Site icon Sanchika

అప్పారావూ… అంతరిక్ష సుందరి!

[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]డా[/dropcap]బా మీద మడత మంచం వేసుకుని వెల్లకిలా పడుకుని, రెండు చేతులూ తలకింద పెట్టుకుని, ఆకాశంలోని నక్షత్రాల కేసి చూస్తూ పడుకుంటే ఆ ఆనందమే వేరు. అప్పారావు ఇప్పుడు అదే అనుభవిస్తున్నాడు. చందమామ ఉండీ లేనట్టుగా సన్నగా ఉన్నాడు. తారలు తళుకు తళుకుమంటున్నాయి.. ఎక్కడో కీచురాళ్ల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం. అప్పుడప్పుడు ఆకాశం మీద నుంచి వెలుగుతూ రాలే ఉల్కలు. అవన్నీ చూస్తుంటే అప్పారావుకి చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు, తాతయ్య చెప్పిన జానపద కథలు గుర్తొస్తాయి. ‘ఏమిటో ఈ నక్షత్రాలు!’ అనుకున్నాడు. ‘అసలెన్ని ఉంటాయి’ అని కూడా అనుకున్నాడు. ‘పోనీ లెక్కపెడితేనో’ అనిపించి మొదలెట్టాడు కానీ ఓ పదో, పదిహేనో అయ్యాక ఏ చుక్క దగ్గర ప్రారంభించాడో గుర్తులేక విరమించుకున్నాడు.

అతడలా చూస్తుంటే ఆ నల్లటి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల మధ్య ఓ నక్షత్రం కదుతున్నట్టు అనిపించింది. దాని కేసే దృష్టి పెట్టి చూశాడు. అరె… చిత్రం… అది రంగులు కూడా మారుస్తోంది!

గబగబా తలగడ కింద తడుముకుని కళ్లజోడు పెట్టుకుని మరీ చూశాడు. అవును నిజమే… అది కదలడమే కాదు, నెమ్మదిగా పెద్దదవుతోంది కూడా!

వాటే… వండర్!

అప్పారావు చూస్తుండగానే అది కిందికి వస్తున్నట్టు అనిపించింది. అరె… అది ఇంకా పెద్దదవుతోందే? వార్నీ… ఏంటిది చెప్మా? అనుకుంటూ చటుక్కున లేచి కూర్చున్నాడు. తల మాత్రం పైకే ఉంది. కళ్లు పెద్దవయ్యాయి. ఆ కళ్లలో వెలుగులు చిమ్ముతూ ఏదో పెద్ద ఆకారం. అది గుండ్రంగా ఉంది. దాని చుట్టూ రంగురంగుల లైట్లు వెలిగి ఆరుతున్నాయి. అది ఇంకా… ఇంకా… కిందికి వచ్చింది.

అప్పారావు నోరు దానంతట అదే తెరుచుకుంది.

ఇదేంటి? ఫ్లయింగ్సాసరా? అంటే… గ్రహాంతర వాసులెవరో వచ్చారా?

చిన్నప్పుడు చదువుకున్నది గుర్తొచ్చింది. యూఎఫ్ఓ! అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. అనగా గుర్తు తెలియని ఎగిరే వస్తువు. అప్పారావు ఆలోచనలు శరవేగంగా పరిగెడుతుండగానే, ఆ గుండ్రని వింత అంతరిక్ష వాహనం అతడు పడుకున్న డాబా మీదకి వచ్చి ఆగింది. దాని నుంచి ఓ ఫోకస్ లాంటి వెలుగు డాబా మీద గుండ్రంగా పడింది. అప్పారావు ఆ వెలుగు చూడలేక కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఆ వెలుగులో ఆ వాహనం కింద తలుపు తెరుచుకుంది. అందులోంచి ఓ నిచ్చెన లాంటిది కిందికి వాలింది. అప్పారావు కళ్లు పెద్దవి చేసుకుని, నోరు వెళ్లబెట్టి చూస్తూనే ఉన్నాడు. ఆ మెట్ల మీద సన్నటి జలతారు కుచ్చిళ్లు జీరాడాయి. ఆ కుచ్చిళ్ల లోంచి సొగసైన ఓ తెల్లని పాదాలు కనిపించాయి. వాటిపై తళుక్కుమంటున్న వెండి మువ్వల పట్టీలు. ఆ పాదాలు మెట్ల మీద సుతారంగా దిగుతూ ఉంటే, జలతారు కుచ్చిళ్లు చంద్రకాంతి పడి వింతగా మెరుస్తున్నాయి. ఆ కుచ్చిళ్లపై గాలికి ఎగురుతున్న పట్టు పావడా, ఆ తర్వాత పారదర్శకంగా ఉన్న ఓ అద్భుతమైన నీలి వస్త్రం, దానిపై ధగధగలాడుతున్న ఆభరణాలు, వాటిపై రకరకాల రంగులతో మెరుస్తున్న మణిమాణిక్యాలు, వాటితో పాటు సుతారంగా కదులుతున్న ముత్యాల సరాలు, లయబద్ధంగా కదులుతున్న వజ్రపు లోలాకులు, వైఢూర్యలు పొదిగిన పాపిటపిందులు, ఉంగరాలు తిరిగిన నల్లని ముంగురుల మీద అలవోకగా అమరిన స్వర్ణ కిరీటం… వీటన్నిటినీ మించిన సొగసుతో వెలిగిపోతున్న ఓ అందమైన యువతి అప్పారావు కళ్ల ముందు కనికట్టులాగా ప్రత్యక్షమయ్యాయి.

దే..వ..క..న్య!

అప్పారావు మనసులో ఆశ్చర్యంగా అనుకున్నాడు.

“ఏడిశావ్…” అంది అంతరాత్మ అంతలోనే.

“ఏం ఎందుకు కాకూడదు? ఎన్ని సినిమాల్లో చూడలేదూ? జగదేక వీరుడైన ఎన్టీఆర్ కోసం ఇంద్రుడి కూతురు బి. సరోజ దిగి రాలేదా? అందగాడైన అక్కినేని కోసం సువర్ణసుందరి లెవెల్లో అంజలీదేవి రాలేదా? అంతెందుకోయ్… మెగాస్టార్ చిరంజీవి కోసం అతిలోక సుందరి శ్రీదేవి వచ్చి మానవా… అంటూ వెంటపడలేదా? మూసుకో!” అంటూ అంతరాత్మ గొంతు నొక్కేశాడు అప్పారావు .

ఇలా అప్పారావు అంతర్మథనం జరుగుతుండగానే ఆ అంతరిక్ష యువతి ర్యాంపులో క్యాట్వాక్ చేసే అందమైన మోడల్లాగా వయ్యారంగా ఆ డాబాపై నడుస్తూ రామారావు దగ్గరకి వచ్చింది.

“హాయ్… అప్పారావ్! ఎలా ఉన్నావ్?” అంది చిరునవ్వులు ఒలికిస్తూ.

అవి… నవ్వులా? కాదు…నవ పారిజాతాలు!

రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు! అనుకున్నాడు అప్పారావు.

‘సిగ్గులేకపోతే సరి… అది సినారే పాట… దాన్నే వాడుకోవాలా ఇక్కడ?’ అంది అప్పారావు అంతరాత్మ.

‘షటప్… అంత గొప్ప పాట కాకపోతే ఈ సందర్భంలో మరోటి ఎలా గుర్తొస్తుంది? నేనేమైనా గీత రచయితనా? కొత్తగా అనుకోడానికి. పైగా ఇప్పుడు కాగితం, కలం తీసుకుని రాస్తూ కూర్చుంటే ఈ దేవకన్య చూస్తూ ఉంటుందేంటి? ఫ్లయింగ్ సాసర్ ఎక్కేసి జంప్ జిలానీ అయిపోతుంది. కాబట్టి ఆట్టే వాక్కు!’ అంటూ మనసులోనే నోరు నొక్కేశాడు.

“నా… నా… పేరు నీకెలా తెలుసు?” అన్నాడు ఎలాగోలా గొంతు పెగల్చుకుని.

ఆ యువతి జిగేల్మని మరోసారి నవ్వేసి, “దిగంతాల నుంచి వచ్చి నీ డాబా మీద దిగినదాన్ని. నీ పేరు తెలీకుండా ఉంటుందా?” అంది.

“ఇంతకీ నువ్వెవరు? జయంతివా? సువర్ణ సుందరివా? అతిలోక సుందరివా? బి. సరోజవా? అంజలీదేవివా? శ్రీదేవివా?” అనేశాడు అప్పారావు గబగబా.

“వాళ్లంతా ఎవరు?” అంది ఆ అందాల అంతరిక్ష యువతి చనువుగా మడత మంచం మీద కూర్చుని తలగడ ఒళ్లో పెట్టుకుంటూ.

“వాళ్లు… వాళ్లు… మా ఊహా సుందరీమణులు… వెండితెర వేలుపులు…” అన్నాడు అప్పారావు, కాస్తకుదుట పడి.

“సరేలే… ఇంతకీ మరి మీ ఊహా సుందరీ మణులు బావున్నారా? నేను బావున్నానా?” అంది చుబుకం కింద చెయ్యి పెట్టుకుని.

‘ఆహా… ఏమందమెంత సౌందర్యమెంత సొగసెంత వయ్యరమెంత వగలు?’ అనుకున్నాడు అప్పారావు మనసులో.

‘ఎదవ కవిత్వం కట్టిపెట్టి ఆవిడ అడిగిన కొశ్చనుకి యాన్సరియ్యి…’ అంది అంతరాత్మ విసుగ్గా.

‘ఛస్…నువ్ నోర్ముయ్యి…’ అంటూ దాన్ని కసిరి, ఆ యువతిని అబ్బురంగా చూస్తూ అప్పారావు జవాబు చెప్పాడు, “వాళ్లెవరూ నీ కాలి గోటికి కూడా సరిపోరు…” అన్నాడు తమకంగా.

“ఓ…నువ్వు నా కాలిగోరెప్పుడు చూశావు?” అంది ఆ యువతి అప్పారావు చేయి పట్టుకుని మడత మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ.

‘అబ్బ… ఏమి స్పర్శ? ఏమి మేని సొగసు?… తనువా? ఊహు… హరిచందనమే! పలుకా? ఊహూ… అది మకరందమే! కుసుమాలు తాకగనే నలిగేను కాదా ఈ మేను?’ అనుకుంటూ ఏదో మైకంలో ఉండిపోయాడు అప్పారావు .

‘ఓరి సన్నాసీ…ముందు నోరు విప్పరా… దరిద్రుడా…’ అంటూ గయ్యిమంది అంతరాత్మ.

దాన్ని పట్టించుకోకుండా అప్పారావు మత్తుగా చెప్పాడు, “ఇందాకా… నువ్వు దిగుతున్నప్పుడు చూశాను. దాన్ని వర్ణించడానికి మా శృంగార కవుల ప్రబంధాలు కూడా సరిపోవు…” అన్నాడు.

“అమ్యయ్య… పోన్లే… మరి నేను నీకు నచ్చానా?” అంది ఆ యువతి రామారావు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ.

‘ఆహా…ఏమి కళ్లు? ఒక్క క్షణం… ఒక్క క్షణం… ఆ రెప్పలు వాల్చకు… అటూ ఇటూ కదలకు… ఒక్క క్షణం… మోయలేని ఈ హాయిని మోయనీ…’ అనుకున్నాడు అప్పారావు .

‘ఒరే…దిక్కుమాలినోడా! ఆ పిల్ల ఏంటో అడుగుతోంది… ముందది చెప్పరా?’ అంది అంతరాత్మ దాని తల అది పట్టుకుని.

అప్పారావు తేరుకుని, “అసలు ఆ అడగడమేంటి? ఎందుకు? ఆకాశం మీద నుంచి రావడమేంటి? నా డాబా మీద దిగడమేంటి? నచ్చానా అని అడగడమేంటి?” అంటూ ప్రశ్నలు కురిపించాడు.

ఆ యువతి హాయిగా నవ్వేసింది. ఆ తర్వాత చెప్పింది, “అది కాదు అప్పారావ్… నువ్విక్కడ డాబా మీద చేతులు తల కింద పెట్టుకుని ఆకాశం కేసి చూస్తున్నావా? సరిగ్గా అదే సమయానికి నేను మా మందిరం మీద లేటెస్ట్ వెర్షన్ టెలిస్కోపు ఓపెన్చేసి ఫోకల్ లెంగ్త్ సెట్ చేసి ఇటు కేసి చూశాను. మీ పాలపుంత కనిపించింది. మరింత ఫోకస్ చేస్తే మీ భూమి కనిపించింది. దాన్ని క్లోజప్ చేసే సరికి నువ్వు సీన్లోకి వచ్చావు. చూడగానే నచ్చావు. వెంటనే మా నాన్న నా బర్త్డేకి ఇచ్చిన స్పేస్ వెహికిల్ ఎక్కేసి చక్కా వచ్చేశా…” అంది అది చాలా తేలికైన విషయమన్నట్టు.

అప్పారావు కేమీ అర్థం కాలేదు. ఆ యువతి చెబుతున్నది అసంభవం అనిపిస్తోంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె మన సూర్యకుటుంబం ఉండే మిల్కీవే పాలపుంతకి అవతల ఎక్కడో మరో గెలాక్సీలో ఏదో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒకానొక ఎక్సోప్లానెట్కి చెందినదై ఉంటుంది. అక్కడి నుంచి ఇన్ని కాంతి సంవత్సరాల దూరం దాటి క్లోజప్లో చూడగలిగే టెలిస్కోపులు ఉండడం ఊహకి అందని విషయం. పైగా ఉన్నాయే అనుకున్నా, కొన్ని క్షణాల్లోనే ఇన్నేసి కోటానుకోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించే స్పేస్ వెహికిల్స్ ఉండడం మరింత అసాధ్యం… కాంతిని మించి ఎన్నో రెట్లు వేగంగా వస్తే కూడా ఇది జరగదు… అనుకున్నాడు అప్పారావు .

‘ఓరి నీ సైన్స్ గోల తగలడా? ఓ అందమైన అమ్మాయి వచ్చి నీ మడత మంచం మీద కూర్చుని నువ్వు నచ్చి వచ్చాన్రా నాయనా అంటుంటే… వెంటనే ప్రొసీడైపోక… గెలాక్సీలు, కాంతి సంవత్సరాలు, దూరాలు, వేగాలంటావేంట్రా దగుల్బాజీ…’ అంటూ అంతరాత్మ కోపంతో చిందులు తొక్కసాగింది.

అప్పారావు మొదటి సారిగా అంతరాత్మతో ఏకీభవించాడు.

‘నిజమే… నేను దరిద్రుడినే, దగుల్బాజీనే, దిక్కుమాలినోడినే, సన్నాసినే… కాసేపు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు చెప్పినట్టే ప్రొసీడైపోతాన్లే…’ అనుకున్నాడు.

ఆ తర్వాత దేవానంద్లాగా తలెగరేశాడు. రాజేష్ఖన్నాలాగా కన్నింగ్గా నవ్వాడు. షమీ కపూర్లాగా వంకరగా మొహం పెట్టి చూశాడు. రాజ్కపూర్లాగా రొమాంటిక్గా ఫీలింగ్ ఇచ్చాడు. చిరంజీవిలా స్టైల్గా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మహేష్బాబులాగా లుక్కిచ్చాడు. ఆఖరికి దేవరకొండలాగా ధైర్యంగా, యూత్ఫుల్గా ఫేస్ పెట్టి, “ఇంతకీ నాలో ఏం చూసి మెచ్చావు? ఏం నచ్చి ఇంత దూరం వచ్చావు?” అన్నాడు పెద్ద హీరోలా ఫోజ్ పెట్టి.

అంతరాత్మ పకపకా నవ్వింది. ‘ఒరే… ఇందాకా నువ్వు అనుకున్నవన్నీ కాదురా అసాధ్యాలు… ఈమెకు నువ్వు నచ్చడమే అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం…’ అంది.

మంచి మూడ్లో ఉన్న అప్పారావు , దాన్ని పట్టించుకోలేదు.

“ఏదో ఒకటి చూశాన్లే అప్పారావూ? నువ్వు నాతో రావూ?” అంది ఆ అంతరిక్ష సుందరి అతడి చెయ్యి పట్టుకుని లాగుతూ.

“ఎ… ఎక్కడికి?” అన్నాడు అప్పారావు ఆశ్చర్యంగా.

“అలా మా లోకానికి పోదాం పదవయ్యా అంటుంటే, అలా మాలోకంలా చూస్తావేంటయ్యా..” అంటూ ఆ అంతరిక్ష సుందరి అతడి చేయి పుచ్చుకుని దాదాపు బరబరా లాక్కుపోయి ఆ వింత వాహనం ఎక్కించేసింది.

అప్పారావుకి ఇక నోరెత్తే అవకాశం రాలేదు. ఆ అంతరిక్ష నౌకలో ఆమె లాంటి వాళ్లే ఓ అరడజను సుందరీమణులు ఉన్నారు. వాళ్లంతా నవ్వుతూ చేతులూపుతుంటే లుంగీ, టీషర్టుతో ఉన్న అప్పారావు, చేసేదేంలేక… అది ఆనందమో, భయమో, మైమరపో, అయోమయమో, ఆశ్చర్యమో, పరశవమో తెలియని ఒకానొక వింత, విచిత్ర, విభిన్న, వినూత్న, అనూహ్య, అవ్యక్త భావానికి లోనయ్యాడు. అతడే కాదు, అతడి అంతరాత్మ కూడా మూగబోయింది.

ఆ అంతరిక్ష నౌక రివ్వుమంటూ ఆకాశంలోకి లేచింది. కిటికీలోంచి చూసిన అప్పారావుకి అతడి మడతమంచం, డాబా, ఊరు అన్నీ చూస్తుండగానే చిన్నవైపోయి, ఆపై గూగుల్ ఎర్త్ లో లాగా నీలి రంగులో భూగోళం కనిపించి, అంతలోనే అది కూడా చుక్కైపోయి, నక్షత్రాల గుంపులోంచి దూసుకుపోతున్న అనుభూతి కలిగింది.

అప్పారావు కళ్లు విప్పార్చి కిటికీలోంచి తలతిప్పి తనకేసి చూసుకునేసరికి… ఆశ్చర్యం!

తన దుస్తులన్నీ మారిపోయి ఉన్నాయి. జగదేకవీరుడు సినిమాలో ఎన్టీఆర్ కట్టుకున్న ధగధగలాడే వస్త్రాలవి. ఆ సినిమాలో ఎన్టీఆర్కి నలుగురే. తనకి మాత్రం ఎంతమందో!

అప్పారావుకి లోపలి నుంచి ఉత్సాహం తన్నుకొచ్చింది. అది నోట్లోంచి ఈల పాటలా బయటకొచ్చింది.

“ఆకాశంలో హంసలమై… హాయిగ ఎగిరే గువ్వలపై… అలా అలా కులాసాల తేలిపోదామా?” అనే పాట అది.

‘ఒరే… ఇది ఈల వేసే సందర్భంరా… వీళ్లెవరో, నిన్నెక్కడి లాక్కుపోతున్నారో, అక్కడకి వెళ్లాక ఏం చేస్తారో అని నేను హడలి చస్తుంటే నీకు కులాసాగా ఉందా?’ అంటూ అంతరాత్మ తిట్టిపోసింది.

‘నిజమే… ఎరక్కపోయి డాబా మీద పడుకున్నాను. అప్పటికీ పంకజం చెబుతూనే ఉంది, ఒక్కరూ పడుకోలేరండీ దడుసుకుంటారని…’ అనుకున్నాడు అప్పారావు. భార్యను తల్చుకోగానే అప్పారావుకి జాలేసింది. ‘రేప్పొద్దున్న నేను కనబడకపోతే ఏం కంగారు పడుతుందో?’ అనుకున్నాడు.

‘ఆవిడ సంగతి కాదురా… ముందు నీ సంగతి ఆలోచించు…’ అంది అంతరాత్మ.

ఈలోగా ఏదో కుదుపు. అంతరిక్ష నౌక ఆగిందన్నమాట. అప్పారావు కిటికీలోంచి చూసేసరికి అద్భుత లోకం! వింత విచిత్ర భవంతులు. పెద్ద పెద్ద మందిరాలు!

“రా… సుందరా…” అంది అంతరిక్ష సుందరి.

అప్పారావు వెనక్కి చూశాడు తన వెనక ఎవరైనా ఉన్నరేమోనని.

“నిన్నే అప్పారావ్…పద” అంది ఆ సుందరి.

అప్పారావు ఛాతీ పోలీస్ ఉద్యోగానికి వెళ్లిన అభ్యర్థి ఛాతీలాగా ఉబ్బెత్తున్న పొంగిపోయింది. ఆ సుందరి అప్పారావుని ఓ అందాల సౌధంలోకి తీసుకెళ్లింది. అక్కడెవరూ లేరు, తను…ఆ సుందరి… అంతే! పక్కనే అద్భుతమైన హంసతూలికా తల్పం!

‘ఇదేం గ్రహమో… ఇదేం లోకమో’ అనుకున్నాడు అప్పారావు.

‘ఇదెక్కడి గ్రహచారంరా నాయనా… ఇంత మంచి అవకాశం నీ ఎదుట ఉంటే, ఇదే గ్రహమైతే నీకెందుకురా… ఆ సుందరి చేయి పట్టుకుని ప్రొసీడైపో’ అంటూ విసుక్కుంది అంతరాత్మ.

ఇక అప్పారావు ఆగలేదు. ఒక్క ఉదుటన ఆ సుందరి చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు.

పైగా “నీవేనా నను వలచినది? నీవేనా నను పిలిచినది? నీవేనా నా డాబాకొచ్చి నన్నిక్కడికి లాక్కొచ్చినది?” అంటూ పాటందుకున్నాడు మొహం సాధ్యమైనంత రొమాంటిక్గా పెట్టాననుకుని!

“నేను కాదు…” అంది ఆ అంతరిక్ష సుందరి అప్పారావు చెయ్యి విడిపించుకుని.

తెల్లబోయిన అప్పారావుతో చెప్పింది, “నేను కాదు అప్పారావ్. నిన్నిక్కడికి తీసుకురావడానికి అలా చెప్పానంతే. నిన్ను చూసింది, వలచింది మా యువరాణి! నేను ఆమె చెలికత్తెని. ఆమె ఆజ్ఙ మేరకే నేనిలా చేశాను. అదిగో మా యువరాణి నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్లిరా. అమర సుఖాలు అనుభవించు..” అంటూ ఆ అంతరిక్ష సుందరి వడివడిగా వెళ్లిపోయింది.

అప్పారావు మళ్లీ ఇందాకటి అవ్యక్త భావానికి లోనయ్యాడు.

ఈమె… కేవలం చెలికత్తా? చెలికత్తే ఇంత మనోహరంగా ఉంటే… ఆ యువరాణి ఇంకెంత బావుంటుందో? అనుకున్నాడు అప్పారావు.

‘ఆహా…అప్పారావ్! మొదటి సారి నిన్ను చూస్తే ఈర్ష్య కలుగుతోందిరా. వెళ్లు ఆ యువరాణిని మురిపించి, బులిపించి, మైమరపించు…’ అంటూ అంతరాత్మ తొందరపెట్టింది.

ఇక అప్పారావు ఆగలేదు. ఆ అంతఃపురంలో జలతారు పరదాలను తొలగించుకుని ముందుకు నడిచాడు.

అక్కడ… ఆకాశంలో బంగారు రంగులో వెలిగిపోతున్నపెద్ద చందమామ కురిపిస్తున్న పసిడి వెన్నెల కాంతిలో వెనక్కి తిరిగి ఒయ్యారంగా నిలబడి ఉంది అంతరిక్ష యువరాణి!

అప్పారావులో భావకుడు నిద్రలేచి పాటందుకున్నాడు.

“రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె? నన్నే వెదకుచు ఇట రప్పంచిన కన్యక రతియే కాబోలు…” అన్నాడు ఘంటసాలలా పాడుతున్నాననుకుని.

ఆ అంతరిక్ష యువరాణి కూడా ఆగలేదు…

“రారా… నా అందగాడ! రాతిరంత జాతరేరా… అహా రాతిరంత జాతరేరా…” అంటూ వెనక్కి తిరిగింది. అలా తిరగడంలో ఆమె మేలి ముసుగు చిరుగాలికి జారువాలి తొలగిపోయింది.

అప్పారావు చూశాడు. అతడి కళ్లు విప్పారాయి. నోరు తనంతట తానే తెరుచుకుంది.

ఆ అంతరిక్ష యువరాణి పూర్తి స్వరూపం కంటబడింది.

ఆమె నెత్తిమీద … రెండు యాంటెన్నాల్లాంటి అవయవాలు!

ఆమె కళ్లు…ఆకుపచ్చ రంగులో వెలుగుతున్న పెద్ద పెద్ద గుంటలు!

ఆమె ముక్కు… లేదు సరికదా, దాని స్థానంలో రెండు రంధ్రాలు!

ఆమె పెదవులు… ఎగుడుదిగుడు కోరలతో మూసుకున్న నోరు!

ఆమె భుజాల నుంచి… వంకరగా పీలగా వేలాడుతున్న రెండు చేతులు!

వెనక్కి తిరుగుతూనే ఆ యువరాణి పాటందుకుంది…

“సుందరాంగా… అందుకోరా… సౌందర్య మాధుర్య మందారము…

అందలేని… పొందలేని… ఆనంద లోకాలు చూపింతురా…” అంటూ ముందుకు రాసాగింది.

“కెవ్వు… కెవ్వు… కెవ్వు”మంటూ అప్పారావు నోట్లోంచి అప్రయత్నంగా అరుపులు వెలువడ్డాయ్!

“మోసం… దగా… కుట్ర…” అని అరుస్తూ అప్పారావు వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు.

‘మార్స్ ఎటాక్’, ‘ద ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్కైండ్’ లాంటి హాలీవుడ్ సినిమాల్లోలాగా వికృతంగా ఉన్న ఆ వింతలోక రక్షక భటులు గోలగోలగా అరుస్తూ అప్పారావు వెంటపడ్డారు. బయటకొచ్చిన అప్పారావుకి తనను తీసుకొచ్చిన అంతరిక్ష నౌక కనిపించింది. చటుక్కున దాంట్లోకి ఎక్కేశాడు. అక్కడ కనిపించిన ఏవేవో మీటలు నొక్కేశాడు.

అదృష్టం… ఆ నౌక రివ్వుమంటూ పైకి లేచింది. చూస్తుండగానే దూరంగా భూమి, తన రాష్ట్రం, తన ఊరు, తన డాబా, తన మడత మంచం కనిపించాయి. ఈలోగా ఆ అంతరిక్ష నౌకలో ఓ బటన్ ఎర్రగా వెలిగి ఆరడం మొదలెట్టింది.

‘మైగాడ్… ఫ్యూయల్ అయిపోయిందన్నమాట’. వెనకా ముందూ ఆలోచించకుండా అప్పారావు చటుక్కున ఆ నౌక తలుపు తీసి కిందకి దూకేశాడు!

అంతే… ఆ అంతరిక్ష నౌక పేలిపోయింది!

అప్పారావు మాత్రం వచ్చి వచ్చి మడతమంచం మీద ధఢేళ్…మని పడ్డాడు!

ఆపై మంచం మీద నుంచి కిందకి పడ్డాడు.

అప్పుడు మెలకువ వచ్చింది అప్పారావుకి! అతడి గుండె చప్పుడు అతడికే వినిపిస్తోంది!

‘వార్నీ… ఇదంతా కలా?’ అనుకున్నాడు అప్పారావు.

‘అవును… అందమైన పీడకల!’ అంది అంతరాత్మ.

అప్పటికే ఎండ చుర్రుమంటోంది. తెల్లారిపోయిందన్నమాట అనుకున్నాడు అప్పారావు.

గబగబా దుప్పటి మడత పెట్టేసి, మంచం ఎత్తేశాడు.

అప్పుడు కనిపించింది, మంచం కింద! మెరుస్తున్న వెండి మువ్వల పట్టీ!

‘వార్నాయనో…’ అనుకున్నాడు అప్పారావు. దాన్ని తీసుకుని బలంగా ఎటో విసిరేశాడు.

ఆరోజు నుంచి అప్పారావు డాబా మీద పడుకుంటే ఒట్టు!!

Exit mobile version