[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అర్హత గలవారికే భగవద్దర్శనం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ఈ[/dropcap] కలియుగంలో ఎందరో భగవంతుని దర్శనం కోసం గుడులు, గోపురాలు, పుణ్య క్షేత్రాల చుట్టు అప్రతిహతంగా తిరుగుతున్నారు. పూజలు, వ్రతాలు, నోములూ, ఉపవాసాలు, దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే ఈ సత్కార్యాల వలన వీరికి పుణ్యం అపారంగా ప్రాప్తిస్తోంది కాని వారు ఆశించిన భగవద్దర్శనం లభించడం లేదన్నది కఠోర సత్యం. కారణం ఈ కలియుగంలో ధర్మం ఇతర యుగాల కంటే భిన్నంగా వుంటుంది. ఎన్ని కఠోర సాధనలు చేసినా సాధకుల మనస్సులు పవిత్రం అవడం లేదు. భగవంతుడు తనపై అచంచలమైన నమ్మకాన్ని, తనపై భక్తిని కలిగి ఉంటే చాలు వారిని, వారి యోగక్షేమాలను తానే చూస్తానని భగవద్గీతలో చెప్పాడు. చెప్పడం కాదు, ఆయన ద్వాపరయుగంలో చేసి చూపాడు. భగవంతుణ్ణి మనసారా కోరుకుంటే చాలు. మనసారా స్మరిస్తే చాలు ఆ వేల్పును వేడుకుంటే చాలు. ఆ పరమాత్మ దయామృతం పొందడానికి మరో మార్గమెందుకు? అయితే అందుకు కావల్సిన అర్హత సంపాదించుకోవడం ఎంతో అవసరం.
“నిర్వైస్సర్వభూతేషు” అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి అన్నది శాస్త్ర వాక్యం. అంటే ఇతరుల పట్ల ద్వేషభావం ఉండకూడదు. అంటే రాగద్వేషములను పూర్తిగా వదిలిపెట్టాలి. దీనినే పరిణతి చెందిన బుద్ధి అని కానీ, వైరాగ్యం అని కానీ అనవచ్చు. వైరాగ్యం అంటే కేవలం రాగము లేకపోవడమే కాదు. ద్వేషం కూడా లేని స్థితి. రాగద్వేషాలకు మధ్య ఉన్న స్థితి కలిగి వుండాలి.
ఇదే విషయాన్ని శ్రీసాయినాథులు ఒక సంఘటన ద్వారా తన భక్తులకు చక్కగా వివరించారు. ఒక ధనికుడు శిరిడీకి వచ్చి సాయిని భగవద్దర్శనం, మోక్షం కావాలని అడిగాడు. సాయి వెంటనే ఒక పిల్లవాడిని శిరిడీలో వున్న వర్తకులను కలిసి వంద రూపాయలు అప్పుగా తీసుకురమ్మన్నారు. ఆ వర్తకులందరూ తమ వద్ద చిల్లిగవ్వ లేదని, దానికి బదులుగా తమ నమస్కారాలు స్వీకరించమని చెప్పారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్‌ను పిలిచి ఒక వంద రూపాయలు సత్వరమే కావాలని అడిగారు. నానాసాహెబ్ ఒక చీటీ రాసి పంపగానే ఒక వర్తకుడు వంద రూపాయలు వెంటనే ఇచ్చాడు. శ్రీ సాయి తనకు భగవద్దర్శనం కావాలని అడిగిన ధనికుడిని పిలిచి “ఈ లోకంలో ఆర్థిక వ్యవహారాలన్నీ ఇలాగే వుంటాయి. ధనికులకు, ఉద్యోగస్తులకు మాత్రమే అప్పు పుడుతుంది. అట్లే తీవ్ర సాధనతో ముకుక్షుత్వం కావాలని ఆశించే సాధకులకు మాత్రమే మనస్సు పవిత్రం అయిన నాడు భగవద్దర్శనం లభిస్తుంది” అని చెప్పారు. ఐహిక సుఖాలను అనుభవించాలని మనసే ఇంద్రియాలను ప్రోత్సహిస్తుంది. ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకుని, వాటిని భగవంతుడివైపు మళ్ళించేదీ మనసే. శత్రువులాంటి మనసుతో మైత్రి చేసుకుంటే ముక్తిసాధన సులభతరమవుతుంది. కాబట్టి మనోపవిత్రత కోసం చిత్తశుద్ధితో కృషి చేయడమే సాధకుల తొలి అడుగు కావాలి.