[శ్రీమతి సునీత గంగవరపు రచించిన ‘అపసవ్యం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]వే[/dropcap]ళ్ళు మొరాయిస్తున్నాయి
మృదువుగా హృదయాన్ని
నిమరాల్సిన వేళ్ళు
నిప్పును తాకినట్లు
చురుక్కున లోపలికి ముడుచుకుంటున్నాయి
రాశులుగా పేరుకున్న ఉద్వేగాలు
కదిలేందుకు
కలల్ని కాగితం పై ముద్రించేందుకు
జీవం లేని ఒట్టి దేహాలై
పడి ఉన్నాయి
రాత్రి ఒక అస్పష్ట వర్ణ చిత్రం
వాడిపోయిన రెప్పలను ఆర్చుతూనే ఉంటుంది
ఎంత దిద్దుకున్నా రాత కుదరదు
వంకరటింకర సైగలతో వెక్కిరిస్తూనే ఉంటుంది
అప్రకటిత యుద్ధాలు
రెటీనా అంచుల వద్ద పొంచి ఉంటాయి
జాగ్రత్త సుమీ!
అవి నీ జీవితకాల
అనుభూతి కోటల్ని కొల్లగొడతాయి
అక్కడేదో కనిపిస్తుంది
మృదువుగా పరిమళిస్తూ
సన్నటి చివుర్లు వేస్తూ..!
అందుకేనేమో
ఆగకుండా పరిగెడుతూనే వుంది బతుకు
అలసట ధారగా చెంపలపైకి కారుతున్నా
సవ్యమో.. అపసవ్యమో అర్థం కాని దిశగా
ఇదేమిటి..?
ఉన్నది లేనట్టు
లేనిది ఉన్నట్టు..
మత్తుగా ఆక్రమించుకుంటోంది?
ఇంత ఆర్తిగా ఆకర్షించుకుంటోంది..??
బహుశా అపసవ్యమేమో..???