Site icon Sanchika

అరిసెల పాకం

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘అరిసెల పాకం’ అనే చిన్న కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ల[/dropcap]లిత గంట నుంచి స్టవ్ ముందే ఉన్నది. బెల్లం పాకం పడుతున్నది. కానీ పాకం తీగ పాకమో, ముదురు పాకమో అరిసెలకు ఏ పాకమో సరిగా తెలియట్లేదు. ఎన్నిసార్లు చూసినా ఈ అరిసెలేంటో ఓ పట్టాన రావు కదా! విసుగ్గా పాకాన్ని గరిటతో తిప్పుతూ ఆలోచిస్తోంది.

అసలు సంక్రాంతి పండుగకు ప్రతి సంవత్సరమూ అమ్మ వాళ్ళింటికి వెళుతుంది పిల్లల్ని తీసుకొని. కృష్ణేమో పండగ రోజున వచ్చేవాడు. వారం రోజులు సరదాగా పుట్టింట్లో గడిపి ఆనందంగా ఇంటికి వచ్చేది. అక్కడున్నన్ని రోజులూ అమ్మ అరిసెలు, కారప్పూస, కజ్జికాయలు, గవ్వలు అన్ని పండక్కి వండి పెట్టేది. పిల్లలు “అమ్మమ్మా ఎంత బాగున్నాయి” అంటూ అనేస్తూ, మామయ్యా అంటూ తమ్ముడితో ఏవో ఆటలు ఆడేవాళ్ళు.

కానీ ఇప్పుడంతా మారిపోయింది. తమ్ముడి పెళ్లై మరదలు వచ్చేసరికి అంతా మారిపోయింది. నాన్న సంపాదన తగ్గింది. అమ్మ ఓపిక తగ్గింది. ఇప్పుడు పుట్టింటికి వెళితే మర్యాద లేదు. ఇప్పుడు పండగ రోజుకు తమ్ముడు, మరదలు వాళ్ళత్తగారింటికి వెళుతున్నారు. ఇంతకు ముందులా అమ్మ పిండివంటలు చేయటం లేదు. పిల్లలు సరదాలు, షికార్లు లేక అమ్మమ్మ ఇంటికి ఇష్టపడటం లేదు. అందుకే ఈ సంవత్సరం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

“అమ్మా అరిసెలు వండవా” అంటూ పిల్లలిద్దరూ ఆటల మధ్యలో నుంచి పరిగెత్తుకొచ్చి అడిగారు. లలిత పాకంలో బియ్యప్పిండి పోసి కలయతిప్పుతూ ఉంది గానీ గట్టి పడిపోయి అట్లకాడ కూడా గిన్నెకే అతుక్కుపోయింది. అరిసెలు రాలేదనే అసహనంతో ఉన్న లలితకు పిల్లలు వచ్చి “అరిసెలు అయ్యాయా” అనడంతో కోపమొచ్చి వాళ్ళనొక్కటి వేసింది. పిల్లలిద్దరూ ఏడ్చుకుంటూ బయటికెళ్ళి పోయారు.

లలితకు తన అత్త విషయంలో తను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. అత్త రమణమ్మ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా, నచ్చక పల్లెటూరుకు పంపేసింది. ఆమె చేసినా తప్పేమీ లేకపోయినా ఇంట్లో ఉండగూడదనుకుంది. ఇప్పుడు గుర్తొస్తోంది. తను ఎంత బాగా అరిసెలు వండేది. కూరలు ఎంత కమ్మగా ఉండేవి. ఆలోచిస్తుంటే తన తప్పు తెలిసొచ్చి మనసులో గిల్టీగా అన్పించింది. అత్త ఏమీ అనకపోయినా, ఇంట్లో ఉండకూడదనే కోపమే తనను ఆ విధంగా వెళ్ళగొట్టేలా చేసింది. ఆలోచించి, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. భర్త కృష్ణ అన్నానికి రాగానే “రేపు అత్తమ్మను ఇక్కడకు తీసుకురండి” అని చెప్పింది. కృష్ణ మరేమీ మాట్లాడలేదు, ఆనందంగా తలూపాడు. అరిసెల పాకానికి మనసులో దణ్ణం పెట్టుకున్నాడు.

Exit mobile version