Site icon Sanchika

అన్యోన్య దాంపత్యం

[డా. మజ్జి భారతి రచించిన ‘అన్యోన్య దాంపత్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శ్రీ[/dropcap]విద్యకు వాళ్ళ మామయ్య, సోమసుందరం గారిని చూస్తుంటే ఆశ్చర్యంగానూ ఉంది. అంతే కోపంగానూ ఉంది. అత్తగారు బాగా తిరుగాడినంతవరకు ఆమెకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా.. ఆమె బట్టలు.. నగలు.. ఆఖరుకు వంట విషయంలో కూడా..

తన పెళ్లైననుండి చూస్తూనే ఉంది తాను. ఆయనకి ఇష్టం లేకుండా ఏమి చేసినా, ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఆయన “శారదా” అని గట్టిగా పిలిస్తే “అమ్మో! ఆయనకు కోపం వచ్చింది” అనుకుంటూ గదిలోకి వెళ్ళేది. ఆ వెళ్లడం వెళ్లడం అరగంట వరకూ బయటకు వచ్చేది కాదు. లోపల ఏమి జరిగేదో! ఏమో! ఎవరికీ తెలియని రహస్యం.

ఆ రోజు వంట ఏమి చెయ్యాలి? ఏ కూరలు వండాలి? అవి ఏ రకంగా చెయ్యాలి? అనేది ఆయనే నిర్ణయించేవారు. ఒక ఫంక్షనుకు వెళితే ఆమె యే చీర కట్టుకోవాలో, యే నగలు వేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించేవారు. ఆ విషయంలో ఆమెకు ఏ రకమైన కంప్లైంటూ ఉండేది కాదు. ఉండబట్టలేక తానెప్పుడైనా “ఏమిటిది? అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాలా? మీకు ఇష్టాయిష్టాలంటూ ఉండవా?” అని అడగబోతే.. “పోనీలెద్దూ! ఆయన సంతోషం ఆయనది. ఆయన ఏది చేసినా నన్ను దృష్టిలో పెట్టుకునే చేస్తారు. నిజం చెప్పాలంటే నాకేం కావాలో ఆయనకు తెలిసినంత బాగా, నాకే తెలియదు. ఆ మాత్రం దానికి,  ఆయన మాట ఎందుకు కాదనాలి?” అని చిరునవ్వుతో దాటవేసేవారు.

అటువంటిది ఇప్పుడావిడకు యాక్సిడెంట్ అయి, ఐసీయూలో ఉంటే క్షణం విడవకుండా అన్నీ ఆయనే చేస్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది శ్రీవిద్యకు. ఆమె బాగున్నంతసేపు ఏమి పట్టించుకోకుండా.. ఇప్పుడు ఆమెకు స్పృహలో లేనప్పుడు ఎన్ని సపర్యలు చేస్తే మాత్రం ఆమెకు తెలుస్తుందా ఏమిటి? నిజంగా ఆమె అంటే ప్రేమ ఉండి చేస్తున్నారా? లేక అపరాధ భావం నుండి తప్పించుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు.

ఒక్కొక్కసారి ఆయనను చూస్తుంటే జాలి కూడా వేస్తుంది. అటువంటప్పుడు “మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మేమిక్కడ ఉంటామంటే” ఆయన ఒప్పుకోవడం లేదు. ఆఖరికి ఆయన పిల్లలు..  చైతన్య, స్రవంతి కూడా ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నారు.

“ఇన్ని సంవత్సరాలూ, నాకు నా కుటుంబానికి సేవలు చేసింది. ఇప్పుడు నేను తన క్రింద చేయడంలో గొప్పేమి ఉంది? అయినా మీ అమ్మకేమి కావాలో మీకెవ్వరికి తెలియదు. ఏ క్షణంలో తనకే అవసరం పడుతుందో.. అందుకని నేనే తన దగ్గర ఉంటాను” అనేస్తున్నారు.

డాక్టర్లు కూడా “మీరు కాస్సేపు రెస్ట్ తీసుకోండి. మేము చూసుకుంటాం. ఈ వయసులో మీకేదైనా అయితే కష్టం” అని చెప్పినా వినడం లేదాయన. ఆఖరికి వాళ్లే  ఐసీయూలో ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేశారాయనకు.

ఆయనకు మెలకువ ఉన్నంతసేపూ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నారు. స్పృహలోలేని ఆమెకు  ఆయన మాటలు వినిపించవని తెలిసినా, అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ప్రయత్నాలకు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వాళ్లు కూడా “మామ్మగారూ! తొందరగా స్పృహలోకి వచ్చేయండి. ఈయన బాధ మేము చూడలేకపోతున్నాం” అనేంతగా.

***

చైతన్యకు నాన్నను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నాన్నలో ఈ కోణం కూడా దాగి ఉందా అని. నాన్న అమ్మను యింతగా ప్రేమించారా అని. ఇంట్లో ఎంతమంది చుట్టాలు ఉన్నాగాని.. ఎంతమందిలోనైనా.. అమ్మను “శారదా” అని గట్టిగా పిలిస్తే.. చేతిలో ఉన్న పనులను ఆపేసి తక్షణం అమ్మ గదిలోకి వెళ్ళవలసిందే. క్షణం లేటయితే ఆయనే బయటకు వచ్చి “పిలిస్తే వినిపించడం లేదా!” అనేవారు.

గదిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో ఒకసారి పెద్దత్త, చిన్నాన్న భార్య సుమతి పిన్ని అమ్మానాన్నల గది ముందు చెవులు రిక్కించుకొని తలుపులకు చేరబడి ఉండగా నాన్న దడాలున తలుపులు తీస్తే, పెద్దత్త ముందుకు పడబోయింది. అప్పుడు నాన్న చూసిన చూపు ఎవ్వరూ మర్చిపోలేదు. అంతే! ఆ తర్వాత గదిలో ఏమి జరుగుతుందోనన్న కుతూహలం ఎంత ఉన్నాగాని, ఆ గది దరిదాపులకు కూడా ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అందుకని లోపల ఏమి జరిగేదో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

ఇంట్లో ఎంతమంది ఉన్నా నాన్న వంటగదిలోకి వచ్చి, ఆ రోజు వంట ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అని చెప్పి వెళ్ళేవారు. అమ్మ అలాగే చేసుకుంటూ పోయేది. చుట్టాలందరూ “శారద కాబట్టి అలా ఉంది. అదే మేమైతేనా.. అమ్మో! అలా ఉండడం మా వల్ల కాదు” అనేవారు.

కాని అమ్మ ఏ రోజూ నాన్న గురించి ఎవరి దగ్గరా మాట మాత్రంగానైనా అనేది కాదు. “మీ నాన్న చాలా మంచివారురా” అనేది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు “మీ నాన్నలా నువ్వు కూడా నీ భార్యను అలాగే చూసుకోరా” అని చెప్పింది ఒకసారి.

దానికి తాను “అమ్మా! నిన్ను నాన్న పిలిచినట్టు.. నేను మా ఆవిడని పిలిస్తే, రెండోరోజే పుట్టింటికి పోతుంది. నీకున్న సహనం ఎవరికీ ఉండదమ్మా!” అంటే, తేలిగ్గా నవ్వేసి “నీకు పెళ్లయ్యాక తెలుస్తుందిలేరా, మీ నాన్న నన్నెంతగా ప్రేమిస్తున్నారనే విషయం” అనేసింది. అమ్మ హాస్పిటల్‌లో జాయిన్ అయినవరకు కూడా తనకా విషయం తెలిసిరాలేదు.. నాన్న అమ్మని యింతగా ప్రేమిస్తున్నారా అని! అమ్మ లేకపోతే ఉండలేనన్నంత ఎక్కువగా అమ్మను ప్రేమిస్తున్నారని.

కాని అమ్మకు యాక్సిడెంట్ అవ్వకముందు తాము చూసిన నాన్న స్వభావానికి, ఇప్పటి నాన్న స్వభావానికి పోలికే లేదు. కానీ నాన్నప్రేమ పట్ల అమ్మకున్న నమ్మకం.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు తాను. ఇటువంటి దాంపత్యం చాలా అరుదుగా చూస్తాం. అమ్మ తనకు చెప్పినట్లు, నాన్న అమ్మను ప్రేమించినంత బాగా, తాను తన జీవితకాలంలో శ్రీవిద్యను ప్రేమించగలడా! అనుమానం వచ్చింది చైతన్యకు.

***

స్రవంతికి అమ్మను చూస్తుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో నాన్న గొంతే గట్టిగా వినిపించేది. అమ్మమాట కూడా వినిపించేది కాదు. ఎప్పుడైనా తాము అల్లరి చేస్తే “వద్దమ్మా నాన్నకు ఇష్టం ఉండదు” అనేది అంతే. అంతకుమించి ఒక్కమాట కూడా మాట్లాడేది కాదు. యింట్లో అన్నీ నాన్న నిర్ణయాలే. అమ్మకు ఏ రకమైన కంప్లైంటూ ఉండేది కాదు.

“మీ నాన్నకు అన్నీ బాగా తెలుసు. ఏది ఎప్పుడు, ఎలా చేయాలో, ఆయనను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ నాన్నలా అందరూ ఉంటే అన్ని కుటుంబాలూ సంతోషంగా ఉంటాయి” అని తిరిగి నాన్న గురించి గొప్పగా చెప్పేది. “మీ నాన్న నన్ను చూసుకున్నట్లు, వచ్చే అల్లుడు నిన్ను చూసుకుంటే చాలమ్మా” అనేది.

“వచ్చేవాడు ఎలా ఉండాలో తెలియదుగాని, నాన్నలా అన్ని నిర్ణయాలు తానే తీసుకునేవాడు మాత్రం వద్దమ్మా” చెప్పేది తాను. “పిచ్చి మొహమా! నీ పెళ్లయ్యాక తెలుస్తుందిలే, నాన్న నన్నెంత బాగా చూసుకుంటున్నారన్న విషయం” అని తేలిగ్గా నవ్వేసేది.

అమ్మకు నాన్నమీద అంత నమ్మకం ఎందుకో, ఇప్పుడు అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు.. అమ్మ గురించి నాన్న పడుతున్న తాపత్రయం చూస్తే తెలుస్తుంది. ఇందులో సగం ప్రేమ, వంశీ తనమీద చూపించినా చాలని అనిపిస్తుందిప్పుడు. అమ్మ కోలుకోకపోతే నాన్న పరిస్థితి ఊహించడానికే భయమేస్తుంది స్రవంతికి.

***

చూడటానికి వచ్చే దగ్గర బంధువులకు కూడా సోమసుందరంను చూస్తే ఆశ్చర్యమేస్తుంది, భార్యకు యింతలా ఎవరైనా చేస్తారా అని. అందులోకి సోమసుందరం ఏనాడూ భార్యమీద ప్రేమను నలుగురిలో చూపించి ఎరగడు మరి.

***

డాక్టర్ల వైద్యమో! ఆయన చేసిన సేవల ఫలితమో! లేక భగవంతుడికే ఆయనమీద జాలివేసిందో! ఏమైతేనేం.. రెండు వారాలకు ఆమె కళ్ళు విప్పిచూసింది. ఎదురుగా కన్నీళ్ళతో భర్త.

“చాల్లేండి మీరు మరీను.. ఆ కన్నీళ్లేమిటి? ఎలా అయిపోయారో చూడండి. ఐనా నేను మిమ్మల్ని విడిచి పోతాననుకున్నారా ఏమిటి? ఆ యమధర్మరాజుకైనా తెలియదా, మీరు నన్ను విడిచి ఉండలేరని. అందుకే తిరిగి పంపించేశాడు. నాకింకేమీ భయంలేదు. మీరు కాస్సేపు నిద్రపోండి. లేకపోతే ఎవరైనా చూస్తే హాస్పిటల్లో ఉన్నది నేనా! లేక మీరా! అని అనుమానపడతారు” అందామె హీనస్వరంతో, కళ్ళమ్మట నీళ్లు కారుతుంటే.

“ఎంత భయం వేసిందో శారదా! నా మాట లెక్కచేయకుండా వెళ్ళిపోతావేమోనని” చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేసాడు సోమసుందరం. వెక్కివెక్కి ఏడుస్తున్న సోమసుందరాన్ని చూసి అందరికీ, కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి.

***

శారదమ్మగారు ఇంటికి వచ్చి రెండు వారాలు దాటింది. నిన్ననే అన్ని పరీక్షలూ చేసి “అంతా బాగుంది. మందులు వాడక్కరలేదు” అని చెప్పారు. ఆమాట విని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరికన్నా ఎక్కువగా సోమసుందరంగారు సంతోషించారు.

“మీ నాన్న నన్ను చూసుకున్నట్టు నువ్వు కూడా నీ భార్యనలాగే చూసుకోరా – అని నా పెళ్ళికి ముందు అమ్మ చెప్పింది.  అప్పుడు ఆ మాటలను నేను సీరియస్‍గా తీసుకోలేదు. కాని అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాక, మీలాగే ఉండాలని అనుకుంటున్నాను. మీరు అమ్మనెలాగ చూసుకున్నారో చెప్పరా? మీరెప్పుడూ అమ్మతో కోపంగా ఉన్నట్టే అందరికీ బయటకు కనిపిస్తుంది. కాని మీ మనసులో అమ్మమీద యింత ప్రేమ ఉందని ఎవరికీ తెలియదు. అమ్మకు మీ మీద అంత నమ్మకం ఎలా కుదిరింది? కొంచెం చెప్పండి నాన్నా!” అడిగాడు చైతన్య తండ్రిని, ఆయన మంచి మూడ్‌లో ఉన్నప్పుడు.

‘శారదకు నా మీద అంత నమ్మకం ఎలా కలిగిందా?’ ఆలోచనలలోకి జారుకున్నాడు సోమసుందరం.

తమది పెద్ద కుటుంబం. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్లు, వాళ్ల కుటుంబాలు. అందరితో ఇల్లు ఎప్పుడూ మనుషులతో నిండి ఉండేది. అందరికీ సేవ చేసేది పెద్దకోడలు శారదే. మిగిలిన వాళ్ళు తెలివిగా పని తప్పించుకునేవారు. ఇంట్లో పనంతా చేసి, రాత్రి ఏ పదింటికో అలసిపోయి గదిలోకి వచ్చి నిద్రపోయేది శారద. దాంతో తనకు శారదమీద చాలా కోపం వచ్చేది, అందరిలాగా పని తప్పించుకోలేనందుకు, తనతో ఎక్కువ కాలం గడపనందుకు. శారదను విసుక్కునేవాడు, కసురుకునేవాడు. కాని, పాపం.. ఏ రోజూ నోరు తెరిచి సమాధానం చెప్పేదికాదు. అందరూ గమనించినా, గమనించనట్టు ఊరుకునేవారు.

తన తండ్రి ఒక్కడే అందరిలా ఊరుకోలేదు. “నీ కుటుంబానికి సేవ చేస్తున్న నీ భార్యమీద విసుక్కుంటావెందుకు? చేతనైతే ఆమెను ఆ పరిస్థితి నుండి తప్పించు. ఎలా అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది” నవ్వుతూ చెప్పాడు తండ్రి.

తండ్రి చెప్పిన మాటల్లో అంతరార్థమేమిటా అని ఆలోచించగా, అర్థమైంది తానేమి చేయాలో! అంతే! రాత్రి గదిలోకి వచ్చిన తర్వాత కాకుండా, పనిలో ఉన్నప్పుడు అందరి ముందూ గట్టిగా పిలిచేవాడు “శారదా” అని. ఆ పిలుపుకి శారదే కాదు, మిగిలినవాళ్లు కూడా భయపడేవారు. గదిలోకి వచ్చిన శారదను అరగంట కూర్చోబెట్టేవాడు. ఈలోగా  తప్పదన్నట్టు, శారద వదిలిన పనిని మిగిలిన వాళ్ళు చేసుకునేవారు. అలా శారదకు విశ్రాంతి దొరికేది. నిజంగానే పిచ్చిది. లేకపోతే, “పోనీలెండి మన ఇంటికివచ్చి వాళ్లు పనిచేయడమేమిటి? మీరిక్కడ నన్ను కూర్చోబెట్టడమేమిటి? నాకేమీ నచ్చలేదు సుమా!” అని కోప్పడేది. “నా మాట వినకపోతే నిజంగానే నాకు కోపం వస్తుంది” దొంగ కోపం నటించేవాడిని. “వద్దు బాబు! మీ కోపం భరించలేను. మీరు చెప్పినట్టే వింటాను” అనేసేది.

ఇక వంట విషయంలో కూడా.. వాళ్లకి అది నచ్చుతుందని, వీళ్ళకి ఇది యిష్టమని.. యిలా పది రకాలు చేసేది. అందుకే ఆ విషయంలో కూడా తానే కల్పించుకోవలసి వచ్చేది. లేకపోతే అలా వంటగదిలోనే ఉండేది.

యిక బట్టలు, నగల విషయానికొస్తే అందరికీ కొనేది గాని, తనకు తాను ఏమీ కొనుక్కునేది కాదు. అందుకే అవి కూడా తనే కొనాల్సి వచ్చేది. ఆ రకంగా తాను కోపిష్టి భర్తగా, భార్యకు యే విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వనివాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయాడు. ఆఖరికి పిల్లల దృష్టిలో కూడా. తన తండ్రి ఒక్కడే తనని చూసి మీసం మెలేసేవాడు. ఇప్పుడివన్నీ కొడుకుతో చెప్పాలా! అవసరం లేదేమో!

“మీ అమ్మ పిచ్చిదిరా. ఎవరికేమి కావాలో పట్టించుకుంటుంది. అందరి అవసరాలూ తీరుస్తుంది. కాని తనకేం కావాలో ఎప్పుడూ పట్టించుకోదు. అందుకే తనకేమి కావాలో నేను పట్టించుకుంటాను. భార్య చెప్పకుండా ఆమె అవసరం ఏమిటో భర్త గ్రహించుకుంటే ఆమెకంతకన్నా ఆనందం ఏముంటుంది? నేను అదే చేశాను. అందుకే మీ అమ్మకు నేనంటే అంత గౌరవం. గ్రహించుకుంటే నువ్వూ చెయ్యగలవు. కాకపోతే మీ అమ్మ దగ్గర శ్రీవిద్య ఉన్నంతవరకూ నీకా అవసరం రాదు. మీ అమ్మే చూసుకుంటుందంతా” నవ్వేశారు సోమసుందరంగారు.

Exit mobile version