పఠనాసక్తులను పెంచే సమీక్షలు-పీఠికలు

0
3

[box type=’note’ fontsize=’16’] ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం ప్రథమ సంపుటం అనుభూతి అన్వేషణ (సమీక్షలు-పీఠికలు)కు -కె.పి. అశోక్ కుమార్ రాసిన పీఠిక. [/box]

[dropcap]వె[/dropcap]లుదండ నిత్యానందరావు నిరంతర చదువరి. నిత్య పరిశోధనాశీలి. పరిశోధన విద్యార్థిగా, విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా, పండిత విమర్శకుడిగా, విస్తృత రచయితగా వారిని సన్నిహితంగా గమనించిన వారిలో నేను ఒకడిని. కూచిమంచి జగ్గకవి రాసిన “చంద్రరేఖా విలాపం” అనే బూతు (అధిక్షేప) కావ్యం మీద యం.ఫిల్ చేయడం అప్పట్లో (1986) పెద్ద సంచలనం. “తెలుగు సాహిత్యంలో పేరడీ” పేరిట పిహెచ్.డి చేయడం కూడా మామూలు విషయం కాదు. ఎవరూ ఊహించలేనంత సమాచారాన్ని కుప్పలు పోసి ఆశ్చర్యపరిచారు “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” పేరిట రూపొందించిన ఆకరగ్రంథం వెలుదండ వారి కృషికి ఉదాహరణగా నిలిచిపోతుంది. ఎప్పటికప్పుడు దానిని నవీకరించి మూడుసార్లు పరివర్ధిత ముద్రణలుగా తీసుకురావడంలో వారు చూపిన కృషి, పట్టుదల ప్రశంసనీయం. సంస్థలు చేయవలసిన పనిని ఒక వ్యక్తి చేయడం సాహసమే కదా! ఎవరికీ తెలియని విషయాల వైపు దృష్టి సారించడం వారి ప్రత్యేకత. నలిగిన విషయమైతే ఎవరికి తెలియని కొత్త కోణాలను వెలికితీయకుండా ఊరుకోరు. నూతనత్వాన్ని, వైవిధ్యాన్ని అభిలషించే నిత్యానందరావు విమర్శలు, పరిశోధనలు, పుస్తకసమీక్షలు, ముందుమాటలతో తన విమర్శారంగాన్ని విస్తృతం చేసుకున్నారు. ఆసంఖ్యాకమైన వారి రచనలనుండి సమీక్షలు/పీఠికల తో ప్రస్తుత సంపుటాన్ని వెలువరించడం సంతోషకరమైన విషయం.

ఒక పుస్తకంలోని విషయం, శైలి, ప్రత్యేకతల విశ్లేషణయే సమీక్షగా పరిగణింపబడుతుంది. సాహిత్య పత్రికలలో సమీక్షకులు ఆయా పుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేయడమే కాకుండా ఆ రచనలపై తమ అభిప్రాయాలు- ఆలోచనలను కూడా పాఠకులతో పంచుకుంటారు. కొన్ని సందర్భాలలో పుస్తక సమీక్షలు ఇతివృత్త సారాంశానికే పరిమితమవుతాయి. ముఖ్యంగా సమీక్ష పుస్తకం యొక్క ఉద్దేశాన్ని, విషయాన్ని గురించిన సాధికారతలపై దృష్టిని సారించాలి. పుస్తక సారాంశం, భౌతిక వర్ణనలు పుస్తక సమీక్షలో ఒక భాగమే తప్ప, అదే సమీక్షగా కాకూడదు. ఆ పుస్తకంలోని బలమైన అంశాలను, బలహీన అంశాలను విశ్లేషించగలగాలి. ఆ పుస్తకం ద్వారా రచయిత చెప్పదలచుకున్నదానిలో విజయం సాధించాడా లేదా సోదాహరణంగా విశ్లేషించగలగాలి. ఇలాంటి లక్షణాలు కలిగిన సమీక్షకులలో వెలుదండ నిత్యానందరావు ప్రముఖంగా కనిపిస్తారు.

సమీక్షలు చేయడానికి పత్రికలు ఆయా రంగాల్లో ప్రఖ్యాతులైన వారిని విషయ నిపుణులుగా ఎంపిక చేసుకుంటారు. విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా నిత్యానందరావును గుర్తించడం వల్ల ఎక్కువగా పరిశోధన గ్రంథాలను, విమర్శగ్రంథాలను పంపించారు. ప్రాచీన సాహిత్యాన్ని విశ్లేషించేవారు అరుదైన సందర్భంగా ఆ పుస్తకాలను కూడా వీరికే పంపించడం తరుచుగా జరుగుతుండేది. ఇవి కాకుండా ఇతరేతర గ్రంథాలను పంపించినా, వాటిని సమీక్షించడంలో నిత్యానందరావు సమతూకాన్ని పాటించాడనే చెప్పాలి. అందువల్లనే కాబోలు నిత్యానందరావు చేసిన 147 సమీక్షల్లో  పరిశోధన గ్రంథాలు, విమర్శలు, వ్యాసాలు దాదాపు 91 దాక ఉన్నాయి.

 “వార్త” దిన పత్రికలో కేటాయించిన స్థలపరిమితులకు లోబడి చేసిన క్లుప్తసమీక్షలు ఓ పది దాక ఉన్నాయి. అవి రికార్డ్ కోసమే తప్ప దీనిలో చేర్చకపోయినా నష్టం లేదు. ఒకవచనరామాయణాన్ని క్లుప్తంగా సమీక్షిస్తూనే నిత్యానందరావు తెలుగులో వచ్చిన వచనరామాయణాలను పేర్కొన్నారు. ఈపట్టిక ఆధారంతో ఏకంగా ఒక పి.హెచ్.డీయే చేయవచ్చు. కొలకలూరి ఇనాక్ వెలువరించిన శ్రీరంగరాజచరిత్ర ను సమీక్షిస్తూ భారతీయభాషల్లో ద్వితీయనవలలకే తప్ప తొలి నవలలకు పేరు రాలేదని సోదాహరణంగా వివరించారు. “కాలక్రమం రీత్యా శ్రీరంగరాజచరిత్ర తొలినవల. గుణాతిశయంచేత, ప్రభావప్రసరణంచేత, వ్యక్తిమహత్వంచేత కందుకూరి రాజశేఖరచరిత్ర ప్రశస్త అద్వితీయనవల. 1872లో ప్రథమముద్రణ వచ్చాక 138 ఏళ్ళ తర్వాత ఇన్నాళ్ళకు మలిముద్రణ రావడమే శ్రీరంగరాజచరిత్రకు పాఠకుల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో, దాని ప్రభావమేమిటో తెలుస్తుంది” అని యుక్తియుక్తంగా రాయడం గమనార్హం.

విషయ ప్రాధాన్యత గలిగిన పరిశోధన గ్రంథాలకు స్థల పరిమితి విధించక పోతే, వివరంగా సమీక్షలు వ్రాసే అవకాశముంటుంది. విశ్వవిద్యాలయం నుండి వెలువడే సిద్ధాంత గ్రంథాల పరిమితులు ప్రయోజనాల గురించి సరియైన అవగాహన వుండటం వల్ల, నిత్యానందరావు వాటిని విమర్శనాత్మకంగానే కాకుండా వివరణాత్మకంగా తెలియజేశారు. కొత్త విషయం మీద వెలువడిన సిద్ధాంత గ్రంథాలను, వాటి గొప్పదనాన్ని వివరంగా తెలియజేయాలన్న ఉత్సుకతతో ఆ సమీక్షలు వుంటాయి. ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్యస్రవంతి    (డా. వై. రామకృష్ణారావు), అడవిబాపిరాజు నవలా సాహిత్యానుశీలనం (డా. మన్నవ సత్యనారాయణ), ఆధునికాంధ్ర గేయ కవిత్వం  (డా. జి. చెన్నకేశవరెడ్డి) కథానిక స్వరూప స్వభావాలు, (డా. పోరంకి దక్షిణామూర్తి) ఇందుకు నిదర్శనం.

వివరణాత్మకంగా చేసిన సమీక్షల్లో ఆయా గ్రంథాల గొప్పదనాన్ని తెలుపడంతో పాటు అక్కడక్కడ సందర్భోచితంగా కొన్ని సలహాలు- సూచనలు ఇవ్వడం కూడా బాగుంది. ఇవి సమీక్షకుడి అధ్యయనాన్ని, సునిశిత దృష్టిని తెలియజేస్తాయి. ఉదాహరణకు డా. కె. కుసుమాబాయి “మడికి సింగన కవి” సిద్ధాంతగ్రంథాన్ని ప్రశంసిస్తూనే “కుమారసంభవ పద్యాలను సింగన సకలనీతిసమ్మతంలో ఉదాహరించడం వల్ల ఇది మానవల్లి రామకృష్ణకవి కూటసృష్టి కాదని తేలుచున్నది” అని ఒక వాక్యం రాస్తే ఇంకా బాగుండేది- అంటారు. అలాగే డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి సిద్ధాంత గ్రంథం భాగవత వివేచనలో వాత్సల్యభక్తి గురించి వివరిస్తు “అట్లాగే వైర భక్తిని ప్రస్తావించడం సముచితం” అని సూచిస్తారు.

విషయప్రాధాన్యాన్ని బట్టి అంశాల వారిగా విశ్లేషించి వివరించడం కూడా కొన్ని సమీక్షల్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు తులనాత్మక విశ్లేషణ వీటిల్లో వుంటుంది. సమీక్షకుడు తన అభిప్రాయలను తెలియజేయడమే కాకుండా నూతన ప్రతిపాదనలు చేయడం కూడా గమనించవచ్చు. ఉదాహరణకు సుమతీ నరేంద్ర గారి “తిక్కన చేసిన మార్పులు- ఔచిత్యపు తీర్పులు”ను అధ్యాయాల వారిగా విశ్లేషిస్తు ఒక విమర్శకుడి వ్యాఖ్యను తీసుకొని భారతంలోని తెలుగు సంస్కృత పాత్రల గురించి వివరించడం ఆకట్టుకొంటుంది

డా. కె. మలయవాసిని “ఆంధ్ర జానపద సాహిత్యం- రామాయణం” ను విశ్లేషిస్తూ “రామాయణాన్ని విషవృక్షంగా తలపోసి కలవరపడినవారంతా వాల్మీకి కంటే విజ్ఞానవంతు లనిపించుకున్నారేమో కాని, రామాయణ వైశిష్ట్యాన్ని, జనుల మనసుల్లో దానికున్న స్థానాన్ని తగ్గించలేక పోయారు”……. మలయవాసినిగారి గ్రంథం గతించిన భావాల సంకీర్తనం కాదు. వర్తమానజీవితానికి హృదయంగమమైన వ్యాఖ్యానం (పుట.30) అని ముక్తాయింపు నివ్వ డం ఎంతో సముచితంగా ఉంది.

భీంపల్లి శ్రీకాంత్ సంకలనం చేసిన “పాలమూరు కవిత” సమీక్షిస్తూ సంకలనాల తయారీలో ఎదుర్కొనే సమస్యల గురించి వివరించారు. “కవితాసంకలనం తేవడమంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ప్రచురణకు డబ్బులు సమకూర్చుకోవడం కన్నా ఆయాకవుల చిరునామాలు పట్టుకొని, వేదించి, వేదించి కవితలను రాబట్టుకోవడమే కష్టం. సంకలనం వెలువడిన పిదప వారివి లేవు. వారివి లేవు అని వంకలు పెట్టడం, స్థాయి సరిపోలే దని పెదవి విరవడం లాంటివి ఉంటాయి. ఇవన్నీ అనుభవించినవాడికి తెలుస్తాయి. ఇటువంటి అనుభవాలను పొందడానికి సిద్ధపడిన ఈ సంకలనకర్త భీంపల్లి శ్రీకాంత్ అభినందనీయు”డంటారు (పుట.177). ఇవి ఎప్పటికి గుర్తుంచుకోవలసిన విషయాలు. ఈ సమస్యల నెదుర్కొంటూనే, ఓపిగ్గా భరిస్తూనే చేయకుండా ఉండలేని ఒకానొక మనస్తత్వం కారణంగా చేస్తుంటారు. “నేను కూడ మహబూబ్ నగర్ జిల్లా వాడినే. తొలినాళ్ళల్లో నా కవితలు పత్రికల్లో వచ్చాయి. ఈ సంకలనకర్త నన్ను కూడా అడిగాడు. కానీ జీవహింస మహాపాపం అని నేను కవితా వ్యాసంగాన్ని వదిలేశాను. చాలామందికి ఆ వివేకం కలగడం లేదు” (పుట. 179) అని అలవోకగా అన్నట్లుగా కనిపిస్తూనే గడుసుతనం చూపిస్తారు నిత్యానందరావు.

పుస్తకం యొక్క గుణదోష చర్చ చేస్తూ నొప్పించకుండా నిర్మొహమాటంగా చెప్పదలుచుకొన్నది చెప్పడం నిత్యానందరావు నైజం. ఉదాహరణకు “ నన్నయ్య భారతి” రెండు సంపుటాలను సమీక్షిస్తూ ఆ వ్యాసాల్లో కనిపించే పాండిత్య అహంకార ప్రదర్శనను గుర్తించి నిరసిస్తారు. దొరకని సాహిత్యం పట్ల, తత్కర్తల పట్ల చూపే ఔదార్యం లభ్య రచనల పట్ల చూపడం లేదన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అలాగే సంకలనకర్తల లోటుపాట్లను, అచ్చుతప్పుల గురించి వివరిస్తారు. మూడవ సంపుటం రానున్నదని సంకలనకర్తలు ప్రకటిస్తే దానిలో ఏఏ వ్యాసాలు ఉండాలో సూచించడం చాల బాగుంది. “ఆదికవి మీద ఆరు సంపుటాలు అందంగా వస్తే నష్టమేమిటి?” అనే ముగింపు వాక్యం మనల్ని ఆలోచింప చేస్తున్నది. శిష్ల్టా శ్రీనివాస్ “కపిద్ధాకార భూగోళా” గ్రంథానికి ప్రేరణ గురజాడ చేసిన ప్రస్తావన అని పేర్కొన్నారు. కాని ఆ పదం పూర్వకవులరచనల్లో ఎక్కడెక్కడ దొరికే అవకాశం ఉందో చూపించడం పాఠకులను అబ్బురపరుస్తుంది. ఇదే రచయిత రాసిన రాజమహేంద్ర క్షేత్ర పటాలను సమీక్షస్తూ దశావతారాల్లో బలరాముడు పేర్కొనబడి, కృష్ణుడు లేకపోవడం విశేషమని గుర్తిస్తారు. విచిత్రమైన పురుషామృగ ప్రస్తావన, చర్చ అసక్తికరంగా చేశారు. రెండువందల ఏళ్ళ కిందటి భాషకు ఇప్పటి భాషకు వచ్చిన మార్పుల గురించి కూడా చర్చించారు. 1951 లో వ్రాయబడిన “సంస్కృత సాహిత్య విమర్శ” అనువాదం 2011 లో రావడం వల్ల దానికి రావలసిన కీర్తి ప్రతిష్ఠలు రాకుండా పోయాయి. ఒక పని సకాలంలో చేయకపోతే కలిగే నష్టమేమిటో రచయితలు తెలుసుకోవాలని హెచ్చరిస్తారు.” తెలుగులో మారుపేరు రచయితలు” ను సమీక్షస్తూ మారుపేర్లతో ఏర్పడే అయోమయాన్ని చర్చిస్తూ, వారి అసలు పేర్లను బయటపెట్టడం వారి ప్రైవసీకి భంగం అని వాదిస్తారు. “విప్లవం నుంచి వేదం దాకా” డా. దాశరథి రంగాచార్య సాహిత్య జీవిత ప్రస్థానం ను సమీక్షిస్తూ విప్లవవాదిగా, మార్క్సిస్టుగా వుంటూనే వేదవాదిగా, సంప్రదాయకునిగా రెండు భిన్నమైన పాత్రల్లో ఏకకాలంలో దర్శనమివ్వడాన్ని ప్రశ్నిస్తూ చేసిన చర్చ మనల్ని ఆలోచింపవేస్తుంది. “తెలంగాణా రాయారావులు- సామాజిక సాంస్కృతిక వంశ చరిత్ర” ను సమీక్షిస్తూ, చివరలో రచయిత అన్ని వివరాలు ఇచ్చారు. గోత్రాన్ని ఈ సమీక్షకునికి వదిలి వేశారని చమత్కరిస్తూ ఆ గోత్రం, దాని ప్రవర తాలూకు విషయాలను వివరంగా తెలియజేయడం బాగా నచ్చింది.

కడియాల జగన్నాథశర్మ మహాభారతంపై రాసిన గ్రంథంలో కౌరవులు ఆర్యులనీ, పాండవులు అనార్యులనీ, బహుభర్తృత్వం వారి సాధారణాచారమని వ్యాఖ్యానించడాన్ని నిత్యానందరావు అతార్కికమని ఖండించారు. శంతనుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు ఆర్యులైనపుడు పాండవులు మాత్రం ఆర్యేతరులెలా అవుతారు? బహుభర్తృత్వం సాధారణ వంశాచారమైతే కౌరవులు నూరు మందికీ ఒకే భార్య ఉండాలి. కనీసం ఉపపాండవులందరికీ ఒకేభార్య ఉండాలిగదా అని నిత్యానందరావు ప్రశ్నిస్తారు. “ఈ ఆచారం పాండవులది కాకపోతే వ్యాసుడు వచ్చి ఏవో కథలు చెప్పి దాన్ని ఎందుకు సమర్థిస్తాడు” –అని ఒక విచిత్రమైన వాక్యం జగన్నాథశర్మ ప్రమేయం లేకుండానే వచ్చిపడింది. ఆ వాక్యమే మనకు జవాబు చెప్తుంది. బహుభర్తృత్వం పాండవుల సాధారణ వంశాచారం కాదు కనుకే వ్యాసుడు ప్రత్యేకంగా వచ్చి సమర్థించి సముదాయించవలసి వచ్చింది. (పుట.295)

“శ్రీనాథ కవితా వైజయంతి”ని సమీక్షిస్తూ, శ్రీనాథుడు సీసములు చెడగొట్టినాడను వాదము- దాని ఖండనలు ప్రముఖుల వాదనలలోని అనౌచిత్యాన్ని వెల్లడించారు. ఇందులో పెదపాటి నాగేశ్వరరావు వ్యాసం మూడుపేజీలే వున్నా, ఒక పిహెచ్.డికి మార్గనిర్దేశం చేస్తుందని తెలియజేశారు. శ్రీనాథుని సాహితీవైదుష్యాలను పరిశీలిస్తూ ఒక పది సిద్ధాంతగ్రంథాలు, ఏబై విమర్శనాత్మక గ్రంథాలు ఇప్పటికే వచ్చినా ఇంకా సమగ్ర శ్రీనాథమూర్తి ఆవిష్కరింప బడలేదనే సత్యాన్ని తెలియజేయడం విశేషం.

డా. వి. సిమ్మన్న “దర్శిని” లో సాహిత్యంలో ప్రసక్తిగా వచ్చిన చిత్రలేఖనాన్ని గురించి ఓ వ్యాసం వ్రాశారు. అందులో ఆయన పేర్కొన్న రెండు పద్యాలను కథల వర్ణనా చాతురికి దృష్టాంతాలే తప్ప చిత్ర లేఖన సంబంధాంశాలు కావని స్పష్టపరిచారు. ఈ పుస్తకంలో ఉండటానికి అనర్హమైన వ్యాసం సాహిత్యంలో స్త్రీ. ఇందులో పరస్పర విరుద్ధ వాక్యాలు, స్వవచో వ్యాఘాతాలు ఈ వ్యాసంలో ఎన్నో వున్నాయని తెలియజేశారు. ఈనాటి భావాలతో ప్రాచీన కావ్యాలను పరిశీలించడం, వాటిల్లో అవి ఇవి లేవని దెప్పడం ఈనాడు ఒక ఫ్యాషనై పోయిందని నిరసిస్తారు.

అలాగే సి. నారాయణరెడ్డి ఆరని జ్వాల కవితాసంపుటిని పూర్తిగా విమర్శించడం సాహసమేనని చెప్పాలి. ఇందులో కవిత్వాంశ కన్నా వాచ్యత, ఉపన్యాసధోరణి ఎక్కువయ్యాయని నిర్మొహమాటంగా చెబుతారు.

తెలంగాణ కవులు రచయితల మీద రాసిన చిన్న వ్యాసాలు, సమీక్షలతో ద్వానాశాస్త్రి “తెలంగాణ సాహిత్య రత్నాల వీణ” పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకానికున్న పరిమితులు- అవకతవకలను నిత్యానందరావు తన సమీక్షలో చర్చించారు. ఎప్పుడో రాసిన సమీక్షలు, వ్యాసాలను సరిచూసుకోకుండా వేయడం వల్ల ఆ తప్పులు, పొరపాట్లు కూడా ఇందులో యథాతథంగా చోటుచేసుకున్నాయని చెబుతారు.

కత్తి పద్మారావు “తెలుగు సాహిత్య చరిత్ర, భాష, సామాజికత, కులాధిపత్యం” పుస్తకంపై నిత్యానందరావు చేసిన సమీక్షా వ్యాసం గొప్ప విమర్శావ్యాసంగా నిలిచిపోతుంది. ఇది ఏకాంశ నిష్ఠమైన గ్రంథంలా కాకుండా, వ్యాససంకలనంలా తయారయింది. దీనిని తెలుగు సాహిత్య చరిత్ర అని నామకరణం చేయడం అతివ్యాప్తి దోషం. కులాధిపత్యం అనో మరోటో పెట్టెసి బ్రాకెట్లో వ్యాస సంకలనం అని రాసి ఉంటే సరిపోయేది. “నడుస్తున్న చరిత్ర” పత్రికలో పరంపరంగా రాసిన వ్యాసాలన్నింటిని ఇందులో చేర్చారు. ఆ విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యాససంపుటం కావడం వల్ల పునరుక్తులు, అ ప్రయోజనకరమైన అలవోక వ్యాఖ్యలు, మధ్య మధ్య రచయిత ప్రవేశం, కాలక్రమాలను అనుసరించని ప్రస్తావనలు, చంద్రబాబు, యన్.టి.ఆర్. ఇతర శాసన సభ్యులపై చురకలు, ఉపన్యాసధోరణి చోటు చేసుకున్నాయి. ఈ వ్యాసాలను ముడిసరుకుగా ఉపయోగించుకుని తమ లక్ష్యానికి అనుగుణమైన, ఒక విద్యాత్మకమైన క్రమశిక్షణతో, సంయమనశీలంతో రాసి ఉంటే సాహిత్య చరిత్రగా రూపు దాల్చేది అని నిష్కర్షగా చెబుతారు. అలాగే ఈ పుస్తకంలో పేర్కొన్నబడిన తప్పుడు వాదాలను అనౌచిత్యాలను తార్కికంగా, హేతుబద్ధంగా ఖండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ విమర్శలన్నీ నిత్యానందరావు విస్తృత అధ్యయనాన్ని, పాండిత్య ప్రతిభను, సునిశిత పరిశీలనను తెలియజేస్తాయి.

సమీక్షకుడిని విస్తృతాధ్యయనం. విషయంపై మంచి అవగాహన, విశ్లేషణా సామర్థ్యంతో పాటు సంయమనం కలిగివుండాలి. నీతి, నిజాయితి, నిర్భయతతో పాటు సమీక్షకుడు అందలి పట్ల సమదృష్టితో మెదలాలి. సమీక్షకునికి రచన పట్ల కుతుహలం, రచనలతో పరిచయమే కాక ఆయా రచనల గురించి పూర్తి అవగాహన కలిగి వుండాలి. రాగద్వేషాలకు అతీతంగా వుండాలి. భిన్న ధ్రువాలలాంటి యం. వి. ఆర్. శాస్త్రి, కత్తి పద్మారావుల పుస్తకాలను సమీక్షించడంలో నిత్యానందరావు చూపిన సంయమనం, సమదృష్టి ప్రశంసనీయం. సమీక్షకునికి ఉండవలసిన లక్షణాలన్నీ నిత్యానందరావులో పుష్కలంగా వున్నాయని ఈ సమీక్షలు తెలియచేస్తాయి. నిత్యానందరావు ఏ గ్రంథాన్ని అయినా లోతుగా విషయవివేచన చేయడం. కొత్త విషయాలు కానీ, మంచి విషయాలు కానీ వుంటే ప్రశంసించడం, లోపాలను మిత్రసమ్మితంగా చెప్పడం ముఖ్యంగా సలహాలు, సూచనల ద్వార తెలియజేయడం బాగుంది. రచయిత పరిచయాన్ని ప్రశంసతో మొదలు పెట్టి వారి రచనను నిర్మొహమాటంగా విమర్శించడం అనే టెక్నిక్ ను నిత్యానందరావు పాటించి విజయవంతం కాగలిగారు. సమీక్షకునిగా నిత్యానందరావు రచయితకు పాఠకుడికి మధ్య వారధిగా వుండి పుస్తకాన్ని గూర్చి అవగాహన పాఠకుడికి, రచనలోని మంచి చెడ్డల అవగాహన రచయితకు కలిగేలా వ్యవహరించారు. సమీక్ష చదివాక మూల గ్రంథం చదివేలా ప్రేరేపించడం, ఒక వేళ అప్పటికే మూలగ్రంథాన్ని చదివి వుంటే సమీక్షతో తమ ఆభిప్రాయాలను పోల్చుకొని తమ అవగాహనను మరింత పెంచుకునేలా నిత్యానందరావు సమీక్షలు కొనసాగుతాయి.

-2-

గ్రంథం తనంత తానుగా ఇవ్వని, పాఠకునికి అవసరమైన, పాఠకుడు తెలుసుకోగోరే వివరాలను పీఠిక అందజేస్తుంది. పీఠికలో సామాన్యుడు గ్రహించలేని ఎన్నో విశేషాంశాలను, లోతుపాతులను పీఠికా కర్త వెలికి తీసి వ్యాఖ్యానించవచ్చు. ముఖ్యంగా సాధారణ పాఠకులకు అందకుండా నిగూఢంగా రాసే కవిత్వాలకు పీఠిక అవసరం. గూఢవస్తుమయమై వున్న కావ్యాలకు, వ్యాఖ్యానాల వంటి పీఠికలెప్పుడూ అవసరమే. అటువంటి రచనలకు కూర్చబడిన పీఠికలు, గ్రంథావగాహనకు అవసరమైన అన్వయ సూత్రాలను, మార్గాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ఇలాంటి విశ్లేషణ-విమర్శనాత్మక పీఠికలు కొన్నిసార్లు మూలగ్రంథం కంటే ఎక్కువగా ప్రచారాన్ని, ఆదరణను పొందే అవకాశమున్నది. పీఠికలు కేవలం గ్రంథాల్లోని భాగాలుగానే కాక, స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి వున్నాయనడానికి నేడు వెలువడుతున్న పీఠికల సంకలన గ్రంథాలే నిదర్శనం. సాధారణంగా రచయితలు తమను, తమ రచనను లోకానికి పరిచయం చేయడానికై పీఠికను వ్రాయించుకుంటారు. ఎవరు తనని గురించి చెబితే సమాజంలో ఎక్కువ మందికి ఆమోదంగా వుంటుందో వారితోగాని, తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనుకూలంగా ఆలోచించే వారితోగాని, ఏ వ్యక్తి పీఠిక రాస్తే తమ పుస్తకానికి విలువ పెరుగుతుందనుకుంటే ఆ వ్యక్తితోగాని, తమకు ఆత్మీయంగా వుండేవారితో గాని, సాధారణంగా ‘పీఠిక’ వ్రాయించుకుంటారు.

వెలుదండ నిత్యానందరావు విమర్శకుడిగా, విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా సుప్రసిద్ధులు. విద్యార్థులతో స్నేహంగా వుంటూ, నిరంతరం వారిని ప్రోత్సహించే నిత్యానందరావును విద్యార్థులు ఎంతగానో అభిమానిస్తారు. అందుకే వారు తమ పరిశోధన గ్రంథాల మీద ఆచార్యుల వారి అభిప్రాయాలు, ఆశీస్సులు కోరుతూ ముందుమాట కోసం వస్తారు. సహృదయుడు, స్నేహశీలి, చదువరి అయిన నిత్యానందరావుతో సహుద్యోగులు, అధ్యాపకులు, ఆచార్యులు ఇక పరిచయస్థులు, మిత్రులు, సహాధ్యాయులు, సన్నిహితులు సరేసరి.. ఏ మాత్రం పరిచయం లేకపోయినా విషయ నిపుణుడిగా గుర్తించి, తమ పుస్తకాలకు ముందుమాటలు వ్రాయమని అభ్యర్థించిన వారు కూడా ఉంటారు

విమర్శ గ్రంథాలు:

వెలుదండ నిత్యానందరావు బాగా అభిమానించే ఆచార్య జి.వి.యస్ గారి విమర్శనా గ్రంథానికి పీఠిక రాయడంతో తన పీఠికా ప్రస్థానాన్ని ప్రారంభించడం ఒక ఆశ్చర్యం,. ఈ విషయం ప్రస్తావిస్తూ నిత్యానందరావు ‘పీఠికా రచన, సంపాదకత్వం నాకు కొత్త. ఈ పీఠికతో నాకు మంచి ‘బోణి’ జరిగింది. వారు ఆతిశయ వాత్సల్యంతో నన్నీ పనికి పురమాయించారే కాని నాకు పీఠిక రాసేంత ‘అర్హత’ వుందని కాదు. అచ్చులో నా పేరు చూసుకోవచ్చనన్న ప్రలోభం కొద్దీ, ‘సూత్రం శిరసి ధార్యతే’ అన్న ఆలంకారిలోదాహరణం మదిలో మెదలడం కొద్దీ ఈ పనికి పూనుకున్నానే తప్ప వేరుకాదు’’ అని వినయంగా చెప్పుకున్నారు. తమ ప్రతిభా మహత్త్వాలతో జాతిని విద్యుత్తరంగితం చేసిన చేస్తున్న 18 మంది సహృదయ విద్వాంసుల సాహిత్య వైదుష్యాల సమాలోచనం ఈ వ్యాస సంకలనం. ఇందులో ‘ప్రక్రియ’ స్వరూప స్వభావాలను విశ్లేషించడం- గుర్తించడం, ‘క్లాసిజం’ ప్రమాణాలను అన్వేషించడం- వివేచించడం ఈ పద్దెనిమిది వ్యాసాల్లో ఆచార్య జి.వి.ఎస్. చేసిన పని అని నేను తలపోస్తున్నాను. రచయిత వారి రచనారీతులు గురించి వివరిస్తూ ‘‘ఒక సమన్వయాత్మకమైన కొత్త చూపును అందించడానికే యత్నించారు. కొత్త సాహిత్య మూలాలను, సిద్ధాంతాలను, మెళకువలను మిమర్శకులకు, పాఠకులకు అందించారు. ఒక రచయిత ప్రదర్శిస్తున్న కళాత్మక సంవేదనను పఠిత హృదయంలో ముద్రపడేలా వారధిగా దోహదం చేశారు. కొన్ని వ్యాసాల్లో అవగాహన చేసుకునే తీరుతెన్నులను నిర్ధేశించారు. మరికొన్నింటిలో నిజాలను నిర్ద్వంద్వంగా చెప్పారు. ఇంకొన్నింటిలో రచయిత దృక్పథాలను, తబ్బిబ్బులను సరి చేశారు- అని చక్కగా విశ్లేషించారు.

‘‘భరతఖండంబు చక్కని పాడియావు’’ పద్యకర్త చిలకమర్తి వారు కారని చెన్నాప్రగడ భానుమూర్తి అని గతంలో చిన్న చిన్న చర్చలు జరిగినా సత్యాన్వేషణ స్ఫూర్తితో, నిశిత పరిశీలనతో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన కరణం సుబ్బారావు గారిని అభినందిస్తారు. 1905లో చెన్నాప్రగడ భానుమూర్తి ప్రకటించిన ‘‘భారత ధర్మ దర్శనం’’లో ఈ పద్యం వున్నదని సుబ్బారావు గారి ప్రతిపాదన కాని ‘‘భారత ధర్మ దర్శనం’’ 1907లో ప్రచురితమైనది నిత్యానందరావు అనేక సాక్ష్యాలు చూపుతూ ‘‘1905లో ఈ పద్యం రాయడానికి ఇంకా బలమైన ఆధారం చూడాలి’’ అని నిలదీశారు. ఇది మింగుడుపడని రచయిత ఈ పేరా మొత్తాన్ని పీఠిక నుండి తీసివేయడం తో ఆ పీఠిక అపార్థాలకు తావిచ్చే అవకాశం కలిగింది. నిత్యానందరావు తన పీఠిక సంకలనంలో తన పీఠిక పూర్తి పాఠాన్ని ఇవ్వడంతో పాఠకులే నిజానిజాలు తెలుసుకోగలుగుతారు.

పాటిబండ మాధవశర్మ గారి ‘‘ఆధునికాంధ్ర భావ కవిత్వం’’ పై ఎంఫిల్ సిద్ధాంతవ్యాసమంత విషయనిర్భరమైన పీఠిక రాశారు. రచయిత జీవితం-సాహిత్యం గురించి వివరంగా తెలియజేశారు. తర్వాత ‘ఆధునికాంధ్ర భావ కవిత్వాన్ని’ విఫులంగా విశ్లేషిస్తూ ఇందులోని కొన్ని ప్రతిపాదనలకు కాలదోషం పట్టవచ్చు. మరి కొన్ని పునర్మూల్యాంకనం చేయవలసి రావచ్చు. అనాడు పాటిబండ వారు లేవదీసిన కొన్ని ప్రశ్నలకు నేటికీ సమాధానాలు సంతృప్తికరంగా దొరకకపోవచ్చు. అందుకే అనాటి స్థలకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని చదవాల్సి వుంటుందనడం గమనార్హం.

“మహాకవి దాశరథి సాహిత్య వ్యక్తిత్వాలలోని శతాధిత పార్శ్వాలను, అంశాలను విశ్లేషిస్తూ శతాధిక రచయితలు రాసిన వ్యాసాల సమాహారం ‘‘సాహిత్య ప్రపంచలో దాశరథి’’ ఈ సంకలనంలో దాశరథితో మైత్రీ బంధాన్ని పెనవేసుకున్న సమకాలీన మిత్రుల అనుభవాలు వున్నాయి. ఆయన కవితా వైశిష్ట్యాన్ని విశ్లేషించిన పరిశోధక విద్యార్థుల వ్యాసాలు వున్నాయి. జయంతి, వర్ధంతి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అస్థానకవి పదవీయోగం లాంటి సందర్భాలలో వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు వున్నాయి. ‘తెలంగాణ ఉద్యమ స్పృహ’ పెరిగిన తర్వాత కలిగిన ‘దాశరథి స్పృహ’ తో రాసిన వ్యాసాలున్నాయి. ఇవన్నీ కలిపి చదువుతుంటే ఒకరిద్దరు ఔత్సాహికుల ఎత్తిపోతల పథకాలు కనబడే ప్రమాదం కూడా ఉండవచ్చు. కాని భిన్న కాలాల్లో భిన్న సందర్భాలలో ఒక కవిని అంచనా వేస్తున్నప్పుడు భిన్నమైన వ్యాఖ్యానాలు అందివస్తున్నాయి. అంతేగాక కొన్ని ప్రస్తుత తరానికి తెలియని సరికొత్త అంశాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది” అని నిత్యానందరావు సంకలనం తీరుతెన్నులను తెలియజేశారు.

భక్తి తాత్త్వికతలు అంతస్సూత్రంగా, పద్యప్రక్రియ బాహిర అచ్ఛాదనగా వెలువడిన వ్యాస సంపుటి వఝల రంగాచార్యుల వారి ‘‘ఆనంద నిలయం’’. దీనిలోని ప్రధాన వ్యాసం ‘‘తెలంగాణ ఆధునిక పద్య కవులు – కావ్యాలు’’. 71 పుటల సుదీర్ఘ వ్యాసాన్ని ఇంతటితో ఆపకుండా మరో 74 పుటలు కలిపి ఒక ప్రత్యేక గ్రంథంగా వెలువరిస్తే, సాహిత్య లోకానికి రంగాచార్యుల వారు ఒక అమూల్యమైన కానుకను సమర్పించిన వారవుతారు- అని సూచిస్తారు. ఇలాంటి సూచనలు సాహిత్య పురిపుష్టికి దోహదం చేస్తాయి.

పరిశోధన గ్రంథాలు:

వేముల రామాభట్టు ‘‘గౌరీ విలాసం’’ వసుచరిత్రకు ధీటైన ప్రబంధం. దానిని పరిష్కరించడం, విశ్లేషించడం, సామాన్య విషయం కాదు. పూర్వకావ్యాలతో ప్రగాఢ పరిచయం, అముద్రిత కావ్యాలు పరిష్కరించిన అనుభవం, శాస్త్ర పరిజ్ఞానం అత్యంత విశ్వాసం ఈ అముద్రిత కావ్యాన్ని అచ్చులో తేవడానికి 1998 నుండి 2014 వరకు చేసిన విఫలయత్నాల గురించి చెబుతూ నిత్యానందరావు గ్రంథ పరిష్కరణలో భాగంగా, కావ్య విశేషాలను వివరిస్తూ రాసిన విపులమైన పీఠిక మరొకటి. ఇంతా చేస్తే కావ్యమూ బయటికి రాలేదు. ఈ పీఠికా అచ్చుకెక్కలేదు.

“ధరణి దేవుల రామయ మంత్రి ‘‘దశావతారచరిత్ర’’ ప్రసిద్ధికి నోచుకున్న కావ్యం కాదు. భక్తి రసాత్మక ఇతివృత్తమైన దశావతారాలను శృంగారరసంలోనికి తీసుకుని వెళ్ళడం దుస్సాహసం. తీవ్రమైన అనౌచిత్యం. అందువల్ల అటు భక్తజనులకు, ఇటు రసక జీవనులకు ప్రీతిపాత్రం కాలేదని పరిశోధకుడు డా. సచ్చిదానందం ఎంతో స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పడం చూస్తే ముచ్చటేస్తుంది. ఇదే కాకుండా కావ్యంలో వన్న అనౌచిత్యాలను ఖండించిన తీరును అభినందిస్తూ, పరిశోధకుల నుండి ఇలాంటి స్పష్ట ప్రతిపాదనలే” కావల్సిందని అభినందిస్తారు.

మహబూబ్ నగర్ జిల్లా సంకీర్తన కారుల సంగీత, సాహిత్య, భక్తి తత్పరతలను సమీక్షిస్తూ డా.పి. భాస్కరయోగి వెలువరించిన సిద్ధాంత గ్రంథం ‘‘పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం – ఒక పరిశీలన’’ సంకీర్తనలు మౌఖిక రూపాలు కావడంతో ప్రచారంలో వున్నది నిలిచిపోవడం, మిగతావి కాలగర్భంలో కలిసిపోవడం, ఉన్నవి మార్పులకు లోనుకావడం జరుగుతున్నది. వీటిని సేకరించడం, భద్రపరచడం, అచ్చులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని సూచిస్తూ గ్రంథ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. అలాగే ‘‘మహబూబ్ నగర్ జిల్లా శతక సాహిత్యం’’పై పరిశోధన గ్రంథాన్ని వెలువరించి డా. సురేశ్ బాబు జిల్లాను జల్లెడ పట్టి గాలించి 325 శతకాల వివరాలను సాధించాడు. అముద్రిత శతకాలను కూడా సేకరించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాచీన కవుల దొరకని 17శతకాల వివరాలను కూడా నమోదు చేసి మంచిపని చేశాడని అభినందించారు. జిల్లాలో అత్యధిక శతకాలు రాసిన వ్యక్తి ఈ పీఠికా కర్త అన్నగారు కావడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

‘‘అర్ధ శతాబ్దపు తెలుగు నృత్య రూపకాల’’ వస్తు రూప రస రచనల్లో సాగించిన ప్రయోగాత్మక ప్రయోజనాత్మక ధోరణులను విశ్లేషిస్తూ అమలాపురం కన్నారావు రచించిన పరిశోధనా గ్రంథాన్ని పూర్వ పరిశోధనలతో పాటు ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను – ధోరణులను వివరిస్తూ మంచి ముందుమాట రాశారు. పరిశోధకుడు 512 నృత్య గేయ రూపకాలను సేకరించి చర్చకు పెట్టడాన్ని అభినందిస్తూ, అతని పరిశోధనాసక్తులను ప్రశంసించారు.

డా.ఎన్. సుధాకరనాయుడు సిద్ధాంతగ్రంథం ‘‘తెలుగులో సైన్స్ ఫిక్షన్’’కు ముందుమాట రాస్తూ, ఈ విషయంపై వచ్చిన తొలి సమగ్ర పరిశోధన గ్రంథంగా దీన్ని గుర్తించారు. ‘‘చారిత్రక వైజ్ఞానిక నేపథ్యం’’ పేరిట వచ్చిన ప్రథమాధ్యాయం’’ పరిశోధకుల పాలిట గని అంటూ తొలి తరాల సైన్స్ రచయితలపై పరిశోధనలు రావల్సిన అవసరాన్ని సూచించారు. సైన్స్ ఫిక్షన్ కు – సైన్స్ ఫాంటసీకి మధ్య వున్న తేడాను చర్చిస్తూ, ఇవి రెండు వేరు వేరు విభాగాలు అయినప్పటికీ, ఎక్కడో ఒక చోట ఈ రెండు కొంత మేరకు కలగలిపోతాయేమో! అనే సందేహాన్ని వెలిబుచ్చడం నిజమే. అలాగే పరిశోధకుడు తొలి తెలుగు సైన్స్ కథలు, తెలంగాణ నుండి వచ్చాయనే నిర్ధారించడం గమనార్హం అంటారు.

డా. బోనాల మురళి సిద్ధాంత గ్రంథం ‘‘తెలుగు సాహిత్యంపై సాయుధ పోరాట ప్రభావం’’లో రజాకార్ల దమనకాండ, సాయుధ పోరాటం, పోలీసు చర్య – ఈ మూడింటి లక్ష్యాల్లో తేడా వున్నా జరిగిన హింసాకాండలో మాత్రం తేడా లేదు. వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలలో సామాన్యులు నలిగిపోయారు. ఉన్నవాళ్లు బాగుపడ్డారన్న విషయాన్ని నిర్మొహమాటంగా తమ ముందుమాటలో తెలియజేశారు.

డా. ములుగు అంజయ్య సిద్ధాంత గ్రంథం ‘‘రంగారెడ్డి జిల్లా రచయితలు – పండితులు’’ హైదరాబాద్ నగరానికి బంగారు కడియంగా వర్ధిల్లే రంగారెడ్డి జిల్లా సాహిత్యానుశీలన లక్ష్యమైన ఈ గ్రంథం ఎంత త్వరగా వెలువడితే అంత మంచిది. సమీప భవిష్యత్తులో ఈ బంగారు కడియం రూపుమారిపోయి సరికొత్త వేషాన్ని ధరించే సూచనలు కానవస్తున్నాయని హెచ్చరిస్తారు. నిత్యానందరావన్నట్లే ఈరోజు రంగారెడ్డి జిల్లా నాలుగు జిల్లాలైంది.

కవిత్వ విశ్లేషణలు:

కవిత్వానికి సంబంధించిన వచన కవిత్వం, పద్య కవిత్వం, శతకం, గేయ కవిత్వాలపై రాసిన ముందుమాటలు వున్నాయి. “జంగా హనుమంతరావు 1915లో రాసిన సత్యావివాహం అచ్చతెనుగు కావ్యం మలిముద్రణకు పాండితీస్ఫోరకమైన పీఠిక రాశారు. ఆ కావ్యంలో ప్రసక్తమైన మంగళహారతి ప్రయోగాన్ని వివరిస్తూ ద్రావిడ, ఇండో ఆర్యన్ భాషలన్నింటిలో ఆరతి రూపాంతరాలు కనిపిస్తుండగా తెలుగులో మాత్రమే “హారతి” కనిపిస్తుందని సోదాహరణంగా వివరిస్తారు. ఆరతికి మొదటిరూపం హారతి అన్న శబ్దరత్నాకరకారుని మాటను ఉల్లేఖించి అది అతని స్వీయాభిరుచిజన్యమని ఖండించడంలో నిత్యానందరావు ఉదాత్తత, సంయమనం గోచరిస్తాయి. తొలితరం తెలంగాణ కవులైన అంబటిపూడి వెంకటరత్నం రాసిన ప్రణయ వాహిని, ధవళా శ్రీనివాసరావు రాసిన ధవళశ్రీ” కావ్యాలు పునర్ముద్రణలకు, నిత్యానందరావు సమాచారాత్మకమైన పీఠికలను సమకూర్చడం విశేషం. అయినా చాలావరకు ఔత్సాహికుల కవిత్వానికే ముందుమాటలు రాయవలసి వచ్చింది. అందువల్ల వారికి కవిత్వం అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? లాంటి సలహాలు ఇవ్వడమే కాకుండా, కవిగా ఎదగడానికి వారు చేయాల్సిన కృషి గురించి బోధించారు.

వచన కవితా సంకలనాల్లో గ్రాంథిక వ్యావహారిక మాండలిక రూపాలు పరస్పరం కలగలిసిపోయే ప్రాథమిక ధోరణి తొంగిచూసినా, అది కవిలోని మొగ్గతొడిగిన కవిత్వ చైతన్యంగా భావిస్తూ, తనలోని స్వచ్ఛతను తాజాతనాన్ని ఆస్వాదించాలని నచ్చజెపుతూనే, కవి అధ్యయనం-అభ్యసనం పట్ల శ్రద్ధ చూపాలని సూచిస్తారు.

సంకేపల్లి నాగేంద్రశర్మ రాసిన “ఏములాడ మూలవాగు” సంకలనంలోని కవితలన్నీ సామయిక కవితలు లేదా సంఘటనాశ్రయ కవితలు. ఆ సంఘటన పూర్వాపరాలు తెలిసినప్పుడు ఒక తీరుగా అర్ధమవుతుంది. కొన్నాళ్ళకు ఆ సంఘటన మరుగునపడిన పిదప పాఠకుడికి అర్ధమయ్యే తీరు వేరయ్యే అవకాశముంటుంది. సామయిక కవిత్వం రాసే రచయిత ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని అర్ధావగాహనలో ఎలాంటి లోపం రాకుండా రాయడంలో నేర్పు ప్రదర్శించాలి. పద్యంలో గణాల మార్పు వల్ల అప్రయత్నంగా ఒక లయ సిద్ధిస్తుంది. వచన కవితలో అంతర్లయ ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తించకపోతే వచన కవితలకు, వచనానికి నడుమనున్న సన్నని విభాజక రేఖ చెరిగిపోయే ప్రమాదం తరచు సంభవిస్తుంది. అందునా వ్యక్తుల పేర్లను, సంఘటనలను వాచ్యంగా పేర్కొనాల్ని వచ్చినపుడు ఈ ప్రమాదం మరీ హెచ్చవుతుంది. పత్రికల్లో రాసినపుడు ఆ ఒక్క కవితను మాత్రమే విడిగా చదువుతారు. ఇవి తాత్కాలికాలు. కొన్నాళ్ళతర్వాత వాటిని సంకలనంగా మార్చి “పుస్తకం” రూపమిచ్చి శాశ్వతత్వం కల్పిస్తున్నపుడు అన్ని కవితలను పోల్చుకుంటూ చదువుతారు, చర్చించుకుంటారు. కనుక సంకలనంగా వచ్చేటపుడు editing కూడా అవసరం. అవసరమనుకుంటే కొన్ని పంక్తులను పరిహరించడం, కొన్నింటిని కొత్తగా కలపడం, కొన్ని మార్పులు చేయాలి. రచయితగా తన రచన మీద తనకు వ్యామోహం ఉండటం సహజమే. కాని రచయిత నుండి విడివడి ఎడిటర్ గా మారాక కత్తెరకు పదును పెట్టడంలో మొహమాట పడకూడదు అని ఖచ్చితంగా చెబుతారు.

వాచ్యతా రీతిలోకి జారిపోవడం కవిత్వాన్ని కుంచింపచేసే అంశం. ప్రతిపాదిత వస్తువుకే ప్రాధాన్యమిచ్చి, అభివ్యక్తి పట్ల చిన్నచూపు ఏర్పరచుకోవడం, గుండెలోతుల్లోంచి కవిత్వం దూసుకుని వస్తుందనుకోవడం, దానిని ఎడిటింగ్ చేసుకోకూడదనుకోవడం లాంటి అమాయకపు ఆలోచనలకు లోను కాకుండా అభివ్యక్తి మాధుర్యాన్ని, వస్తు గాఢతను కవిత్వంలో రంగరించి ఉత్తమ సృజనశీలురుగా వర్ధమానకవులు మన్ననలందుకోవాలని ఒక ముందుమాటలో ఆకాంక్షిస్తారు.

“మహాకావ్యాలు చదివే తీరిక, ఓపిక లేవు. అంతా ఇన్ స్టంట్ ఫుడ్ తినే కాలం వచ్చింది. ఆలోచించి, ఆలోచించి, ఆస్వాదించి, ఆస్వాదించి ఆనందించే కాలం కాదిది. మరుగుజ్జు కవితలే మహాకావ్యాలుగా చలామణిలోకి వచ్చేశాయి. “ఒకసారి” చదివిన వెంటనే అర్థమై “ఆహా” అనిపించడం వంటి స్వాభావిక లక్షణం అంటూ ఓ మినీకవితా సంకలనానికి రాసిన మున్నుడిలో పేర్కొన్నది వాస్తవమేగదా.

 గేయ కవిత్వంలో వస్తున్న మార్పులను తెలియజేయడానికి “కలం-కాలం” వెలువరించిన మద్దోజు సుగుణాచారిగారు ప్రచారం పరమావధిగా కవితా వ్యవసాయం చేసినవారు. పాండిత్యాన్ని పక్కకు పెట్టారు. తేలికైన భాషని తెచ్చుకున్నారు. ప్రజల నోళ్ళలో నానిన ప్రసిద్ధమైన పాటల బాణీలను కూడా ఆలింగనం చేసుకున్నారు. చెవికింపు కావాలన్నా, జనం తన మాటను వినాలన్నా ‘లయ’ ఉండక తప్పదని అనుభవపూర్వకంగా గ్రహించారు. పామర జనుల్లో పరిజ్ఞానం పెరగాలంటే, ప్రచారం జరగాలంటే ఇదంతా చేయక తప్పదని స్పష్టం చేస్తారు. పద్యకవుల మీద కూడా స్పందన కనిపిస్తుంది.

“భక్తహృదయులకు భగవత్సంకీర్తనమే పరమ లక్ష్యం. ఆత్మానందమే పరమ లక్ష్యం. కనుక వారు తదనుగుణంగానే ఆస్వాదిస్తారు. రచనలు చేస్తారు. కాని పాఠకలోకం భక్తిని ఆస్వాదిస్తూనే గణ యతి ప్రాసలు, వ్యాకరణ నిర్దిష్టత, సార్ధక పద ప్రయోగ చణత, భావ శబలతను కూడా పరిగణిస్తారు. కనుక వాటిని సంతృప్తి పరచవలసిన బాధ్యత రచయిత మీదే ఉంటుంది. ఛందో వైముఖ్యం ప్రబలడానికి ప్రధాన కారకులు పద్యకవులేనన్న మాట నిజం చేయకూడ”దని ఒకదానిలో నిత్యానందరావు హెచ్చరిస్తారు.

ఆచార్య పరిమి రామనరసింహం, డా. ద్వానా శాస్త్రిల ఆత్మీయతానుబంధాన్ని వెలార్చే “ద్వానాశతకం” కు పీఠిక రాస్తూ, గతంలో వచ్చిన మైత్రి శతకాల గురించి వివరించారు. అధిక్షేప శతకం “నృహరీ” పీఠికలో తెలుగు సాహిత్యాన్ని గాలిస్తే 200 నుండి 300 దాకా నరసింహస్వామి శతకాలు, ఇతర రచనలు దొరుకుతాయంటారు. సమాచారాత్మకమైన ఇలాంటి పీఠికలు పరిశోధకుల మెదడుకు మేతను కలిగిస్తాయి. నండూరి రామచంద్రరావు రచన “చంద్రగగద్య శతకం” పీఠికలో, ఇన్నాళ్లు శతకం కేవలం పద్య రూపంలోనే సాగింది. నియమిత పంక్తులతో, మకుటంతో వచన కవిత్వంలో కూడా శతకం రాయవచ్చునని ఈ రచన నిరూపిస్తుందంటారు.

పేరడీ గ్రంథాలు:

“తెలుగు సాహిత్యంలో పేరడీ” అనే ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించి నిత్యానందరావు, సాహిత్య లోకంలో సంచలనం సృష్టించాడు. దాంతో పేరడీ రచనలు చేసేవారు తమ గ్రంథాలను పంపి నిత్యానందరావు ఆమోదముద్రను లేదా అతని గుర్తింపును, ప్రశంసలను పొందాలని ఉవ్విళ్ళూరడం సహజమే. కాని విచిత్రం ఏమిటంటే, హాస్య వ్యంగ్య రచనలకు పేరడీలకు తేడా లేకుండా రాసినవారు ఎందరో ఉన్నారు. కాని నిత్యానందరావు ఆ పుస్తకాలకు రాసిన పీఠికలలో “పేరడీ అంటే ఏమిటీ? దాని లక్షణాలు ఎలా రాయకూడదో వివరంగా చర్చించారు. ఒక పీఠికలో “పేరడీల్లో, పేరడీతుల్య కవితల్లో వాడి, వేడి ఉన్నాయనడం……”. “ దీనిలో పేరడీలున్నాయి. పేరడీలకు చాలా దగ్గరగా వచ్చిన పద్యాలూ ఉన్నాయి”. అనడంలో నిత్యానందరావు నేర్పరితనం, చమత్కారం కనిపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా చదివితే తప్ప పీఠికా కర్త ఉద్దేశాన్ని గ్రహించలేము. పేరడీ అంటే ఏమిటి? ఎలా రాస్తే పేరడీ విజయవంతమవుతుందో వివరిస్తూ ప్రసిద్ధ సినిమా పాటల బాణీలను, ప్రసిద్ధ పద్యాల శైలిని అనుకరిస్తూ రాసినంత మాత్రాన పేరడీలు అయిపోవు. ప్రసిద్ధ విప్లవ గీతాల ఒరవడిలో తద్భిన్నమైన సిద్ధాంతాలు వారు, వారి సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నీ పేరడీలు కాజాలవని స్పష్టం చేశారు.

ఇతరాలు :

ఈ విభాగంలో రెండు కథా సంపుటాలకు, ఒక నవలకు రాసిన పరిచయాత్మక పీఠికలున్నాయి, ఇందులో అన్ని అనువాద కథల సంపుటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, అనువాద ప్రక్రియ పుష్పక విమానం లాంటిదని ఇచ్చిన వివరణ మనసుకు హత్తుకు పోతుంది. అలాగే అయిదు ఆధ్యాత్మిక గ్రంథాలకు, ఒక సూక్తులు పుస్తకానికి పీఠిక రాశారు. ఇందులోని రెండు ఆధ్యాత్మిక గ్రంథాలు రాసిన పీఠికలలో “తనదైన అనుభూతి తనదిగాన” “తనదైన భక్తి రచనలు తనవిగాన” అన్నట్లుగా అందజేస్తున్నారని చమత్కరించారు. సంస్కృత కావ్యం, అచ్చతెలుగు కావ్యాలకు కావ్య పరిష్కరణ, కావ్య విశేషాలను వివరిస్తూ విపులమైన పీఠికలు రాశారు.

ఇవన్నీ ఒక ఎత్తు. గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించిన పీఠికలు మరో ఎత్తు. ఇందులో రెండు వాఙ్మయ సూచీలపై, రెండు నిఘంటువులపై ఉన్నాయి. పరిశోధనలో ఆచూకీ గ్రంథాల ప్రాముఖ్యాన్ని అందులో వాఙ్మయ సూచీలు, ప్రాధాన్యతను, గతంలో వచ్చిన సూచీల వివరాలను, సూచీ నిర్మాణాన్ని ఆసక్తిగా తెలియజేశారు. తర్వాత డా. ఎస్. రాధిక “తెలుగు సాహిత్య వ్యాస సూచి”కి పీఠిక రాస్తూ, ఆమె సామాజిక వైజ్ఞానిక రచనలను వదిలి పెట్టి కేవలం భాషా సాహిత్య అంశాల దర్శినిగా దీన్ని తయారు చేశారని తెలిపారు. సంకలన కర్త కేవలం ఒక్క తెలుగు మాస పత్రికకే పరిమితం కావడం వల్ల, అందులో ప్రతి సంచికలో నాలుగయిదు వ్యాసాలకు మించి ఉండకపోవడం వల్ల సులువుగా పాఠకునికి తెలుస్తాయన్న ఉద్దేశంతో ఉపవిభాగాల వర్గీకరణ జోలికి పోకుండా ఔచిత్యాన్ని పాటించారు అని చెబుతూ సూచీ పరిమితులు- లోపాలను మృదువుగా తెలియజేశారు.

నిఘంటువులు, రకరకాల పద నిఘంటువులు, వాటిలో వృత్తి మాండలిక పదకోశాల గురించి చర్చిస్తూ డా.దేవారెడ్డి విజయలక్ష్మి “రాయలసీమ వాడుకమాటలు”కు పీఠిక ప్రారంభించారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల వాడుక పదాలను ఎంతో శ్రమతో విజయలక్ష్మిగారు సేకరించారని చెబుతూ నిఘంటువుకున్న పరిమితులు- ప్రాసంగికతను వివరించిన విధానం బాగుంది. నిఘంటు నిర్మాణం, ప్రశస్త నిఘంటువుల వివరాలతోపాటు ‘ఆంధ్రపద నిధాన’ కర్త తూమురామదాసు జీవన వివరాలను తెలియజేశారు. సులభ గ్రాహ్యమైన సంస్కృత పదాన్ని ప్రధానారోపంగా ఇచ్చి దానికున్న అచ్చ తెలుగు పర్యాయపదాలను ఛందోబద్ధంగా పేర్కొనడం “ఆంధ్రపదనిధానం” గొప్పదనమని తెలియజేశారు.

సమీక్షలు, పీఠికలు విమర్శలో ఒక భాగమే. విమర్శకుడి బహుముఖీనత్వానికి అవి ప్రతీకలు. పీఠిక రాయడం కూడా ఒక కళ. పీఠికా కర్తకు విస్తృత అధ్యయనం, సునిశితమైన పరిశీలన, సరియైన అవగాహన ఉండాలి. రచయిత పట్ల వారి రచనల పట్ల సహృదయతను కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగిన పీఠికా కర్తలలో వెలుదండ నిత్యానందరావు ఒకరు.

నిత్యానందరావు వాసిన ప్రతి పీఠిక, రచయిత పరిచయంతో ప్రారంభమవుతుంది. రచయిత జీవిత విశేషాలు సాహిత్యకృషి ని పేర్కొని, ఆయా గ్రంథాలవిషయాన్ని విపులంగా వివరించడం కనిపిస్తుంది. ప్రమాణాల మేరకు వుండని పుస్తకాలు వస్తే, రాయనని తిరస్కరిస్తే వాళ్లు నొచ్చుకుంటారు. అలాంటి సందర్భాలలో నొప్పింపక, తానొవ్వని రీతిలో పీఠికలు రాయవల్సివస్తుంది. అందుకని పుస్తకం గురించి ప్రస్తావించక పూర్తిగా రచయితను అతని వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని, అతనితో తనకు గల స్నేహ బాంధవ్యాన్ని వివరిస్తూ, ప్రశంసిస్తూ సరిపెడతారు. సహాద్యోగులు అయితే వారితో గల స్నేహబంధాన్ని, వారి మంచితనాన్ని, వారు ఎదిగిన క్రమాన్ని వివరిస్తారు. విద్యార్థులయితే వారికి అభినందనలు తెలియజేస్తూ తగు సలహాలు సూచనలు ఇస్తారు. అభ్యంతరకరమైన అంశాలను, వివాదాస్పద విషయాలను నేరుగా ఖండించకుండా మిత్రసమ్మితంగా అందులోని అనౌచిత్యాలను రచయిత దృష్టికి తెస్తారు. పునరాలోచించమంటారు.

అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయాల నుండి వెలువడే పరిశోధనా సిద్ధాంత గ్రంథాల నాణ్యత, పరిమితులు-లోపాల గురించి క్షుణ్ణంగా తెలియడం వల్ల వాటిని కఠిన విమర్శకు గురిచేయడం అనవసరమని భావిస్తారు. అలాంటి వాటిలో బాగున్నవాటిని ప్రశంసించడం, మాములుగా వున్న వాటిని క్లుప్త పరిచయాలతో సరిపెట్టడం చేస్తుంటారు. ఇతర గ్రంథాలకు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగిస్తారు. ఉదాహరణకు డా. కూర్మాచలం శంకర స్వామి “సుజ్ఞాన గీత” వ్యాసాలు చాత్తాద శ్రీవైష్ణవ వార్తలో సీరియల్‌గా రావడంతో, అసలు విషయాన్ని పక్కనబెట్టి “తెలుగు సాహిత్యానికి చాత్తాద శ్రీవైష్ణవుల సేవ” అనే పరిశోధన గ్రంథం రావాల్సిన అవసరాన్ని సూచిస్తూ, తనకు తెలిసిన కొంతమంది పేర్లను చెబుతారు. అలాగే “పాలెం వెంకటేశ శతకం” కు ముందు మాటలురాస్తూ పుస్తకం జోలికి పోకుండా, పాలెము స్మృతులలో మునిగిపోతారు. నిత్యానందరావు పీఠికల్లో ఉబుసుపోక కబుర్లు కానీ, శాఖా చంక్రమణం కానీ, అనవసర చర్చలు కాని ఉండవు. ఏ పుస్తకానికి పీఠిక రాసినా దాని లోతుల్లోకి వెళ్లి విశ్లేషించడం వారి పీఠికల్లో కనిసిస్తుంది. నిష్టూరమైన నిజాలు తెలిపి రచయితను నొప్పించడం కంటే, వ్యంగ్యం ముసుగులో అందంగా చెప్పి తప్పించుకుంటారు లేదా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి దాటుకుంటారు.

ఏదైనా కొత్త విషయం, సమన్వయం, విశ్లేషణ లేకుండా నిత్యానందరావు పీఠికలు వుండవు. విస్తృతమైన విషయ పరిజ్ఞానం నిత్యానందరావు సొంతం. అందుకే సాహిత్యంలోని ఏ ప్రక్రియ మీదనైనా సాధికారికంగా రాయగలరు, ప్రసంగించగలరు. ఏదైనా విషయానికి సంబంధించి పీఠిక రాయాల్సి వస్తే ఆ విషయం యొక్క పూర్వాపరాలు, గతంలో వచ్చిన పుస్తకాలు పరిశోధనల గురించి తప్పకుండా ప్రస్తావిస్తారు. ఇలాంటి సమాచారాత్మక పీఠికలు విజ్ఞానదాయకంగా భాసిల్లుతాయి. పీఠికా కర్త తాను ఉన్నతాసనం మీద ఉన్నట్లుగా భావించుకుని, రచయిత ప్రదర్శించే తీరులు చేసే హితబోధలు, ఉపదేశాలు నిత్యానందరావు పీఠికల్లో కనిపించవు. పీఠిక రాసే గ్రంథం తనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ గ్రంథకర్త చేసిన కృషిని గుర్తించి గౌరవించుతారు. అలాగని పరుషోక్తులతో ఖండించడం గానీ, అనవసరంగా ఆకాశానికెత్తడం గాని ఉండదు. రచనపట్ల రచయిత పట్ల సమతూకం పాటిస్తారు. ఎలాంటి పక్షపాత ధోరణులు లేకుండా, అనవసర వివాదాల జోలికి పోకుండా, నిబద్ధత సాహిత్య పురోగతి కాంక్షించే నిత్యానందరావు సహృదయ విమర్శకుడిగా ఎప్పటికీ నిలిచిపోతారు.

ఆచార్యుడిగా, విమర్శకుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలాంటి “ఈగో” ప్రదర్శించకుండా నిత్యానందరావు, తనకు తెలియని విషయాలను తెలుసుకోవడంలో ఉత్సుకత ప్రదర్శిస్తారు. ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. డా. ఆర్.సూర్యప్రకాశరావు సిద్ధాంత గ్రంథం “అమ్మంగి వేణుగోపాల్” రచనలు సమగ్ర పరిశీలన”కు ముందుమాట రాస్తూ అమ్మంగి వారు చాలాకాలం నుండి తెలిసిన వారు నాటక రచయిత, కథకుడు కూడా అన్న సంగతి ఈ గ్రంథం ద్వారా నే తెలిసి ఆశ్చర్యం కలిగిందంటారు. తాను ఎప్పుడూ నిరంతర విద్యార్ధినని వినయపూర్వకంగా చెప్పుకుంటారు. ఎలనాగ “అంతస్తాపము” పద్యకవిత చదివి ‘ఒక విద్యార్ధిగా ఎలనాగ కృతివల్ల కతిపయ శబ్దార్థ పరిజ్ఞానం సంపాదించుకున్నాను. ఒక పఠితగా వారి కవితలోని సామాజికాంశాల రీతి పట్ల ఏకీభావం పొందాను. వారి భావుకతను ఆస్వాదించాను” అంటూ తాను తెలుసుకొన్న కొత్తపదాల పట్టికనివ్వడం వారి సహృదయతకు చిహ్నం.

నిత్యానందరావు పీఠికల్లో వస్తు వైవిధ్యం, ప్రక్రియా వైవిధ్యం బాగా కనిపిస్తుంది. ఇంతటి వైవిధ్యం మరే పీఠికా రచయితల్లోను కనిపించదు. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలకు చెందిన వివిధ అంశాలను ఎన్నింటినో ఇందులో స్పృశించారు. ఆయన లేవనెత్తిన ప్రతిపాదనలు ఆలోచనాత్మకంగా వుంటాయి. కొన్నిసార్లు గ్రంథ రచయితకు మార్గదర్శకంగా వుంటాయి. పాఠకుడికి గ్రంథ విషయంతోపాటు సంబంధిత ఇతరేతర విషయాలను తెలియజేయడంలో ఈ పీఠికలు సమాచారాత్మకంగాను, విజ్ఞానాత్మకంగాను పని చేస్తాయి.

***

ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం

ప్రథమసంపుటం అనుభూతి-అన్వేషణ (సమీక్షలు-పీఠికలు).

వెల. ₹ 800 పుటలు.596. రచయిత సెల్.944166681

నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ 500029

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here