధాలే కాదు ఆత్మీయ బంధాలు ఉండాలి.

అలా శ్రావ్య పెళ్లి, జీవితం, పిల్లలు అన్ని సక్రమంగా సాగిపోయాయి. ఆమె మంచితనం, తెలివి కూడా కలిసి వచ్చాయి.

ఈ రోజుల్లో ఇంటి బాధ్యత ఎవరూ పుచ్చుకోరు. కానీ శ్రావ్య తన జీతంతో చెల్లెళ్ళ కుటుంబాలను కూడా సరిదిద్దింది.

పెంకి మరుదులు కూడా ఉన్నారు. అందర్నీ తీర్చిదిద్దడం వల్ల వాళ్ళూ బాగుపడ్డారు.

అదంతా ఆర్థిక బంధం అని చెప్పాలి.

పిల్లలు కావాలి అన్నవి కొంటుంది. అక్క పిల్లల్ని చదివించింది. బావకి ఆడపిల్లల చదువులు ఇష్టం ఉండదు. కానీ ఈ రోజుల్లో చదువు వస్తేనే పిల్లల బ్రతుకు బాగుంటుంది అని పట్టుపట్టింది శ్రావ్య.

అవసరం అయితే డబ్బు నేను పెడతాను అనేది. తోబుట్టువుల పిల్లలు కూడా చదువులో రాణించి మెరిట్‌లో పాసై ఉద్యోగాల్లో కాంపస్ట్ సెలక్షన్‌లో చేరారు. అందరికీ ఆనందమే.

సుహాన్ కూడా అక్కకి గౌరవం ఇస్తాడు.

అలా అందరికీ శ్రావ్య చక్కని సలహాలు సూచనలు ఇస్తూ అత్తవారింట, పుట్టినింట గౌరవం పొందింది. దానికి కారణం భర్త సహకారమే. ఆడదానికి భర్త అండ ఉంటే ప్రపంచాన్ని నడిపించే శక్తి వస్తుంది.

***

ఆడపిల్లకి అత్తవారిల్లే స్వర్గం అని నచ్చ చెప్పి తల్లి తండ్రి పెళ్లి చేశారు. బాధ్యతలు మోయడమే కాదు, మనిషి ఆనందంగా ఉండాలి. యాంత్రిక జీవితం కాదు, మంత్రముగ్ధ జీవితం కావాలి.

యంత్రాలు పని చేస్తాయి.

మనుష్యులు ఆలోచించి చేసినవే కదా అవి.

మానవ ప్రజ్ఞ.

అదే జీవితం కాదు

మనకి అదొక భాగము.

అమృతవర్షిణి రాగంలో ‘అన్ని మంత్రములు ఇందే ఆవహించెను’ అని శ్రీ అన్నమయ్య ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన సారం అదే కదా.

మనసులో అమృతతత్వాన్ని పెంచుకుని అత్త మామలో తల్లి తండ్రిని చూడాలి, వారంతా మన వాళ్ళు అనుకోవాలి అంటూ ఎన్నో హితవులు చెప్పారు.

“నేటి పరిస్థితిలో అబ్బాయి పెళ్ళే కష్టంగా ఉన్నది, నువ్వు తమ్ముడికి మంచి సంబంధం చేసావు కదా; ఆ పిల్ల అన్నగారు ఉన్నాడు. అతను నిన్ను ఇష్ట పడుతున్నాడు కనుక వప్పుకో” అంటు శ్రావ్య పెళ్లి చేశారు అమ్మానాన్నలు.

అయితే బాధ్యతలు బంధాలు పెళ్లి తరువాత బాగా పెరిగాయి.

అతనికి తల్లి తండ్రి తమ్ముళ్ళ బాధ్యత ఉంది.

అందుకే ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు.

అందర్నీ శ్రావ్య ఇండియాలో బాగానే చూసింది. ఆ సంతృప్తి చాలు.

లాంగ్ లీవ్ పెట్టి పిల్లల్ని పెంచింది. పిల్లల ఆనందం కోసం, పిల్లల కోసం లాలి పాటలు నేర్చుకున్నది.

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అంటూ; జో అచ్యుతానంద జో జో ముకుందా, లాలి  పరమానంద రామ గోవిందా జో  జో అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు చక్కగా నేర్చుకున్నది. అలా పాడుతూ పిల్లల్ని పెంచడంలో నిజమైన ఆనందం పొందింది శ్రావ్య.

***

ఆయా కాఫీ తెచ్చివ్వడంతో, జ్ఞాపకాల్లోంచి బయటపడింది శ్రావ్య.

స్త్రీ జీవితంలో మంచి భర్త పిల్లలు లభించడం అద్భుత, అపూర్వ అవకాశం అంటారు పెద్దలు. భావితరంలో కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలి ఇది చాలా కీలకమని అంటారు.

నిజానికి శ్రావ్య రిటైర్మెంట్‌కి ఇంకా ఒక ఏడాది ఉంది. కానీ భర్తతో ఉండడం మంచిదని ముందే రిటైర్మెంట్ తీసుకుని వెళ్లడానికి రెడీ అయ్యింది.

అత్తమామలని మరిది చూస్తూ ఉంటాను అన్నాడు. తల్లి తండ్రి కూడా సరే వెళ్లి రమ్మన్నారు. వాళ్ళని చిన్న కూతురు చూస్తానన్నది.

ఈ రోజుల్లో పెద్ద వాళ్ళు బాధ్యతగా మారారు. మంచి పిల్లలు అయితే చూస్తున్నారు.

కొందరు గ్రూప్ హౌజ్ లో ఉంటున్నారు.

మానవులకి జీవిత కాలమంతా ఎవరో ఒకరు తోడు కావాలి. అందుకే కుటుంబ బంధాలు కీలకం అని నేటి తరం గమనించాలి.

డబ్బే కాదు ఆప్యాయత ఆదరణ ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు ఉండాలి. రక్తసంబంధాలే పరిమళాలు వెదజల్లే జీవిత పుష్పాలు. ఇలా అన్నీ కలిసొస్తే ఆనందమే అని చెప్పాలి.

అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే అనిపించినా, కేవలం ఆర్థిక సంబంధాలే కాదు, హార్ధిక సంబంధాలు కూడా చాలా ముఖ్యం అని నేటి యువత తెలుసుకోవాలి. వారిలో మార్పు రావాలి అనుకుంది శ్రావ్య.

ఇదే జీవితము.

‘నానాటి బ్రతుకు నాటకము’ అనే శ్రీ అన్నమయ్య కీర్తన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గళంలో శ్రావ్యంగా వినిపిస్తోంది ఆమె గదిలో.

శాంతి శుభము

Exit mobile version