అరటి పండు

0
3

[dropcap]అ[/dropcap]మ్మమ్మ దగ్గరకు వచ్చిన అవని, అఖిల్ పగటి పూట ఆన్‌లైన్ క్లాస్ అయ్యాక హోమ్ వర్క్ చేసుకుంటారు బుద్ధిగా. లేకుంటే తాతకు కోపం వస్తుంది.

లంచ్ తరువాత తాతతో కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. పొలం గట్ల మీద తిరుగుతూ పంట పొలం లోకి నీరు ఎలా పెడతారో తెలుసుకున్నారు.

పొలంలో ఉన్న కాపలాదారు (కేర్ టేకర్) ఇంటి ముందున్న పెద్ద నీటి తొట్టిలో స్విమ్మింగ్ చేశారు. వాళ్లకి అదొక పెద్ద ఫన్. సిటీ లైఫ్‌లో లేనిది.

పొలంలో ఒక సగం పండ్ల తోట. అరటి, జామ, బొప్పాయి, మామిడి, కొబ్బరి ఉన్నాయి.

స్విమ్మింగ్ అయ్యాక ఫ్రెష్ అయిన అవనికి, అఖిల్‌కి, తాతకి పొలం కాపలాదారు తాజా కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చాడు.

పొలం లోని పెద్ద వేప చెట్టు నీడలో మంచం మీద కూర్చున్న పిల్లలు “తాతా ఇక్కడ ఏసిలా ఉంది. సో కూల్. యమ్మీ కోకోనట్ వాటర్” అన్నారు.

“ఇంకా కొంచం తాగండి” అంటూ వాళ్లకి ఇచ్చారు తాత.

ఇంతలో స్వామి అదేనండి, పొలం కేర్ టేకర్ తాజాగా పండిన అరటి పళ్ళు తెచ్చి ఇచ్చాడు.

“తాతా! ఐ డోంట్ లైక్ బనానా. వద్దు” అన్నాడు అఖిల్.

మిగిలిన అందరు తిన్నారు. ఇంటికి చాలా తీసుకు వచ్చారు.

జరిగింది అమ్మమ్మకి చెప్పింది అవని.

“అవునా? అఖిల్ అరటిపండు వద్దన్నాడా? సరే, నేను వాడికి అరటి పండు స్టోరీ చెబుతాను” అంది అమ్మమ్మ.

“అఖిల్! అరటి పండు వద్దన్నావుట. ఎందుకు?” అని అడిగింది.

“నాకు నచ్చదు అమ్మమ్మా”

“ఎందుకు?”

“ఎందుకంటే తెలీదు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్.”

“అఖిల్ నువ్వు ఎందుకో తెలీకుండానే ముందుగానే అరటి పండు అంటే ఇష్టం లేదు అని డిసైడ్ అయ్యావు. అరటి పండు చాలా మంచిది ఆరోగ్యానికి. ఎలాగో చెబుతా విను. అఖిల్ అరటి పండు ఎక్కడ పుట్టిందో తెలుసా?”

“తెలీదు అమ్మమ్మా” అన్నాడు.

“భూమిపై మొదటిగా పండించిన పంటల్లో అరటి కూడా ఒకటి. ఎక్కువగా పండించే పంటగా కూడా దీనికి పేరుంది. వీటికి భారత్, ఆగ్నేయాసియా పుట్టినిల్లు. అయితే, ఇప్పుడు ఇవి చాలా ప్రాంతాలు, దేశాలకు విస్తరించాయి. ఎక్కువ మంది వీటిని ఆహారంగా తింటారు”

“అవునా మనదేశంలో ఫస్ట్ పెరిగిందా? wow” అన్నాడు అఖిల్

“కదళీ ఫలం రుచికి అలెగ్జాండర్ ఆనందపడ్డాడుట, చరిత్ర చెబుతోంది. అరటిని సంస్కృతంలో కదళీ ఫలంగా పిలుస్తారు. అలెగ్జాండరు తొలిసారిగా క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో తిని వీటిని పశ్చిమాసియాకు తీసుకెళ్లాడు. అక్కడే వీటికి బనాన్ అనే పేరు వచ్చింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యంలో ఉన్నది. అరబిక్‌లో బనాన్ అంటే చేతి వేళ్లు అని అర్థం. ఆ తర్వాత క్రీస్తుశకం 1502లో పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియన్, మధ్య అమెరికా ప్రాంతాలలో మొదలుపెట్టారు. 15వ శతాబ్దంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులకు ఆ తర్వాత బెర్ముడాకు చేరాయి. 17,18 శతాబ్దాల్లో బెర్ముడా నుంచి ఇంగ్లండ్‌కు తీసుకెళ్లేరు. 1835లో మూసా కేవెండిషిగా పిలిచే పసుపు అరటిపళ్లను ఇంగ్లండ్‌లోని డెబ్రీషైర్‌లో జోసెఫ్ ప్యాక్స్‌టన్ పెంచేవారు. తన యజమాని విలియం కేవెండిష్ పేరునే ఆయన ఈ అరటిపళ్లకు పెట్టారు.”

“అన్ని దేశాలు తిరిగిందా అరటిపండు? భలే భలే” అని చప్పట్లు కొట్టాడు అఖిల్.

“అవును మరి అరటి పండు చాలా రుచిగా ఉన్నది కనుక అందరు లైక్ చేస్తారు.”

“అమ్మమ్మా బనానాలలో వెరైటీస్ ఉన్నాయా?”

“ఉన్నాయి. చాల రంగులు, రుచులలో దొరుకుతాయి. భారతదేశంలో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు. అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్) మాత్రమే. చాలా పెద్ద పెద్ద ఆకులతో 2 నుండి 3 మీటర్లు పొడుగు 4 నుండి 8 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు ఉంటాయట. ఈక్వడార్, కోస్టారికా, కొలంబియా, ఫిలిప్పైన్సు ఎక్కువగా అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.”

“ఇంట్రెస్టింగ్. ఇంకా?” అన్నాడు అఖిల్ అమ్మమ్మ ఇచ్చిన అరటిపండు తింటూ.

“అరటి చెట్టులో ప్రతిదీ మనకి ఉపయోగం. నీకు తెలుసుగా పండగల్లో మనం అరటి ఆకుల్లో అన్నం తింటామని.”

“అవును అమ్మమ్మ. ఎందుకు అలా?” అన్నాడు అఖిల్.

“అదొక సంప్రదాయం. Old tradition.  రాజులు పాలించేటప్పుడు వాళ్ళ ఆహారం (ఫుడ్) లో విషం (poison) ఉంటే కనుక్కోవటానికి అరటి ఆకు మీద వడ్డిస్తే, నీలం రంగులోకి… అంటే బ్లూ గా మారేదిట. అరటి ఆకులు డెకొరేషన్స్‌లో కూడా వాడతారు. ఫుడ్ కప్స్, ప్లేట్స్‌లా వాడతారు. పళ్ళని కేక్ తయారీలో, బ్రెడ్, చిప్స్ మిల్క్ షేక్స్ రకరకాలుగా తింటారు. అరటి పువ్వుని వంటలో వాడతారు. అరటి కాయల కూర బావుంటుంది” అంది అమ్మమ్మ

“అమ్మమ్మా, అరటి పండు బలం అన్నావు. నిజమేనా?”

“నిజం. రోజు అరటి పండు తినడం వల్ల అధిక బరువు, ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్ తగ్గుతుంది. అరటి ఇంటస్టైన్ ప్రాబ్లమ్స్, constipation తగ్గిస్తుంది, విరేచనాలు, రక్తహీనత, టీబీ, ఆర్థరైటిస్, గౌట్, కిడ్నీ,లాంటి రోగాల నుండి అరటి పండు కాపాడుతుంది.

అరటిని అనారోగ్యానికి ఔషధంగా వాడతారు. రోజు అరటి పండు తినడం వల్ల రక్తపోటును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రోగనిరోధకత పెంచడంలో సహాయపడుతుంది. అరటిని తినడం వలన కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. బలమైన ఎముకలను ఇస్తుంది. సో శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి మంచిది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బీపీని తగ్గేలా చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటుందిట.

పండిన తర్వాత వీటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీ లతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. భారత్‌లో వేల ఏళ్ల నుంచీ వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. ఇంకో సంగతి తెలుసా? మనదేశంలో అరటి చెట్టుని కొలుస్తారు. పూజలు, ఫంక్షన్స్‌ ముఖ్యంగా వాడతారు.

పశ్చిమ బెంగాల్‌లో అయితే దుర్గాపూజ టైంలో అరటి చెట్లును దుర్గా మాతగా కొలుస్తారుట. అరటి చెట్లుకు ఎర్ర రంగు అంచు ఉండే పసుపు చీరను కట్టి అమ్మవారిలా ముస్తాబు చేస్తారని చదివాను. ఈ దేవతను కోలా బవుగా పిలుస్తారు. ఇక్కడ కోలా అంటే అరటి పండు, బవు అంటే మహిళ అని అర్థం.

  1. అరటి సాగు రైతులకు ఓ ఆదాయ వనరు.
  2. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా మట్టిలో కలిసి పోతుంది.
  3. అరటి ఆకులు గేదెలకు మేతగా వేయవచ్చు.
  4. అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉంది.

అంతే కాదు పెరుగుతున్న వేడి కారణంగా అరటి ప్రొడక్షన్ తగ్గుతోందిట. క్లైమేట్ చేంజ్ కి కారణం మన స్వార్థం. అడవులను నరకటం, నీటిని గాలిని పొల్యూట్ చేస్తున్నాము. ప్రపంచంలో ప్రమాదస్థాయిలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ సిటీస్ చాల మనదేశంలో ఉన్నాయిట.

ప్రకృతిలో మొక్కని, ప్రాణిని, కొండని కోనని, అడవిని, నీటిని, గాలిని దేన్నీ పలకరించినా అవి అనేక మానవ తప్పిదాల కథలు వినిపిస్తాయి. అఖిల్! నేచర్ లో దొరికే, పెరిగే ఫుడ్స్ అన్ని బలం. మెయిన్‌గా ఆర్గానిక్ ఫుడ్స్.

అన్ని తినాలి. వద్దన కూడదు. అవును నీకు అరటి మీద రాసిన poem గుర్తుందా?” అని పాడి వినిపించారు అమ్మమ్మ.

“ఆదివారము నాడు అరటి మొలిచింది
సోమవారము నాడు సుడి వేసి పెరిగింది
మంగళవారము నాడు మారాకు తొడిగింది
బుధవారము నాడు పొట్టి గెల వేసింది
గురువారమునాడు గుబురులో దాగింది
శుక్రవారము నాడు చక చకా గెల కోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లివిగో”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here