అపరాధం

2
2

[dropcap]భా[/dropcap]రీగా వర్షం పడుతోంది. డ్రైవరు యాక్సిలరేటర్‌ను కొద్దిగా తగ్గించాడు. పాడేరు నుండి విశాఖకు రాత్రులలో కారు నడపాలంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి వుంటుంది. ఎవరైనా తుఫాను సమయంలో ఇంట్లో వుండాలని కోరుకుంటారు. కాని డ్రైవరు ఆర్థిక పరిస్ధితి దారుణంగా వుంది. సినిమా కష్టాలన్నీ అతనికే వున్నాయి. మరోవైపు నెలపడితే కారు ఇన్‌స్టాల్మెంట్ కట్టాల్సివుంది. వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశ అతనిని ముందుకే కదిలించింది. నిజానికి విశాఖ నుండి పాడేరుకు వేరే వాళ్లకు బాడుగకు వచ్చాడు. రాత్రి పాడేరులోనే వుండొచ్చు. కాని ఇంట్లో భార్యకు బాగాలేదు. బాడుగ డబ్బులతో ఆమెకు బాగు చేయాల్సివుంది. డ్రైవరుకు ఆరోగ్యం బాగాలేక 20 రోజుల తర్వాత కారు బయటకు తీశాడు.

“ఎవరైనా విశాఖకు వెళ్లే వాళ్లుంటే బాగుండును” మనసులోనే అనుకున్నాడు.

అతను కారు హెడ్ లైట్ల వెలుగులోకి పదునైన కళ్ల చూపును సారించాడు. అప్పుడే మెరిసిన మెరుపు వెలుగు రోడ్డును మరింత కాంతివంతం చేసింది. వర్షం రోడ్డును శుభ్రంగా కడిగేసింది. రోడ్డు పక్కన ఒక వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి గోధుమ రంగు చొక్కా ధరించాడు. అతను చేతితో కారును ఆపడానికి ప్రయ్నతించాడు. డ్రైవరు కారును ఆపాడు. విండో గ్లాసును కొంచెం కిందికి దించాడు.

“మీరు విశాఖవైపే వెళుతున్నారా” కారు ఆపిన వ్యక్తి అడిగాడు.

“అవును. కాని మీరు డబ్బు ఎక్కువ ఇవ్వవలసి వుంటుంది. వర్షం కదా” డ్రైవరు పొడిగా అన్నాడు.

కారును ఆపిన వ్యక్తి సాలోచనగా తలూపాడు. అతను కారు డ్రైవరు సీటు వెనక వైపు ఎక్కాడు. వర్షం నుండి బయటపడటం అతనికి ఆనందాన్ని ఇచ్చిందేమో తెలీదు. కారు ఎక్కంగాల్నే డోరును గబాన మూశాడు. అతను తన వీపును వెనక్కి వాల్చి బలంగా నిట్టూర్చాడు. పొడుగ్గా వున్న వ్యక్తికి 50 సంవత్సరాలుంటుంది. టోపి తీయడం వల్ల అతని తెల్లని జుట్టు మెరుపు వెలుగులో మెరుస్తోంది. గడ్డం నీటుగా షేవ్ చేసివుంది.

‌‌‌‌”వర్షం పడిన భయంకర రాత్రి ఇదేనేమో” అన్నాడు డ్రైవర్.

పొడుగాయన తన చూపులను స్ధిరంగా రోడ్డు వైరే సారిస్తున్నాడు. వర్షపునీటి చుక్కలు అతని ముఖం మీద ఇంకా కారుతున్నాయి.

సోలోచనగా “అవును, అవును ” అన్నాడు.

డ్రైవర్ కారును వేగంగా తుఫాను వర్షం గూండా పోనిస్తున్నాడు. పొడుగాయన అతని భుజం మీద నుండి లైటు వెలుగులో మెరుస్తున్న రోడ్డును తదేకంగా చస్తున్నాడు.

“సార్ మీరు బాగానే వున్నారా” డ్రైవరు అడిగాడు.

పొడుగాయన తడుముకున్నాడు.

వారు కొద్దిసేపు మౌనంగా వెళ్లారు.

నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ డ్రైవరు “సార్ విశాఖకు వెళ్లాలంటే మూడు వేలు ఇవ్వాల్సి వస్తుంది” నిదానంగా అన్నాడు.

పొడుగాయన సానుకూలంగా తలూపాడు. అది కారులోను మిడిల్ మిర్రర్ నుండి డ్రైవరుకు కనిపించింది.

“మీరు ఏదన్నా పని మీద వెళుతున్నారా” డ్రైవర్ అడిగాడు.

మౌనమే సమాధానంగా వచ్చింది.

“మీరు స్నేహితులను చూడటానికి వెళుతున్నారా” ఎందుకంటే అతను ఈ ప్రాంతం వాడిగా డ్రైవరుకు అగుపించలేదు.

అవును, కాదు అనే విషయం పొడుగాయన చెప్పలేదు. చొక్కా మొదటి రెండు గుండీలు తీశాడు. ఇంత చలిలోను, కారు ఎసిలోను అతనికి చెమటలు పట్టి వున్నాయి.

“మీరు విశాఖలో వుంటారా” అని అడిగాడు పొడుగాయన.

“అవును” అన్నాడు డ్రైవర్.

“నేను పాడేరుకు పని మీద వచ్చాను. పని ఆలస్యం వల్ల వర్షంలో ఇరుక్కుపోయాను. నా పరిస్థితి చూస్తే మీకే అర్థం అవుతుంది కదా” పొడుగాయన అన్నాడు.

అది నిజం కాదని డ్రైవరుకు తెలుస్తోంది.

మళ్ళీ వారు నిశ్శబ్దం వైపు మళ్లారు.

పొడుగాయన కారు కిటికీ నుండి అవతల వైపు తదేకంగా చూస్తున్నాడు.

“మనం వినగలిగే సంగీతం లేదా” పొడుగాయన అడిగాడు.

“నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను నిజంగా సంగీత అభిమానిని కాదు. అయినా పాటలంటే ఇష్టమే” డ్రైవరు అన్నాడు.

పొడుగాయన కొంచెం ఉషారుగా మాట్లాడాడు.

“నాకు సంగీతం వినడం చాలా ఇష్టం. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది” అన్నాడు.

డ్రైవర్ ఏమీ అనలేదు. ఎఫ్.ఎమ్. రేడియోలో పాటలు వస్తున్నాయి. టవర్ అందక మధ్య, మధ్యలో పాటలు ఆగుతున్నాయి. అందుకని డ్రైవరు సెల్ ఫోన్‌లో న్యూస్ పెట్టాడు. జియో మొబైలు అడవిలోనూ బాగా పనిచేస్తుంది. ఫోన్లో న్యూస్ బులెటిన్ వచ్చింది. రిపోర్టర్ ఆమె ప్రకటన చదివేటప్పుడు తెలుగు పదాలను ఇంగ్లీషు పదాల్లా ఉచ్చరించే ప్రయత్నం చేస్తుంది.

“పాడేరులో తీవ్రంగా కూబింగ్ జరుగుతోంది. మావోయిస్టు నాయకుడు సాహు అలియాస్ అమన్ తప్పించుకున్నాడు. అతని కాలికి తీవ్రగాయం అయిందని, స్ధానిక ఆర్ఎమ్‌పి డాక్టరు దగ్గర వైద్యం చేయించుకున్నట్టు, అక్కడ నుండి పోలీసులు వెంటబడుతుంటే మళ్లీ అడవిలోకి పారిపోయినట్టు పోలీసు నివేదికలు అందాయి. మనిషి పొడుగ్గా వుంటాడు. అతని తలపై 20 లక్షల రివార్డు వుంది. ఇప్పటికే అతనిపై 12 హత్యకేసులు వున్నాయని పోలీసులు చెప్పారు. “

“న్యూసు కాకుండా, సినిమా పాటలు పెట్టొచ్చుగా” పొడుగాయన అసహనంగా అన్నాడు. డ్రైవరు సినిమా పాటలు పెట్టాడు. సంగీతం స్పీకర్ల నుండి అస్పష్టంగా వస్తోంది. డ్రైవర్ తన ప్రయాణీకుడి వైపు మధ్య మిర్రర్ నుండే చూసాడు. ఏదో ప్రశ్న అడగాలనుకుని మళ్లీ సంశయించాడు.

“వార్తల్లో వాస్తవాలు వుండటం లేదు” పొడుగాయన అన్నాడు.

“జర్నలిజంలో విలువులు లేవు. ఇది చాలా నిరుత్సాహపరుస్తుంది. రేటింగులు కోసం తపన తప్పితే, ప్రజలు బాధలు వారికి పట్టడం లేదు”

డ్రైవర్ సమాధానం ఇవ్వలేదు. డ్రైవరు వాలకం చూసిన పొడుగాయన

“భయపడొద్దు. నేను నక్సలైటు కాదు” అన్నాడు తన చొక్కా గుండీలు పెట్టుకుంటూ.

“లేదు, నా ఉద్దేశం, లేదు, మీరు కాదు” డ్రైవరు తడబడ్డాడు.

కాని డ్రైవరు అనుమానిస్తూనే వున్నాడు. ఎందుకంటే పొడుగాయన కారు ఎక్కేటప్పడు కుంటటం అతను గమనించాడు. ‘ఇతని ఆచూకి తెలిపితే 20 లక్షలు వస్తాయనే ఆశ అతన్ని కుదురుగా వుంచడం లేదు. ఒకవేళ ఇతను కాకపోతే నష్టమేమీ లేదు గదా. బహుశా తన కష్టాలను చూసి దేవుడే ఈ అవకాశం ఇచ్చాడేమో’ డ్రైవరు మనసులో అనుకున్నాడు.

‘నిజానికి పొడుగాయన తనకు ఏం ద్రోహం చేయలేదు. అటువంటుప్పడు అతన్ని పోలీసులకు పట్టియడం కరెక్టు కాదేమో. ఆ పాపం నాకెందుకు. న్యూసులో పదికిపైగా హత్యలు చేశాడని చెపుతున్నారు. అది నిజమైతే తనని హత్య చేసి కారు తీసుకుని పారిపోవచ్చుగా‌‌’ డ్రైవరు మదిలో ఆలోచనలు తుఫాను గాలులు కన్నా వేగంగా వీస్తున్నాయ్.

చివరకు పోలీసులకు విషయం చెప్పాలనే నిశ్చయించుకున్నాడు. కాని ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. పొడుగాయన మోహం చూస్తే పెద్ద మనిషి మాదిరే వున్నాడు. మొహంలో భయం కనపడలేదు. కానీ తత్తరపాటు వుంది. ముఖ్యంగా మొహంలో గాంభీర్యం తుఫాన్ను మించి వుంది.

కొంతదూరం పోయిన తర్వాత పొడుగాయన “కారు అపండి, టాయిలెట్ వస్తోంది‌” అన్నాడు.

డ్రైవరు కారు స్లో చేసి ఆపాడు. పొడుగాయన కారు దిగి రోడ్డుకు అటువైపు వెళ్లి చుట్టుపక్కల చూస్తున్నాడు. డ్రైవరు ఇదే అదునుగా భావించి 100కి కాల్ చేశాడు. రెండు సార్లు ట్రై చేసినా ఎవరూ ఎత్తలేదు. పొడుగాయన డ్రైవరు వైపు రావడంతో సెల్ జేబులో పెట్టుకున్నాడు.

“నేను ఇక్కడే దిగిపోతాను. మీరు వెళ్లండి. కాని నా దగ్గర పైసా డబ్బులేదు మీకివ్వడానికి. మీరు నన్ను క్షమించాలి” పొడుగాయన అన్నాడు.

డ్రైవరు బిత్తరపోయాడు. తను ఖచ్చితంగా తప్పించుకున్న మావోయిస్టే అని నిశ్చయించుకున్నాడు. కాని భయంతో ఏం మాట్లాడలేక పోయాడు.

“సార్ మీ ఇష్టం‌” కొంచెం భయంతో అన్నాడు.

“లేదు, మీ డబ్బు మీకు ఇవ్వాలి. నాకు మీరు ఎంతో సహాయం చేశారు. జగదాంబ సెంటరు ఎదురుగ్గా నవీన్ మెడికల్ షాపు వుంటుంది. మీరు నాగేశ్వరరావును అడిగి మీ డబ్బులు తీసుకోండి” అని నవ్వుతూ షేక్ హాండ్ ఇచ్చాడు. ‌వణుకుతున్న చేతులతో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతనికి షేక్ హాండిచ్చాడు. పొడుగాయన వడివడిగా కుంటుకుంటూ నడుస్తూ అడవిలోని చీకటిలో కలిసిపోయాడు. అంత చీకటిలోను అతను కాలి నుండి కారుతున్న ఎర్రని రక్తం డ్రైవరు చూశాడు. డ్రైవరు హడావుడిగా కారు ఎక్కి అంత వర్షంలోను వేగంగా పోనిచ్చాడు.

2 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత, డ్రైవరు వాహనాన్ని పోలీసులు ఆపారు. అక్కడ పెద్ద తుపాకులు పెట్టుకుని సుమారు 60 మంది పోలీసులు వున్నారు. పోలీసులకు విషయం చెప్పాలని అతనికి అనిపించలేదు. కారాపిన పోలీసులు అతన్ని బయటకు దిగమన్నారు.

“ఏరా, నీకు రోడ్డు మీద ఎవరన్నా అనుమానాస్పదంగా కనపడ్డారా” ఒక పోలీసు ఉరుముతూ అడిగాడు.

డ్రైవరుకి కోపం వచ్చింది. “సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి‌” అన్నాడు. ఆ మాట వెంటనే పోలీసోడు లాగి చెంప మీద ఒక్కటిచ్చాడు. చెంప చెళ్లుమంది. డ్రైవరు కళ్లెంట నీళ్లు గిర్రున తిరిగాయి.

“ఎవ్వరిని చూడలేదు సార్” అని విసురుగా సమాధానం చెప్పాడు.

ఇంతలో పెద్ద ఆపీసరు జోక్యం చేసుకుని, కొట్టిన పోలీసతన్ని తిట్టాడు.

“అతన్ని పట్టించుకోవద్దు. డ్యూటీ టెన్షనులో వున్నాడు. పారిపోయిన వ్యక్తి నరహంతకుడు. అతనను మళ్లీ సమాజంలోకి వెళితే మరిన్ని హత్యలు చేస్తాడు. బాధ్యత గల పౌరుడిగా నువ్వు నిజం చెప్పాలి‌” సముదాయిస్తూ అన్నాడు.

ఆఫీసరు మాటలతో డ్రైవరుకు దేశభక్తి ఉప్పొంగింది. పౌరుడిగా కర్యవ్యం గుర్తుకువచ్చింది. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత తనమీదే వుంది అని భావించాడు.

“సార్, నాకు రివార్డు ఇస్తానంటే చెపుతా” అన్నాడు.

పోలీసు ఆఫీసరు భుజం మీద చేయివేసి పక్కకి తీసుకువెళ్లాడు. తన జేబులో నుండి సిగరేట్ పాకెట్ బయటకి తీసి డ్రైవరుకు సిగరెటిచ్చాడు. డ్రైవరు సిగరేటు నోటిలో పెట్టుకుంటే తనే లైటరుతో వెలిగిచ్చాడు. దాంతో డ్రైవరు ఛాతీ ఉప్పొంగింది.

“మొత్తం రివార్డు నీకే అందజేస్తా. ఇంకా అదనంగా డబ్బు ఇస్తా. నీ పేరు బయటకు రాకుండా నేను చూస్తా” కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు.

“సార్, సరిగ్గా 122 మైలురాయి దగ్గర అతను దిగాడు. అతని కాలికి గాయమయింది. బహుశా అతనే అయి వుంటాడు” దమ్ము లాగుతూ చెప్పాడు.

వెంటనే ఆఫీసరు తన సెల్లో ఒక ఫోటో చూపించి ఇతనేనా అన్నాడు.

 ‌”దాదాపుగా ఇలానే వున్నాడు” డ్రైవరు అన్నాడు.

ఆఫీసరు, డ్రైవరు ఫోను నెంబరు, పేరు, చిరునామా తీసుకున్నాడు. తన ఫోను నెంబరు అతనికి ఇచ్చాడు. తన జేబులో నుండి 5 వేలు తీసి డ్రైవరు జేబులో కుక్కాడు. వాకీటాకీలో అందరికి విషయం చెప్పి అప్రమత్తం చేశాడు. కారులో వేగంగా పోలీసులందరినీ తీసుకుని వెళ్లాడు. డ్రైవరు మంచి పని చేశాననే ఆనందంగా ఇంటికి బయలుదేరాడు.

మూడు రోజులు అయింది. పోలీసు ఆఫీసరు ఫోను చేయలేదు. పేపర్లు చూస్తున్నా ఎటువంటి వార్త కనబడలేదు. అతను నక్సలేటు కాదేమో అనుకొని డ్రైవరు తన రొటీను జీవితంలో పడిపోయాడు. మరుసటి రోజు పేపరులో వార్త వచ్చింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు సాహు మరణించాడని, అతని దగ్గర నుండి ఎకె47, మందుగుండు సామాగ్రి, విలువైన డైరీ పోలీసులు రికవరీ చేశారని రాశారు. పోలీసులు వారిస్తున్నా, మొదటగా మావోయిస్టులే కాల్పులు జరిపారని, విధి లేక పోలీసులు కాల్పుల జరిపారని పోలీసు అధికారి చెప్పినట్టు అతని ఫోటో వేశారు. ధైర్య సాహసాలతో వ్యవహరించి, వీరోచితంగా పోరాడిన పోలీసు అధికారికి ప్రమోషన్ ఇస్టున్నట్టు సాక్షాత్తు హామ్ శాఖా మంత్రి ప్రకటించాడు.

డైవరు నాలుక చేదుగా అయిపోయింది. పొడుగాయన్ని అరెస్టు చేస్తారనుకున్నాడు కాని, చంపుతారని అతను అనుకోలేదు. వెళ్లేటప్పడు కరాచలనం చేస్తూ అతను నవ్వుతున్న మొహమే డ్రైవరుకు కనిపిస్తోంది. డ్రైవరు కళ్లమ్మేట నీళ్లు తిరిగాయి. పేపర్లో సాహు గురించి మంచిగాను, చెడ్డగాను రాశారు.

డ్రైవరు బాధ ఏమిటంటే, పొడుగాయన హత్యలు చేశాడు. కాని అతన్ని తాను సమాచారం ఇచ్చి పోలీసుల చేత హత్య చేయించాడు. తను కూడా హంతకుడయ్యాడనే విషయమే అతన్ని స్ధిమితంగా వుండనీయడం లేదు. ఆ రోజు సాయంత్రమే ఆ ఏరియా ఎస్సై వచ్చి అతనికి 10 లక్షల డబ్బు ఇచ్చాడు. అతను నవ్వుతూ “మిగిలిన డబ్బు స్టేషనులో వుంది. నీకు ఎప్పుడు అవసరమైతే అప్పడు వచ్చి తీసుకో‌” అని చెప్పి వెళ్లిపోయాడు. అతనికి అర్థమయింది. ఇంక మిగిలిన పది లక్షలు ఇవ్వరని. డ్రైవరుకు తీసుకోవాలనే ఆలోచనా లేదు. ఇచ్చిన డబ్బును భార్యకు ఇచ్చి బీరువాలో పెట్టించాడు. దాంతో భార్య ఆరోగ్యం బాగుపడుతుంది. కారు లోను మొత్తం తీర్చేయెచ్చు. కాని ఎందుకో ఆ డబ్బు మీద వ్యామోహం డ్రైవరుకు తగ్గిపోయింది.

మరుసటి రోజు జగదాంబ సెంటరు, మెడికల్ షాపు కెళ్లాడు. షాపులో 55 ఏళ్ల ముసలాయన కళ్లజోడు పెట్టుకుని మందు చీటి ఇచ్చిన వాళ్లకి మందులు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నాడు.

అతని దగ్గరికి వెళ్లి ‌”సార్ నాగేశ్వరరావు అంటే మీరేనా” అన్నాడు.

అతను అవునన్నట్టు తలూపాడు.

“సార్ కైలాశం గారు నాకు మూడువేలు బాకీ పడ్డారు. మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు.”

అతను ఎటువంటి ప్రశ్నలు వేయకుండా కౌంటరులో నుండి మూడు వేలు తీసిచ్చాడు. మళ్లీ తన పనిలో బిజీ అయిపోయాడు. డ్రైవరు అక్కడే కొంచెం సేపు వున్నాడు.

‌”అతనికి విషయం తెలుసా, తెలీదా. పోనీ అతను మావోయిస్టేమే, మనకెందుకు‌” అక్కడ నుండి వెళ్లిపోదామనుకున్నాడు. కాని డ్రైవరు అక్కడికి డబ్బు కోసం రాలేదు. తన మనసులో బాధను వెళ్లగక్కుకునేందకు వచ్చాడు. ఎందుకంటే కైలాసమే స్వయంగా నాగేశ్వరరావు పేరు చెప్పాడు.

బిజీ తగ్గిన తర్వాత నాగేశ్వరరావు అతని వైపు చూసి “ఏం సారు మీకు ఏమన్నా కావాల్నా” అని అడిగాడు.

“లేద్సార్, మీతో మాట్లాడదామని వచ్చాను. డబ్బు కోసం రాలేదు” అని తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వపోయాడు. ఎందకంటే అతనికి శవం మీద డబ్బుని ఏరుకున్నట్టు అనిపించింది.

షాపాయన తీసుకోలేదు.

“సార్, కైలాసం గారు చనిపోయారు. మీకు తెలుసు కదా” అని బొంగురు గొంతుతో అన్నాడు.

“ఏంటండి, మీరనేది, నెల క్రితం వచ్చి మాట్లాడేసి వెళ్లాడు” అని షాక్ కు గురౌతూ అన్నాడు.

“అదేంటి సారు, మీరు పేపరు చదవలేదా. మావోయిస్టు నాయకుడు సాహూని పోలీసులు చంపేశారు కదా” ఆశ్యర్యంగా అన్నాడు.

“అయితే” ప్రశ్నార్దకంగా చూశాడు.

“అంటే సాహూనే కైలాసమని మీకు తెలీదా” రెట్టించిన ఆశ్చర్యంతో డ్రైవరు అన్నాడు.

“అతను నక్సలైటేంటి బాబూ, బహు సరదా మనిషైతేను” నవ్వుతూ అన్నాడు షాపాయన.

డ్రైవరుకు బుర్ర తిరిగిపోతోంది. నిజానికి పేపర్లో ఫోటోకు నిజం కైలాసానికి చాలా తేడా వుంది. గుర్తుపట్టడం కష్టమే.

“మీకు కైలాసం ఎలా పరిచయం సార్” అన్నాడు డ్రైవరు.

“6 నెలలకు ఒకసారి షాపుకు వస్తాడు. సరదాగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటాం. కొంత డబ్బు ఇచ్చి దగ్గర పెట్టుకోమంటాడు. ఎవరన్నా తన పేరు చెప్పి డబ్బు అగితే, వాళ్ళు అడిగనంత ఇవ్వమనేవాడు. తాను పనుల మీద వేరే వూర్లు తిరుగుతుంటాడని చెప్పేవాడు. అంతే” షాపాయన అన్నాడు.

“మరి ఎవరన్నా ఎక్కువ డబ్బు అడిగితే, లేదా మీరే ఆ డబ్బును వాడుకుంటే” ఆ మాట అన్నప్పడు డ్రైవరు నాలిక్కరుచుకున్నాడు.

దానికి షాపాయన నవ్వుతూ “నేను అదే అడిగా. నీకు డబ్బు అవసరమైతే తీసుకో. నేను పంపినోళ్లు అవసరం మేరకే తీసుకుంటారు. అయినా మనుషులనే నమ్మకపోతే ఇంక ఎవర్నినమ్ముతాం అని నవ్వుతూ అనేవాడు. గత 6 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నా. మొదట్లో అవసరానికి నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. అటు తర్వాత నా మీదే నాకే అసహ్యం వేసి, ఖర్చు పెట్టుకున్న డబ్బు అందులో పెట్టేశా. నిజానికి వచ్చిన వాళ్లేవరు ఎక్కవు డబ్బు తీసుకుంటారని నేను అనుకోను. కైలాసంతో ఒకసారి పరిచయమయిన వాళ్లు తప్పుచేస్తారని నేను అనుకోను. కైలాసం ఎప్పడూ ఎంత డబ్బు ఎవరెవరికి ఇచ్చావు. ఎంత మిగిలింది అనేవాడు కాదు. నేను చిన్న కాగితంలో లెక్కలు రాసి అతనికి చూపించే ప్రయత్నం చేసేవాడిని” షాపాయన నింపాదిగా చెప్పాడు.

తను కైలాసానికి ద్రోహం చేశాడని చెపితే షాపాయన ఎలా రియాక్టు అవుతాడో అని భయం వేసింది. షాపాయన దృష్టిలో కైలాసం బతికే వున్నాడు. కైలాసం బతికున్నాడనే భరోసా షాపాయనకు వుండటం మంచిందని డ్రైవరు అనుకున్నాడు. జేబులో వున్న కైలాసం డబ్బు మూడు వేలు 20 లక్షలతో సమానం అనిపించింది. కాని తప్పు చేశానన్న అపరాధ భావం అతన్ని దహిస్తుంటే, కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు కారాయి. బిజీగా వున్న షాపాయనకు కనబడకుండా డ్రైవరు కన్నీళ్లను తుడుచుకుని “వుంటా సార్” అని జీరగొంతుతో అంటూ భారంగా వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here