[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అర్జునుని శరణాగతి’ అనే రచనని అందిస్తున్నాము.]
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్॥
(భగవద్గీత 2 వ అధ్యాయం, 8 వ శ్లోకం)
[dropcap]అ[/dropcap]ర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తన మనస్సులో వున్న శోకం, భయాందోళనల గురించి వివరించే క్రమంలో వచ్చిన శ్లోకం ఇది.
ఓ భక్తజన భాంధవా, నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, మరియు ఎప్పుడైతే మనస్సులోని దుఃఖం యొక్క కారణం మన తర్కానికి అందదో, అప్పుడే మన మనస్సు దుఃఖానికి తలవంచి మానసికంగా కుంగిపోవటం మొదలౌతుంది. అర్జునుడిది నిజంగా అల్పబుద్ధే కాని భగవానుడైన శ్రీకృష్ణుని సాంగత్యం చేత అతనికి శక్తియుక్తులు అబ్బాయి. నేటి సాంకేతిక పరిజ్ఞాన భాషలో దీనినే వర్చువల్ స్త్రెంగ్త్ అంటారు. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరిణమించటంతో, తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు కాబట్టి శ్రీ కృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని పై శ్లోకం ద్వారా చెప్పుకున్నాడు.
జీవితంలో మనకు దుఖం అప్పుడప్పుడూ అనివార్యంగా ఎదురవుతూ వుంటుంది. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం తొలగించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోము. మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకునే యత్నం చెయ్యము. పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ తరచుగా ఇతరులను ద్వేషిస్తాము. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న గురువు మనకు లభించినప్పుడు, మనం అణకువ, వినయం ద్వారా సద్గురువును సేవిస్తే ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకొని సుసంపన్నుడయ్యాడు. తన మనస్సులో వున్న బాధంతా శ్రీకృష్ణుడికి చెప్పుకొని తద్వారా ఉపశమనం పొందడమే కాకుండా బలసంపన్నుడై కురుక్షేత్ర సంగ్రామంలో శత్రువులను చీల్చి చండాడాడు. కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడికి సర్వశ్య శరణాగతి చేసి ఆయన కృపను పూర్తిగా పొందగలిగాడు.