Site icon Sanchika

అన్యోన్య దాంపత్యానికి నిర్వచనం గురజాడ వారి ‘కాసులు’

[box type=’note’ fontsize=’16’] సెప్టెంబరు 21 గురజాడ జయంతి సందర్భంగా గురజాడ గారు ‘కాసులు’ కవిత ద్వారా సమాజంలో, కుటుంబంలో, స్త్రీ పురుష సంబంధాలలో ఉదాత్తమైన మార్పును కాంక్షించిన వైనాన్ని వివరిస్తున్నారు చెంగల్వ రామలక్ష్మి. [/box]

[dropcap]ప్రే[/dropcap]మ అనే అంశం తీసుకుని మానవ జీవితంలో అది ఏ ఏ రూపాల్లో వుంటుందో, ఏ సంధర్భాల్లో ఎటువంటి పరిణామం పొందుతుందో వాటినన్నింటినీ గురజాడ అప్పారావు కవిత్వ రూపంలో రాయాలనుకున్నారట. వాటిలో కొన్ని మాత్రమే రాసారుట. ఈ విషయాన్ని గిడుగు రామమూర్తిగారు, అప్పారావుగారి కుమారుడు రామదాసుగారితో స్వయంగా అన్నారుట కూడ.

‘కాసులు’, ‘ముత్యాల సరములు’, ‘డామన్ – పిథియస్’, ‘లవణరాజు కల’ ఈ కోవలోకి చెందినవే.

సమాజంలో మానవుల మధ్య గాని, స్త్రీ పురుషుల మధ్యగాని ప్రేమ భావం ఉంటే అది అన్ని అసమానతలను పోగొడుతుందని గురజాడ వారి విశ్వాసం. సాటి మనిషికి హృదయమిచ్చి ప్రేమించాలని క్రీస్తు చెప్పిందీ, షెల్లీ ప్రవచించిందీ, బుద్ధుడు ఉపదేశించినదీ ఈ ప్రేమను గురించేననీ వారు చెప్పారు.

కుటుంబంలో స్త్రీ పురుష సంబంధాలను గురించి గురజాడ వారికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వారి భావాలను ‘కాసులు’ కవిత స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.

భార్యాభర్తల మధ్య వయసు తారతమ్యం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తదితర కారణాల వల్ల నాటి స్త్రీలకు భర్తంటే ఒక భయం, గౌరవం తప్ప చనువు ఉన్నట్లు కన్పించదు. అందుకే గురజాడ భర్త దేవుడనే మాట పాత మాటని, భర్తను ప్రాణమిత్రుడుగా భావించాలన్నాడు.

ధనము, బంగారం ఆశాశ్వతమైనవి ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. దీనిని ఇంట్లో ఎవరూ నేర్పరు. శాస్త్రాలలో ప్రేమను గురించి చెప్పరు. అది హృదయంలో నుంచి రావాలి. బంగారం స్త్రీలకు అందాన్నిస్తుంది. కాని, స్వచ్ఛమైన ప్రేమ ఇంకా అందాన్నిస్తుంది. కాని, ఇటు వంటి ప్రేమ భావన దంపతుల మధ్య ఎలా పెంపొంతుంది? అంటే వారి మధ్య ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు.

‘ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును’
‘ప్రేమ పెంచక పెరుగునే
ప్రేమ కలుగక బ్రతుకు చీకటి’

దంపతుల మధ్య ప్రేమ ఆనే భావన లేకపోతే ఆ బంధం యాంత్రికమై పోతుంది, రసహీనమైపోతుంది. అందుకే ప్రేమ బంధంతో ముడుపడని బతుకు చీకటి.

ఎంత గొప్ప భావాలిని! ఎంత ఉన్నతమైన అలోచనలివి!

మరులు, ప్రేమ ఒకటే అని భావించకూడదు. మరులు వయసు పోయినపుడు పోతుంది. శాశ్వతంగా ఉండేది ప్రేమ ఒక్కటే. అది హృదయ సంబంధి! ఇక్కడ మరులు అంటే అకర్షణ, మోహం.

వయసు పెరుగుతున్న కొద్దీ దంపతుల మధ్య ప్రేమ మరింత వికసించాలి. మరింత అవగాహన పెరగాలి. దాంపత్యం నిత్య నూతనంగా ఉండాలి.

మానవ జీవితంలో దాంపత్యం ప్రధానమైనదని గురజాడ భావించారు. జీవితాంతం దంపతులు ఆనందంగా అన్యోన్యంగా ఉండాలని వారి భావన. భార్యాభర్తల సంబంధం చెడిపోతే అది సమాజానికి అనర్థ హేతువు.

ప్రేమ హృదయంలో పుష్పించే ఒక కోమల పుష్పం కావాలి. అది అజ్ఞానమనే అంధకారాన్ని పొగొట్టి అత్మను తేజోవంతం చేస్తుంది. ఆయితే ఇది ఉన్మాదావస్థను తెచ్చిపెట్టే మోహం మాత్రం కాదు. స్త్రీ పురషుల మధ్య తాత్కాలిక ఆకర్షణ కాక శాశ్వతంగా నిలచిపోయే ప్రేమ భావన ఉండాలని గురజాడ చెప్పారు.

నేడు ప్రేమ పేరుతో అకర్షణలో పడి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకునే వారికి మంచి సందేశం లాంటిది గురజాడ వారి ‘కాసులు’.

మాయ మర్మము లేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటే

అదే

బ్రతుకులో సుఖ సంతోశషాలకు రాజమార్గంగా వారు భావించారు.

స్త్రీ పురుష సంబంధాలను గురించి గురజాడ చెప్పిన భావాలు ఊరికే తేలికగా చెప్పినవి కాదు. నాటి సమాజంలో, కుటుంబంలో స్త్రీ పురుషుల మధ్య వున్న సంబంధాలను లోతుగా పరిశీరించి చేసుకున్న నిర్ణయాలు. ఈ అసమానత తొలిగిపోవాలని భార్యాభర్తలు స్నేహితుల్లా మెలగాలనే వారి భావనను వారి కవిత స్పష్టం చేస్తుంది.

అయితే గురజాడ వారి ఆకాంక్ష ఆకాలానికి ఆచరణలు అంత తేలికగా సాధ్యమయ్యే విషయం మాత్రం కాదు. మగవారి పెత్తనం కింద స్త్రీలు ఎంత నలిగి పోతున్నారో ఓసారి ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం అనే తన శిష్యుడికి గురజాడ లేఖ రాసారు. అందులో చుట్టూ కన్పిస్తున్న వైవాహిక జీవితాన్ని పరిశీలించమని, అవగాహన చేసుకొమ్మని రాశారు. అందుకోలేని దుస్సాధ్యమైన నీతి సుత్రాలపై స్త్రీ పురుషు సంబంధాలు ఆధారపడి ఉన్నాయని రాశారు.

స్త్రీ పురుషుల మధ్య అధిక్య అధీన భావాలుండటం చిన్నతనంలోనే వివాహం కావటం, భార్యను ఇంటి పనులు చేసే వ్యక్తిగా మాత్రమే పురుషులు గుర్తించటం, ఇద్దరి మధ్య ప్రేమ అశ భావన కొరవడటం, స్త్రీ పురుష సంబంధాలలో అసమానతకు కారణాలు. సమాజం విధించిన సాంఘిక శాసనాలు, ధర్మాలు లోపభూయిష్టంగా ఉన్నప్పడు వాటిని ఎదుర్కోవాలని గురజాడ భావించారు.

అప్పుడున్న సాంఘిక భావాలు పోయి వాటి స్థానే కొత్తవి రావాలసిన అవసరాన్ని వారు గుర్తించారు.

ఎందుకంటే దంపతులు మధ్య పరస్పర అనురాగం పెరగక పోవడానికి ఒక్కొక్కసారి వారి చుట్టూ వుండే వాతావరవణం కూడా కారణమవుతుంది. కుటుంబంలోని ఇతర వ్యక్తులెవరైనా భార్య వద్ద భర్తను, భర్త వద్ద భార్యను చులకన చేస్తూ మాట్లాడుతూ వుంటారు. ఈర్ష్యతో అసూయతో కాపురాలను విడదీయటానికి ప్రయత్నిస్తారు. లోపాలేవైనా వుంటే గోరంతలు కొండంతలు చేస్తారు. లేని లోపాలు పుట్టించి, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తే చూసి మానసికానందాన్ని పొందుతారు. దీని వలన దంపతుల మధ్య దూరం మరింత పెరిగిపోతుంది.

సమాజంలో, కుటుంబంలో మానవ స్వభావంలోని భిన్న కోణాలను గురుజాడ వారు పరిశీలించిన తీరు, వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా తోస్తుంది.

తన కాలం నాటి సమాజంలో వైవాహిక జీవితంలోని అసమానతను, లోపాలను గుర్తించిన గురజాడవారు తాను స్త్రీ పురుష సంబంధాలలో ఎటువంటి మార్పును కోరుకుంటున్నారో తెలియజేస్తూ అధునిక దృక్పధంతో రచించినదే ‘కాసులు’ కవిత.

స్త్రీ పురుషుడి కన్న ఎందులోనూ తక్కువ కాదని వారి భావన. స్త్రీలు మేల్కోవాలి, తిరగబడాలి, అధునిక మహిళ మానవ చరిత్రను తిరిగరాయాలని చెప్పారు గురజాడ. ఎంతో దూరదృష్టితో కూడిన మాటలివి.

కాసులు కవితలో భర్త భార్యతో ‘నేను నీకు ప్రాణమిత్రుడును నీ ప్రేమ పొందక పోతే పేదను, పొందితే తన పదవి ఇంద్రుని కన్న ఎక్కువ’ అంటాడు.

నేడు ఇటువంటి ఉన్నత భావాలు ఊహించటానికి కూడ సాధ్యం కానివి. భార్య ప్రేమను పొందటాన్ని ఇంద్రపదవి కన్న మిన్నగా భావించటం ఉందా?

గురజాడ వారి కాలం నాటి సమాజాన్ని పరిశీలిస్తే అధిక శాతం పురుషాధిక్యమే కన్పిస్తుంది. స్త్రీ అణచివేతకు గురయినట్లే కనిపిస్తుంది. స్త్రీల కన్నీటి గాథలకు గల కారణాలను గురజాడ అంచనా వేశారు. కుటుంబం స్త్రీ ప్రాధాన్యతను పలుచోట్ల చెప్పారు వారు.

సమాజంలో, కుటుంబంలో, స్త్రీ పురుష సంబంధాలలో ఉదాత్తమైన మార్పును కాంక్షిస్తూ చేసిన రచన ‘కాసులు’.

ఒక చోట ‘స్త్రీ శారీర సౌఖ్యం పొందటం గొప్పకాదు, ఆమె మేథాశక్తిని గ్రహించి రసానుభూతిని పొందటం గొప్ప’ అన్నారు గురజాడవారు. స్త్రీని వ్యక్తిత్వం కల వ్యక్తిగా గౌరవించాలని, ఆమె భావాలను, మనసును గౌరవించాలని వారి భావన. అందుకే కాసులు కవితలో భర్త పాత్ర అంత ఉదాత్తంగా ఉంది.

గురజాడ వారి కాలం నాటికీ, నేటికీ సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. నేటి స్త్రీలు ఉన్నతమైన చదువులు చదవుతూ వుండటం, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ వుండటం కారణంగా, కుటుంబంలో స్త్రీ పురుష సంబంధాలలోనూ అభ్యుదయకరమైన మార్పు వచ్చిందనే అనుకోవచ్చు. కాని, నాటి పరిస్థితి నేటికీ కొన్ని కుటుంబాలలో స్త్రీల విషయంలో కొనసాగుతోందన్న విషయమూ ఒప్పుకోక తప్పదు.

అందుకే గురజాడ వారి రచనలు చదువరులకు ఎప్పుడూ స్పూర్తిదాయకాలే.

Exit mobile version