అరికత

4
2

[dropcap]”రా[/dropcap]త్రి అరికత వినేకి పోయివుంటివి కదనా, దాసు ఏమి చెప్పేనా?”

“సంసారము గురించి శానా సమాచారము చెప్పేరా, అది నాకి శానా ఇష్టమాయెరా”

“ఆ ఇష్టాన్నీ నాకీ ఈనా”

“ఇదో తీసుకోరా… మనము పెండ్లాము, బిడ్లు, బతుకు అనే సంసారబందాలలా చిక్కి దేవున్ని మరస్తావున్నామంటా, ఇట్ల కాకుండా నీళ్ళలాని తామర ఆకులా ముట్టి ముట్ట నట్ల వుండాలంటరా!”

“తామరాకులా వుండాలంటనా?”

“ఊరా”

“ఆకులా వుండేకి మనము చెట్లా, మాన్లా, మనుషులు కదా? అదెట్ల అట్లుండేదినా?”

“కదా! నాకి బుర్రే పారలే… దాసు చెప్పతా వుంటే అయిగా విని ఇట్లొస్తినిరా”

“ఇట్ల వినే వినే మనోళ్లు ఏమిటికి తరము కాకుండా వుండేది. అయినా దేవుడు పుట్టిచ్చిన మనిషి అవసరము దేవునికి ఏముంది? ఏచన చేసే పని లేదా? మనం ఇట్లుండేదానికే రవంత బుద్దుండే వాళ్లంతా పుణ్యమంతులై దేవతా అంశాలై మెరస్తా వుండారు. ఆ దాసునే కాదు ఇట్లా వాళ్లని కూడా కొన్ని విషయాలు అడగాలనా, కడగాలనా?”

“నాకేమి అర్థము కాలేదురా”

“అర్థము చెప్పేవాళ్లకి పరమార్థము బోద చేసేవాళ్లకి అర్థము అవుతుంది లేనా”

“సరేనప్పా!” అంటా అన్న ఇంటి దోవ పట్టే.

నేనూ లేస్తిని.

అంతలానే “ఏం? రా! అబ్బయ్య… ఏమో పెద్ద పెద్ద… మాటలు మాట్లాడతా వుండావు. పోనీ మన జీవితానికి అర్థము ఏమని రవంత చెప్పరా?” అంటా ఆడికి వచ్చె రమణారెడ్డి అన్న.

“జీవించటమే జీవితానికి అర్థమునా” అట్లే అంట్ని.

నా మాటకి అన్న నగి (నవ్వి)

“జీవితమే అర్థవంతమైనది అయితేరా” అనె.

“ఇంగా మంచిదినా” అంటా అన్నకి దండాలు చెప్పుకొంట్ని.

***

అరికత = హరికత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here