కాజాల్లాంటి బాజాలు-95: అపురూపమైన ప్రేమంటే ఇదా!..

6
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]కొ[/dropcap]త్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని అందరూ జనవరి నెల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ మా కజిన్స్‌మి మాత్రం ఆ జనవరి నెలలో రాధ ఇంటినుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాం.. ఎందుకంటే జనవరి నెలలో వచ్చే రాధ పుట్టినరోజుని వాళ్ళాయన సుధాకర్ ఎప్పటికప్పుడు ఎంతో కొత్తగా చేస్తుంటాడు. రాధ మా పెద్దమ్మ కూతురే. పుణ్యం కొద్దీ పురుషుడన్నట్టు అదెప్పుడేం పుణ్యం చేసుకుందో అలాంటి మొగుడొచ్చేడని మిగిలిన కజిన్స్ అందరం దాని అదృష్టానికి ఈర్ష్య పడిపోతుంటాం.

సుధాకర్ మంచి భావుకత ఉన్న మనిషి. రాధని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. భార్యని ఎలా చూసుకోవాలో, ఎప్పటికప్పుడు ఆమె అవసరాలను ఎలా కనిపెట్టుకుని ఉండాలో, ఏమి చేస్తే రాధ సంతోషిస్తుందో అన్నీ చక్కగా బోల్డు పుస్తకాలు చదివి ఆచరిస్తాడు. అందుకేనేమో జనవరిలో వచ్చే రాధ ప్రతి పుట్టినరోజునీ మళ్ళీ పుట్టినరోజు వచ్చేవరకూ అందరూ తల్చుకునేలా చేస్తాడు. అన్నింటికన్నా గొప్ప విషయమేంటంటే అతను ఆ రోజు రాధకి ప్రత్యేకంగా ఇచ్చే పుట్టినరోజు బహుమతి.  ఆ బహుమతి ఎంత బాగుంటుందో దానికన్న ఆ బహుమతిని సెలెక్ట్ చెయ్యడానికి సుధాకర్ ఎంత తపన పడిపోయాడో రాధ పరవశించిపోతూ చెపుతూంటే అంతకన్న వెయ్యిరెట్లు బాగుంటుంది.

బెనారస్ పట్టుచీర కొనడానికి అసలైనది తేవాలని స్వయంగా బెనారస్ నేతగాళ్ల దగ్గరికి వెళ్ళాడనీ, నెక్లెస్ చేయించేటప్పుడు దానిలో ఎక్కువ రాగి కలపకుండా, అది పూర్తిగా 24 కేరట్లూ ఉండడానికి స్వయంగా కంసాలి దగ్గర రెండు రాత్రులు కూర్చున్నాడనీ…. ఇలాంటివన్నీ రాధ చెప్తుంటే లేని ఆసక్తి తెచ్చుకుని మరీ వినేవాళ్లం.

అంతవరకూ పరవాలేదు కానీ ఒక్కొక్కసారి రాధ చెప్పే విషయాలు మరీ అతిశయోక్తులుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు మాకు ఒళ్ళు మండిపోతుంటుంది. రాధని ఎదురుగా ఏమీ అనలేక మాలో మేము రాధా, సుధాకర్ల మీద జోకులేసుకుంటుంటాం. అందుకోసమే ఈసారి సుధాకర్ రాధకి ఏ బహుమతి ఇస్తాడా అని రాధకన్న మేమందరం ఎక్కువగా ఎదురుచూస్తున్నాం.

కానీ అదేవిటో ఈసారి జనవరి నెల అయిపోతున్నా కూడా రాధ ఇంటినుంచి ఇంకా పిలుపు రాలేదు. అందుకే వదినకి ఈ విషయాలన్నీ తెలుస్తాయని వదినకి ఫోన్ చేసి వివర మడిగేను.

“బహుశా రేపు పిలుపొస్తుందేమోలే.. రేపు కాకపోయినా ఈ నెలాఖరు లోపల తప్పకుండా పిలుస్తుంది. ఇందాకే మాట్లాడేను.” అంది వదిన.

“అసలెప్పుడు ఇంత లేటు చెయ్యరే.. ఇంతకీ ఈసారి ఏ బహుమతిస్తున్నాడూ సుధాకర్!” ఆతృత ఆపుకోలేకపోయేను.

“అదిగో.. ఆ బహుమతి వల్లే లేటయింది.” అంది నెమ్మదిగా వదిన.

“అంటే అమెరికానించి ఏమైనా తెప్పిస్తున్నాడా!” నా గొంతులో మరింత ఆతృత.

“అమెరికా నించి వచ్చేది మొన్ననే వచ్చేసింది. అయినా నీకిలా చెప్తే తెలీదు కానీ మొదట్నించీ చెప్తాను విను..

నెల్లాళ్ళ క్రితం సుధాకర్ నాకు ఫోన్ చేసి రాధ నక్షత్రం చెప్పి ఆ నక్షత్రానికి నవరత్నాల్లో ఏ రత్నం ధరించాలో ఎవరినైనా పండితులని కనుక్కుని చెప్పమన్నాడు. నేను తెలిసున్నవాళ్లని కనుక్కుని రాధ నక్షత్రానికి ముత్యం ధరిస్తే చాలా మంచిదని చెప్పేను. సుధాకర్ మంచిముత్యాలు ఎక్కడ దొరుకుతాయని అడిగేడు. అదేంటీ.. హైద్రాబాదుకి మరో పేరే పెరల్ సిటీ కదా.. ఇక్కడ అన్ని రకాల ముత్యాలూ దొరుకుతాయీ అన్నాను. దానికతను ‘అబ్బే అందర్లాగా అలా షాప్‌లో ముత్యాలదండలు కొనిచ్చేస్తే ఎలాగండీ.. రాధకి ఏదిచ్చినా కల్తీ లేనిదీ, అపురూపమైనదీ అయి ఉండాలి.’ అన్నాడు.”

“మరెక్కడ కొంటాడుట..”

వదిన విసుక్కుంది. “ఆ మాట నేనెలా అడగగలనూ.. సరేనని ఫోన్ పెట్టేసేను.”

“అంటే అప్పట్నించీ సుధాకర్‌కి కొనడానికి ముత్యాలే దొరకలేదంటావా!”

“అదే అనుమానం నాకొచ్చి మొన్న రాధకి ఫోన్ చేసి, మాటల్లో ఈ విషయం కదిపేను. అంతే.. అది ఒక్కసారి గొల్లుమంది.. ‘ఏం చెప్పమంటావు వదినా.. అపురూపం అపురూపం అంటూ ఈయన ఏం చేసేరో చూడూ..’ అంటూ విషయమంతా చెప్పింది.”

“ఏం చేసేట్టా..” ఇవతల నాకు ఆతృత ఆగటం లేదు.

ముందు చిన్నగా వదిన నవ్వు వినిపించింది. తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది..

“ముందు మంచిముత్యాలు ఎక్కడ దొరుకుతాయోనని ఆన్‌లైన్‌లో ఉన్న షాపులూ, వెబ్ సైట్లూ అన్నీ వాటి రివ్యూలతో సహా రెండురోజులపాటు గాలించేసేట్ట.. దాని వలన అతనికి వచ్చిన జ్ఞానమేంటంటే ఎంతో నిజాయితీ ఉన్న షాప్ వాళ్ల మీద కూడా నూటికి ఒకటో అరో నెగిటివ్ కామెంట్లు కనిపించేవిట. ఇలా చూడడం వలన అతనికి కలిగిన జ్ఞానోదయ మేంటంటే ఇలా రెడీగా ఉన్న ముత్యాలు కొనేకన్న ఒరిజినల్ పెరల్ షెల్స్ అంటే అసలైన ముత్యపుచిప్పలు కొంటే వాటిలో మంచిముత్యాలే ఉంటాయికదా! ఇంక నకిలీ ముత్యాలు వచ్చే ఛాన్సే ఉండదుగా..”

నాకు మతిపోయింది..

“ఆగాగు.. అలా ముత్యపుచిప్పలు అమ్ముతారా!” ఆశ్చర్యంగా అడిగేను.

“అమ్ముతారుట.. గిఫ్ట్‌లూ అవీ అమ్మే వెబ్ సైట్లలో అమ్ముతారుట. కొంతమంది వీటిని కొని అపురూపంగా బహుమతు లిస్తుంటారుట.”

“నిజవా!”

“ఊ.. ఈ సంగతి తెలీగానే సుధాకర్ ఒక అమెరికన్ షాప్ వాడికి రెండు పెరల్ షెల్స్‌కి ఆర్డర్ ఇచ్చేసేడుట. ఆహా.. నా మొగుడే కదా అమెరికానుంచి అసలైన ముత్యపుచిప్పలు తెప్పిస్తున్నాడూ. అలాంటి ముత్యాపుచిప్పలు ఇప్పటికొచ్చి మనవాళ్ళెవరూ వాళ్ళ భార్యలకోసం తెప్పించలేదనుకుంటూ రాధ తెగ మురిసిపోయిందిట..”

“ఇంతకీ అది నిజమైన సైట్ కాదా… వీళ్ళ డబ్బులు పోయేయా..”

“నీ ఆతృత బంగారంగానూ.. విషయం వినవే తల్లీ.. ఆ సైటూ నిజమైందే.. వీళ్ళ ఆర్డరూ వచ్చింది నాల్రోజుల క్రితం. ఆ పెరల్ షెల్ ఎలా ఉందిటంటే సముద్రంలోంచి అప్పుడే బైటకి తీసి, పేకట్లో పెట్టి పంపించినంత ఫ్రెష్‌గా ఉందిట. షెల్ మీద చల్లటి తేమ ఇంకా ఆరనేలేదుట. కానీ అక్కడే వచ్చింది చిన్న చిక్కు..”

“ఏంటీ..”

“ఆ షెల్ లోంచి ముత్యాలని ఎలా తియ్యాలో వీళ్లకి తెలీలేదుట. ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్ తోటీ, అమాందస్తా గూటం తోటీ కొట్టి చూసేరుట.. అబ్బే.. ఆ చిప్ప మీద గీటు కూడా పడలేదుట. ఇంక వీళ్ల దగ్గర తగిన పనిముట్లు లేవని ఆన్‌లైన్‌లో టూల్ కిట్ కోసం ఆర్డర్ పెట్టేరుట. అది రేపొస్తుందిట.. అందులో సుత్తీ, సానం లాంటివన్నీ ఉంటాయిట. రేపు ఆ టూల్ కిట్ వచ్చేక, వీళ్ళు ఆ చిప్పల్ని పగలగొడితే అందులోంచి ముత్యాలే వస్తాయో ఇంకేమైనా వస్తాయో మనం వేచి చూడాల్సిందే..” అంటూ ముగించింది వదిన.

“ఆ.. అందులోంచి ముత్యాలే ఒస్తాయో ఉత్తి డొల్లలే ఉంటాయో…. మనకి నిజం చెపుతారేంటీ.. బైట ముత్యాలు కొనుక్కొచ్చేసి అవే అందులోంచి తీసినవని చెప్పొచ్చుగా..” నా పిచ్చి అనుమానాన్ని బైట పెట్టేను.

“నాకామాత్రం తెలీదనుకున్నావా.. నేను రాధతో చెప్పేను. ‘నిజంగా మీ ఆయన నీకు ఎంతో అపురూపమైన బహుమతు లిస్తున్నాడూ. రేపు నీకోసం అతను ఆ చిప్ప పగలగొడుతుంటే మొబైల్‌లో  వీడియో తియ్యీ.. నాకు లైవ్ పెట్టూ.. నేను నీమీద మీ ఆయన కున్న ప్రేమని అందరికీ చెప్తానూ..’ అన్నాను. అలాగేనంది. అందుకనే నేను రేపటికోసం వెయిట్ చేస్తున్నాను. రేపు వాళ్ళిద్దరూ సుత్తీ, సానం పట్టుకుని  ఆ చిప్పని పగలగొడుతున్న దృశ్యం అలా నా కళ్ళముందు కొచ్చేస్తోందనుకో…” అంది వదిన.

వదిన తెలివికి మురిసిపోతూ, “వదినా, నాకిప్పుడో అనుమానం వస్తోంది..” అన్నాను నెమ్మదిగా.

“ఏంటీ..” అంది వదిన.

“ఆ పండితుడెవరో కానీ ముత్యాలు రాధ నక్షత్రానికి నప్పుతాయని చెప్పి రక్షించేడు. అదే కనక ఏ వజ్రమో నప్పుతుందంటే ఆ సుధాకర్ ఏం చేసి ఉండే వాడంటావ్..” అడిగేను నవ్వుతూ..

“ఆ… ఏవుందీ… ఏ వజ్రాల గనుల్నుంచో ఓ బొగ్గుముక్క తెప్పించి ఓ నెల్లాళ్ళు దాన్ని సానపడుతూ ఉండేవాడు. నయం.. ముత్యం కనక మనకి జనవరిలోనే పుట్టిన్రోజు ఫంక్షన్ వస్తోంది. అదే వజ్రమైతే ఏ మార్చిలోనో.. లేకపోతే వచ్చే ఏడాదో వచ్చును..” అంది వదిన నా నవ్వుకి శృతి కలుపుతూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here