Site icon Sanchika

భిన్నమైన ప్రేమకథకు అక్షరరూపమే, ‘అనుకోని అతిథి’ నవల

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘అనుకోని అతిథి’ నవల సమీక్షను అందిస్తున్నారు డా. కె.ఎల్.వి. ప్రసాద్.]

[dropcap]పా[/dropcap]ఠకులు నవలలు చదువుతున్నారా? అని ఒక పిచ్చి ప్రశ్న వేస్తుంటారు, ఏమీ చదవని కొందరు మహానుభావులు! అయితే ఒకప్పుడు నవలలు (ముఖ్యంగా సీరియల్ రూపంలో) తెగ చదివేవారు. అవి పుస్తకరూపంలో వచ్చినప్పుడు కూడా సీరియల్ ఫాలో కాని వాళ్ళు నవల కొనుక్కుని చదివేవాళ్ళు. అది నిజంగా నవలాయుగంగానే చెప్పుకోవాలి. ఆ యుగాన్ని ఏలిన రచయిత్రులలో శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ, మాదిరెడ్డి సులోచన, యద్దనపూడి సులోచనా రాణి, సి. ఆనందారామం, కోడూరి కౌసల్యాదేవి, పరిమళా సోమేశ్వర్ వంటి ఇంకా ఎందరో ఆనాటి పాఠకులకు ఆరాధ్య రచయిత్రులైనారు. అప్పట్లో పత్రికలు కూడా, పాఠకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, నవలా రచయిత్రులను అధికంగా ప్రోత్సహించాయనడం ఏమాత్రం అతిశయోక్తి కాదని నా అభిప్రాయం.

అయితే, ప్రస్తుతం నవల చదివేవాళ్ళ సంఖ్య తగ్గివుండొచ్చుగానీ, నవలలు చదివేవాళ్ళు లేకుండా పోలేదు. అయితే దీనికి అనేక కారణాలు వున్నాయి. ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి, యాంత్రిక జీవన శైలిలో పుస్తకపఠనం అనేది ప్రాధాన్యతల లిస్టులో నుండి పక్కకు జరిగిపోయిందన్న విషయం మాత్రం వాస్తవం! అయినా రాసేవాళ్ళు రాయడం మానలేదు. గతంలో వున్నన్ని పత్రికలు ఇప్పుడు లేకపోయినా, వున్న పత్రికలు, ముఖ్యంగా ‘సంచిక’ వంటి అంతర్జాల పత్రికలు, సీరియల్స్ రాసే రచయిత్రులను రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. అలా.. 1998లో జులై ఆంధ్రభూమి మాసపత్రికలో శ్రీమతి అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి గారు రాసిన ‘ఊహల పందిరి’ మినీ నవల, తర్వాత ‘అనుకోని అతిథి’ నవలగా మన ముందు ప్రత్యక్షం అయింది.

ఈ విభిన్నమైన ప్రేమకథ నాలుగు ముఖ్యమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇదో వింత ప్రేమకథ. కథలోని నాలుగు ముఖ్యమైన పాత్రలు – కృష్ణ మోహన్, శిల్ప, శ్వేత, రవి.

ఇందులో, కృష్ణమోహన్ – శిల్ప భార్యాభర్తలు. చివరికి ఆత్మీయ మిత్రులుగా మిగిలిపోయిన వాళ్ళు, శ్వేత – రవి.

కథకు కేంద్ర బిందువు మాత్రం కుమారి శ్వేతనే! కథ ముగింపుకు సూత్రధారి రవి.

సాధారణంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో, ఒకరినొకరు ప్రేమించుకోవడాలు అన్ని స్థాయిల్లోనూ ఉంటాయి. అలాంటివారిలో, వారి మధ్య ప్రేమలు వివిధ కారణాల వల్ల బెడిసికొట్టడాలు కూడా ఉంటాయి. ఇలాంటి ప్రేమల్లో చిక్కుకున్నవాళ్లల్లో, అవివాహితులు వుంటారు, వివాహితులు వుంటారు. అవివాహితుల మధ్య ప్రేమ చిగురిస్తే అందులో పెద్దగా ప్రత్యేకత ఉండదు. కానీ, ఒక యవ్వనంలో వున్న అమ్మాయి, ఒక వివాహితుడు చుట్టూ తిరుగుతూ ప్రేమరాగం ఆలపిస్తుంటే, అతగాడి పరిస్థితి ఏమిటీ? ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని, ఈ యువతీ ప్రేమను ఎలా అందుకోగలడు? ఇలాంటి ప్రేమకథే ఈ ‘అనుకోని అతిథి’ నవల.

ఆఫీసులో అందమైన తన బాస్‌నే ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి, బాస్ ఇల్లు కనుక్కోని వెళ్లి “మీ ఆయన్ను ప్రేమిస్తున్నాను, ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను” అంటుంది. ఇలాంటి సన్నివేశం బహు అరుదుగా చూస్తాం. ఇక్కడ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి, చక్కని సంసారం బీటలు వారే పరిస్థితులు రావడం, ఇద్దరు యువతుల మధ్య ఆ యువకుడు మానసికంగా నలిగిపోవడం, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వరకూ వచ్చి, ఒక విచిత్రమైన సంఘటనతో ఇద్దరూ కలిసి హాయిగా ఉండడం వంటి అంశాలు రచయిత్రి చక్కగా రాశారు.

అయితే కథ సుఖాంతం ఎలా అయింది, కృష్ణమోహన్ (ఆఫీసులో బాస్) ను ప్రేమించిన అమ్మాయి ఏమైపోయింది, ఇందులో రవి పాత్ర ఏమిటి? మధ్యలో ఇతను ఎలా వచ్చాడు? అసలు కథలో ఈ అనుకోని అతిథి ఎవరు? ఈ ప్రేమకథ పాఠకుడికి ఎలాంటి సందేశం ఇస్తున్నది? వంటి విషయాలు పూర్తిగా తెలియాలంటే నవల చదవవలసిందే.

ఈ రచయిత్రి రచనా శైలి, చదవడం మొదలుపెడితే పూర్తిచేసేవరకూ నవలను వదలకుండా చదివిస్తుంది.

ఒక విభిన్నమైన ప్రేమకథ కోసం ఈ నవల తప్పక చదవవలసిందే!

***

అనుకోని అతిథి (నవల)
రచన: అల్లూరి గౌరీలక్ష్మి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 134
వెల: ₹ 60.00
ప్రతులకు:
రచయిత్రి: 9948392357
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Anukoni-Athidhi-Alluri-Gouri-Lakshmi/dp/B07GNHJ61Z

Exit mobile version