Site icon Sanchika

అనుబంధాలు

[dropcap]ఆ[/dropcap]టో ఆగింది. శాంతమ్మ, గోపాల్ దిగారు. ఆటో వాడికి డబ్బులిచ్చి తాళం చెవి జేబులోంచి తీసి తలుపు తీయడానికి వెళ్ళాడు గోపాలం. నెలనెలా భర్త పెన్షన్ డుబ్బలు తీసుకెళ్ళడానికి వస్తుంది శాంతమ్మ పక్కనే ఒక పాతికముప్పైం కిలోమీటర్లు దూరమున్న పల్లెటూరు నుండి. ఆ రోజు పెన్షను ఆఫీసుకు తీసుకెళ్ళి రావడం గోపాలం డ్యూటీ. “ఈ రోజు ఉండి రేపొద్దున బస్సుకు వెళ్ళచ్చులే అమ్మా” అన్నాడు ఆప్యాయంగా శాంతమ్మని.

“లేదు నాన్నా ఉమకి ఒంట్లో బాలేదు, నాకోసం ఎదురు చూస్తుంటుంది అంది” శాంతమ్మ.

శాంతమ్మకి ఇద్దరు పిల్లలు, కొడుకు గోపాలం, కుతూరు ఉమ. భర్త వుండగా స్వగ్రామంలోనే ఒక మోతుబరి రైతుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. వాళ్ళతో పాటు వీళ్ళకున్న నాలుగెకరాల పొలం కూడా వ్యవసాయం అల్లుడితోనే వ్యవసాయం చేయిస్తూ పల్లెటూళ్ళోనే పాత పెంకుటింట్లో వుంటోంది శాంతమ్మ. నాలుగిళ్ళ అవతల వున్న కూతుర్ని అలుడ్ని, మనమణి చూసుకుంటూ భర్త పెన్షన్ డబ్బులు తీస్కోడానికి మాత్రం నెలకొకసారి పట్నంలో కొడుకు దగ్గరకి ఒక రోజు వస్తుంది. వ్యవసాయంలో ఎక్కువ నష్టాలు కనబడ్డంతో పెన్షన్ డబ్బులు కోసం శాంతమ్మ ఆత్రంగా ఎదురు చూస్తుంటుంది. “ఉండను” అనేసరికి గోపాలం చిన్నబుచ్చుకున్నాడు. మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని టీ చేసి తల్లికి అందించాడు. పట్నంలో చిరుద్యోగం చేస్తున్నాడు గోపాలం, భార్య రమ, ఒక కొడుకు, ఖర్చులకు తను తెచ్చే జీతం చాలక, కొడుకు చదివే స్కూలులోనే రమ కూడా టీచరుగా చేరింది. టీ తాగాక మళ్ళీ తలుపు తాళం బెడుతుండగా కోడలు, మనవడు స్కూలు నుంచి వచ్చారు. ఇద్దరూ వాడిపోయి వున్నారు. రమ ఎంతగానో అలసిపోయింది. అత్తగార్ని చూసి సన్నగా నవ్వింది. కుశలప్రశ్నలయ్యాక గోపాలం శాంతమ్మ బస్టాండుకు బయలుదేరారు. బస్టాండులో షాపుకెళ్ళి మనవడికి బిస్కెట్టు, చాక్లెట్లు తీసుకొని సంచిలో పెట్టుకుంది శాంతమ్మ.

గోపాలం మనస్సు చివుక్కుమంది. టికెట్టు తీసుకొని శాంతమ్మని బస్సెక్కించి ఇంటికి తిరిగి వచ్చాడు.

బాబుని పడుకోబెట్టి గాలి విసురుతోంది రమ. “ఏమైంది రమా?” ప్రశ్నించాడు.

“బాబుకు జ్వరమొచ్చిందండీ” రమ గోంతులో బేలతనం. “ఫ్యాను వేసుకోవచ్చుగా” అన్నాడు గోపాలం. “బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేశారండి” అంది రమ. మతిపోయినంత పనైంది గోపాలానికి, నెమ్మదిగా సంభాళించుకొని, “సరే బాబుని ముఖం కడిగి తీస్కురా డాక్టరు దగ్గరికి తీస్కెళ్ళొస్తా” అని లేచాడు.

***

గంటన్నర ప్రయాణం చేశాక పల్లె చేరింది శాంతమ్మ. నెమ్మదిగా సంచి తీస్కుని రిక్షా మాట్లాడుకుని ఇంటికి చేరింది. కాస్తంత కాఫీ కలుపుకుని తాగి మంచం మీద నడుం వాల్చింది శాంతమ్మ. ఇంతలో మనవడు, కూతురు ఉమ వచ్చారు. “అమ్మా వెళ్ళోచ్చావా?” మంచం మీద కూర్చుంటూ అడిగింది ఉమ.

“ఇప్పుడే వచ్చానమ్మా” అంది శాంతమ్మ. సంచిలో కొన్న బిస్కెట్లు, చాక్లెట్లు మనవడి కిద్దామని ఉత్సాహంగా లేచింది శాంతమ్మ. వంటింట్లోకి వెళ్ళి ఉమకి కూడా కాఫీ కలిపి ఇచ్చింది. “ఇదిగో అమ్మా కూరలు తెచ్చాను” అంటూ బుట్ట అక్కడ పెట్టింది ఉమ. సంబరంగా చూసింది శాంతమ్మ. “ఉండమ్మా నీకిష్టమైన గుత్తొంకాయ కూర చేసిస్తాను, మళ్ళీ ఇంటికెళ్ళి ఏం వండుకుంటావు?” అంటూ వంటింట్లోకి నడిచింది శాంతమ్మ. ఉమ టీ.వీ చూస్తూ కూచుంది.

కూర బాక్సులో సర్ది కూతురు చేతికిచ్చింది శాంతమ్మ. “ఎల్లుండి మేము ముగ్గురం ఉత్తర భారతదేశ యాత్రకు వెలుతున్నావమ్మా” అంది సంబరంగా ఉమ. “ఎలా?” కుతూహలంగా అడిగింది శాంతమ్మ. “ఈ ఊర్నించి బస్సు వేశారమ్మా. ఆయన ఫ్రెండ్స్ అంతా బయల్దేరుతున్నార్ట. మనమూ వెళ్తామన్నారు ఆయన” అంది ఉమ. “అలాగే వెళ్ళిరండమ్మా. వ్యవసాయం పన్లేమన్నా ఉంటే నేను చూసుకుంటాలే” అంది శాంతమ్మ.

“నువ్వుండగా మాకేంటి అమ్మా” అంది ఉమ ఆప్యాయంగా.

తెల్లవారగానే హడావుడిగా పనులు మొదలు పెట్టింది శాంతమ్మ. యాత్రలకు వెళ్ళే కూతురు, అల్లుడు, మనవడి కోసం చక్రాలు, చెక్కలు, కట్టివేయలు చేసి మూడు డబ్బాల్లో పోసి ప్యాక్ చేయించింది. అంతా అయ్యేసరికి సాయంత్రమయ్యింది. అప్పుడు గుర్తొచ్చింది శాంతమ్మకి తను అన్నం కూడా తినలేదని కాసిన్ని బియ్యం వుడకేసి మంచం మీదకి చేరింది శాంతమ్మ. ఒళ్ళంతా హూనమైనట్టుగా వుంది. కళ్ళు మూతలు పడిపోయినయి. అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. శాంతమ్మకి, తలంతా తిరిగి పోయిన్నట్లుంది. ఒళ్ళు తూలి పోతోంది, జ్వరం కాలిపోతోంది. నోటమాట రాలేని స్థితి అలాగే పడుంది మంచం మీద. తెల్లారింది. పక్కింటి కుర్రాడితో ఉమకు కబురు చేసింది రమ్మని. కాసేపయ్యాక వచ్చింది. “అయ్యో అమ్మా ఇవన్నీ ఎవరు చెయ్యమన్నారు చూడు ఇప్పుడు ఎలా?” అంటూ మొత్తుకుంది ఉమ.

“ఉండు ఆచారిగారిని పిలుస్తాను” అంటూ వెళ్ళి గంట తరువాత వెంట బెట్టుకు వచ్చింది. ఆచారి నాడిని పరీక్షించి మందులు వేశాడు. “పడుకోమ్మా, ఇప్పుడే వస్తా” అంటూ వెళ్ళింది ఉమ. శాంతమ్మకి నీరసం కమ్మేస్తోంది. దాహంతో నాలుక పిడచగట్టుకు పోతోంది. అలాగే పడుంది. సాయంత్రానికి ఉమ, మనవడు వచ్చారు. అమ్మా ఆచారి గారి మందులు పనిచేసాయా అడిగింది ఉమ. లేదన్నట్లు తలతిప్పింది శాంతమ్మ. “తగ్గుతుందిలే అమ్మా నెమ్మదిగా. నువ్వు ఖంగారు పడకు” అని ఏదో చెప్తోంది ఉమ. కళ్ళు మూతలు పడిపోతున్నయి శాంతమ్మకి. బలవంతంగా లేపింది ఉమ. “అమ్మా ఈ డబ్బాలు తీస్కెళ్తున్నాను, రేపు ప్రొద్దున్నే బస్సు బయలు దేరుతుందట, ఆచారిగారిని రెండు పుటలా వచ్చి చూడమన్నాను. ధైర్యంగా వుండు, వారంలో వచ్చేస్తాం, పదరా” అంటూ కొడుకుతో వెళ్ళింది ఉమ. మాట్లాడ లేకపోయింది శాంతమ్మ. నెమ్మదిగా మంచం మీద నుండి లేచింది అంతే భళ్లున వాంతి అయింది. నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళి ఒళ్ళు శుభ్రం చేస్కొని, వేరే చీరకట్టుకుని గదిలోకి వచ్చింది. ఏం చెయ్యాలి అని ఆలోచించింది. “జ్వరం తగ్గిందా వదినా?” అంటూ తలుపు తీసుకొచ్చింది పక్కింటి పార్వతమ్మ వస్తూనే తలమీద చెయ్యివేసింది. “అమ్మో వదినా కాలిపోతోంది… ఏదైనా పట్నం డాక్టరుకు చూపిద్దామా, జ్వరం తగ్గట్లేదు ఆచారి మందులకి” అంది. శాంతమ్మ మాట్లాడలేదు. “ఉండు ఉమని పిల్చుకొస్తా” అంటూ లేచింది వారించింది శాంతమ్మ ఉమ ఊరెళ్ళిన విషయం చెప్పింది. అయితే నీ కొడుక్కి ఫోన్ చేసి చెప్తా అని సెల్‌ఫోన్ తీసింది శాంతమ్మ నెంబరు ఇచ్చింది. గోపాలం ఫోన్ వెంటనే తీశాడు. పార్వతమ్మ విషయం చెప్పింది. శాంతమ్మ నిద్రలోకి జారిపోయింది.

విషయం విన్న గోపాలం కూచుండిపోయాడు. ఇంతలో రమ స్కూలు నుండి వచ్చింది. భర్త మొహాన్ని చూసి ఏంటండీ ఏం జరిగింది అంది ఆదుర్దాగా. “అమ్మకి ఒళ్ళు తెలీని జ్వరమంట, పట్నం తీస్కెళ్ళి చూపించండని పార్వతత్త ఇప్పుడే ఫోన్ చేసింది అన్నాడు గోపాలం. రమ ఒక్కసారిగా లేచింది. “అయితే ఇంకేంటి వెళ్ళి అత్తయ్యగార్ని తీస్కురండి ఏమిటి ఆలోచిస్తున్నారు” అన్నది. “ముందు మీరు బయల్దేరండి” అంటూ వెయ్యిరూపాయలు పర్సులో నుండి తీసిచ్చింది. “ఎక్కడివి?” అన్నాడు గోపాలం.

“ప్రైవేటు చెప్పుతున్నాను ఒక అమ్మాయికి. వాళ్ళు ఇవ్వాళే అడ్వాన్సు ఇచ్చారు, తీస్కెళ్ళండి పదండి పదండి” అంటూ తోసింది. “అత్తయ్యగార్ని కార్లో తీసుకురండి” అని చెప్పింది. పల్లె చేరేప్పటికి గంటపైనే పట్టింది గోపాలానికి. లోపలికి వెళ్ళాడు గోపాలం, “అయ్యో అమ్మా ఏమైంది పదపద ఇంటికెళ్దాం” అంటూ తొందర పెట్టాడు. ఇంట్లో వున్న పాలు, పెరుగు అన్నీ పార్వతమ్మకి ఇచ్చి తలుపులు అన్నీ వేసేసి శాంతమ్మ బట్టలు కొన్ని సంచీలో సర్ది, నెమ్మదిగా నడిపించి కార్లో ఎక్కించాడు శాంతమ్మని. ఇంటికి చేరేసరికి చీకటి పడిపోయింది. రమ వాకిట్లోనే ఎదురు చూస్తోంది. పరుగుపరుగున వచ్చి అత్తగార్ని లోపలికి తీస్కెళ్ళింది. అప్పటికి సర్ది వుంచిన మంచం మీద పడుకోబెట్టింది. “అయ్యో ఒళ్ళు కాలిపోతోంది అండీ ఆటో తీసుకు రండి. హాస్పిటల్‌కు తీస్కేళ్దాం” అంది.

గోపాలం వెళ్ళి ఆటో తెచ్చాడు. ముగ్గురు 20 నిమిషాల్లో హాస్పిటల్‌కు చేరుకున్నారు. డాక్టరు పరీక్షించి అడ్మిట్ చెయ్యామన్నాడు.

గోపాలం మొహం పాలిపోయింది. “జ్వరానికే ఎందుకు డాక్టరు గారు?” నసిగాడు.

“ముందు టెస్టు చెయ్యాలి దాన్ని బట్టి మందులు వాడాలి పేషంటు చాలా వీక్ గా వుంది” అన్నాడు డాక్టరు.

“అలాగే డాక్టరుగారు” అంటూ రమ వెళ్ళింది రిసెప్షన్ దగ్గరికి డబ్బు కట్టేసి రూమ్‌లో జాయిన్ చేసింది శాంతమ్మని. శాంతమ్మ గోపాలం మొహమొహాలు చూసుకున్నారు. ఏం మాట్లాడలేదు. నర్సు వచ్చి సెలైన్ పెట్టి ఇంజక్షన్ ఇచ్చి టెస్ట్‌కి బ్లడ్ తీస్కెళింది.

“నేను ఇంటికెళ్ళి వంట చేసి భోజనం చేసేసి ఇక్కడికి మీకు బాక్స్ తెచ్చేస్తాను. కాసేపు కూర్చోని బాబు నేను వెళ్తాం” అని బయటకు వెళ్ళిపోయింది రమ.

గోపాలానికి రమ అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చిందో అర్ధం కాలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. శాంతమ్మ మంచి నిద్రలో ఉండడంతో తనుకూడా కుర్చీలోనే కళ్ళు మూస్కొని కునుకులోకి వెళ్ళిపోయాడు గోపాలం. తొమ్మిది గంటలకి బాక్స్ తీసుకొని రమ వచ్చింది. ఒక అరగంట కూచున్నారు రమ, బాబు. ఇంతలో శాంతమ్మ బ్లడ్ రిపోర్ట్ వచ్చాయి. శాంతమ్మకి టైఫాయిడ్ అని తేలింది. “పర్వాలేదు 4 రోజుల్లో తగ్గిపోతుంది” ధైర్యం చెప్పాడు డాక్టరు. “ఈ పూటే మెడిసిన్ స్టార్టు చేసేస్తా, ఒక 4, 5 రోజులకి ప్రిపేరవ్వండి” అన్నాడు డాక్టరు. “అలాగే నండి” అంది రమ. “నేను బాబు ఇంటికి వెళ్తామండి” అంది రమ. తలూపాడు గోపాలం.

హాస్పటల్ వైద్యం పుణ్యమని శాంతమ్మ వారంలోపే కోలుకుంది. జ్వరం నార్మల్ కి వచ్చేసింది. కాకపోతే “చాలా వీక్‌గా వున్నారు. బలానికి టానిక్కులు వాడాలి” అంటూ మందులు రాసిచ్చారు డాక్టరుగారు. దానితో బాటు బిల్లు కాగితం చేతిలో పెట్టారు, రిసెప్షన్లో కట్టేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. రమ తీసుకుంది కాయితాలు. డాక్టరుగార్ని అనుసరిచింది.

“ఇప్పుడెలా ఉందమ్మా” అని గోపాలం అడిగాడు శాంతమ్మని, “చాలా తెరపిగా ఉంది నాయినా” కన్నీరొలికించింది శాంతమ్మ కన్నుల నుండి.

“ఊర్కోమ్మా” అనునయించాడు గోపాలం. పావుగంటయ్యాక రమ కారు తీసుకువచ్చింది. ముగ్గురూ ఇంటికి చేరారు. ఇల్లంతా ఎంతో పొందికగా నీటుగా సర్దుకుంది రమ. చాలా రిలీఫ్ గా ఫీలయ్యింది శాంతమ్మ.

చకచకా వంటచేసి, కాస్త చారన్నం కలిపి శాంతమ్మ దగ్గరికి తీస్కువచ్చింది రమ. ఎంతో రుచిగా ఉన్న చారన్నం తృప్తిగా తిన్నది శాంతమ్మ. “అత్తయ్యగారు ఈ మందులు వేసుకోండి” అంటూ మందులు, మంచినీళ్ళు అందించింది రమ. “అత్తయ్యగారు ఇక పడుకోండి” అంటూ లైటార్పి, తలుపు దగ్గరకేసి వెళ్ళింది రమ. శాంతమ్మ పడుకుంది కాని, రమ గోపాలం కూడా భోజనానికి కూర్చున్నారు.

“రమా అమ్మ వైద్యానికి డబ్బు ఎలా సర్దుబాటు చేశావు” అన్నాడు గోపాలం.

“ఏం నేను చెయ్యకూడదా” అంది రమ.

“చెయ్యకూడదని కాదు, ఎలా వచ్చిందిఅని అడుగుతున్నాను.”

కొద్ది క్షణాలు మౌనంగా ఉండి, “నా చేతి గాజులు అమ్మేశాను” అంది రమ. “కొంత డబ్బు మా ప్రిన్సిపాల్ గారి దగ్గర రిక్వెస్టు చేసి ఎక్స్ ట్రా క్లాసులు తీసుకుంటానని తెచ్చాను. మిగిలిన కొంచెం డబ్బు అలమారలో వుంది. 3 నెలలు పాటు రెండు గంటలు ఎక్కు పని చెయ్యాలి అంతే కదా. దీనికింత టెన్షన్ అవుతారెందుకు? రేపు మీకు మంచి ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో నాకు గాజులు చేయించుదురుగానీ సరేనా” అంది రమ నవ్వుతూ.

గోపాలానికి నవ్వు రాలేదు. “ఏంటి ఏం మాట్లాడరు, అత్తయ్యగారికి మనంకాక ఇంకెవరు చేస్తారు. అన్ని సార్లు ఫీల్ అవ్వకండి” అంది రమ.

గోపాలం తలదించుకున్నాడు. గదిలోకి స్పష్టంగా వినబడింది. నిద్రపట్టని శాంతమ్మకి ఇదంతా. పది నిమిషాలు అలాగే వుండి ఏదో నిశ్చయించుకున్న దానిలా తెరిపిగా నిద్ర పోవడానికి ఉపక్రమించింది.

మరో నాలుగు రోజులు గడిచాయి. శాంతమ్మలో కొంత ఉత్సాహం వచ్చింది. ఇంతలో పస్ట్ తారీఖు రానే వచ్చింది. “అమ్మా పెన్షన్ తీసుకోవాలిగా ఆఫీసుకు రాగలవా” అడిగాడు గోపాలం. “వెళ్దాం నాయనా రేపు పొద్దున” శాంతమ్మ జవాబిచ్చింది. జీతం తీసుకొని రమ కూడా సంతోషంగా ఇంటికి చేరింది. బుట్ట నిండా పళ్లూ, కూరలు తెచ్చింది రమ. మర్నాడు ఉదయం పెన్షన్ తీసుకొని ఇంటికి వచ్చారు శాంతమ్మ,

గోపాలం. అమ్మ వెళ్ళిపోతుందేమో ఇంక అనుకున్నాడు గోపాలం సాయంత్రమయ్యింది. లేచి హాల్లోకి వచ్చింది శాంతమ్మ. కొడుకుతో కలిసి టీవి చూస్తున్నాడు గోపాలం. “రమా” పిల్చింది శాంతమ్మ. ఏంటత్తయ్యగారు అంటూ వచ్చింది. పెన్షన్ డబ్బూ, మరికొంత డబ్బున్న కవరు రమ చేతిలో పెట్టింది శాంతమ్మ.

“ఏంటిది అత్తయ్య” రమ అంది.

“ఈ నెల ఇంటి ఖర్చులకి వాడమ్మా…. ఏముంది అందులో, ఈ నెలే కాదు ఇక ప్రతి నెలా, ఈ డబ్బు మనందరిదీ ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు” అంది చిన్నగా. “గోపాలం, పల్లెలో మన ఇల్లు పార్వతమ్మ కలుపుకుంటానంటోంది ఎప్పణించో, రేపు వెళ్ళి ఇల్లు దానికిచ్చేసి డబ్బు పట్టుకురా. నా కోడలికి నగలు కొనాలి. సాయంత్రం వంట నేను చేస్తానులే రమ, పొద్దస్తమానం నువ్వెక్కడ చాకిరీ చేస్తావు” అని వంటింట్లోకి వెళ్ళింది శాంతమ్మ.

రమ కళ్ళల్లో ఆనందబాష్పాలు. గోపాలానికి కూడా మనసులో ఏదో బరువు దిగినట్లైంది.

“అత్తయ్యా మీరెంత మంచివారు” అంది రమ.

“నీకన్నానా?” అంది శాంతమ్మ.

Exit mobile version