[box type=’note’ fontsize=’16’] అన్నమాచార్యుల మనుమడు తాళ్ళపాక చిన్నన్న రాసిన అన్నమాచార్య చరిత్రలో అన్నమయ్య మహిమలు అని వర్ణించబడిన సంఘటనల ఆధారంగా వంకాయల శివరామకృష్ణ రాసిన కథ. [/box]
“య్యోవ్, బాపనాయనా! ప్రభువులు పిలుస్తున్నారు! ఇనబళ్ళా? నిన్నేనయ్యోవ్!”
[dropcap]ఏ[/dropcap]దో ఆలోచించుకుంటూ దివాణంముందునించి తలవంచుకొని పోతున్న సోమనాథ చయనులు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఎదురుగా రెండు నిలువుల ఎత్తు బల్లేన్ని పట్టుకొని బుర్రమీసాలతో, పెద్ద తలపాగాతో రాజభటుడు!
తిరుపతికి కొద్ది దూరంలోని చంద్రగిరి సమీపంలోని ఒక పాళెగాని అధీనంలో ఉన్న ఒక మోస్తరు పట్టణం అది. దాని ప్రభువు చౌడేశ్వర నాయకుడు. ఆయన దివాణం ముందునించి నడుచుకుపోతున్నాడు చయనులు. పదిహేనేళ్ళు దాటుతున్న తన కూతురు పెళ్ళి విషయం ఆయన్ని తొలిచేస్తోంది. తానేమీ కలిగిన ఇంటివాడు కాదు. వంశంలో తరతరాలుగా వస్తున్న వేదవిద్యే తనకి ఆధారం. ఉన్న నలుగురు కొడుకులకీ తనలాంటి గృహస్తుల కూతుళ్ళనే తెచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. వాటికి తనకేమీ ఖర్చవలేదు. ఇంక మిగిలింది తన కుమార్తె పెళ్ళి. కూతురి పెళ్ళంటే మాటలు కాదు. తన దగ్గర నోటిలోని విద్య తప్ప ఐహికమైన ధనమేమీ లేదాయె! కొడుకులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. వారి సంపాదన వారికే చాలీ చాలకుండా ఉంది. ఇంక చెల్లెలి పెళ్ళికి వారేం సహాయపడగలరు? ఎదిగొస్తున్న కూతురు తన గుండెలమీద కుంపటిలా తయారయింది. ధనహీనుడి కూతుర్ని పెళ్ళాడతానని ఎవరు ముందుకొస్తారు?
ఈ ఆలోచనలు సోమనాథ చయనులికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. తన బాధలు నివారణకావాలని కోరుకుంటూ శ్రీ సూక్తాన్ని మననం చేసుకుంటూ నడుస్తూ, రాజభటుడి గద్దింపుతో ఒక్కసారి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలో పడ్డాడు మళ్ళీ!
రాజభవనంలో అడుగుపెట్టడం కాని, ప్రభువుని ఏనాడూ చూడడం కానీ చెయ్యని తనను రాజు రమ్మనడం అతనికి భయాన్ని కలిగించింది. అసలు సోమనాథ చయనులు అనే ఒకడు తన రాజ్యంలో ఉన్నట్టు ఆయనకెలా తెలిసింది? తననెందుకు ఆయన తీసుకురమ్మన్నాడో అంటూ వెన్నులో వణుకు పుడుతుండగా, ఆ సైనికుడి వెంట కోటలోకి నడిచాడు.
***
అది 15 వ శతాబ్దారంభం. విజయనగర సామ్రాజ్యం రాచరికపు మార్పులతో సతమతమవుతున్న కాలం. సంగమ ప్రౌఢరాయలు మరణించాక సాళువ నరసింహ రాయలు♦ రాజ్యానికొచ్చాడు. దీనితో సాళువ వంశ పరిపాలన మొదలయింది. నరసింహ రాయలు మహా పరాక్రమవంతుడు, రాజనీతిజ్ఞుడు. బహమనీ సుల్తానులను, ఓఢ్ర గజపతులనూ నిలువరించాడు. ఐతే 1491 లో ఆయన మరణించాక ఆయన కుమారులు తిమ్మరాజు, రెండవ నరసింహ రాయలూ బాల్యంలోనే ఉన్న కారణంగా రాజ్య సేనాని తుళువ నరస నాయకుడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. నరస నాయకుడు తన కిందనున్న సేనానాయకులు అనేకమందికి చిన్న చిన్న పరగణాలను ఇచ్చి తనకు సామంతులుగా ఉంచుకున్నాడు. వారిలో ఒకడే ఇప్పుడు సోమనాథ చయనులను పిలిపించిన చౌడేశ్వర నాయకుడు.
***
“మహారాజులకు జయము జయము! ఏలికా, తమరు పిలిపించిన బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం బయట నిలబడ్డాడు. సముఖానికి తెమ్మని ఆజ్ఞ ఐతే…” అని భటుడు వంగి నిలుచొని అంటూండగానే రాజు అనుజ్ఞసూచకంగా చేతిని ఊపాడు. కొన్ని క్షణాల్లో చయనులు ప్రభువు ముందు వినమ్రంగా నిలబడి స్వస్తి వాచకాన్ని పలికాడు, భయపడుతూనే! రాజు కోట బురుజుమీద నున్న ఒక మండపంలోని ఉన్నతాసనం మీద ఆశీనుడై ఉన్నాడు. అక్కడినించి చూస్తే ఆ పట్టణమంతా చాలావరకు కనిపిస్తుంది. ఎదుటనున్న రాజమార్గంగుండా ఎవరు వెడుతున్నా చూడవచ్చు. అలా వెడుతున్న చయనులు రాజు కంటబడ్డాడు. ఆయన్ని అంతకు ముందు ఎరగకున్నా, అతని వర్చస్సుని చూసి గొప్ప పండితుడై ఉంటాడని భావించి, తన సమస్యకి పరిష్కారం చూపగలడేమోనని పిలిపించాడు.
పరిచయాలయ్యాక, చౌడేశ్వర నాయకుడు చయనులు అమాయకుడు, కల్మష రహితుడూ అని నిశ్చయించుకున్నవాడై, తనను పట్టి పీడిస్తున్న ఒకానొక దీర్ఘ వ్యాధి గురించి, తనను చుట్టిముట్టి ఉన్న ఆర్థిక సమస్యల గురించీ చెప్పి, తగిన పరిష్కార మార్గాలేమైనా ఉంటే చెప్పమన్నాడు.
“ఆర్యా, నాకు మంత్రి గణమూ, ఆచార్య బృందమూ లేక కాదు. కానీ వారి మంత్రాంగాలూ, సూచనలూ నాకు సహాయపడడం లేదు. మిమ్మల్ని చూడగానే నాకు ఒక పూజ్య భావం, ఆచార్య భావం కలిగాయి. దయచేసి మీకు పరిష్కార మార్గాలేమైనా తెలిస్తే చెప్పండి”
చయనులు ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతేకదా! తాను భయపడవలససిందేదీ లేదు.
“రాజా, ఇటువంటి సమస్యలకి వజ్రాయుధం వంటిది మన్యుసూక్తం. దాన్ని ఒక మండలం పాటు పారాయణ చెయ్యండి, లేక మీ ఆస్థాన గురువులచేత చేయించుకోండి. తప్పక ఫలితం ఉంటుంది”
“ఆర్యా, మీరే దాన్ని చేయించండి” అని కోరాడు రాజు.
“అవశ్యం! రాజాజ్ఞ! మంచి రోజు చూసి మొదలుపెడదాము. సెలవు చిత్తగించండి”
***
ఇంటికి పోయిన సోమనాథ చయనులు స్తిమితంగా కూర్చొని ఆలోచించాడు. ఈ అకస్మాత్ రాజాశ్రయానికి కారణాన్ని! అవును! తనకు మంచి రోజులు వస్తున్నాయి!
మరి, తనను ఆశీర్వదించినదెవరు? సాక్షాత్తు తిరుమల శ్రీనివాస సాక్షాత్కార భాగ్యాన్ని పొందిన మహా భాగవతుడు తాళ్ళపాక అన్నమాచార్యులవారు! ‘ఆయన దయ తన మీద ప్రసరించడంవల్లనే తనకు ఈ అవకాశం తన ప్రమేయం ఎంతమాత్రమూ లేకుండానే వచ్చింది’ అనుకుంటూ చయనులు అంతకు కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు.
***
దాదాపు తొమ్మిది దశాబ్దాల వృద్ధులు అన్నమాచార్యులవారు అప్పటికి. తనకి సాళువ నరసింహరాయ ప్రభువు దానం చేసిన మరులుంకు అగ్రహారంలో విడిది చేసి ఉన్నారు. అప్పుడప్పుడే కన్నడ భాషలో సంకీర్తనలు రాస్తున్న యువకుడు పురందరదాసు తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకొని, అన్నమాచార్యులవారు మరులుంకు గ్రామంలో విడిది చేసి ఉన్నారని విని, ఆయన సందర్శనానికి వచ్చాడు.
ఆ రోజుల్లోనే అన్నమాచార్యులవారు ఆ గ్రామంలోని పుల్ల మామిడి చెట్టుని తన మహిమతో తియ్యమామిడిగా మార్చారనీ, ఆయన సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరునంతటి మహిమాన్వితుడనీ అందరూ అనుకొనగా అది చయనుల చెవిన పడింది. ఆ మహానుభావుడిని సందర్శించి సేవించుకొని, తన దారిద్ర్య నివారణకి ఏదైనా వరం కోరుకోవాలని అనుకొని, మరులుంకు గ్రామానికి భార్యా సమేతంగా తరలివెళ్ళాడు. ఆ మహాభాగవతుడు శ్రీనివాస ప్రభువుమీద పాడిన సంకీర్తనలు విని పరవశులయ్యారు చయనులూ, భార్యా! నల్లని దీర్ఘదేహం! నుదుట ఊర్ధ్వపుండ్రాలు, భుజాలమీది శంఖ చక్ర ముద్రలతో ఆయన అపర రామానుజుల్లా ఉన్నారు. ఆయన ప్రసన్నులై ఉన్న ఒక సమయంలో చయనులు భార్యా సహితుడై సాష్టాంగ దండ ప్రణామాలాచరించాడు. అచార్యులవారు అతడి గురించి వివరాలడిగారు. సోమనాథ చయనులు తన కుటుంబం గురించి, కుమార్తె వివాహం చెయ్యడానికి తన పేదరికం అవరోధమైపోయిన విషయం గురించీ కన్నీళ్ళతో వివరించాడు.
అంతా విన్న అన్నమయ్యగారు నిమీలిత నేత్రులై, “శ్రీనివాసానుగ్రహ ప్రాప్తిరస్తు! నాయనా, సకలలోక జననీజనకులు లక్ష్మీ నారాయణులు. మనసా వారిని నిష్టగా సేవించు. శ్రీసూక్తాన్ని పఠించు. నీకు త్వరలోనే రాజానుగ్రహం కలిగి, నీ కష్టాలన్ని గట్టెక్కుతాయి” అని అశీర్వదించారు. ఆయన సలహా మేరకు వారు తిరుమల పోయి శ్రీనివాసుని దర్శించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్ళారు.
***
మూడు రోజుల్లోనే మంచి ముహూర్తాన్ని నిర్ణయించి సోమనాథ చయనులు రాజు చేత మన్యు సూక్త పారాయణ, ఆదిత్య హృదయ పారాయణా, గ్రహ శాంతులూ పూర్తి చేయించాడు. రాజుకీ ఆయన పట్ల మంచి గురి కుదిరింది. దైవానుగ్రహం వల్ల ఆయన సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఆరోగ్యం కుదుట పడింది.
సోమనాథ చయనులికి గురు సత్కారం భూరిగా చేసాడు రాజు. తన గురువుగా సేవించుకున్నాడు అప్పటినించీ!
***
ఒక రోజు ఒక ఉన్నత కుటుంబీకుడైన బ్రాహ్మణుడు చయనుల ఇంటికి వచ్చాడు. తనకు సకల విద్యావంతుడూ, సద్గుణ సంపన్నుడూ ఐన మేనల్లుడున్నాడనీ, చయనులవారి కుటుంబం గురించి మరులుంకు అగ్రహారంలో విన్నాననీ, అన్నమాచార్యుల వారి ఆశీస్సులు, తన అక్కా బావగార్ల అనుమతీ తీసుకొని తమ వద్దకు వచ్చాననీ, తన మేనల్లుడికి చయనులుగారి కుమార్తెనిచ్చి వివాహం చెయ్యమనీ ప్రార్థించాడు.
సరేననడమూ, శ్రీనివాస ప్రభువుకీ, అన్నమాచార్య గురుదేవులకీ మనసులోనే నమస్కరించుకోవడమూ సోమనాథ చయనుల వంతయ్యింది.
00000
♦ సాళువ నరసింహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి సహాధ్యాయి అని ప్రతీతి. తనపై శృంగార సంకీర్తన పాడనందుకు అన్నమాచార్యులను కారాగారంలో పెట్టినది ఈతడే!