Site icon Sanchika

అనుకూల్ : సత్యజిత్ రాయ్ కథ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం

[box type=’note’ fontsize=’16’] “మనం ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎంతగా అలవాటు పడ్డామంటే ఇప్పుడు ఈ చిత్రం మనల్ని ఆశ్చర్య పరచదు. కాని ఈ కథ అప్పట్లోనే వ్రాశాడు అంటే రాయ్ ఎలాంటి దూరదర్శో అర్థం చేసుకోవచ్చు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘అనుకూల్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఇ[/dropcap]దిగో పైన శీర్షికే చెబుతున్నది నన్ను ఈ చిత్రం తన వైపుకు ఎందుకు లాక్కెళ్ళిందో. నిడివి ముచ్చటగా 21 నిముషాలు. గంగి గోవు పాలు అంటారే అలా వుంది. పూర్తి నిడివి చిత్రం తీయడానికి ముందు చాలా మంది లఘు చిత్రాలు తీస్తుంటారు. వొక్కసారి పెద్ద తెరమీద తమ చిత్రాలు ప్రదర్శించాక లఘు చిత్రాల జోలికి చాలామంది వెళ్ళరు. సుజోయ్ ఘోష్ కహాని, బదలా లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. అసలు ఇతని మొదటి చిత్రమైన ఘంకార్ బీట్స్ తోనే గుర్తింపు పొందాడు. సరే, వొక బెంగాలీ గా అతని పైన్, చాలా మందికి లానే, సత్యజిత్ రాయ్ ప్రభావం చాలా వుంది. అది అతని చిత్రాలలో కూడా కనిపిస్తుంది. ఈ సారి యేకంగా రాయ్ కథనే తీసుకుని వో లఘు చిత్రం తీశాడు. కథ 1976 లో వస్తే, సినెమా 2017 లో.

పోయిన వారం వొక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చూసి వాతలు పెట్టించుకున్నాక, ఈ సారి సేఫ్ గేం ఆడాలనుకున్నాను. నా ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా. ఇది చూడమని రెకమెండ్ చేస్తాను.

నికుంజ్ (సౌరభ్ శుక్లా) కలకత్తా లో వొక హిందీ టీచర్. వొక్కడే వుంటాడు. ఇంటి పనులకి వొక రోబో కొనుగోలు చేస్తాడు, వాయిదాల పధ్ధతి మీద. ఆ రోబో పేరే అనుకూల్ (పరమబ్రత చటర్జీ). మనిషి కాదు కాబట్టి నిద్ర పోడు. శలవలు లేవు. 24 గంటలూ చేసినా ఓవర్ టైం వుండదు. ఇలాంటి రోబోని ఎవరు మాత్రం వద్దనుకుంటారు? అయితే చిత్రంగా అనుకూల్ కి పుస్తకాలు చదవడం ఇష్టం. చదివి, దాని మీద ఆలోచించి, తర్కించే రకం. వో సారి భగవద్గీత చదివి నికుంజ్ తో ధర్మం మీద చర్చిస్తాడు. ఆ సంభాషణ చాలా కీలకం. వాళ్ళను, సమాజాన్ని, అప్పటి పరిస్థితులని వో కోణంలో అర్థం చేసుకోవడానికి. ధర్మం పక్షాన నిలబడాలి సరే, కాని ఏది ధర్మమో ఎలా నిర్ణయించడం? ఎవరు చెబుతారు? అని అడుగుతాడు. ఎడమ వక్షం మీద చెయ్యి పెట్టుకుని ఇది చెబుతుంది అంటాడు నికుంజ్. కథంతా నాలుగు గోడల మధ్యే. కాని బయట వో కార్మిక సంఘ నాయకుడు కేకలేస్తూ పిలుస్తాడు. నువ్వు వో రోబో ని తెచ్చుకున్నావంట. కోల్కొతా లో మేమందరం రోబోలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలీదా? ఎంత మంది ఉద్యోగాలు పోయి ఎలా యాతన పడుతున్నారో తెలీదా? అని నిలదీస్తాడు. లేదు అలాంటిదేం లేదు అనేసరికి వెళ్ళి పోతాడు. అబధ్ధం ఎందుకు ఆడావని అనుకూల్ అడిగితే వొకో సారి అవసరమవుతుంది అంటాడు నికుంజ్. నికుంజ్ కి వరసకి తమ్ముడు రతన్ (ఖరజ్ ముఖర్జీ) కి ఉద్యోగం దొరకదు. అతను అన్న ఇంటికి వచ్చి అనుకూల్ ని చూసి అన్న మీద మండి పడతాడు. ఇలాంటి రోబోల కారణంగానే నీ తమ్ముడు నిరుద్యోగి, అని దుర్భాషలాడి; కోపంలో ఇస్త్రీ పెట్టెతో అనుకూల్ చెంప వాయిస్తాడు. అనుకూల్ పడిపోతాడు, తల డేమేజి అవుతుంది. చౌరంఘీ రోబో సప్లై కంపెనీ నుంచి ఏకావలి ఖన్నా వచ్చి ఆ రోబో ని రెపేర్ చేయించి, ఇకనించి జాగ్రత్తగా వుండమని చెబుతుంది. తనకు హాని చేసే ప్రయత్నం ఎవరన్నా చేస్తే రోబో కరెంటు షాక్ ఇచ్చేట్టుగా తయారు చేయబడింది అని చెబుతుంది. నాలుగు గదుల్లో కేవలం సంభాషణలతోనే కోల్కోతా నగరమంతా ఎలాంటి పరిస్థితులు నెలకొని వున్నాయో తెలియచేస్తాడు. ఈ రోబోలు బాగా ఎక్కువై పోయి, చాలా మందితో పాటే నికుంజ్ కూడా ఉద్యోగాన్ని కోల్పోతాడు. వొకసారి రతన్ వచ్చి వాళ్ళ చుట్టం వొకాయన చనిపోయి, పోతూ పోతూ తన ఆస్తినంతా తన పేర వ్రాసి పోయాడనీ, నికుంజ్ కు మాత్రం ఏమీ వదలలేదనీ చెబుతాడు. వొకసారి వెళ్ళొద్దాం అంటాడు నికుంజ్. నీకు చిల్లి గవ్వ ఇవ్వకున్నా నువ్వు వెళ్ళడానికి తయారయ్యావంటే నీకంటే పిచ్చోడు మరొకడుండడు అంటాడు తాగి వచ్చిన రతన్. నికుంజ్ పక్క గదిలోకెళ్ళినప్పుడు బయట ఉరుము శబ్దం, లోపల ధడాలున మనిషి పడ్డ శబ్దం. చూస్తే రతన్ చనిపోయి పడున్నాడు. అనుకూల్ గుండె మీద చేయి పెట్టుకుని అంటాడు, నా మీద దాడి చేయబోతే నాకిది తప్పలేదు అంటాడు. మర్నాడు లాయర్ వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు వారసుడు వొక్క నికుంజ్ మాత్రమే మిగిలాడు కాబట్టి ఆ పదకొండున్నర కోట్లు అతనివే అని ప్రకటిస్తాడు.

మనం ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎంతగా అలవాటు పడ్డామంటే ఇప్పుడు ఈ చిత్రం మనల్ని ఆశ్చర్య పరచదు. కాని ఈ కథ అప్పట్లోనే వ్రాశాడు అంటే రాయ్ ఎలాంటి దూరదర్శో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు ET స్పీల్బర్గ్ తీసినా అలాంటి కథ రాయ అంతకు ముందే వ్రాసి వున్నాడు. ఇంకా పిల్లల కోసం కథలు, సైన్స్ కథలు, డెటెక్టివె కథలు చాలానే వ్రాశాడు. సుజోయ్ ఘోష్ కూడా చాలా మటుకు వాచ్యంగా చెప్పకుండా సంకేతాల రూపం లో చెబుతాడు. ధర్మం అన్న మాటను చాతీ పై చేయి పెట్టడంతో కలిపి చెప్పడం. అనుకూల్ కి చదవడమే కాదు తర్కించడం అనే మానవ గుణారోపణ చెయ్యడం. కోల్కోతా సినెమాలలో ఎక్కువగా నగరంలో రద్దీ ఎలా వుంటుందో ఇళ్ళల్లో ఫర్నిచర్ల రద్దీ కారణంగా వొక ఇరుకుదనం కనిపించి ఊపిరి ఆడనివ్వదు. ఇందులో కొంత open spaces కనిపిస్తాయి. కథలో, ముఖ్య పాత్రధారులలో ఆ openness కనిపిస్తుంది. పారిశ్రామిక విప్లవం వచ్చినపుడు యంత్రాలకు ఎంత భయపడ్డామో, ఇప్పుడు AI విస్తరణకు ఎంత భయపడుతున్నామో స్ఫురణకు వస్తుంది. మనుషుల్లో వొక పక్క అభద్రతా భావన, కొత్తదనాన్ని నిరాకరించడం, స్వార్థం, అక్కడక్కడా మిగిలిన మానవీయత అన్నీ కనిపిస్తాయి. కావడానికి 21 నిముషాల చిత్రమే అయినా ఆలోచించే కొద్దీ ఆశ్చర్యమేస్తుంది, ఆ లోతుకి. సౌరభ్ గొప్ప నటుడు అని ఇప్పుడు కొత్తగా చెప్పాలా? సుజోయ్ చిత్రాలలో తరచుగా కనిపించే పరమబ్రత కూడా చాలా బాగా చేశాడు. రోబో కదా బాగా చెయ్యడం ఏమిటి అంటారా? ఇది రజనీకాంత్ రోబో లా కాకుండ పరిమిత ఎక్స్‌ప్రెషన్స్ తోనే కాని ప్రభావవంతంగా చేశాడు.

ఇది కాక సుజోయ్ మరో లఘు చిత్రం అహల్య తీశాడు. సౌమిత్ర చటర్జీ, రాధికా ఆప్టేలతో. అది కూడా బాగుంటుంది చూడండి. కొత్తగా దర్శకత్వం చేపట్టే వారు లఘు చిత్రాలు తీయడం ద్వారా, వ్యాపార ప్రకటనల చిత్రాలు చూడటం ద్వారా దృశ్య కథనం మీద కొంత అవగాహన వస్తుంది.

Exit mobile version