Site icon Sanchika

తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు – 13: అప్కారి సూర్యప్రకాశ్

[box type=’note’ fontsize=’16’] “ఈ కథల్లో ఉన్నవారంతా మంచివారే. పరిస్థితుల ప్రభావం వల్ల వారు చెడుగా ప్రవర్తించినప్పటికి వారిలో మానవత్వం ఇంకా మిగిలే వుందని నిరూపిస్తారు రచయిత” అంటున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

ఆప్కారి సూర్యప్రకాశ్ గారు 1947లో నిజామాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఏ, ఎం.ఏ (లిట్) చదివారు. ప్రభుత్వ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులుగా పనిచేసి, చివరకు ప్రిన్సిపాల్‍గా పదవీ విరమణ చేశారు. నిజామాబాద్ ఫిల్మ్ క్లబ్, ఇందూరు భారతి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ, అనేక సాహితీ సంస్థలకు అండగా నిలిచారు. విద్యార్థి దశ నుంచే కలం చేపట్టి ఈనాటి వరకూ తనదైన మార్గంలో, తనదైన శైలిలో కవితలు, వ్యాసాలు, తదితర రచనలు చేస్తూ పత్రికలకు పంపుతూ, అలా అచ్చయిన వాటిని సంపుటాలుగా వేస్తున్న సీనియర్ కవి ఆయన. వీరు చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. వీరు గతంలో అనగా 1967 నుండి 1970 వరకు రాసిన కథలను ‘ఆప్కారి సూర్యప్రకాశ్ కథలు’ పేరిట సంపుటంగా ఇప్పుడు తీసుకువచ్చారు.

1960 దశకంలో వచ్చిన మార్పులను, ఆనాటి ఆలోచనా ధోరణులను ఈ కథలు ప్రతిఫలించాయి. ఒక విజయవంతం అయిన ‘స్క్రిప్ట్ రైటర్’ అనే సినిమా రచయిత అంతరంగం ఒక కథగా రూపుదాల్చింది. ఎంతో కష్టపడితే తప్ప సినీరంగంలో నిలదొక్కుకోలేరు. కాని ఇందులో నాయకుడైన రచయిత చకచకా వైకుంఠపాళిలో నిచ్చెనలా పైకెళ్ళిపోతాడు. చివరి దశలో అతనిలో రియలైజేషన్ మొదలవుతుంది. సాహిత్యంలో నాటకాల వల్లనే నిలుస్తాడు కాబట్టి ఎప్పటికైనా ‘కన్యాశుల్కము’ లాంటి నాటకం రాసి కన్నుమూయాలనే నిర్ణయానికి వస్తాడు. ఇంకో కథలో నిద్రమాత్రలు వేసుకున్న నిద్రపట్టని వ్యక్తి ఆలోచనా స్రవంతి కనిపిస్తుంది. చదువు వున్నప్పటికీ తండ్రి మిగిల్చిన డబ్బు ఉందన్న భరోసాతో ఉద్యోగం కోసం ప్రయత్నంచలేదు. కవిగా, రచయితగా ఊహా ప్రపంచంలోనే విహరిస్తుంటాడు. బంధువులు, స్నేహితులు ఎవరూ పట్టించుకోరు. లోకం దృష్టిలో అప్రయోజకుడిగా మిగిలిపోతాడు. బ్రతికున్నంతకాలం తండ్రి పెత్తనంలో, పెళ్ళి తర్వాత భార్య ఆధిపత్యంలో బ్రతుకీడ్వాల్సిన పరిస్థితి. గతం, వర్తమానాలను బేరీజు వేసుకుంటూ కొనసాగిన కవి అంతరంగం చైతన్య స్రవంతి పద్దతిలో కొనసాగడం విశేషం. ఆఫీసుకు బయలుదేరిన ఒక యు.డి.సి బస్సు ప్రయాణంలో కొనసాగిన ఆలోచనా ధారను ‘మేడిపండు’ కథగా మలిచారు. సగటు ప్రయాణికుడి ఆలోచనా ధోరణిలో కొనసాగిన ఈ కథలో లోకరీతి వ్యక్తమవుతుంది. ఇందులో మొదటికథ ‘స్క్రిప్ట్ రైటర్’ స్వగతంలో కొనసాగుతోంది. మిగతా రెండు కథలు స్థల కాలాదుల విషయాల్లో కానీ, ద్రపరూప శైలిని అనుసరించడంలో కానీ చైతన్య స్రవంతి ధోరణి కనిపించినా, అన్-సెన్సార్డ్ ఆలోచనాధార లేకపోవడం వలన పూర్తి చైతన్య స్రవంతి కథలని నిర్ధారించలేం.

సినిమారంగం ఒక దీపశిఖ. ఎంతోమంది దాని ఆకర్షణకు లోబడి తమ జీవితాలను నాశనం చేసుకున్నవారున్నారు. దాని చుట్టూ పరిభ్రమించే ‘దీపం పురుగుల్లో’ ఒకరైన రచయిత థియేటర్ యజమానిగా స్థిరపడతాడు. సినీకవిగా కావాలనుకున్న భీమశంకరం శృంగార పత్రిక పెట్టి ధనవంతుడవుతాడు. సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి తాయారు అన్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఆకర్షణ లోంచి బయటపడితే తప్ప మనుషులు బాగుపడరని రచయిత అన్యాపదేశంగా ఈ కథలో సూచించారు. వాస్తవికతకు – ఊహాప్రపంచానికి ఆదర్శవాదానికి గల తేడాను తెలుసుకున్న నవలా రచయిత కథే ‘కాగితం పువ్వు’ సాహిత్యం గురించి ముఖ్యంగా నవల రచన అందులో వున్న సాధక బాధకాల గురించి ఈ కథలో చక్కగా వివరించారు.

వివాహితుడైన యూనివర్శిటి విద్యార్థి తన క్లాస్‍మేట్‍పై మనసు పారేసుకుంటాడు. ఆమెకు ప్రేమలేఖ రాయబోయి, ఇంటి నుండి భార్య వ్రాసిన ఉత్తరంతో కర్తవ్యాన్ని గ్రహించి, తన పొరపాటును సరిదిద్దుకోవడం ‘సాహితి’లో పనిపిస్తుంది. ‘వంగిన నింగి’ కథలో ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కలలు గన్న యువకుడికి, ఎక్కడా ఎలాంటి ప్రతిస్పందన రాదు. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయినే, తన తండ్రి తనకు వధువుగా నిర్ణయించాడని తెలిసి ఉప్పొంగిపోతాడు. ఈ రెండు కథలు కాలేజీ యువకుల చపల చిత్తాన్ని తెలియజేస్తాయి. తల్లిని పోగొట్టుకున్న కూతురు, తండ్రి ప్రేమకు కూడా దూరం కావడాన్ని ‘అమ్మ’ కథ చిత్రీకరించింది. నిజయితీగా పనిచేసే క్లర్క్, కొడుకు వైద్యం కోసం లంచగొండిగా మారడం ‘ప్రతిఫలం’ కథలో, చెరువులో పడిపోయిన బాలుడ్ని రక్షించబోయి తాను మునిగిపోయిన కల్పన ‘రాత’ కథలో, శోభనం రాత్రే నవ వధువు ఫిట్స్ తో మరణించడం ‘అపశ్రుతి’లో కనిపిస్తుంది. విషాదాంతాలుగా ముగిసిన ఈ నాలుగు కథల్లో అతి నాటకీయత చోటు చేసుకుంది.

ఆడంగి రేకుల సీతారాంకు, మగరాయుడి లాంటి కృష్ణకు పెళ్ళిళ్ళు కుదరడం లేదు. వీళ్ళిద్దరికి పెళ్ళి చేస్తే ఎలా వుంటుందనే పెళ్ళిళ్ళ పేరయ్య ఆలోచన ఫలించడం వెనుక వున్న తతంగమంతా ’ఆడ పురుషుడు – మగ స్త్రీ’ కథలో చూడవచ్చు. బామ్మ అమాయకత్వం, అజ్ఞానం, చాదస్తం వల్ల సంభవించిన సంఘటనల సమాహారాన్ని ‘బామ్మ భారతం’లో చూడవచ్చు. ఆత్రపు పెళ్ళికొడుకు హడావుడి కథే ‘పగలే వెన్నెల’ సన్నివేశపరమైన సంఘటనలతో ఈ కథలు గిలిగింతలు పెడతాయి.

దొంగతనానికి వచ్చిన దొంగకు అక్కడ అపస్మారక స్థితిలో పడివున్న ఇంటి యజమాని కనిపిస్తాడు. అతనికి వైద్య సహాయం అవసరమని గుర్తించిన ఆ దొంగ, తన పని పక్కన పెట్టి అతడ్ని భుజాన వేసుకుని వైద్యుడి దగ్గరకు బయలుదేరుతాడు. అందుకే రచయిత దీన్ని ‘మేల్కొన్న మానవత్వం’గా గుర్తించమంటాడు. ఆడవాళ్ళు అపరాధుల్లా తప్పించుకుని, తలవంచుకుని తిరిగినంతకాలం ‘రోడ్‍సైడ్ రోమియో’ల ఆటలు కొనసాగుతాయి. ఎవరైనా తిరగబడి వాడిని చెంప వాయిస్తే, వాడికే కాదు మిగతా వాళ్ళకు కూడా బుద్ది వస్తుందని తెలియజేస్తారు. ‘తటిల్లత’ కథలో, ప్రజాసేవలో ఆస్తినంతా హారతి కర్పూరం చేసిన సాంబశివరావు చనిపోతే భార్య మంగళసూత్రాలు అమ్మి అంత్యక్రియలు చేస్తుంది. ఏ ఆధారం లేని ఆ కుటుంబానికి, అయిదుగురు కూతుళ్ళు చదువు ఆగిపోకుండా వుండాలంటే ఎలా? తాను ఆహుతి అయినా సరే, పిల్లల బతుకులను బాగుపరచడానికి ఆ తల్లి తీసుకున్న నిర్ణయం మన మనసును కదిలించి వేస్తుంది. సమస్యలు ఎదురయితే కుంగిపోవడం కాదు. సరియైన పరిష్కారాన్ని ఎంచుకోవాలని ఈ కథలు సూచిస్తాయి. ‘మేల్కొన్న మానవత్వం’ కథ మాత్రం ఆదర్శవాద ధోరణితో కూడుకుని వుంది. పెళ్ళిగాని పిచ్చిది గంగికి నెల తప్పడంతో ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఆ వూరి సర్పంచి కొడుకు తన పాలేరును అనుమానించి నిలదీస్తాడు. కాని వాడు తెలియజేసిన ‘రహస్యం’తో తలదించుకోవాల్సి వస్తుంది. దీన్ని కొసమెరుపు కథగా మలచిన విధానం బాగుంది.

రచయితలు, క్లర్కులు, కాలేజీ విద్యార్థులు ఈ కథల్లో నాయకులుగా కనిపిస్తారు. ఈ కథల్లో ఉన్నవారంతా మంచివారే. పరిస్థితుల ప్రభావం వల్ల వారు చెడుగా ప్రవర్తించినప్పటికి వారిలో మానవత్వం ఇంకా మిగిలే వుందని నిరూపిస్తారు.

హాస్యం, విషాదంతో పాటు స్వీయచైతన్యం ఆదర్శవాద ధోరణులతో ఈ కథలు నిండివున్నాయి. శిల్పరీత్యా చూస్తే చైతన్య స్రవంతి ధోరణి కొసమెరుపు కథలున్నాయి. రెండు, మూడు కథలు స్కెచ్‍లాగా కనిపించినప్పటికీ, ఈ కథలన్నీ ఆకట్టుకునే విధంగా రూపొంది, ఆసక్తిగా చదివింపజేస్తాయి.

Exit mobile version