అనుభవాలు – జ్ఞాపకాలు

4
2

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి ‘అనుభవాలు – జ్ఞాపకాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కప్పుడు ఊరిలో అన్నీ పూరిళ్ళే ఉండేవి. పెంకుటిల్లు అక్కడక్కడ ఉండేవి. సిమెంట్‌తో కట్టిన బిల్డింగులు దాదాపుగా ఉండేవి కాదు. ఇంటిలో నేలలు, రోడ్లు అన్నీ మట్టివే ఉండేవి. ఎంత పెద్ద వర్షం వచ్చినా కొద్దిసేపటిలోనే నీళ్ళన్నీ నేలలో ఇంకిపోయేవి. అందువల్ల భూగర్భ జలాలు పెరిగి బోరు వేసినప్పుడు ఐదారు అడుగుల లోతులోనే నీళ్ళు అందేవి. ప్రతి ఇంట్లోనూ చెట్లు ఉండేవి. దూరంనుంచీ చూస్తే చెట్ల మధ్య ఊరు ఒదిగిపోయినట్లు కనిపించేది.

ప్రతి ఇంటిముందూ దుమ్ము లేవకుండా కళ్ళాపి జల్లి, ముగ్గులు పెట్టేవారు. ఆ ముగ్గు కూడా బియ్యం పిండితో చేసినది. ముగ్గులు ఇంటికి అందం ఇవ్వటమే కాకుండా పిండితో వేయటం వల్ల చీమలు లాంటి జీవులకు ఆహారంగా ఉపయోగపడేది. ఇంటి చుట్టూ మందార, చేమంతి, బంతి, కనకాంబరం, నందివర్ధనం వంటి పూలమొక్కలు, కొబ్బరి, మామిడి, జామ, వేప వంటి చెట్లు పెంచేవారు. అవి పూలు, పండ్లు ఇవ్వటమే కాకుండా వేసవికాలం ఎండ తగలకుండా నీడని, చల్లటిగాలిని ఇచ్చేవి.

నా చిన్నప్పుడు మా ఇంటిపెరటిలో బాదంచెట్టు మీద చిలకలు వాలుతూ ఉండేవి. పచ్చటిఆకుల మీద, అవి కూడా పచ్చగా లేత ఆకులే గాలికి కదులుతూ ఉన్నాయా అన్నట్లు ఎగురుతూ ఉండేవి. చెట్టుతొర్రలో గుడ్లుపెట్టేవి. నేను ప్రతిరోజు చెట్టు ఎక్కిచూసి “నాలుగు గుడ్లు ఉన్నాయి. ఒక గుడ్డు పిల్ల అయింది. పిల్లలకు ఎర్రటిరెక్కలు వస్తున్నాయి. ఒక పిల్ల ఎగిరిపోయింది” అంటూ మా అమ్మ దగ్గర రిపోర్ట్ వినిపించేవాడిని. మా స్నేహితుల బ్యాచ్‌లో పదిమంది ఉండేవారు. అందరం కలసి ఆడుకునేవాళ్ళం. చెట్లమీద ఉడత కూర్చుంటే వెనకనుంచీ నిశ్శబ్దంగా వచ్చి “ఉష్” అని జడిపించేవాడిని. అది ఉలిక్కిపడి ఒక్క పరుగుదీసి, కొంతదూరం వెళ్లి తోకఎత్తి వెనుదిరిగి చూసేది. మా ఇంటిచూరుకి వడ్లకంకి వేలాడగట్టేవారు. ఆ గింజల కోసం పిచ్చుకలు వచ్చేవి. కొబ్బరిచెట్ల మీద కొంగలు గుంపులు గుంపులుగా వాలేవి.

పక్కింటామె “పిల్లలూ! పెరడంతా కొంగలు రెట్టలు వేస్తున్నాయి. డబ్బాలు వాయించండర్రా! మీకు మినప సున్నిఉండలు పెడతాను” అనేది. మేం స్నేహితులం అంతా పోలోమంటూ వెళ్లి డాం… డాం అని డబ్బాలు వాయించేవాళ్ళం. కొంగలన్నీ ఒక్కసారిగా రివ్వున ఎగిరేవి. అవి వరసగా వెళుతుంటే ముత్యాలగొలుసు ఆకాశంలో వేలాడుతున్నట్లు ఉండేది. ఎటు వెళ్ళేవో పది నిమిషాలకే మళ్ళీ వచ్చి వాలేవి. మా స్నేహితులు అమ్మాయిలు, అబ్బాయిలు అందరం దాగుడుమూతలు, వంగుళ్ళు దూకుళ్ళు, కోతి కొమ్మచ్చి మొదలైన ఆటలు ఆడేవాళ్ళం. వెన్నెల్లో గుండ్రంగా కుర్చుని కథలు చెప్పుకునే వాళ్ళం. బడిలో ఉన్నంత వరకే చదువు. ఇంటికి వచ్చిన తర్వాత హోం వర్కులు ఉండేవి కాదు. ఇప్పటి పిల్లలకు బండెడు హోంవర్కులు, పరీక్షల టెన్షన్‌లు. బాల్యంలోని అనుభూతులే లేవు. ప్రకృతి పరిశీలన అంటే తెలియదు.

నేను ఆరవ తరగతి చదివేటప్పుడు మా స్నేహితుల బ్యాచ్‌లో వసుధ ఆటలకు రావటం మానేసింది. వరుసగా నాలుగురోజులు రాకపోయేసరికి వాళ్ళ ఇంటికివెళ్లి “వసూ ఆడుకోవటానికి రావటం లేదే!” అని అడిగాను. “ఊరు వెళ్ళింది” అని చెప్పింది వాళ్ళ అక్క. ఆ రోజు సాయంత్రం బడినుంచీ వస్తుంటే వసుధ, వాళ్ళ ఇంట్లో పంపు దగ్గర కనబడింది. ఇంటికివెళ్ళిన తర్వాత మా అమ్మతో “వసూ ఇంట్లోనే ఉందమ్మా! వాళ్ళక్క అబద్దం చెప్పింది” అన్నాను. “ఆ అమ్మాయి ఓణీ వేసుకుందిలే!” అన్నది మా అమ్మ. “ఓణీ వేసుకుంటే ఏం? బట్టలు రోజూ వేసుకుంటూనే ఉంటాంగా!” అన్నాను. “అదంతేలే! నువ్వెళ్ళి మగపిల్లలతో ఆడుకో!” అన్నది. వసుధ రానురాను మాట్లాడటం కూడా తగ్గించేసింది. అప్పటినుంచీ నాకు ఆడ మగ తేడాలు లీలగా అర్ధం అయ్యేది.

అట్లతద్ది పండగకి శివాలయం పక్కన వేపచెట్టుకి ఉయ్యాల వేసేవాళ్ళు. ఆడపిల్లలు అందరూ గుంపులు గుంపులుగా ఉయ్యాలలూగే వాళ్ళు. కొత్త పరికిణీ ఓణీలు వేసుకుని ఉయ్యాల ఊగుతుంటే పొడవాటి జడతో పాటు జడలో కనకాంబరం మాలలు కూడా గాలిలో ఊగేవి. ఆ ముచ్చటలు చూడటానికి మగవాళ్ళు పొలాల నుంచీ పెందలాడే ఇంటికి వచ్చేవారు. నాకు కూడా అలా ఉయ్యాల ఊగాలని ఉత్సాహంగా ఉండేది. అమ్మతో చెబితే “ఆడపిల్లలు ఆడే ఆటలు మగపిల్లలు ఆడకూడదు. అందరూ నవ్వుతారు” అన్నది. అంటే మగవాడిగా పుట్టినందుకు జన్మలో ఉయ్యాల ఎక్కకూడదా! ఆ అనుభూతి తెలుసుకోవాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందేనా! అప్పుడు కూడా మగవాడిగానే పుడితే ఎలా! అనుకునేవాడిని. ఆ ఆలోచనలు గందరగోళంగా అనిపించేది. ఇవన్నీ మా అన్నయ్యతో చెప్పాను. మా అన్నయ్య నాకన్నా మూడేళ్ళు పెద్ద. పక్కన ఉన్న టౌన్‌లో తొమ్మిదవ తరగతి చదువుతూ ఉన్నాడు. అదివిని “ఓస్! ఇంతేనా! నేను స్కూల్ నుంచీ వచ్చే దారిలో పిల్లల పార్క్ ఉన్నది. అక్కడ ఉయ్యాల ఆడాళ్ళు, మగాళ్ళు అందరూ ఎక్కుతారు. ఎవరూ ఏమీ అనరు. రేపు ఆదివారం నిన్ను అక్కడికి తీసుకువెళతాను” అన్నాడు. నేను సంతోషంగా అన్నయ్యను కౌగలించుకున్నాను.

ఆదివారం సాయంత్రం అన్నయ్య నన్ను పిల్లల పార్కుకి తీసుకువెళ్ళాడు. అక్కడ చీకటిపడేదాకా మనసుదీరా ఉయ్యాలలూగాను. ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది. నేను నిద్రలో తూలిపోతున్నాను. ఆన్నయ్య నన్ను భుజంచుట్టూ చేతులు వేసి పొదివిపట్టుకుని పొలం గట్టున నడిపిస్తూ “నిద్రపోకు. అదిగో! ఆ తాటిచెట్లు దాటి నాలుగు అడుగులు వేస్తే మన ఊరు వస్తుంది. మనూరి లైట్లు కనబడుతున్నాయి. చూడు” అని బుజ్జగిస్తూ నడిపించేవాడు. అప్పట్లో ఎంతదూరం అయినా పొలం గట్లమీదే నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పటిలాగ ఆటోలు ఉండేవికాదు. ఇప్పటి పిల్లలకి “అన్నయ్యా! తమ్ముడూ!” అనే పిలుపులే లేవు. పేర్లు పెట్టి పిలుచుకుంటారు. పైగా “మేము అన్నదమ్ములలాగా ఉండము. ఫ్రెండ్స్ లాగ ఉంటాము. తండ్రీ కొడుకులలాగ ఉండము. ఫ్రెండ్స్ లాగా ఉంటాము” అంటూ ఉంటారు. అదేదో గొప్ప విషయం అయినట్లు! తండ్రీ కొడుకులు ఫ్రెండ్స్ లాగా ఉండటం ఏమిటి? బస్‌లో తోటి ప్రయాణీకురాలిని పెళ్ళాం లాగా చూసుకుంటే ఊరుకుంటుందా!.. తండ్రి తండ్రే! కొడుకు కొడుకే! అన్నమీద అనురాగం ఉండాలి. తమ్ముడి మీద అభిమానం ఉండాలి. తండ్రి మీద గౌరవం ఉండాలి. అందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటే అనుబంధాలు ఎలా తెలుస్తాయి?

నాకు పందొమ్మిదేళ్ళు. బి.యస్.సి. రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నాను. ఆడామగా తేడాలు బాగా అర్థం అయ్యాయి. మేం ఫ్రెండ్స్ అందరం కాలేజీ వరండాలలో పని ఉన్నా లేకపోయినా లేడీస్ వెయిటింగ్ రూమ్ వైపు పదిసార్లు అటూ ఇటూ తిరిగేవాళ్ళం వాళ్ళ దృష్టిలో పడాలని. అమ్మాయిలు కబుర్లు చెప్పుకునే వాళ్ళల్లా వరండాల్లో మా అడుగులు చప్పుడువిని టక్కున తలలు తిప్పి చూసేవాళ్ళు. అది గమనించినా గమనించనట్లు క్రాఫ్ సరిచేసుకుంటూ, వెన్ను నిటారుగా పెట్టి ఇంకా ఠీవీగా నడిచేవాళ్ళం. ఎప్పుడైనా అమ్మాయిలు అబ్బాయిలకి ఎదురుపడినప్పుడు తడబడిపోయి, కళ్ళు వాల్చుకుని పైట సర్దుకునేవారు. ఇవన్నీ చిత్రంగా పులకింతలు కలిగించేవి నాకు. మాట్లాడుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. అమ్మాయిలు కాలేజీ అవగానే దీపాలు పెట్టకముందే ఇంటికి వచ్చేయమని పెద్దవాళ్ళు చెప్పేవారు. మగవాళ్ళకి దూరంగా ఉండమని అనేవారు. మమ్మల్ని కూడా ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే “ఆడపిల్లలతో నీకు కబుర్లేమిట్రా!” అంటూ చివాట్లు పెట్టేవారు. అటువంటి కట్టుబాట్ల మధ్య పెరిగాము.

ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మధ్య అటువంటి కట్టుబాట్ల సరిహద్దులు చెరిగిపోయాయి. అబ్బాయి బైక్ నడుపుతుంటే వెనక అమ్మాయి అతని వీపు హత్తుకుని కుర్చుని వెళ్ళటం చాలాసార్లు చూశాను. అంత సన్నిహితంగా ఉంటే ఇరవై, ఇరవై రెండేళ్ళ వాడు నిగ్రహించుకోగలడా! తర్వాత మోసం చేశాడు అని గగ్గోలు పెట్టటం దేనికి? నీ హద్దుల్లో నువ్వు ఉంటే వాడు మోసం చేయగలడా! సెల్ ఫోన్‌లో “నీకు లాటరీలో కోటి రూపాయలు వచ్చాయి. ఈ కింద లింక్ క్లిక్ చెయ్యి” అని మెసేజ్ వస్తుంది. అది క్లిక్ చేస్తే కోటి రూపాయలు రావటం కాదు, నీ ఎకౌంట్‌లో డబ్బు మాయమైపోతుంది. నువ్వు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే వాడు నిన్ను మోసం చేయగలడా? కాబట్టి నీ సహకారం లేకుండా ఎవరూ నిన్ను మోసం చేయలేరు అనేది కాదనలేని నిజం! అందరూ ఋష్యశృంగుడిలా, హరిశ్చంద్రుడిలా ఉండటానికి ఇది త్రేతాయుగం కాదు.

చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. మనసులో ఏదో ఖాళీ, ఒంటరితనం. ఏదో కావాలనిపిస్తుంది. పుస్తకాలు, కథలు చదవటానికి మనసు మళ్ళించుకున్నా అది తాత్కాలికమే! పుస్తకం మూయగానే మళ్ళీ ఆ వెలితి వెక్కిరిస్తున్నట్లు కనబడేది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు. కథల్లో, సినిమాల్లో చూపించినట్లు ప్రేమించుకోవటాలు నేను ఎరగను. పెళ్ళయిన తర్వాతే ప్రేమ. భార్య అంటే స్త్రీ అనుభవం సర్వం తెలియజేసిన ప్రణయమూర్తి అని అర్థం అయింది. ఇప్పటివరకు మనసులో ఉన్న ఖాళీ భర్తీ అయినట్లు, పూర్తి మనిషిని అయిన భావన కలిగింది. పురుషుడికి తను పొందాలనుకున్న అనుభవాలు భార్య దగ్గరే పొందాలి. అలాగే స్త్రీ కూడా తన అనుభూతులు భర్త దగ్గరే పొందాలి. అప్పుడే ఆ వివాహబంధం బలపడుతుంది. వివాహానికి ముందే అన్ని అనుభూతులు అయిపోతే పెళ్లిలో ఉన్న ఆనందం తెలియదు. పైగా ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయటం వల్ల ఈగోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నన్ను ఇంతమాట అంటావా! అంటూ వివాహబంధాన్ని పుటుక్కున తెంచేసుకుంటున్నారు.

మనుషులందరికీ ఆవేశం, కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. అది సహజం! భర్త ఆవేశపడినప్పుడు భార్య తగ్గాలి. భార్య ఆవేశపడినప్పుడు భర్త తగ్గిఉండాలి. ఇద్దరూ సంయమనం పాటిస్తేనే ఆ బంధం నిలుస్తుంది. ‘నా ఇష్టం’ అంటూ ఈగోలకు పోకూడదు. మనం సంఘంలో నివసించేటప్పుడు వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యత తగ్గించుకుని, అందరికీ ఆమోదయోగ్యం అయ్యేటట్లు నడుచుకోవాలి. బ్రోకెన్ హోం నుంచీ వచ్చిన పిల్లలకు సంఘం పట్ల గౌరవం ఉండదు.

కొత్తగా తండ్రిని అయినప్పుడు అదొక వింత అనుభవం. బాబుని చూస్తుంటే ‘నా స్వంతం.. నా రక్తం’ అని గర్వంగా ఉండేది. వాడు నెలల వయసులో పారాడేటప్పుడు కొద్దికొద్దిగా ఉహ తెలుస్తూ ఉండేది. నేను డ్యూటీకి టైం అయిందని హడావిడిగా వెళుతుంటే నా ప్యాంట్ పట్టుకుని వెళ్లనీయకుండా పెద్దగా ఏడిచేవాడు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని “టైం అయింది నాన్నా! సాయంత్రం వస్తాను” అని దించేవాడిని. అర్థం అయినట్లు ఊరుకునేవాడు. తప్పటడుగులు వేస్తూ కుర్చీలు పట్టుకుని, బల్లలు పట్టుకుని నడకలు నేర్చేవాడు. ఏమీ పట్టుకోకుండా స్వంతంగా నిలబడినప్పుడు చూడమన్నట్లు పెద్దగా చప్పట్లు కొట్టేవాడు. వాడిని చూస్తుంటే నాకు క్షణం క్షణం ఆనందవీక్షణం అన్నట్లు ఉండేది.

నేను ఈలోకంలోకి వచ్చి అయిదున్నర దశాబ్దాలు అయింది. ఈలోగా ఎన్నో మార్పులు. నాతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు మాయమయ్యారు. అమ్మా, నాన్న, బాబాయ్, పిన్ని.. వంటి పిలుపులు అన్నీ పోయాయి. కొత్త మనుషులు పుట్టుకొచ్చారు. పిల్లలు పెద్దయి చదువుల కోసం, ఉద్యోగాల కోసం కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయారు. ఏదీ ఆపలేము! ఏదీ మన చేతుల్లో లేదు! జీవితం పట్ల నిర్వికార భావన వచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు –

“ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తే షూ పజాయతే।
సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోదోభి జాయతే॥

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః।
స్మృతిభ్రంశా ద్బుర్దినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి॥”

(“విషయ వాంఛలను గురించి సదా మననము చేయువానికి దాని యందు అనురాగము అధికమై అది కామముగా మారును. కామము చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితంగా మనుజుడు బుద్ధిని కోల్పోయి, చివరకు అధోగతి చెందును”) అన్నాడు భగవంతుడు.

పిల్లలు ఉద్యోగరీత్యానో, పెళ్లయిన తర్వాతో దూరంగా వెళ్లిపోతారు. ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచిస్తుంటే చివరకు వాళ్ళు తన దగ్గరే ఉండాలనే కోరిక కలుగుతుంది. కోరిక తీరితే సంతోషం, తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకోలేక ‘కనీ, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే లెక్కచేయవా!’ అనే ఉక్రోషం కలుగుతుంది. కొడుకు తన భార్య పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడనుకోండి. దాంతో క్రోధం వస్తుంది. దానిలో నుంచీ అసూయ కలుగుతుంది. ఈ దశలో యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం మర్చిపోయి అనరాని మాటలు అనటం, చేయరాని పనులు చేయటం జరగుతుంది. చివరికి బుద్ధి కోల్పోయి, అందరినీ ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ, అందరికీ శత్రువు కావాల్సివస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఆలోచనలు తగ్గించుకోవాలి. వయసు పెరిగే కొద్దీ బంధాలకు దూరంగా, భగవంతుడికి దగ్గరగా జరుగుతూ ఉండాలి. అలా ఉండగలిగితే ఏ విషయాన్నైనా ఉదాసీనంగా తీసుకోగలిగిన స్థితి వచ్చి, మనశ్శాంతిగా గడుపగలుగుతాము.

భగవద్గీత అనగానే సామాన్యులకు విషాదయోగం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఘంటసాల గానం చేసిన భగవద్గీత వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి భగవద్గీత బ్రతకటానికి ధైర్యం ఇస్తుంది. మనుషులను అర్థం చేసుకునే వివేకం కలిగిస్తుంది. సుఖాలకు పొంగిపోని, దుఃఖాలకు కుంగిపోని స్థితప్రజ్ఞత అలవడేటట్లు చేస్తుంది భగవద్గీత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here