[dropcap]చి[/dropcap]న్నప్పుడు చినుకుల్లో
చిలిపిగా తడవటం
చెప్పలేని సరదా…
చిటపట శబ్దాలు వింటుంటే
చెవులకింపుగా వుండేది
టప టప మంటూ అడుగేస్తుంటే
నీళ్ళ నాట్యం హుషారెక్కించేది…
ఒకటో తరగతిలో వుండగా
ఇంటిగంట కొట్టినప్పుడు
వాన పడుతున్నా ఆగకుండా
తలపై పలక పెట్టుకొని వచ్చేవాడ్ని…
తుంపర కురుస్తున్నప్పుడు
అరచేతుల్ని ఆడించేవాళ్ళం
పూలజల్లు పడుతుంటే
కావాలని తడిసేవాళ్ళం…
వానొస్తుంటే పిల్లలందరం
చెట్టాపట్టాలేసుకు చిందేసేవాళ్ళం
నోరు తెరిచి నేరుగా
నీటి చుక్కల్ని నోట పట్టేవాళ్ళం…
పారే నీటిలో కాగితం పడవలు
జారిపోతూ వుంటే
వాటి వెంటే నడిచేవాడ్ని…
ఇప్పుడు కూడా
వాన పడుతుంటే బాల్యం లోకి
వెళ్ళి వస్తుంటా
కిటికీ తెరిచి చూస్తూ
అనుభూతుల్లో తడుస్తూ
నాలో నేనే తుళ్ళుతుంటా…
వర్షం తీసే రాగాలకు
నేలతల్లి పులకలు చూస్తుంటా
మేఘం చేసే రావాలకు
ప్రకృతితో పాటు ప్రతిస్పందిస్తుంటా…
వానధారలు పుడమిని ముద్దాడి
కనరాని తీరాలకు చేరుతాయంటా
తుప్పరగా పడుతున్న తప్పకుండా
ఎప్పటి సంగతులనో చెప్పేయునంటా…
తడిలేని నేలపై వాన కురిస్తే
వచ్చే మట్టి వాసన ఇష్టంగా పీలుస్తా
చుక్కల్ని చిలకరిస్తూ పలకరించే
వర్షాన్ని హర్షంతో ప్రియనేస్తంగా పిలుస్తా…