Site icon Sanchika

అర్ధరాత్రి పూట..

[తమిళంలో జాతీయ పురస్కార సినీ దర్శకులు, కవి శీను రామసామి రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీ జిల్లేళ్ళ బాలాజీ.]

~
దాని
గుండెకు గుద్దుకున్న వాహనం
నలిగి
దాదాపు చాలామంది
ప్రాణంతో బ్రతికింది లేదు.

ఇరువైపులా
రహదారిపై
నిదుర ఆవహిస్తుంది
వాహన చోదకులకు.

కారణం చింతచెట్లు
అయితే అవి చెట్లు కావు
రెండో పత్నిగా
అడుగుపెట్టిన పడతి
వేలాడిన మర్మం
దానికి మాత్రమే తెలుసు.

మతి తప్పిన ముదుసలికి
ముడుక్కొని పడుండటానికి
అది విస్తరించి నిలబడుంది.

రుషులు దాన్ని సమీపించటం లేదు
ధ్యానించటానికి తగిన చోటు కాదు
అయినా
నాగలిని వాల్చి
నిద్రించేవానికి
పరుచుకుని నీడనిస్తోంది.

కాకులు
తమ గూటిని
కట్టుకోవటానికి అనుమతిస్తోంది
ఒక పిల్లను కిందికి తోసి
ప్రేమను వేగు చూస్తోంది.

దాని
బొగ్గుపులుసు వాయువును పీల్చి
బలహీనుడు మరణించిన నెపం
చెట్టుపై జీవించే
రూపులేని ‘మునీశ్వరుడిపై’
పడింది.

నెలలు నిండని పసిగుడ్డుల
కళేబరాలు కట్టిన
దాని దేహంపై
దుర్వాసన లేదు
సువాసనా లేదు
దాని పచ్చదనంలో
లోటు లేదు.

ఎవరూ నీరు అందించలేదు
ఎలాగో
పెరిగింది
దుష్టాత్మల వెంట్రుకల్ని
దానిపై దిగ్గొట్టి
తర్వాత
వెనుదిరిగి చూడకుండా వెళ్లటమూ
ఆమెకు చెప్పబడింది.

నాగు విషం తీసే
నాటు వైద్యుని
ప్రకటనా రేకును
వాటి మర్మావయవంలో
అర్ధరాత్రి దిగ్గొడతాడు.

దీని వెనకే ఉంటూ
మల్లెలు చుట్టుకున్న ఓ సరసి
ఒంటరిగా
వెల్తుర్లో కనిపించి లారీలను
అడ్డగిస్తుంది.
ఆగని ఇంజన్ శబ్దంలో
క్లీనర్ పిల్లాడి మీద రాలుతాయి
చెట్టు ప్రతిస్పందనలు

నివాస సంఖ్యలు
దానికున్నాయి
అయితే
ఇల్లు అని అంగీకరించేందుకు
ఎవరికీ వీలుకాదు
దాని వేర్లలో
దేవతలను
నేనూ చూడలేదు.
సినిమాల్లో గుడ్లగూబల
సునిశిత చూపుల దృశ్యం
చింతచెట్లపై
నమోదు కాబడ్డది.

ప్రతి ఇంట్లోని
కడుపులోకీ
కరిగించబడుతోంది
వెన్నెముక ఎండిన
వాటి పండ్లు
మూగబోయిన దాని
అగ్ని సెగల్లో
అధికమయ్యే వేడిమిని
గ్రహించటం అవసరం.

గన్నేరుకాయల్నీ
ఎలకల మందునూ
కక్కించి
చావును తప్పించి
వాడికి
జీవితాన్ని ప్రసాదించింది
చింతపండు రసం

బెల్లంతోపాటు
చింతపండు రసం పానకంలా
కలిపి తాగిన అతడేమో
ఎండ వేడిమిని తట్టుకున్న
బాటసారి
భక్తి ఫలితం తెలిసినవాడు
జీవించేవాడికి
ఎన్నో ఉన్నాయి
తీరకుండా
సగంలో చచ్చినవాడికి
చింతచెట్టే గతి
అన్నట్టు అయిపోయింది..
~

తమిళ మూలం: శీను రామసామి
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

Exit mobile version