అపసవ్యం

8
4

[dropcap]దు[/dropcap]ర్మార్గుడంటే మనుషుల రక్తం తాగేవాడో లేక కామపిశాచో కానక్కర్లేదు. సన్మార్గంలో నడవని ఏ మనిషయినా దుర్మార్గుడే! ఎందుకంటే దుష్ట లక్షణాలు ఏ క్షణంలోనయినా బహిర్గతం కావచ్చు కాబట్టి.

ఈశ్వర్రావు ఖచ్చితంగా దుర్మార్గుడే. ఆయన దృష్టిలో భార్య అంటే ‘చప్పరించి ఊసేసే చూయింగ్ గమ్’ లాంటిది.

కొడుకేమో చవట. కూతురంటే గుదిబండ. కోడలు ఇంటిని నాశనం చెయ్యటానికి వచ్చిన తాటకి. అల్లుడు రక్తం పీల్చే రాక్షసుడు. మనవళ్లూ మనవరాళ్ళూ కేవలం స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు హరించే ఆకతాయి సన్నాసులు – ఇహ చుట్టాలూ స్నేహితులూ కుళ్ళుబోతులు మరియు దద్దమ్మలూ. – ఇలా తనకి తానే నిర్వచించుకొని నిర్లక్ష్యంగా అహంకారంతో డెభై ఏళ్ళు గడిపేశాడు ఈశ్వర్రావు.

ఈశ్వర్రావు భార్య జానకమ్మ క్రమశిక్షణ గల ఇల్లాలు. నెమ్మది నిదానంతో.. మంచి మంచి భవిష్య ప్రణాళికలతో పిల్లల్ని చదివించి, ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.

తన మంచితనం వల్ల పిల్లలిద్దరూ యోగ్యులయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు. కొడుకు జగన్నాధం అమెరికాలోనూ, కూతురు పల్లవి లండన్లోనూ స్థిరపడ్డారు.

పిల్లలు స్థిరపడ్డారు. కానీ స్థిరత్వం లేని ఈ తండ్రిలో మాత్రం ఎలాటి మార్పూ లేదు. పైగా, నానాటికీ ఈశ్వరరావు ఆగడాలు ఎక్కువవసాగాయి.

పిల్లిని కూడా గదిలో బంధించి బెదిరిస్తే పులి అయినట్లుగా జానకమ్మ కూడా అసహనంతో రెచ్చిపోయి భర్తని ఎదిరించసాగింది. అసలే కోతి మనస్తత్వం గల ఈశ్వరరావు ఈ మధ్య చిందులెక్కువగా వేయడం మొదలెట్టాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలూ మనస్పర్థలూ ఎక్కువయిపోయాయి.

తల్లి ద్వారా విషయం తెలుసుకున్న పిల్లలిద్దరూ నెల రోజులు శెలవు పెట్టి వచ్చారు.

సవ్యంగా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమంగా పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాలి. కాని ఇక్కడ అందుకు రివర్స్ అయింది సీన్. అపసవ్యమైన తండ్రి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి, సక్రమ మార్గంలో పెట్టాలని కంకణం కట్టుకున్నారు అన్నా చెల్లెళ్ళు. అందుకే ఒక పథకం ప్రకారం ఓ నెల శెలవు పెట్టి మరీ వచ్చారు.

వారం అయ్యేసరికి ఈశ్వరరావులో మార్పు రాసాగింది. కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉండాలని విశ్వప్రయత్నం చేయడం మొదలెట్టాడు. అనూహ్యంగా భార్యతో సహా ఎవరూ ఆయనతో మాట్లాడ్డంలేదు. కనీసం భోజనానికి కూడా ఆయన్ని పిలవకుండా ఎవరికి వారు తినేసి సమయం గడుపుతున్నారు. అసలు ఇంట్లో ఈశ్వరరావు అనే వ్యక్తి కనీసం ఉంటున్నట్లు కూడా ఎవరూ గమనించట్లేదు. భార్య, చివరికి మనవళ్ళు మనవరాళ్ళూ, కోడలూ, అల్లుడు కూడా ఈశ్వరరావుతో మాట్లాడ్డం మానేసారు.

మరో వారం గడచేసరికి ఈశ్వరరావు మరింత క్రుంగిపోసాగాడు. ఎవరి కబుర్లు వాళ్ళవి. అందరూ హాయిగా ఆటపాటల్లో ఖుషీగా ఉంటున్నారు. చివరికి భార్య జానకమ్మ సైతం ఎంతో ఉల్లాసంగా కాలం గడుపుతోంది. రకరకాల వంటలూ, పిండి వంటలూ, సినిమాలూ షికార్లూ – ఒకటేమిటి ఇల్లంతా పెళ్లి పందిరిలాగా ఉంటోంది. అంతా ఓ కంట గమనిస్తూనే వున్నాడు. ‘తను – ఈశ్వరరావు అనబడే వ్యక్తి బ్రతికేఉన్నాడన్న కనీస స్పృహ కూడా వీళ్లకెవరీ లేదేమిటీ? ‘.. చింత మొదలైంది. అది చింత గింజంత ప్రమాణం నించి మర్రి చెట్టులా మెదడునీ మనసునీ తొలిచేస్తోంది.

ఏ మనిషికైనా ఒంటరి తనం శాపమే. పైగా ఒంటరిగా చూడబడ్డం మహా శాపం. పుత్ర శోకాన్ని మించిన బాధ ఏదైనా వుందీ అంటే అది ఒంటరిని చేయబడటమే.

పిల్లలు తిరుగు ప్రయాణానికి సిధ్ధమైపోతున్నట్టు వాళ్ళ మాట్లాడుకునే మాటల్లో గ్రహించాడు. అది కాదు అతన్ని నిశ్చేష్టుడ్ని చేస్తున్న సంగతి ఏమిటంటే.. వాళ్లతో బాటు పెళ్లామూ వెళ్తోందని తెలుసుకున్న అతనికి కోపం ఆవేశం కలిసి అది చివరికి సముద్రమంత దుఃఖంలా మారిపోయింది.

ఒక వారం రోజుల్లో భార్య కొడుకుతో సహా అమెరికా వెళ్ళబోతోందా! ఎంతో క్రుంగిపోసాగాడు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆలోచనల్లోంచి.. అవగాహనలోకి మారాడు. అహం నించి పశ్చాత్తాపంలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుస్తోంది.. భార్య అంటే ఏమిటో.. బంధాలు ఎంత విలువైనవో.. అసలు జీవితం అంటే ఏమిటో అన్న నిజం కళ్ల ముందు నిలిచింది.

కుటుంబం అంటే కలకాలం కొనసాగే మమతానురాగాల మధురిమ అనీ, దాన్ని అంతే సుమధురంగా కాపాడుకోవాలనీ అర్థం అయింది.

మరో ముఖ్యమైన విషయం అవగతమైపోయింది. ఎవరు మారాలో తెలిసొచ్చింది.

***

మరో నాలుగు రోజులు గడిచే సరికి ఈశ్వరరావులో ఇంటిల్లిపాది కోరుకున్న మార్పు వచ్చింది.

జానకమ్మ, కొడుకూ, కూతురూ ఎంతో సంతోషించారు.

అనుసరించిన విధానం అపసవ్యమైనా, మార్గాన్ని సవ్యం చేయడం కోసమే కదా!

ఇప్పుడు అతని జీవన గమనం కాంతివంతమైంది. తల్లిదండ్రులు పిల్లల్నే కాదు – పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని సన్మార్గంలోకి తేవచ్చు. తప్పేమీ లేదు. అని చక్కగా నిరూపించారు ఈశ్వరరావు పిల్లలు.

పిల్లలతో బాటు భార్య వెళ్లడం లేదు. ఆమె అమెరికా ప్రయాణం కూడా పథకంలో భాగమేనని తెలుసుకున్న ఈశ్వరరావు ఎంతో సంతోషించాడు.

జానకి ఆనందానికి అవధులే లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here