అరుదైన నటవహ్ని- బల్‍రాజ్ సహ్ని – 1 సీమ (1955)

3
1

[dropcap]సి[/dropcap]నిమాలలో ‘హీరో’ని ఎప్పుడూ విశిష్టంగా, గొప్పగా చిత్రీకరించే సాంప్రదాయం మన భారతీయ సినిమాలలో మొదటినుండి ఉంది. అందంలో, గుణంలో, వ్యవహారంలో అన్నిటిలోనూ హీరో గొప్పగా ఉండేట్టుగా సినిమా రంగం హీరోలను మలచింది. హీరో ఎంతటి పేదవాడయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఓ చరిష్మా ఉండేలా జాగ్రత్తపడతారు సినీ దర్శకులు. కాని నిజ జీవితంలో హీరోలు సామాన్యులుగానే ఉంటారు. వారిని చూస్తుంటే అతి మామూలు వ్యక్తులను చూసినట్లుగానే ఉంటుంది. స్క్రీన్‍పై కనిపించే హీరోయిజం ఓ అందమైన అబద్ధం మాత్రమే. మనిషిలో మంచి చెడులు, గొప్పతనం, బలహీనతలు కలగలిసి పోయి ఉండడమే వాస్తవం. ఈ రకమైన పాత్రలను రొటీన్ హిందీ సినిమాలలో చూపించడం చాలా అరుదు. ఇలాంటి సామాన్యులను చూపించాలనే పారెలెల్ సినిమా అనే ఓ కొత్త ఒరవడి డెబ్బైల కాలంలో మొదలయిందని చెప్పవచ్చు. కాని అంతకు ముందు కూడా వాస్తవిక జీవనాన్ని తెరపై చూపించే క్రమంలో అతి సామాన్యమైన పాత్రల చుట్టూ కథలల్లి తీయబడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి పాత్రలను సవాలుగా తీసుకుని నటించి, మెప్పించి సినీ హీరోల మధ్య, నటుల మధ్య ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్న గొప్ప నటుడు బల్‍రాజ్ సహ్ని.

హిందీ సినీరంగంలో ఆనాటి సినిమాలలో ఓ డిగ్నిపైడ్ నటుడుగా, ప్రత్యేకమైన ఒరవడికి శ్రీకారం చుట్టారు బల్‍రాజ్ సహ్ని. వీరికి మొదటి నుండి చెట్ల వెనుక పరుగెత్తడాలు, అసహజ ప్రేమలు, అనవసరమైన స్టంట్లు నచ్చేవి కావు. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న సోషలిస్టిక్ భావజాలం చాలా విషయాలలో వీరికి గ్లామర్ పాత్రల పట్ల అనాసక్తి కలిగించింది. ఆయన ఆహార్యం, గాంభీర్యం, వాచకం, వ్యక్తిత్వం ఆ పాత్రల పట్ల విముఖత కలిగిస్తే, అప్పటి హీరో ఇమేజ్‍కి విరుద్ధంగా కథావస్తువు నిర్మించుకోవాలనుకున్న సినీ దర్శకులకు బల్‍రాజ్ ఓ గొప్ప అదృష్టంగా కనిపించారు. హీరోయిన్లతో డ్యూయెట్లు పాడని హీరోలు, అతి గంభీరమైన సంఘర్షణాత్మక జీవిత్రాన్ని జీవించే సామాన్యమైన వ్యక్తుల కథలను సినిమాగా మలచాలనుకున్నప్పుడు దర్శకులకు నటులను ఎన్నుకోవడం చాలా కష్టం అయ్యేది. అప్పటికే ఓ ఇమేజ్ చట్రంలో కూరుకుపోయి, దానికి భిన్నమైన పాత్రలను తమ దగ్గరకు రానీయకుండా సినీ జగత్తులో వెలుగుతున్న హీరోలు, ఈ దర్శకులు సృష్టించిన పాత్రలను పోషించడానికి సిద్దంగా ఉండేవారు కాదు. ప్రయోగాత్మక సినిమాలను తీయాలనుకునే దర్శకులకు బల్‍రాజ్ సహ్నిలో ఓ గొప్ప నటుడు కనిపించారు. ఎటువంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఆనాటి హీరోల లౌడ్ పర్పామెన్స్‌ను అనుకరించకుండా అతి సామన్యమైన వ్యక్తిలా కనిపిస్తూ కథకు అనుకూలంగా తన శరీర భాషను మార్చుకోగల అద్భుత నటుడు ఆ కాలంలో బల్‍రాజ్ సహ్ని మాత్రమే.

యాభైలలో దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్‍ల సినిమాలు చూస్తే ఆ ముగ్గురు హీరోలు ఏర్పరుచుకున్న ఇమేజ్ అర్థం అవుతుంది. దేవానంద్ లవర్ బాయ్, దీలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్, రాజ్ కపూర్ అమాయక  రొమాంటిక్ హీరో, అశోక్ కుమార్ లాంటి సీనియర్ నటులు కూడా ఓ స్టీరియోటైప్‌లో పడిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో విభిన్నమైన సినీ కథలకు బల్‍రాజ్ సహ్ని ప్రాణం పోసారు. ఏ పాత్రకైనా నేను సిద్దం అన్నట్లుగా ఆయన సినిమాలు చేసేవారు. అసలే మాత్రం హీరోయిజం లేని సినిమాలు, మధ్య వయసు వ్యక్తి పాత్రలు, డీ గ్లామరైజ్డ్ పాత్రలను ఎంచుకుని చేసి ఆయన మెప్పించిన తీరు అత్యద్భుతం.

ఆ కోవలోకే వస్తుంది ‘సీమ’ సినిమా. ఈ సినిమా 1955లో వచ్చింది. అమియా చక్రవర్తి దీనికి దర్శకులు. ఆ రోజులలోనే గొప్ప విప్లవాత్మక కథాంశాలతో సినిమాలను తీసిన వ్యక్తి అమియా చక్రవర్తి. సామాజిక అంశాలకు మనోవిశ్లేషణాత్మకతను జోడించి ఆయన మంచి చిత్రాలను తీసారు. ముఖ్యంగా వీరి సినిమాలలో సమాజంలోని మూఢత్వాన్ని ఎదిరించే స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. మద్యపాన వ్యసనాన్ని వదులుకోలేక అవస్థలు పడే హీరో మనకు ‘దాగ్’ (1952)లో కనిపిస్తే, రేప్‍కు గురయి ఓ బిడ్డకు తల్లి అయిన స్త్రీని భార్యగా అంగీకరించే వ్యక్తి కథ ‘పతిత’ (1953). వీటి తరువాత అమియా చక్రవర్తి తీసిన సినిమా ‘సీమ’.

నేరస్థులు పుట్టరు, తయరవుతారు అనే ఇతివృత్తంతో తీసిన సినిమా ‘సీమ’. సమాజంలో పేదరికంలో  మగ్గిపోతూ, అన్యాయాలకు గురి అవుతున్న వ్యక్తులు సమాజం పట్ల, సాటి మనుష్యుల పట్ల నమ్మకం పోగొట్టుకుని నిరంకుశ శక్తులుగా మారి విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది. వీరిని శిక్షించడంతో ప్రయోజనం లేదు. వీరిలో మార్పు తేవడం ముఖ్యం. సమాజం పట్ల వారు పోగొట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి వారిలో జనియింపజేసినప్పుడే నేరాన్ని పూర్తిగా తుడిచివేయగలం. దీని కోసం నేరస్థులతో ప్రవర్తించే వ్యక్తులు ప్రత్యేకంగా కృషి చేయాలి. వారిని నేర మార్గం నుండి మళ్లించడానికి ప్రయత్నించాలి. ఈ సందేశంతో తీసిన సినిమా ‘సీమ’.

‘సీమ’ అంటే పరిధి అని అర్థం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యే వ్యక్తులు కొన్ని సందర్భాలలో మంచి, ప్రేమ స్నేహం, న్యాయం లాంటి పరిధులను దాటి విరుద్ధమైన దారి ఎన్నుకుంటారు. మంచి నుంచి చెడు వైపుకు జరిగే ప్రయాణంలో ఓ సరిహద్దుని దాటవలసి వచ్చినప్పుడు వారు కూడా చాలా గందరగోళానికి గురవుతారు. ఆ సరిహద్దు రేఖ వద్ద చాలా సేపు కొట్టుమిట్టాడుతారు. తమలో మంచితనాన్ని పూర్తిగా చంపుకోలేక, సంపూర్ణంగా చెడును స్వీకరించలేక వీరు పడే ఆ మానసిక ఘర్షణను సరిగ్గా అర్థం చేసుకుని వారికి సహాయపడగలిగే వ్యక్తులు ఉంటే వారిని రక్షించుకోవడం పెద్ద కష్టం అవదు. సమయం మించి పోయి సమాజం పట్ల కోపాన్ని వీరు విధ్వంసం వైపు మళ్ళిస్తే జరిగే ఘోరం భయంకరంగా ఉంటుంది. చాలా సార్లు ఇది వారికి, ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. అందుకే ఆ సరిహద్దు రేఖ వద్దకు చేరిన వారికి చేయూతనిచ్చి వారి దారి మళ్ళించగల బాధ్యతాయుతమైన వాతావరణం, మనుష్యులు అవసరం అవుతారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన కరెక్షన్ హోమ్స్ ఉద్దేశం కూడా ఇదే.

యాభైవ దశకంలో ఈ విషయంగా మొదటిసారి మన దేశంలో చర్చ మొదలయింది. నేరస్థుల నేరాన్ని దాటుకుని వారిని నేరానికి ప్రేరేపించిన పరిస్థితులను పరిశీలించి వారి మానసిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా విశ్లేషించి వారిని అర్థం చేసుకోవలసిన దిశగా గంభీరమైన చర్చ మొదలయిన క్రమంలో వచ్చిన సినిమా ‘సీమ’.

ఇందులో ముఖ్య పాత్ర పేరు గౌరీ. తల్లి తండ్రులు చనిపోయి బాబాయి ఇంటికి వస్తుంది గౌరి. జూదగాడయిన బాబాయి, గయ్యాళి అయిన పిన్ని ఆమెకు నరకం చూపిస్తారు. ఇళ్లల్లో పని చేస్తూ తనే ఆ ఇంటిని ఆధారం అవుతుంది. అయినా ఆమెకు సరైన తిండి కూడా ఇంట దొరకదు. పని చేసే చోట ఆమె చేయి జారి పగిలిన సామాను ఖరీదు ఆమె జీతంలో కట్టుకుంటూ ఉంటారు యజమానులు. దీనితో సమయానికి జీతం రాలేదని ఆమెపై ఇంట్లో పోరు ఎక్కువ అవుతుంది. ఆమెపై కన్నేసిన బాంకేలాల్ గౌరీ తనకు లొంగట్లేదని ఆమెపై దొంగతనం మోపుతాడు. పని చేసుకుంటున్న గౌరి చీర కొంగులో యజమాని కూతురు గొలుసు ఉంచి ముడి వేస్తాడు. పోలీసులు గౌరీ దొంగ అని ఆమెను స్టేషన్‌కు తీసుకువెళతారు. కాని వయసు రీత్యా గౌరీ చిన్నపిల్లని ఆమెను బెయిల్ పై తిరిగి ఆమె బాబాయికి అప్పజెపుతుంది కోర్టు. కాని దొంగ అని ముద్ర పడిన గౌరీని ఇంటి నుండి గెంటేస్తారు ఆ దంపతులు. గౌరీ చాలా చోట్ల పనికి ప్రయత్నిస్తుంది. కాని దొంగ అని ముద్రపడడం వలన అమెకు ఎవరూ పని ఇవ్వరు. ఆకలితో నకనకలాడుతూ కూడా తన ముందు పొరపాటున పడిన ఓ నాణాన్ని తీసుకోవడానికి సంకోచించే గౌరిని చూస్తున్నప్పుడు తప్పు పని చేయలేని ఆమె వ్యక్తిత్వం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. రెండు రోజుల ఆకలితో, కోపంతో బాంకేలాల్‍ను కొట్టడానికి అతని ఇంటికి వెళుతుంది గౌరి. ఆమెను మాటల్లో పెట్టి, భోజనం తీసుకువస్తానని చెప్పి అతను పోలీసులను పిలుచుకు వస్తాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. తన మాట వినకుండా బాంకేలాల్ పక్షంలోనే పోలీసులు మాట్లాడడం గౌరీ సహించలేకపోతుంది. కోపంతో రగిలిపోతున్న గౌరీని తిరిగి ఇంటికి తీసుకువెళ్లడానికి ఆమె బాబాయి పిన్ని ఒప్పుకోరు. తనను ఒంటరి చేసిన వారిపై గౌరి కోపంతో రగిలిపోతుంది.

తప్పని పరిస్థితులలో ఆమెను ఓ అనాథ శరణాలయంలోకి చేరుస్తారు పోలీసులు. ఆ ఆశ్రమం మేనేజర్ అశోక్. అందరూ అతన్ని బాబూజీ అని పిలుస్తారు. అశోక్ గౌరీలో ఉన్న కసిని కోపాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతాడు.

మధ్యవయస్కుడిగా చేతి కర్ర సహాయంతో నడుస్తూ, గుండె జబ్బుతో బాధపడుతున్న బలహీనమైన వ్యక్తిగా ఈ పాత్రలో బల్‍రాజ్ సహ్ని ఒదిగిపోయారు. గౌరి చేసే ఆగడాలను అతను ఓపిగ్గా ఎదుర్కోవడం, అమె కోపం వెనుక ఉన్న బాధను, ఒంటరితనాన్ని అర్థం చేసుకుంటూ ఆమెకు చిన్న చిన్న శిక్షలు వేస్తూ ఆమెను భరించడం, లాంటి సందర్భాలలో బల్‍రాజ్ సహ్నిది నటన అనిపించదు. కుర్చీలో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ కర్ర సహాయంతో కూర్చునే అతనిలో సమయం వచ్చినప్పుడు ఓ మొండితనం, దాని మాటున ఆశ్రమంలోని అభాగ్యులకు మంచి జీవితం ఇవ్వాలనే తపన కనిపిస్తూ ఉంటాయి. పారిపోవాలని ప్రయత్నించే గౌరిని కూడా అయన అర్థం చేసుకుని “జబ్ ఇంసాన్ ఉలఝనో సె ఘిర్ జాతా హై నా తొ జిందగీ సే భాగ్నా చాహతా హై” (మనిషి గందరగోళంలో కూరుకుపోయినప్పుడు జీవితం నుండి పారిపోవాలని అనుకుంటాడు) అని చెప్పే సందర్బంలో ఆయన గంభీరమైన కంఠం దానిలో దయ, ఆలోచన, ప్రేక్షకులకు చేరి ఆలోచింపజేస్తాయి.

గౌరీ ఆగడాలను భరించలేనని శరణాలయం వార్డెన్ అశోక్ అన్నప్పుడు ఆమెతో బల్‍రాజ్ జరిపే సంభాషణ దగ్గర ఆయన గొంతులోంచి వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గమనించాలి. ఆ నేరస్థుల బాధ, ఆవేశం అన్నీ ఆయన గొంతు నుండి వినిపిస్తాయి. ప్రేమ నోచుకోని వ్యక్తుల స్థితిలో మనల్ని ఊహించుకుని వారు పడే బాధను అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెపుతాడు ఆయన. ఇది కొంచెం గొంతు పెంచి బల్‍రాజ్ సహ్ని మాట్లాడే సన్నివేశం. ఆయన స్థానంలో మరే నటుడు ఉన్నా కాని, ఈ సందర్భంలో వచ్చే ఆ డైలాగ్ డెలివరీ చాలా హెచ్చు స్థాయిలో చేసి ఉండేవారు. కాని బల్‍రాజ్ ఎక్కడా లౌడ్ ఫర్మామెన్స్ లేకుండా చాలా సహజంగా ఈ సీన్‍లో సంభాషిస్తారు. “ఇంసాన్ కభీ బురా నహీ హోతా, హాలాత్ ఉసె బురా బనాతే హై, లోగ్ ఉసె బురా బనాతే హై, హమ్ ఉసె బురా బనాతే హై” (మనిషి ఎప్పుడూ చెడ్డవాడు కాదు. పరిస్థితులు అతన్ని చెడ్డవాడిని చేస్తాయి. మనుషులు అతన్ని చెడ్డవాన్ని చేస్తారు, మనం అతన్ని చెడ్డవానిగా మారుస్తాం) అంటూ ఆలోచిస్తున్నట్లుగా మాటను మెల్లగా మొదలెట్టి ఆవేశంగా అతను బలహీనుల పక్షాన మాట్లాడడం, దీనికి ఆయన తన గొంతులో చూపించే ఎమోషన్స్, మెయింటెయిన్ చేసిన టెంపో గమనిస్తే ఆయనెంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు.

“ప్రతి మనిషి జీవితంలో ఓ సందర్భం వస్తుంది, అది అతని ఉన్నతికి కారణం కావచ్చు, నాశనానికి కూడా కారణం అవవచ్చు. ఈ అమ్మాయి జీవితంలో ఇప్పుడు అదే స్థితి ఉంది. ఆమె జీవితానికి మరణానికి మధ్యన ఉండే రేఖ మధ్య నిలిచి ఉంది. మనం కొంత సహాయం చేస్తే ఆమె జీవితం ఓ దారిలో పడవచ్చు” అంటున్నప్పుడు ఆయన కళ్లలో కనిపించే ఆ పట్టుదల ఆకట్టుకుంటుంది. అక్కడ ఆ బలహీనమైన సామాన్యుడిలో ఓ హీరో కనిపిస్తాడు ప్రేక్షకులకు. హీరోయిజం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. అంత కోపంతో వార్డెన్‌తో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ గౌరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముందు మాటలు రానట్లుగా ఉండిపోవడం, సౌమ్యంగా మాట్లాడుతూనే ఆమెపై కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేయడం మంచి ఈజ్‍తో చేస్తారు బల్‍రాజ్ సహ్ని.

‘సీమ’ సినిమాలో బల్‍రాజ్ సహ్ని పై చిత్రించిన రెండు పాటలు చూసి తీరాలి. “తూ ప్యార్ కా సాగర్ హై” అంటూ సాగే భక్తి గీతం అన్ని మతాలకు అతీతంగా అంతర్యామిని స్తుతిస్తూ పాడే ప్రార్థనా గీతం. ఈ పాట అంతానూ బల్‍రాజ్ సహ్ని ఓ కుర్చీలో కూర్చుని పాడతారు. అతని ముందు ఆశ్రమంలోని స్త్రీలు పిల్లలు వరుసగా కూర్చుంటే వారి వెనుక కూర్చుని ప్రార్థన ఆలపీంచే సన్నివేశం ఇది. ఈ పాట గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెబుతారు. ఈ పాట చిత్రీకరించే రోజున బల్‍రాజ్ సహ్ని మరో ఊరి వెళ్ళవలసి ఉందట. విమానాశ్రయానికి వెళ్ళాలని అతను దర్శకుడు అమియా చక్రవర్తికి చెప్పారట. కాని సినిమాకే ముఖ్యమైన సీన్ ఇది అంటూ ఈ పాట ఇదే రోజు పూర్తవ్వాలి, కాబట్టి వెళ్ళడం కుదరదని అమియా చక్రవర్తి అయనకు చెప్పారట. సీన్ మరో సారి విని బల్‍రాజ్ సహ్ని చాలా కూల్‍గా ఓ కుర్చీ అడిగి కూర్చుని మూడు షాట్లలో ఒకే టేక్‍లో ఈ సీన్ చేసారట. ఎక్కడా బ్రేక్ చెప్పడం కానీ రీటేక్ అవసరం కాని ఎంత చూసినా లేకపోవడంతో దర్శకులు ఆశ్చర్యపోయారట. అనుకున్న టైం కన్నా చాలా ముందుగా విమానాశ్రయం చేరుకున్నారట బల్‍రాజ్ సాహ్ని. అంతటి స్పాంటేనిటీ ఆయన నటనలో ఊండేది. ఈ పాటను మన్నాడే గానం చేశారు. మన్నాడే పాడిన గొప్ప సినీ గేయంగా దీన్ని ఈనాటికీ పరిగణిస్తారు.

“ఘాయల్ మన్ కా పాగల్ పంచీ ఉడనె కో బేకరార్, పంఖ్ హై కోమల్, ఆంఖ్ హై ధుంధలీ, జానా హై సాగర్ పార్” (గాయపడిన  మనసుతో ఈ పిచ్చి పక్షి ఎగరాలని అశపడుతుండి. దాని రెక్కలు సున్నితం, కళ్లు మసక బారి ఉన్నాయి, వెళ్ళవలసిందేమో సముద్రానికావల) అన్న వాక్యాల దగ్గర మన్నాడే గొంతులో ఆ లాలన, ప్రేమ, జాలి ఎంత గొప్పగా పలుకుతాయో, బల్‍రాజ్ సహ్ని మొహంలో ఆ భావాలన్నీ ప్రస్ఫుటిస్తాయి. పక్కన కూర్చున్న ఓ చిన్న పాప నెత్తిన చేయి వేసి నిమురుతూ, నిమగ్నమైన అతను పాడుతుంటే, ఈ పాట ప్లేబాక్ సాంగ్ అనిపించదు. బల్‍రాజ్ సహ్ని స్వయంగా పాడుతున్నారు అనిపిస్తుంది.

సినిమా మొత్తంలో కూడా ఆ పాత్రలో ఒదిగిపోయిన బల్‍రాజ్ సహ్ని శరీరభాషను గమనిస్తే గౌరిలో కోపాన్ని, ద్వేషాన్ని, కసిని ఎదుర్కోవడానికి కొండెత్తు శాంతాన్ని ప్రదర్శించే మానవతామూర్తి ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటాడు. బల్‍రాజ్ ఆ పాత్ర చేస్తున్నంత సేపు కూడా ఓ రకమైన సంయమనాన్ని అనుక్షణం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన చేతిని, పాదలను కూడా అంతే నెమ్మదిగా కదిలిస్తూ ఉండడం చూస్తే ఆ పాత్ర కోసం ఆయన చేసిన్ హోం వర్క్ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రార్థన ఆలాపించే వాళ్ళు ముందు అందరిని చూస్తూ పాడుతూ ఉంటే వారి వైపు నిలిచి ఉన్న మిగతా వాళ్లు గొంతు కలుపుతారు. కాని ఈ పాటలో అనాథ స్త్రీలు, పిల్లలు దేవుని విగ్రహం ముందు వరుసగా కూర్చుని పాడుతూ ఉంటే వారి వెనుక ఉండి పాటను నడిపిస్తారు బల్‍రాజ్ సహ్ని. వెనుక వరుస నుండి ప్రార్థన మొదలవడం సాధరణంగా జరగదు. కాని ఈ పాటను ఇలా చిత్రించి ఆ అమాయక స్త్రీల వెనుక నిలిచి ఉన్న వ్యక్తిగా బల్‍రాజ్ సహ్నిని చూపించే ఓ లాంగ్ షాట్‍తో దర్శకులు – బల్‍రాజ్ సహ్ని పాత్రను ఎలివేట్ చేసిన విధానం బావుంటుంది. కేవలం నాయకత్వాన్ని ప్రదర్శించేవాళ్లు ముందుండి ఇతరులను నడిపిస్తారు. కాని జీవన మార్గాన్ని చూపే మార్గదర్శకులు, మనలను ముందుంచి మన వెన్నంటి ఉంటారు. ఈ పాట చిత్రీకరణలో ఈ భావం కనిపిస్తుంది. దీన్ని ఇలా చిత్రించడంతో ఓ గొప్ప ప్రశాంతత కనిపిస్తుంది. ఏ మాత్రం హీరోయిజం లేని ఈ సినిమా హీరో తన దరి చేరిన వారిని ముందుంచి తాను వారి వెనుక ఉండిపోవడాన్ని ఇష్టపడతాడు. ఈ సందేశాన్ని బల్‍రాజ్ సాహ్ని తన మాటతో, నడకతో, కంటి చూపుతోనూ చూపించడంలోనే అతని అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది.

నిజ జీవితంలో కమ్యునిస్ట్‌గా పేరు పొంది, తాను చనిపోయిన తరువాత ఎర్ర జెండా మాత్రమే తన ఒంటిన కప్పాలి అని కోరుకున్న బలరాజ్ ఎంతటి దైవ భక్తుడో అర్థం చేసుకోవచ్చు. కాని ఈ పాట దగ్గర అతని నరనరం లోనూ కూడా భక్తి భావం కనిపిస్తుంది. ఎంత తాదాత్మతతో, తనను తాను ఆ పైవానికి అర్పించుకుంటూ అ శక్తి ముందు మోక్రిరిల్లుతూ ఈ గీతం అభినయించారంటే, “ఇధర్ ఝూమ్తీ గాయె జిందగీ, ఉధర్ హై మౌత్ ఖడీ, కోయీ  క్యా  జానే కహా హై  సీమ, ఉల్ఝన్  ఆన్ పడీ” (ఈ వైపున జీవితం నాట్యం చేస్తూ పాడుతుంది, అటువైపు మరణం పొంచి ఉంది. సరిహద్దు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అంతా అయోమయమే) అన్న వాక్యం దగ్గర ఆయన అభినయం చూడవలసిందే.

గౌరీ ఆ శరణాలయంలో ఉండే పుత్లీ అనే మరో అమ్మాయితో గొడవపడుతుంది. దీనికి శిక్షగా ఆమెను ఒంటరి గదిలో ఉండమని ఆదేశిస్తాడు అశోక్. గౌరీ తిండి తిననని ఉపవాస దీక్ష మొదలెడుతుంది. అశోక్ ఓ చిన్న పిల్లతో ఆమె గదిలోకి భోజనం పంపించి గౌరి తిండి తినేలా చూస్తాడు. మెల్లగా ఈ వాతావరణానికి గౌరి అలవాటు పడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చే తోటీ స్త్రీలను గమనిస్తూ వారి సమస్యలను వింటూ ఉంటుంది. అయినా బాంకేలాల్‌ను కసితీరా కొట్టాలనే ఆమె కోరిక ఆమెను నిద్రపోనివ్వదు. పుత్లీ సహాయంతో ఆశ్రమం దాటి వెళ్లి ఆ పని చేస్తుంది కూడా. ఆమెకు అక్కడి నుండి పారిపోయే అవకాశం ఉన్నా తిరిగి శరణాలయానికే వస్తుంది. గౌరి పారిపోయిందని తెలుసుకున్న అశోక్ మాత్రం ఆమె తిరిగి వస్తుందనే నమ్ముతాడు. ఈ సందర్భంలో రఫీ గొంతులో వచ్చే “కహా జా రహా హై” అనే పాట మరో ఆణిముత్యం. ఇందులో కవి శైలేంద్ర రాసిన ప్రతి పదం కూడా మనసుకు హత్తుకుంటుంది. “జో ఠోకర్ నా ఖాయే నహీ జీత్ ఉస్కీ, జొ గిర్కె సంభల్ జాయే హై జీత్ ఉస్కీ, నిషాన్ మంజిలోకె యె పైరో కే చాలే” (ఎదురు దెబ్బ తినకపోతే గేలుపే లేదు, పడి లేచి నిలబడిన వారిదే గెలుపు, కాళ్లకు కాసిన కాయలే గమ్యానికి గుర్తులు) అంటూ సాగే ఈ పాటలో జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కున్న వ్యక్తి, మనిషిగా ఎదిగే వైనాన్ని గొప్పగా రాసారు ఆయన.

ఈ సినిమాకు శైలేంద్ర, హస్రత్ జైపురి ఇద్దరూ పాటలు రాసారు. సంగీతం  శంకర్ జైకిషన్‍లు అందించారు. “సునో చోటీ సీ గుడియా”, “బాత్ బత్ మే రూటో నా” “యె దునియ్ గమ్ కా మేలా” అని వచ్చే పాటలు హస్రత్ జైపురి రాస్తే, శైలేంద్ర పైన చెప్పిన రెండు పాటలతో పాటు “మన్ మోహనా బడే జూటే” అనే మరో పాట్ రాసారు.

శరణలయం నుండి వెళ్ళి మళ్ళి తిరిగి వచ్చిన గౌరిని అశోక్ నిలదేసే సీన్‍లో తన కోపాన్ని, గౌరి క్షేమంగా తిరిగి వచ్చిందనే సంతోషాన్ని ప్రదర్శిస్తూ, ఆ కోపానికి ఆందోళనను జోడించి అశోక్ జరిపే సంభాషణను గమనించాలి. ఆయన గొంతులో ఓ కంట్రోల్డ్ ఎమోషన్ కనిపిస్తుంది. ఆమెను తిరిగి ఒంటరి గదిలో ఉండమని శిక్ష విధించిన తరువాత అక్కడ సామాన్లను కిటికీ అద్దాలను గౌరి పగలగొట్టినప్పుడు అశోక్ ఆందోళన పడకపోగా “ఎవరి మనసులో దొంగ ఉంటారో వాళ్లు మౌనంగా అన్నీ భరిస్తారు. కాని ఎవరు నిర్దోషో వాళ్లు తమకు వేసిన శిక్షను గట్టిగా ప్రతిఘటిస్తారు” అంటాడు. గౌరిలో ఆ కోపం, బాంకేలాల్‌ని కొట్టి రావడం తన హక్కు అని ఆమె ప్రస్తావించడం ఇవన్ని చూసిన అతను ఆమె కేసును పూర్తిగా స్టడీ చేసి బాంకేలాల్ గౌరిని నేరంలో ఇరికించాడేమో అని అనుకుంటాడు. మిత్రుడైన మురళీధర్‍ని విషయం కనుక్కుని సాక్షాధారాలతో రమ్మని పంపిస్తాడు.

అద్దాలు పగులకొడుతూ పాట పాడుతున్న గౌరి దగ్గరకు అశోక్ వెళతాడు. ప్రసన్నవదనంతో తన ముందుకు వచ్చి నిలుచున్న అశోక్‌ని చూసి గౌరి ఆశ్చర్యపోతుంది. పైగా తనను తిట్టకపోగా ఎంత చక్కగా పాడుతున్నావో అన్న అతన్ని చూసి ఏమనాలో ఆమెకు అర్థం కాదు. అశోక్ ఆమెను పాడమని ప్రోత్సహిస్తాడు. ఆమె ఒప్పుకోకపోతే తానే అద్దాలను పగలగొట్టడం మొదలెడతాడు. అంత కోపంలో ఉన్న గౌరీ అతని ముందు తల దించుకుంటుంది. ఆమె పాడిన పాట విని ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని మొదటి సారి ఆమెకే పరిచయం చేస్తాడు అశోక్. పైగా తాను ఆమె నిర్దోషినని నమ్ముతున్నానని చెపుతాడు. అతను తనపై చూపిన నమ్మకానికి గౌరి కరిగి పోతుంది. అతని కాళ్ల పై పడుతుంది. మనల్ని నమ్మే వాళ్లు మనిషిగా గౌరవించే వాళ్లు ఉన్నారన్న ఆలోచన చాలా గొప్ప మందుగా పని చెస్తుంది. గౌరీ నిజాయితీని సాక్షాలతో అశోక్ నిరూపించిన తరువాత ఆమెపై కేసు కొట్టివేయబడుతుంది.

గౌరి తిరిగి సమాజంలోకి వెళ్ళడానికి ఇష్టపడదు. అక్కడే ఉండిపోతానంటుంది. ‘సీమ’ సినిమాను ఇక్కడి దాక గొప్పగా నడిపించిన దర్శకులు తరువాత కొంచెం హడావిడిగా దీనికి కమర్షియల్ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేయడం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది. నేరస్థులను మార్చాలని, వారికి మారే అవకాశం ఇవ్వాలనే ఓ సందేశాన్ని అనవసరంగా అతికించారనిపిస్తుంది. పైగా గబగబా అశోక్ చేత ఓ పెద్ద సందేశాన్ని లెక్చర్‍గా ఇప్పించడం కొంచెం అసహజంగా అనిపిస్తుంది. గౌరి వివాహం మురళీధర్‍తో జరిపించాలని అశోక్ అనుకోవడం, గౌరి మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చిన అశోక్ తోనే జీవితాన్ని కోరుకుని అతన్ని చివర్లో కలవడం సినిమా ముగింపు.

‘సీమ’ కథావస్తువు అప్పటి సినిమాలతో పోలిస్తే చాలా వినూత్నంగా ఉన్న మాట నిజం. అయితే హీరో హీరోయిన్లు చివర్లో కలవడం అవసరం అని అప్పటి సినిమా ఫార్ములాని దర్శకులు అనుసరించారేమో అనిపిస్తుంది. గౌరీ పాత్రలో నూతన్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా చేసేటప్పటికి ఆమె వయసు కేవలం పద్దెనిమిదేళ్ళట. కాని ఎంతో పరిపక్వత కూడిన నటన ఆమె ప్రదర్శించారు. అమాయకమైన ఆడపిల్ల నుండి నేరస్థురాలని ముద్రపడి కుచించుకుపోతున్న యువతిగా, అన్యాయాన్ని ఎదిరించాలని, అది ఎలాగో తెలియక కోపంతో రగిలిపోయే అమ్మాయిగా, ఆ కోపంలో కసిని అసహాయతను జోడించి శరణాలయంలో ఆమె చేసే హడావిడీ, గందరగోళం చివరకు, మళ్లీ ప్రేమను పంచే స్త్రీగా ఆమె మారడం, ఇన్ని షేడ్స్ ని చాలా గొప్పగా చూపించారు ఆమె. ‘సీమ’ బల్‍రాజ్ సహ్నికి ఎంత పేరు తీసుకుని వచ్చిందో, నూతన్ కెరియర్‍కూ అంతే గొప్పగా ఉపయోగపడింది. ఈ సినిమాతో ఆమెకు మొదటి ఫిలింఫేర్ అవార్డు లభించింది.

సినిమా కథను అమియా చక్రవర్తి రాసుకున్నారు. ఈ సినిమా కథకు కూడా రెండో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. కారెక్టర్ నటిగా, కమేడియన్‌గా ఆ తరువాత పేరు తెచ్చుకున్న షోబా కోటేకు ఇది మొదటి సినిమా. ఇందులో ‘పుత్లీ’ పాత్రలో ఆమె నటించారు.      ఆ కాలంలో ఆమె సైకిల్ రేస్ చాంపియన్. అందుకని   ఓ సైకిల్ చేజ్ సీన్‌ను ప్రత్యేకంగా ఆమె కోసం దర్శకులు చిత్రించడం విశేషం.

ఇటువంటి కథావస్తువు తోనే వి. శాంతారాం రెండు సంవత్సరాల తరువాత 1957లో ‘దో ఆంఖే బారహ్ హాత్’ అనే సినిమా తీసారు. అది భారతీయ సినిమాలలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. మారిస్ ఫ్రైడ్మాన్ అనే ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమలో కూడా ప్రేమతో నేరస్థుల్లో మార్పు తీసుకు వచ్చే ఓ జైలర్ కథను మనం చూస్తాం. అయితే దీనికన్నా రెండు సంవత్సరాల ముందే ఇంచుమించు ఇటువంటి ఇతివృత్తంతో అమియా చక్రవర్తి తీసిన ‘సీమ’ ఆ తరువాత చాలా సినిమాలకు ప్రేరణగా మారిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటువంటి కథావస్తువులకు మూలకథగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమలో బల్‍రాజ్ సహ్ని నటన గుర్తుండిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here