[శ్రీ దేశరాజు రచించిన ‘అరమరికలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]నింకా మర్చిపోలేదు-
తొలిరోజుల్లో మనం అద్దెకున్నవాటాను.
ఓ రాత్రి వేళ కమ్ముకుంటున్న ఇద్దరినీ
ఉలిక్కిపడేలా చేసిన వాళ్లింట్లోని చప్పుళ్లను.
రెండు వాటాల మధ్య చీలిన తలుపును
ఆ సందులోంచి ప్రసరిస్తున్న వెల్తురును.
పక్కవాళ్లకు వినిపిస్తుందేమోనని
నోరు తెరవకుండా, కళ్లతోనే చెప్పుకున్న కబుర్లను.
పవర్ కట్ చీకట్లో, కొవ్వొత్తి ఓడిపోయిన రాత్రిలో
నీ చేతులు చెక్కిన శిల్పాలను.
దిండు చివర సున్నాలు చుడుతూ
నీవు రచించిన పంచ రంగుల ప్రణాళికలను.
ఇప్పుడు చూసుకుంటే-
అన్ని రంగులూ అమరకపోయినా,
అరమరికలు లేని హృదయాలు అలానే వున్నాయి.
అది చాలదూ?