అర్ధరాత్రి కవతలవైపు…

2
2

[dropcap]రా[/dropcap]త్రి రెండు గంటలు దాటి పది నిముషాలవుతోంది.

ధన్వంతరి మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ గేట్ దగ్గర ‘ఎమర్జెన్సీ రూమ్’ అన్న ఎర్రని అక్షరాలు మాత్రం నిశ్శబ్దపు నిశీధిలో వెలిగిపోతున్నాయి. అంతవరకూ కూడా రొదగానే వున్న రోడ్డు పైన ట్రాఫిక్ పూర్తిగా నెమ్మదించింది.

ఇప్పుడు ఎక్కడో దూరంగా ఒక కుక్క మొరగడం కూడా వినిపిస్తోంది.

కొంచెం సేపు కళ్ళు మూసుకుని నిద్ర పోవచ్చేమో అని అలసటగా డ్యూటీ రూంలోని బెడ్‌పై మేను వాల్చింది డాక్టర్ శర్మిష్ట.

ఈ రోజు ఎక్కువ కేసులు లేవు. రెండు మూడు మైనర్ ఏక్సిడెంట్స్. గాయాలకు సూచర్స్… ఒక ఫీవర్ కేసు, అంతే. కొంచెం సేపు పడుకోవచ్చేమో.

విసురుగా ఇన్నోవా కారు ఒకటి గేటులోంచి దూసుకువచ్చి సడెన్ బ్రేక్‌తో ఎమర్జెన్సీ రూం ముందు ఆగింది.

వస్తూనే కారు ముందు డోర్ తీసుకుని ఒక యువకుడు బయటకు దూకి, “స్ట్రెచ్చర్! ఎమర్జెన్సీ!” అని పెద్దగా అరిచాడు. వెనుక సీట్ తలుపులు కూడా తెరుచుకున్నాయి.

కునికిపాట్లు పడుతున్న వార్డ్ బాయ్, నర్స్ కారులోని పేషంట్‌ని స్టెచ్చర్ మీదకి లాగడానికి ఒక నిముషం అవస్థ పడాల్సి వచ్చింది.

పాతికేళ్ళ వయసులో వున్న యువకుడు పూర్తిగా బిగుసుకుపోయి కట్టెలా అయిపోయాడు. అతన్ని బయటకి లాగి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టగానే మళ్ళీ చేతులు కొట్టుకోసాగాడు.

“ఫిట్స్! త్వరగా ఇంజెక్షన్ చెయ్యండి” అని మిగిలిన ముగ్గురు యువకులు అరవసాగారు.

“డాక్టర్!” అన్న అరుపుతో శర్మిష్ట మెలకువలోకి వచ్చింది.

నర్స్ చెప్పింది “సీజర్స్ డాక్టర్, మేల్ పేషంట్, 25 ఏళ్ళు, బ్లడ్ సుగర్ 80 mg, బిపి మాత్రం 270/120, SPO2 90%” వివరాలు చెప్పింది.

పరిగెత్తింది శర్మిష్ట.

అతను జీన్ ప్యాంట్స్‌, రెడ్ టీ షర్ట్‌లో, గిరజాల జుట్టుతో అందంగా తెల్లగా, వున్న యువకుడు. మెడలో బంగారు గొలుసు, చేతికి వుంగరాలు అతను ఉన్నత కుటుంబం వాడని తెలియజేస్తున్నాయి.

బుగ్గల మీదుగా రక్తపు మరకలతో నురుగు.

గబగబా బిపి చూసింది. నిజంగానే 270/120! చాలా ఎక్కువ. కంటి పాపలు (pupils) వ్యాకోచం చెంది వున్నాయి. మెడ బిగుసుకుపోయింది. టెంపరేచర్ 102 డిగ్రీలు. వళ్ళంగా వేడిగా వుంది.

“ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎప్పటినుంచి ఫిట్స్? ఇది వరకే వున్నాయా?”

“మేం మా ఇంటి దగ్గర నుంచే వస్తున్నాం మేడం! బర్త్ డే అని అందరం కలుసుకున్నాం. సడెన్‌గా ఇలా… అయింది!”

గబగబా ఫిట్స్ కోసం ‘లెపిపిల్’, బి.పి.కి ‘లేబిటలాల్’ ఇంజక్షన్స్ ఇవ్వమని ఆర్డర్ వేసింది. గ్లుకోజ్ డ్రిప్ స్టార్ట్ చేసింది. ఆక్సీజన్ మాస్క్ నోటి మీద పెట్టింది.

“మీలో అతనికి ఎవరు బంధువులున్నారో వాళ్ళు సంతకం చేయండి! సీరియస్ కేస్! బ్రెయిన్ హెమరేజ్ కావచ్చు! మెనింజైటిస్ అనే బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ కావచ్చు!”

పొడుగ్గా, కొంచెం ఎర్రబడిన కళ్ళతో వున్న ఒకతను గట్టిగా అరిచాడు.

“ముందు ట్రీట్‌మెంట్ చెయ్ డాక్టర్! వాళ్ళ ఫాదర్ మినిస్టర్! ఫోన్ చేసి పిలిపిస్తాం” అతని ధోరణి కోపంగా వుంది.

“ప్రైవేటు హాస్పిటల్ ఇది. డిపాజిట్ కట్టాలి! ఎందుకంటే ఎడ్మిట్ చేయాలి. సి.టి.స్కాన్, ఇంటెన్సివ్ కేర్ రోజుకి ఏభై వేలు అవుతుంది.”

“షిట్!” అరిచాడతను. “ముందు ట్రీట్‌మెంట్ చెయ్యి! వినబడడం లేదా! వాళ్ళ ఫాదర్ మినిస్టర్. ఫోన్ చేస్తున్నాం.”

“ఓ.కె.” అంది శర్మిష్ట భయంగా. “నర్స్, సి.టి.స్కాన్, ఇసిజీ, ఎలెక్ట్రోలైట్స్…” వరుసగా సూచనలు ఇవ్వసాగింది.

“డాక్టర్ ఇదిగో ఇసిజీ” ఇచ్చింది నర్స్.

అది చూస్తూనే షాక్‌కి గురయింది శర్మిష్ట. ST-T ఎలివేషన్…. మేజర్ హార్ట్ ఎటాక్‌లా వుంది. లా… ఏంటి, ఇది ఎక్యూట్ ఎం.ఐ. (myocardial infarction). ఇంత యువకుడికా!!! ఇంత హై బి.పి.నా!!!

“నర్స్, వాళ్ళని పిలువు.”

ఆ ముగ్గురు లోపలికి రాగానే గబగబా చెప్పసాగింది.

“అతను సీరియస్‍గా వున్నాడు. హై. బి.పి, ఫిట్స్, ఎక్యూట్ ఎం.ఐ. అంటే తెలుగులో గుండెపోటు, అధిక రక్తపోటు వల్ల వచ్చాయి. ఎడ్మిట్ చేయాలి ఐసియులో. బహుశా ఏంజియోగ్రామ్, రక్తం గడ్డకట్టకుండా ఇంజక్షన్‍లు… 24 గంటల వరకు కండీషన్ సీరియస్. వాళ్ళ తల్లిదండ్రులని పిలవండి. లేదా తెలియజేయండి.”

వాళ్ళలో ఒకడు మరీ ఎమోషనల్‌గా వున్నాడు. “నో… నో… నో… యూ కాంట్ టెల్ లైక్ దిస్!… ఎవరినయినా సీనియర్ డాక్టర్‍ని పిలవండి. నేను నమ్మను. వాడు నిన్నటిదాకా మంచిగా వుండే! చాలా చిన్నోడు!”

మిగిలినవాళ్ళు కూడా రణగొణ ధ్వనులతో అరవసాగారు.

శర్మిష్ట కోసం పక్కన ముసలి సెక్యురిటీ గార్డు వచ్చి నిల్చున్నాడు, కోరలు పీకిన ముసలి పులిలా.

ఏం మాట్లాడలేక, డైరక్టర్ చందన నెంబర్ డయల్ చేయసాగింది. తప్పదు! అర్ధరాత్రి దాటినా సరే, ఆమెని డిస్టర్బ్ చేయాల్సిందే!

***

సెల్ ఫోన్ వైబ్రేటర్ రింగ్ రింగ్ మని ధ్వని.

డాక్టర్ ధీరజ్ నిద్రమత్తులో సెల్‌ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. రాత్రి మూడున్నర అయ్యింది. ఏ జీవికైనా అత్యంతమైన మత్తూ, అపస్మారకం లాంటి నిద్ర వుండే సమయం అది.

కాని ఆ గొంతు వినగానే, కొంత మత్తు వదిలింది.

“సారీ ధీరజ్! డిస్టర్బ్ చేయక తప్పదు. వి.ఐ.పి. కేస్. నువ్వు అర్జంటుగా రావాలి.ప్లీజ్ ఏమీ అనుకోవద్దు!”

రాత్రంతా ఏదో పుస్తకం చదివి రెండున్నరకి పడుకున్నాడు. చాలా మత్తుగా, అలసటగా వుంది. ఒక్కసారి కోపం వచ్చింది.

“చందనా! ఇప్పుడు టైం ఎంతో తెలుసా? పైగా బయట వాన. ఎవరూ డ్యూటీలో వుంది? పిలువు. కనీసం డిటైల్స్ చెబితే నాకు అర్థం అవుతుంది కదా!”

“మినిస్టర్ ధీరజ్! ఎలాగయినా నువ్వు రావాల్సిందే!”

“ఐ డోంట్ కేర్! నేనేం గవర్నమెంట్ సర్వీస్ వాడినా? ముందు వివరాలు కావాలి. ఎందుకు కేసు అర్థం కాలేదో? ఎవరూ శర్మిష్ట వుందా అక్కడ? పిలువు…”

“యూ ఆర్ ఇంపాజిబుల్! ఇదిగో శర్మిష్ట!”

“ధీరజ్ సార్! యంగ్ పేషంట్, హై బి.పి., ఫిట్స్, ఇసిజిలో ఎక్యూట్ ఎం.ఐ., ప్యూపిల్స్ కన్‌స్ట్రిక్టెడ్:” వినసాగాడు.

“ఓకే. ఇంటరెస్టింగ్. నేను పది నిమిషాల్లో అక్కడుంటాను!”

***

ఐ.సి.సి.యు.

ఎప్పటిలానే బీప్ బీప్ మనే మానిటర్ శబ్దాలతో… ఒకానొక అంతర్లీనమైన ఉత్కంఠతో… ఒక పెద్ద నిద్రపోయే జంతువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపిస్తున్నట్లుగా వుంది.

“బెడ్ నెంబర్ రెండు” అంది శర్మిష్ట.

చుట్టూ వున్న యువకులు కాక, ఒక సఫారీ సూట్‍లో వున్న నెరిసిన జుట్టు, గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాల పెద్దమనిషి నిలబడి వున్నాడు.

“అందర్నీ బయటకు వెళ్ళమను!” అన్నాడు ధీరజ్.

ఎక్కడి నుంచో… హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ చందన అర్ధరాత్రి కూడా పట్టుచీరల రెపరెపలతో వేగంగా నడుచుకుంటూ వచ్చింది.

“ధీరజ్! ఆయన డిప్యూటీ హోం మినిస్టర్. వాళ్ళు పేషంట్ ఫ్రెండ్స్. వాళ్ళు వుండచ్చు. నువ్వు ముందు కేస్ చూడు!”

“నమస్తే డాక్టర్ సాబ్! నేను రామేశం గౌడ్! డిప్టీ హోం మినిస్టర్. ఈ పిల్లోడి తండ్రిని.”

ధీరజ్ “నమస్తే సార్” అని, “మీరు కొంచెం బయట కూర్చుంటే నేను పరీక్ష చేసి బయటకి వచ్చి మాట్లాడతాను. ఓకే?” అన్నాడు.

ఆయనకి కోపం వచ్చింది. “గట్లనే డాక్టర్. మీరు ఏమయిందో చెబుతే తర్వాత వేరే హాస్పిటల్‌కి ఎపోలోకి కాని నిజామ్స్ దవాఖానాకి కాని పోతాం. అక్కడ  కనీసం మాకు మర్యాదయిన ఇస్తరు!. సరే చూడండి, చూడండి. కానీ డాక్టర్ సాబ్! మీ గురించి చాలా విన్న!”

అందరూ వెళ్ళాక ధీరజ్ పది నిమిషాలు ఇసిజి, ఎకో, స్కాన్ చూసి మళ్ళీ ఆ యువకుడిని క్షుణ్ణంగా పది నిమిషాలు పరీక్షించాడు.

హార్ట్ ఎటాక్, బీపీ, రెండూ వున్నాయి. కాని ఇంత చిన్న వయసులో…? అధిక బరువూ లేదూ, డయాబిటెస్ లేదు. పట్టుమని పాతికేళ్ళు లేవు!

ధీరజ్‌కి రిపోర్ట్‌ల కంటే తన తర్కం మీదే ఆధారపడడం అలవాటు.

రెండు నిమిషాలు ఆలోచిస్తూండిపోయాడు.

శర్మిష్ట తెల్ల కాగితం తీసుకువచ్చింది.

రాశాడు. ఎక్యూట్ కొరోనరీ స్పాసమ్. హై బిపి. ఫిట్స్. స్కాన్ నార్మల్!

“ఇప్పుడు ఇ.సి.జి. నార్మల్‌కి వస్తోంది సార్. బి.పి. 180/100” అంది శర్మిష్ట.

ఇది తగ్గిపోయింది కాని… ఎందుకని, ఎందుకని….

యువకుడు, ధనవంతుడు, మంత్రిగారి అబ్బాయి, చుట్టూ ఫ్రెండ్స్, ఆ క్షణంలో ఠక్కుమని ఒక్కటే సమాధానం కళ్ళముందు మెరిసింది.

కాగితం మీద రాశాడు.

శర్మిష్ట “ఓ, నో సార్! ఆయన మినిస్టర్… చాలా సీరియస్ అవుతారు. పెద్ద గొడవవుతుంది” అంది.

చందన కాగితం కేసి చూసి అంది “నీకు పిచ్చా?”.

డయాగ్నసిస్ అలా కాగితం మీద తార్కికంగా రాయడం అతని పద్ధతి అని ఆమెకి తెలుసు.

“రాజకీయ నాయకులకి ఇది చాలా భయంకరమైన వార్త అవుతుంది. ఆయన ఒప్పుకోడు. మనకెందుకు! ట్రీట్‌మెంట్ ఇచ్చి పంపేద్దాం!”

ధీరజ్ ఆ కాగితం మీద మళ్ళీ పెద్ద అక్షరాలతో రాశాడు.

“కొకైన్ ఓవర్ డోస్! ఎక్యూట్ కొరోనరీ స్పాసమ్. ఫిట్స్. హై బిపి.!!”

***

తెల్లవారుతోంది.

విశాలమైన ఏ.సి. గది. డైరక్టర్ చందన, మినిస్టర్ రామేశం, అతని సెక్రటరీ, డాక్టర్ ధీరజ్ టేబుల్ చుట్టూ కూర్చుని వున్నారు.

ఎవరికీ నిద్ర లేదు. ఉదయం ప్రశాంతంగా వుండాల్సిన సమయంలో గాలిలో కూడా టెన్షన్.

“డాక్టర్ సాబ్ ముందు నుంచి చూస్తుండా. మీరు మర్యాదగా మాట్లాడతనే లేరు. మా పిలగాడు కొకైన్ లాంటి డ్రగ్స్ వాడాడంటే నమ్మశక్యం కావడం లేదు! కొంచెం ఆలోచించి చెప్పండి!”

ధీరజ్ వంక చూసింది చందన. “నువ్వు క్లియర్‌గా చెప్పు ధీరజ్. ఇది రాజకీయంగా సార్‌కి చాలా సమస్యలు కలిగిస్తుంది. ఎవరికీ తెలియకూడదు. అనవసరంగా బాధ్యతలేని మాటలు  మాట్లాడద్దు! మన హాస్పిటల్‌కి మంచి పేరు రాదు. సార్‌కి కూడా చాలా సమస్యలొస్తాయ్!”

ధీరజ్ అన్నాడు, “మినిస్టర్ సాబ్. ఏమీ అనుకోవద్దు. అతను యువకుడు. హార్ట్ ఎటాక్ వచ్చే వయసు కాదు. అతని లక్షణాలన్నీ కొకైన్ ఓవర్ డోస్‍లా వున్నాయి. అవన్నీ తగ్గిపోతాయి. తగిన మందులు ఇస్తాం. కానీ, అతన్ని ఆ అలవాటు నుంచి తప్పించాలనే వుద్దేశంతోనే మీరు తండ్రిగా బాధ్యత తీసుకోవాలని చెబుతున్నాను, అంతే సార్! పేషంట్‌కి సంబంధించిన వివరాలు గోప్యంగానే వుంచుతాం. నేను మీ కోసం మంచిగానే చెబుతున్నాను సార్. అది గుండె పోటు కాదు. ఆ అలవాటు మానగానే అన్నీ తగ్గిపోతాయి.”

మినిస్టర్ వుగ్రుడయిపోయాడు.

“ఏంది మాట్లాడుతున్నవ్! మా ఇంట్లో అసుమంటి అలవాట్లే లేవ్. ఏరి పిలవండి ఆ దోస్తులను…”

కాసేపటికి, స్నేహితులు ముగ్గురు భయంగా వచ్చి నిలబడ్డారు.

“చెప్పండిరా బేవ్‌కూఫ్‌ల్లారా. నిజంగా డ్రగ్స్ వాడుతున్నారా? మీరు రాత్రంతా ఎక్కడున్నారు రా?”

“లేదు అంకుల్. ఫార్మ్ హౌస్‍లో దోస్త్ శేఖర్ గాని బర్త్ డే పార్టీ అని… అక్కడున్నం. బీర్ తాగినం, అంతే! ఇంతలో ఇట్ల అయింది!”

ధీరజ్ లేచి నిలబడ్డాడు. “మినిస్టర్ సాబ్, నా ఉద్యోగం పోతుందని తెలుసు. రక్త పరీక్షలు చేయలేదని తెలుసు. ఇది డ్రగ్స్ ఓవర్ డోస్ అనే మాట మీదే నిలబడతాను. కావాలంటే మనం ఫార్మ్ హౌజ్‌కి పోదాం. నేను తప్పయితే ఉద్యోగం మానేస్తా! ఓ.కె.! మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం చెబుతున్నాను.”

“మరి హార్ట్ ప్రాబ్లమ్?”

“అన్నీ తగ్గుతాయ్ సార్. అవన్నీ కొకైన్ వల్ల వచ్చినవే. హెపారిన్, ఆల్టిప్లేజ్,బి.పీ మందులూ తప్పక పని చేస్తాయి. అతనికేం కాదు! కానీ మళ్ళీ ఆ అలవాటుకు పోకూడదు. ఇది నిరూపించాల్సి వుంటుంది.”

చందన కంగారుగా అంది “ధీరజ్… ఎందుకు అంత రిస్క్ తీసుకుంటావ్… వదిలేయరాదా?” అని.

తనదైన శైలిలో విలక్షణంగా నవ్వాడు.

“రిస్క్‌లు తీసుకోవడం అలవాటే కదా చందనా!”

***

ఉదయం సంధ్యకాంతులు ఎర్రగా తడి రోడ్ల మీద పడుతుండగా గండిపేట దాటి శంకరపల్లి దారిలో రోడ్ల మీద, సైరెన్లు హారన్లు మోగించుకుంటూ, గవర్నమెంటుకార్లు ఇన్నోవాలు నాలుగు విసురుగా ఆ మట్టి రోడ్డు వైపు తిరిగి విశాలమైన రాతి ప్రహరీ గోడలోని గేటు ముందు ఆగాయి.

మినిస్టర్ గారి ఫార్మ్ హౌస్. ధీరజ్, మినిస్టర్ గౌడ్, ఆయన సెక్రటరీ, డైరెక్టర్ చందన, పేషంట్ స్నేహితులు ముగ్గురూ దిగారు.

“ఒద్దు అంకుల్…” ఏడుస్తున్నాడు ఒక అబ్బాయి. “లోపల ఏమీ లేదు అంకుల్. చూడద్దు!” అతనిని ఎవరూ పట్టించుకోలేదు. తలుపులు తాళం తెరిచి లోపలికి వెళ్లారు.

“చిందరవందరగా పడి వున్న బీర్ బాటిల్స్, చికెన్ ముక్కలు, చిప్స్, ఎండిన పింగాణీ ప్లేట్స్, బూందీ, మిక్శ్చర్లు ఒలికిపోయిన టీపాయ్ టేబుల్.

ధీరజ్ కళ్ళు తనకి కావల్సిన ఆధారం కోసం వెతుకుతున్నాయి. మనసులో ‘ఒక వేళ ఇక్కడేమీ దొరకకపోతే’ అనే సంశయం. ఎందుకు తను ఇలా ప్రతీసారీ ఆవేశంగా రిస్క్ తీసుకుంటాడు? కనీసం బ్లడ్ రిపోర్టులు వచ్చేదాకా ఆగాల్సిందేమో!

ఒక్కసారి ముగ్గురు యువకులు లోపలి గదిలోకి పరిగెత్తసాగారు.

“ఆగండి!” అరిచాడు ధీరజ్. ఒక చేత్తో వాళ్ళ ముగ్గురిని వెనక్కి నెట్టి, లోపలి బెడ్ రూం లోకి దూకాడు.

ఒక బల్ల మీద వరసగా తెల్లటి కాగితాలు, వాటి మీద చక్కగా పేర్చిన తెల్లటి పౌడర్. ఆ పక్కన ఎవరో యువతి విడిచిన లో దుస్తులూ, ‘స్నార్టింగ్’. అంటే నోటితో పీల్చడానికి వాడే తెల్లటి ట్యూబులు అవి.

“మినిస్టర్ సార్” అరిచాడు.

“ఇదిగో ఇక్కడ చూడండి. ఇదే కొకైన్ పౌడర్. పేపర్ గొట్టాలతో నోటితో పీలుస్తారు.”

లోపలికి వచ్చిన మినిస్టర్ గౌడ్ నిర్ఘాంతపోయి, నిలబడిపోయాడు.

“భాంచత్ నా కొడకల్లారా! ఏంది రా మీరు చేసే పనులు!” అంటూ కొడుకు స్నేహితులపై అరిచాడు.

***

మూడు రోజుల తర్వాత ఉదయం పది గంటలు అవుతోంది. ధీరజ్ తన రూంలో కూర్చుని మెడికల్ జర్నల్ చూస్తున్నాడు.

ఒక్కొక్క రోజు ఎంత టెన్షన్‌ పనో, మరో నాడు అంత తీరికగా వుంటుంది. అదే హాస్పిటల్ జీవితం.

తన పేషంట్లందరూ బావున్నారు.

కొకైన్ పాయిజనింగ్ మినిస్టర్ గారబ్బాయి చక్కగా కోలుకున్నాడు. నార్మల్ బి.పి., నార్మల్ ఇ.సి.జి. వచ్చింది. అన్నీ సంతృప్తికరంగానే వున్నాయి.

ఈరోజు డిశ్చార్జి చేశాడు.

తలుపు మీద కొద్దిగా చప్పుడయింది.

“లోపలికి రావచ్చా డాక్టర్ సాబ్!”

తలెత్తి చూశాడు.

డిప్టీ హోం మినిస్టర్ రామేశం గౌడ్. తెల్లని లాల్చీ కండువాలో హుందాగా, ఠీవిగా నిలబడి వున్నాడు.

“సార్! మీరేమిటి సార్, నన్ను పర్మిషన్ అడగాలా. లోపలికి దయచేయండి. పిలిస్తే నేనే డైరక్టర్ ఆఫీస్‌కి వచ్చేవాడిని కదా!”

రామేశం గౌడ్ వెనక లేడీ సెక్రటరీ ఒక అందమైన వెదురు బుట్ట నిండా ఏపిల్స్, గులాబీ పూలు నింపి వున్నది తీసుకువచ్చి బల్ల మీద పెట్టింది.

“నమస్తే డాక్టర్ సాబ్! మీ మర్యాద మీకు ఇయ్యాలి కదా, నువ్వు దేవుడితో సమానం. పిల్లాడు మంచిగ అయిండు. గుండెపోటు వచ్చి తగ్గిపోయి డిశ్చార్జ్ అయిపోతున్నాడు. అసలు బయటపడతడనుకోలేదు. చాలా థాంక్స్. నీవు చెప్పినదే కరెక్టే! కోపం జేసిన, ఏమీ అనుకోకు!”

ధీరజ్‌కి నోట మాట రాలేదు.

“ధైర్యంగా వ్యాధి నిర్ణయం చేసే నీలాంటి డాక్టర్ వుండటం చాలా అవసరం డాక్టర్ సాబ్! పైగా ఈ డ్రగ్స్ సమస్య బయటకి తెలీకుండా సాయంజేసినావ్. ఎప్పటికీ మరువ! థాంక్స్!”

ఆ తర్వాత అంత హుందాగా వెళ్ళిపోయాడాయన.

ఆ తర్వాత పట్టు చీర రెపరెపలు సంపంగి పూల పరిమళంతో లోపలికి ప్రవేశించింది చందన. డైరక్టర్.

“ఓహో! ఆహా! డాక్టర్ సాబ్! ఫెంటాస్టిక్! మన హాస్పిటల్‌కి మంచి పేరు తెచ్చినవ్! మినిస్టర్ ఖుషీ అయిపోయిండు కదా! కంగ్రాట్స్. నాకు తెలుసు యూ ఆర్ గ్రేట్!” అంది.

బుగ్గ మీద పరిమళభరితమైన ముద్దొక్కటి అతన్ని కాసేపు మరో లోకంలోకి తీసుకెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here