[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డా॥ సి.భవానీదేవి, గౌరవ అధ్యక్షులుగా ప్రఖ్యాత కవి, సాహితీవిమర్శకులు డా॥ పాపినని శివశంకర్ ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 23న గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ కొత్త అధ్యక్ష, గౌరవ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత సంవత్సరం ఇదే వేదికపై 3వ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అనారోగ్యకారణంగా మృతి చెందగా, వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరిగింది.
బాపట్లకు చెందిన డా॥ సి.భవానీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవయిత్రిగా, కథా, నవలా, వ్యాసరచయిత్రిగా, కాలమిస్టుగా, పలుభాషల అనువాదకురాలిగా సి.భవానీదేవి తెలుగు సాహిత్యరంగంలో తనదైన బహుముఖీనమైన సేవలు అందించారు. పలు ప్రక్రియల్లో బహుగ్రంథాలు వెలువరిచారు. ఈ ఏడు భవానీదేవి సాహితీస్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ , ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎన్నిక కాబడడం విశేషం.
అలాగే డా॥ పాపినేని శివశంకర్ తెలుగు సాహిత్యరంగానికి చిరపరిచితమైన పేరు. పూర్వ కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యులుగా పని చేసారు.
ఈ కార్యవర్గ సమావేశంలో ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారిగా నానా, ఉపాధ్యకక్షులు డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, కార్యదర్శులు ఎస్.ఎమ్.సుభాని, శర్మ సిహెచ్ తదితరులు పాల్గొన్నారు.
-చలపాక ప్రకాష్, ప్రధాన కార్యదర్శి