Site icon Sanchika

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

[dropcap]ని[/dropcap]న్న సాయంత్రం పెద కాపుగారి పాలేరు తెచ్చి ఇచ్చిన బాదం ఆకులను విస్తర్లుగా కుడుతూ నామ రామాయణం వల్లెవేస్తోంది పేదరాసి పెద్దమ్మ. మాఘమాసం మధ్యాహ్నం వేళ అయినప్పటికీ ఎండ అంత చుర్రుమనిపించడం లేదు. ఎదురుగా కోనేట్లో నీళ్లు అద్దం బిళ్ళలో, తగరపు ముక్కలో పరచినట్లు తళ తళ లాడుతున్నాయి. ఒడ్డున ఉన్న చింతచెట్టు మీద ఒంటరిగా కూర్చుందేమో ఓ కాకి ఉండుండి అరుస్తోంది. పరాకుగా తలతిప్పిన పెద్దమ్మ కళ్ళకి చింత చెట్టుకిందకి పిల్లిలా చేరుకుంటున్న పదేళ్ల నానిగాడు కనిపించాడు. ఆ వెనకే శీను, రంగా నడుముకు దోపుకున్న పంగలకఱ్ఱతో వెనక్కి వెనక్కి చూసుకుంటూ వచ్చారు. పెద్దమ్మ విస్తర్లు కుట్టడం మానేసి పాటను ఆపేసి వాళ్లనే చూస్తూ కూర్చుంది. ఈ లోగా తనకు తెలియని మరో నలుగురు కుర్రాళ్ళు కూడా అక్కడకు చేరారు.

“ఏమిరా ఇంకా ఏమిటాలస్యం? మళ్లీ ఎవరైనా వస్తారు” అన్నాడు శీనుగాడు.

“నువ్వు ఆగరాబాబు వచ్చినకాడి నుంచి నీకు తొందరే. పెదకాపు భూషయ్య మనవడు గిరి గాడు వస్తానన్నాడు. కుంచెం సేపు సూద్దాముండు.” అన్నాడు  ఎర్రజుట్టోడు. వాడి పక్కనున్నవాడికి గూడకట్టు, మూడోవాడికి ఎత్తుపల్లోడు, నాల్గోవాడికి బక్కోడు ఇలా పేర్లు పెట్టుకుంది పెద్దమ్మ.

నిశితంగా వాళ్ళు చేసే పని గమనించసాగింది. “అవునురోరే మనం సింతకాయలకి ఎళ్తున్నట్లు గిరిబాబుకి ఏవుల్రా సెప్పింది” అని అడిగాడు బక్కోడు.

“నానే” అన్నాడు ఎర్రజుట్టోడు.

“ఒరోరి ఎంటపని సేసినావురా బూసయ్యగారి సెట్టు మీద కాయలు ఆడి మనవడు సేతనే దొంగతనం సేయిత్తావా” అన్నాడు రంగడు.

“మరేటి సెయ్యమంతావు. నాను, ఈడు మొన్న దిబ్బమీద కూకొని సింతకాయలు కొరుకుతా ఉంటే ఈరు బాబు సూసినాడు. ఒరే ఒరే నానిగా నీకు సింతకాయలు ఎక్కడవిరా అన్నాడు. నానేమో తుళ్ళు పడిపోయి రెండుసేతులు ఎనక్కి దాసీనాను. ఇదిగో ఈడే గొప్ప దవిర్యంగా కొట్టుకొచ్చినామ్ బాబు అన్నాడు. నాకైతే నిలువుగుడ్లు పడిపోనాయి. ఆల్ల సెట్టు కాయలు రాలగొట్టినామని ఈడెక్కడ సెప్తాడో, ఆ బాబెల్లి బూసయ్యకి ఎక్కడ సెప్తాడోనని ఒల్లు నీరైపోనాది. ఇంతలో ఒరే మీరలాగే కూర్సోoడి రా అని ఇంట్లోకి పరిగెత్తాడు గిరి. పారిపోవాలనిపించింది కానీ కాళ్లాడ లేదు.”

“నువ్వాగరా నాను సెప్తాను” అన్నాడు ఎర్రాజుట్టోడు. “గిరిబాబు వచ్చిఇద్దరికీ సెరొక లడ్డు సేతిలో పెట్టినాడు.

“ఏటి లడ్డునా?” అన్నారు ఒకేసారి ముక్తకంఠంతో.

“మరేటనుకున్నావైతే” అని “ఒరే ఒరే ఈసారి సింతకాయలు రాలగొట్టడానికి ఎల్లినప్పుడు నన్ను కూడా పిలుసుకుపోండ్రా” అన్నాడు గిరి. అద్గదీ కథ అన్నాడు ఎర్రజుట్టోడు.

మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు గిరి. “అమ్మయ్య గిరిబాబొచ్చెసాడు రండిరా ఉండేలు తీద్దాం” అని గూడపంచెగాడు అంటూ ఉండగానే చింతచెట్టు చాటునుంచి భూషయ్య పాలేరు చటుక్కున ముందుకు వచ్చాడు.

“ఓరి ఎదవా! నువ్వాట్రా చినబాబుగారిని తోటలంట దొడ్లంట తిప్పుతున్నది” అని ఎర్రజుట్టోడి చెవి పట్టుకోబోయాడు.  పిల్లలందరూ పొలో మని పేదరాసి పెద్దమ్మ వెనక్కి చేరిపోయారు. వాళ్ళ వెనకే పాలేరు, ఆ వెనకే ఆయాసపడుతూ భూషయ్య వచ్చారు.

“ఏం భూషయ్యా బాగున్నావా?” అని పలకరించింది పెద్దమ్మ. తమ తాతను పేరుపెట్టి పలకరిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసాడు గిరి. వాడితో పాటు మిగతా పిల్లలను. “ఇలా కూర్చో భూషయ్యా”  అని పీట వాల్చింది పెద్దమ్మ.

భూషయ్య ఆయాసపడుతూ కూర్చున్నాడు. “పెద కాపుగారి చింతకాయలు ఈ పిలగాండ్రు రోజూ రాలగొడుతున్నారు. అంతే కాకుండా ఈరోజు మా చినబాబుగారిని కూడా లాక్కొచ్చాడు మా మనవడు.” అన్నాడు పాలేరు.

“ఏదీ ఈడు నీ మనవడా?” అంది పెద్దమ్మ ఎర్రజుట్టోడిని చూపిస్తూ. “అవును పెద్దమ్మా నా మనవడు కిట్టుగాడు” అన్నాడు పాలేరు.

“ఏం భూషయ్యా నువ్వు కూడా పిల్లల్ని కొట్టడానికే వచ్చావా? నీ చిన్నతనంలో ఈ కోనేటి ఒడ్డునే చింతకాయలు రాలగొట్టిన సంగతి నువ్వు మర్చిపోయావా?. ఆవులపాలు దూడలే తాగాలి. చెరువులు చెట్లు ప్రకృతి ఉన్నది పిల్లల కోసం. వాళ్ళ ఆటల పాటలతో పులకరించి ఇవి మనకు నీళ్లు, పళ్ళు ఇస్తాయి” అంది పెద్దమ్మ. పాలేరు తలదించుకున్నాడు.

పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటే భూషయ్య నవ్వేస్తూ.. పిల్లలతో “మాతాత, వాళ్ళ తాత ఇలా ఎంతమందిని చూసిందో ఈ పెద్దమ్మ, అందరితోనూ ఇలా స్నేహంగా ఉండబట్టే జీడిపిక్కలా గట్టిగా ఈ ఏటిలా స్వచ్ఛంగా ఉంది పెద్దమ్మ” అన్నాడు.

పిల్లలు పొలోమని చింతచెట్టువైపు పరుగుపెట్టారు.

Exit mobile version