అపురూప కానుక

0
2

[dropcap]నే[/dropcap]ను చదువుకునే రోజుల్లో చాలా బొమ్మలు వేసేదాన్ని. ఏమాత్రం ఖాళీ దొరికిన ఏ బొమ్మ వేద్దామా అని ఆలోచిస్తుండేదాన్ని. దీనికి తోడు నా స్నేహితురాళ్ళకు కూడా బొమ్మలు వేసే అలవాటు ఉండటంతో అందరికీ ఇదే పని. పెన్సిల్, పెన్నుతో రేఖా చిత్రాలు, వాటర్ కలర్, ఆయిల్ కలర్స్‌తో అందమైన పెయింటింగులు వేయడం హాబీ. ఇలా బొమ్మ వేసిన తరువాత దాని క్రింద ఏవో మూడు నాలుగు వాక్యాలు నా మదిలో మేదిలిన ఊహలు నాకు తోచినట్లుగా వ్రాసేదాన్ని. అది కవిత్వమని నేను అనుకోలేదు, తెలియదు. మా నాన్నగారు వాటిని చూసి నీవు కవిత్వం వ్రాయగలవు! వ్రాయి! అంటూ ప్రోత్సహించారు. కానీ నేనెప్పుడూ బొమ్మ లేకుండా కవితలు వ్రాయలేదు. బొమ్మ వేసినపుడు మాత్రమే నాకు వాటి కింద అలా వ్రాయలన్పించేవి తప్ప విడిగా ఎప్పుడు కవితలు వ్రాయలేదు. కానీ మా నాన్నగారేమో సాహితీ ప్రియులు కావటం మూలంగా ‘ఏదో ఒకటి వ్రాయి’ అంటూ పోరుపెట్టేవారు. కానీ నాకేమో బొమ్మలు, సైన్స్ వ్యాస రచనలు మీదున్న ఇష్టం దీని మీద ఉండేది కాదు.

ఇలా ఉండగా నేను బియస్సీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు మా నాన్నగారి సన్నిహిత  మిత్రులు ప్రముఖ కవి అష్టావధాని వంగవోలు ఆదిశేషశాస్త్రి గారి షష్టిపూర్తి మహోత్సవం స్వగృహంలో ప్రముఖ కవులు సమక్షంలో నిర్వహించ తలపెట్టారు. ఈ సమయంలో ఏదైనా కవిత ఖచ్చితంగా వ్రాయల్సిందేనని మా నాన్నగారు పట్టుబట్టడంతో నాకు వ్రాయక తప్పలేదు. అలా వ్రాసిన దాన్ని వారికి పంపాము. ఆయన దాన్ని చదివి ఆనందించి ఆ షష్టిపూర్తి మహోత్సవానికి నన్ను సభాద్యక్షురాలిగా పేర్కొంటూ ఆహ్వాన పాత్రలు పంపారు. ఆ ఆహ్వాన పత్రాల్లో నా పేరు చూసి నేను భయపడుతుంటే మా నాన్నమో చాలా సంతోషపడ్డారు. ఆ సభకు ముఖ్య అతిథిగా గుంటూరూ జిల్లా జడ్జిగారు వచ్చారు. గౌరవ అతిథి, కళా ప్రపూర్ణ కొండూరు రాఘవాచారి గారు విచ్చేశారు. ఇంకా చాలా మంది కవులు, పండితులు వచ్చారు. పైకి నేను అందరితో మాట్లాడుతున్నానుగానీ లోపల చాలా భయంగా ఉంది. స్టేజీ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఏమి తెలియదు. కాకపోతే అతిథులంతా మా నాన్న గారికి స్నేహితులే కదా అనే దైర్యం తప్ప. నేను భయపడుతున్నానని కార్యక్రమం జరగబోయే ముందే వారంతా నన్ను కూర్చోబెట్టి ‘సభాధ్యక్ష స్థానం అంటే ఏమి భయపడాల్సిందేమీ లేదు. ఫలానా వారు మాట్లాడతారు అంటూ ఎనౌన్స్ చేయడమే అని అన్నీ విషయాలూ వివరంగా చెప్పి భయం పోగొట్టారు.

ఆ విధంగా ఆ సభలో నేను చక్కగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్నాను. నా జీవితంలో మొట్ట మొదటిసారిగా కవి, పండిత సభలో శాలువా సత్కారాన్ని అందుకున్నాను. నాకు చాలా సంతోషం అన్పిచింది. నేను వ్రాయగలను అనే ఆత్మ విశ్వాసం కలిగింది. నేను ఆ శాలువాను చాలా భద్రంగా ఇప్పటికీ దాచుకున్నాను. కాలేజీలో ఎన్నో బహుమతులు సాధించినా, ఇపుడు రచనా రంగంలోకి వచ్చాక ఎన్ని శాలువా సత్కారాలు అందుకున్న ఈ శాలువను నేను ఎంతో ఇష్టంగా అట్టిపెట్టుకున్నాను. ఎన్ని బహుమతులు వచ్చినా ఈ బహుమతి మాత్రం నా జీవితంలో అత్యంత అపురూపమైన కానుక. ఎందుకంటే ఇపుడు నేను కవిత్వం వ్రాయాలని, వ్రాస్తే చూసి సంతోషించాలనీ ఆశపడే మా నాన్నా లేరు. నా కవితలను చూసి ఆనందించి, ఆశీర్వదించి సత్కరించిన వంగబోలు ఆదిశేషశాస్త్రి గారు లేరు. నేను రచనలు చేయడం వారిరువురూ చూడలేదు. అందుకే ఇప్పటికీ ఆ శాలువా మా బీరువాలోని  కవర్లో మడతలు కూడా విప్పకుండా అతి జాగ్రత్తగా దాచిపెట్టబడి ఉన్నది. నా మనసులో ఉన్న ఈ జ్ఞాపకాన్ని చూసి పైనున్న వారిరువురూ సంతోషపడతారని ఆశిస్తూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here