Site icon Sanchika

అనుకోలేదని ఆగవు కొన్నీ..

[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘అనుకోలేదని ఆగవు కొన్నీ..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“రా[/dropcap]కేష్.. ఒక్కసారి వచ్చి ఈ అమ్మాయిని చూడు..” కంప్యూటర్ ముందు కూర్చుని కుస్తీ పడుతున్న శారద అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన కొడుకుని పిలిచింది..

అప్పటివరకు ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు పనిచేసి వచ్చిన రాకేష్ షూస్ విప్పుకుంటూ తల్లితో “అమ్మా! నీకు నాన్నకు నచ్చాలి.. తరువాత జాతకాలు చూపించాలి.. అప్పుడు మాత్రమే నాకు చూపించు..” అంటూ సున్నితంగా తల్లికి చెప్పాడు..

“నిజమే నాన్నా.. మళ్ళీ అమ్మాయి కూడా ఒప్పుకోవాలి..” అంటూ కంప్యూటర్‌లో అమ్మాయిల వేటలో పడింది..

ఒక్కడే కొడుకు.. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. సంబంధాలు కుదరడం లేదు.. కొన్ని జాతకాలు కుదరక, మరి కొన్ని ప్యాకేజి నచ్చక పోతున్నాయి.. ప్రతి రోజూ ఇద్దరూ కూర్చొని ఆన్‌లైన్‌లో సంబంధాలు చూడటం.. అందులో ఫిల్టర్ చెయ్యడం ఇదీ శారద, శ్రీనివాసుల దినచర్య.. ఒక్క కొడుకు ఇంజనీరింగ్ చదివి లండన్‌లో ఎమ్‌ఎస్ చేసాడు.. అక్కడ ఉద్యోగం వచ్చినా వదులుకుని ఇండియాలో తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు రాకేష్..

శారద గృహిణి.. శ్రీనివాస్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.. సిటీలో ఒక మూడు పడకల అపార్ట్‌మెంట్ కొన్నారు.. పెద్దగా ఆస్తులు లేవు.. ఇద్దరూ దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన వారే.. అందుకని వారి తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆస్తులు సంక్రమించ లేదు..

మగ పిల్లవాడి పెళ్ళి ఇంత సమస్య అని అనుకోలేదు.. రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నారు.. ఏదీ కుదరటం లేదు.. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్ళటం అక్కడ అభిషేకము, అర్చన చేయించుకోవడం చేస్తున్నారు..

ఆన్‌లైన్ సంబంధాలే కాకుండా లోకల్‌గా ఉన్న మ్యారేజ్ బ్యూరోలో కూడా రిజిష్టర్ చేయించారు.. అనేక ప్రయత్నాల తర్వాత ఒక సంబంధం అందరికీ నచ్చింది.. అమ్మాయి పేరు ప్రణతి.. తను కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది.. అమ్మాయి అన్న వినోద్ బ్యాంకులో పని చేస్తున్నాడు.. తల్లి లలిత ఒక్కతే ఉంటుంది.. తండ్రి మరణించాడు.. ఇదీ వారి ఫ్యామిలీ.. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు.. జాతకాలు కుదిరాయి..

వెంటనే పది రోజుల్లో ఎంగేజ్‌మెంట్ చేసారు.. పెళ్ళి ముహూర్తం రెండు నెలల తరువాత కుదిరింది.. ఇరువైపులా చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పెళ్ళికి హాల్ బుక్ చేసుకున్నారు.. సిటీలో అదే ముఖ్యమైన పెద్ద పని..

ఇటువంటి పరిస్థితులలో ఒక రోజు శ్రీనివాస్ అన్న రామారావు ఫోన్ చేసాడు, అమ్మకు బాగా లేదని.. ఇదేమిటి క్రొత్త సమస్య అనుకుంటూ అమ్మను చూడటానికి వెళ్ళారు.. ఆమె వయసు సుమారు 90 సంవత్సరాలు వుంటుంది.. ఆమెను చూస్తే భయమనిపించింది.. రోజుల్లో వుందేమో అనిపించింది.. ఒక ప్రక్క శుభకార్యం అనుకున్నారు.. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మన మధ్య తరగతి జీవితాలకు, అన్నీ లెక్కలేసుకోవడమే కదా..

అమ్మను చూసి వచ్చిన తరువాత శ్రీనివాసుకు దిక్కు తోచలేదు.. పాపం ఒక ప్రక్క ఆడపెళ్ళి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఎలా? ఏం చేయాలి? ఈ విషయం వాళ్ళతో ఎలా మాట్లాడాలి? సంకట స్థితిలో ఉన్నామా అని ఇద్దరూ ఆలోచించడం మొదలు పెట్టారు..

మరునాడు శ్రీనివాస్ చెల్లెలు రమణి, బావ రాఘవ, అమ్మను చూసి వచ్చారు..

“అన్నయ్యా.. అమ్మను చూస్తే భయంగా ఉంది.. మీరు పెళ్ళి అనుకుంటున్నారు.. వీలైతే ప్రీపోన్ చేసుకోండి..” అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చింది..

వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అనుకున్నాడు శ్రీనివాస్..

“శారదా.. ఒక్కసారి వస్తావా..” అంటూ భార్యని పిలిచాడు..

ఇద్దరికీ చెరో కప్పు కాఫీ తీసుకుని వచ్చి ఎదురుగా కూర్చుంది శారద..

“ప్రణతి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్య వినోద్‌ని ఇంటికి రమ్మని పిలుద్దాం.. వాళ్ళు ఒప్పుకుంటే ప్రీపోన్ చేయిద్దాం..” ఏమంటావు అన్నట్లుగా భార్య వైపు చూసాడు..

“మీ ఆలోచన బాగుంది.. ఏమైనా జరిగితే మగ పిల్లవాడి పెళ్ళి చెయ్యకూడదు.. రేపు రమ్మని చెపుదాం..” అంటూ తనూ సలహా ఇచ్చింది..

వెంటనే శ్రీనివాస్ వినోద్‌కి ఫోన్ చేసి వివరించాడు.. “అమ్మగారిని తీసుకుని రేపు రా బాబూ..” అంటూ ఆహ్వానించాడు..

అందరూ విషయాన్ని కూలంకషంగా చర్చించుకున్నారు.. వెంటనే పురోహితునికి ఫోన్ చేసి, సంగతి చెప్పి ఒక మంచి ముహూర్తం, వారం లోపుది చూసి చెప్పమని అడిగారు.. ఆయన పంచాంగం చూసి పిల్లలిద్దరి పేరు మీద రెండు ముహూర్తాలున్నాయని చెప్పాడు.. ప్రణతి అమ్మ గారు లలిత నాలుగు రోజుల్లో ఉన్న ముహుర్తానికి చేసేద్దామని అన్నది.. వాళ్ళు పాపం చాలా కంగారు పడ్డారు..

వాళ్ళు సమావేశమయిన రోజు ఆదివారం.. పెళ్ళి నిశ్చయమయిన ముహూర్తం గురువారం.. కరెక్ట్‌గా 4 రోజుల సమయం మాత్రమే.. అందరూ ఆరోజే అనుకుని పిల్లలకు కూడా చెప్పి ఖరారు చేసుకున్నారు.. దేవుడిపై భారం వేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్దం చేసుకుని లలిత, వినోద్ వెళ్ళిపోయారు..

తెల్లవారి శ్రీనివాస్, వినోద్ కళ్యాణ మండపంకు వెళ్ళారు.. దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో దొరికింది.. వేరే వాళ్ళు కాన్సిల్ చెయ్యటం వలన దొరికింది.. కళ్యాణ ఘడియ సమీపిస్తే అన్నీ అలా కుదురుతాయి..

శ్రీనివాస్ శారదల ఆనందం చెప్పనలవి కాదు.. ఆడపెళ్ళివాళ్ళను బాగా కలుపుకున్నారు.. మగపెళ్ళివారమనే భేషజం చూపించకుండా, వాళ్ళతో కలసి వుండటం వలన పెళ్ళి పనులు ఏ ఆటంకం లేకుండా సాగాయి..

డిజిటల్ శుభలేఖ తయారుచేసి బంధువులందరికి వాట్సాప్‌లో పంపిస్తూ, పెద్దవాళ్ళను ఫోనులో పిలిచారు.. తెలిసిన కంసాలిని పిలిచారు.. బంగారానికి సంబందించిన వస్తువులన్ని 3 రోజుల్లో చేసి ఇచ్చాడు.. మంచి కాటరర్సుని విందు బోజనాలకు ఎంగేజి చేసారు..

దైవికంగా అన్నీ సమయానుకూలంగా సమకూరాయి.. అందరినీ, ఇలా కమిట్మెంటుతో పని చేయిస్తూ ఒక చక్కటి వివాహ వేడుకను, ఆనందంగా, ఆర్భాటంగా, ఏ లోటు లేకుండా జరిపించ గలిగారు.. తక్కువ వ్యవధి అయినా, బంధువులందరూ విధిగా హాజరయి వధూవరులను ఆశీర్వదించారు..

తల్లి దగ్గర పెళ్ళి కొడుకుని చేసారు.. బంధువులందరూ, అమ్మ కోసం వచ్చారు.. అడుగడుగునా వెన్నంటి నిలచిన తల్లి కళ్ళలో ఆనందం చూసిన శ్రీనివాసుకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనుభూతిని కలిగించింది..

ఎక్కువ రూములు దొరకకపోవటం వలన, అక్కడ కొంత మందిని ఉంచి మిగతా వారు హోటల్సులో ఉండి పెళ్ళి అనేది ఇరువురి కార్యం అనుకుంటూ జరుపుకున్నారు..

మమ్మల్ని ఇలా పరుగులు పెట్టించిన ఆ దేవ దేవుని మనసులో ఏమున్నదో తెలియదు కానీ, మాకు మాత్రం ఆఖరుకు అంతులేని సంతృప్తిని కలిగించాడు అనుకున్నారు శారద, శ్రీనివాస్..

మనిషిలో దేవుడిని చూడమని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు.. అందరికీ ప్రశాంతమయిన, ప్రమోద- భరితమయిన జీవితాన్ని అందించాలనే ఆయన తలంపు..

“అనుకున్నామని జరగవు అన్నీ

అనుకోలేదని ఆగవు కొన్నీ

జరిగేవన్నీ మంచికనీ

అనుకోవడమే మనిషి పని..”

అన్న మనసు కవి ఆత్రేయగారిని అనుసరిద్దాం.. అందులోనే ఆనందాన్ని పొందుదాము..

Exit mobile version