అరుదైన నటవహ్ని- బల్‍రాజ్ సహ్ని – 2 ఘర్ ఘర్ కీ కహానీ

0
1

[dropcap]బ[dropcap] ల్రాజ్ సహ్ని నటుడే కాదు ఓ అధ్యాపకుడు, రచయిత కూడా. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీ. ఏ. హిందీలోనూ, ఎం. ఏ. ఆంగ్ల సాహిత్యంలోనూ చేసి, ఆయన శాంతినికేతన్‌లో రవీంద్రనాధ్ ఠాగోర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో కొన్ని నెలలు హిందీ, ఇంగ్లీషు భోధించారు. అక్కడే తన మొదటి రచన “షెహ్జదో కా డ్రింక్” హిందీలో రాసారు. 1938లో మహాత్మా గాంధీ గారితో కలిసి పని చేయడానికి వెళ్ళారు సాహ్ని. వర్ధాలో గాంధీ  గారి పర్యవేక్షణలో నడిచే ఓ  పత్రికకు సంపాదకుడుగా పని చేసారు. తరువాత ఇంగ్లండ్ వెళ్ళి బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ నెట్వర్క్ లో హిందీ అనౌన్సర్ గా కొన్ని సంవత్సరాలు పని చేసారు. ఇంత చదువు నేపథ్యం  ఉన్న నటుడు అప్పట్లో సినీ ప్రపంచంలో మరొకరు లేరు. సమాజం పట్ల తనకూ బాధ్యత ఉందని, సమాజం కోసం తాను పని చేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి కాబట్టే ఆయన  నటించిన పాత్రలన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేవిగానూ,  ప్రేక్షకులను ఆలోచింపజేసేవి గానూ ఉండేవి. 

సినిమా అంటే సౌందర్యం, కళారాధన, వినోదం మాత్రమే కాదని, మనిషికి మంచి విలువలు అందించి, వాళ్ల జీవితాలకు మేలు చేసే ఓ మాధ్యమం అని నమ్మేవారాయన. అందుకే ఆయన ఎన్నుకున్న పాత్రలన్నీ కూడా అప్పటి సినీ హీరోలకు భిన్నంగా ఉంటూ, జీవితంలోని వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండేవి. సరళంగా ఉంటూనే క్లిష్టమైన సమస్యలను చర్చించేవి. సినిమాలను సామాజిక బాధ్యతగా తీసుకుని పాత్రలను సృష్టించే వ్యక్తులు తక్కువ ఉన్నపుడు కూడా బల్రాజ్ అటువంటి పాత్రలనే వెతుక్కుని చేసేవారు. వినోదం ప్రేక్షకుల నాడి ప్రధానమైన అంశాలుగా సినిమాలు తీస్తున్న రోజుల్లో, సినిమాను బాధ్యతాయుతమైన మాధ్యమంగా గుర్తించి, ప్రేక్షకుల స్థాయిని పెంచే రీతిలో జీవితానికి దగ్గరగా ఉండే కథాంశాలతో నిండిన పాత్రలకు న్యాయం చేసిన ఏకైక నటుడు ఆ కాలంలో బల్రాజ్ సహ్ని.

బల్రాజ్ సహ్ని అసలు పేరు యుధిష్టర్ సహ్ని. మే 1, 1913న రావల్పిండి లో పంజాబీ కుటుంబంలో జన్మించారు ఆయన. ఈయన తండ్రి హర్బంశ్ లాల్ సహ్ని ఆర్య సమాజ సేవకుడు. బట్టల వ్యాపారి. కొడుకును అదే వ్యాపారంలో దించాలని ఆయన ప్రయత్నం. కొన్నాళ్లు ఆ పని చేసాక తాను వ్యాపారానికి పనికి రానని అనుకుని అధ్యాపక  వృత్తి స్వీకరించారు  సహ్నీ,  అది కూడా శాంతినికేతన్‌ లో. అతని భావాలు ఎంత భిన్నంగా ఉండేవో, చిన్నతనంలోనే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అర్థం అవుతుంది. భార్య దమయంతిని అక్కడే బీ.ఏ. చదివించారు ఆయన. విద్య, విలువలే మనిషికి ఆభరణాలని నమ్మిన గొప్ప మానవతావాది బల్రాజ్ సాహ్ని.

కుటుంబ జీవితంలో క్రమశిక్షణ, ఉన్నదానితో సర్దుకుపోయే గుణం చాలా ముఖ్యం అని నమ్మిన వ్యక్తి బల్రాజ్. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, అతి పేద జీవితాలను ప్రతిబింబించే పాత్రలను చేసారాయన. 1970లో టీ. ప్రకాశ్ రావు గారి దర్శకత్వంలో బీ. నాగిరెడ్డిగారు నిర్మాతగా వ్యవహరించి తీసిన సినిమా “ఘర్ ఘర్ కీ కహాని” నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమయ్యే ముఖ్యమైన ఇతివృత్తంతో తయారయింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించారు బల్రాజ్. ఇది చాలా లో ప్రొఫైల్ లో తీసిన సినిమా కాని ఒక సారి చూడడం మొదలెడితే ఆ సాధారణ కథనం లోని ఉన్నతమైన ఆలోచనలు మనల్ని కదలనివ్వవు. పిల్లలకు తప్పకుండా పెద్దలు చూపించవలసిన సినిమా ఇది. ఒక కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసి తమ జీవితాలకు అన్వయించుకోదగ్గ అరుదైన అపురూపమైన చిత్రం “ఘర్ ఘర్ కీ కహానీ.”

సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ పిల్లలు ఆర్థికంగా ఉన్నతమైన జీవన స్థాయిని ఆశిస్తారు. ఈ రోజుల్లో చాలా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు, విలాసాలు కలగలిసిపోయాయి కాని ఒకప్పుడు మధ్యతరగతి జీవితాలు చాలా జాగ్రత్తలతో పొదుపుతో కూడుకుని ఉండేవి. శంకర్నాధ్, పద్మ ఇద్దరికి ముగ్గురు పిల్లలు. రవి, రూప, రాజాలను వారు ప్రేమగా పెంచుకుంటారు. ఓ గవర్నమెంటు ఆఫీసులో అఫీసరుగా పని చేస్తుంటాడు శంకర్నాధ్. కటింగ్స్ అన్నీ పోనూ అతని చేతికి 630 రూపాయల జీతం వస్తుంది. శంకర్నాధ్ నిజాయితీ పరుడు. లంచం తీసుకోడు. కాబట్టి అతనికి మరోలా డబ్బు వచ్చే అవకాశమే లేదు. దీనితో పొదుపుగా ఇల్లు నడుపుతుంటారు దంపతులు. శంకర్నాధ్ ఆఫీసులోనే క్లర్కుగా పని చేస్తూ ఉంటాడు సాధురాం. ఇతనిదీ పెద్ద సంసారమే. కాని లంచగొండి. విలాసంగా జీవిస్తుంటుంది ఇతని కుటుంబం. 

రవి స్కూలులో ఎక్స్కర్షన్‌కు వెళ్ళాలనుకుంటాడు. రూపకు కొత్త సిల్కు గౌన్ పై కోరిక, రాజాకి చిన్న సైకిల్ కావలని కోరిక కాని ఇవన్నీ కొనిచ్చే స్థితిలో శంకర్నాధ్ ఉండడు. అతని ఆఫీసులో పని చేసే క్లర్క్ పిల్లల దర్జా చూసి రవి తండ్రి లోభి అని తమ కోరికలు తీర్చడని కోపం పెంచుకుంటాడు. అతనితో పాటు చెల్లెలు తమ్ముడు కూడా తిండి మానేసి సత్యాగ్రహం చేయడం మొదలెడతారు. పిల్లల మొండి వైఖరి చూసి శంకర్నాధ్ బాధపడతాడు. వారి కోరికలు అప్పటికి తీరిస్తే ఆ తరువాత పుట్టే కొత్త కోరికలు తీర్చడం ఎలా అన్నది ఆతని ఆలోచన. ఎంతో దూరాలోచన చేసి పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టుకుని తన జీతం గురించి చెప్పి ఒక ఆరునెలలు జీతం మొత్తం తీసుకుని వచ్చి పిల్లలకు ఇస్తానని వారిని ఇల్లు నడపమని చెబుతాడు. పిల్లలు అంగీకరిస్తారు. ఇది చాలా పెద్ద బాధ్యత అని చిన్నపిల్లలు ఆ భారం మోయలేరని పద్మ చెబుతుంది. కాని జీవితం ఓ యుద్ధం లాంటిదని. ఆ యుద్ధాన్ని జయించే సైనికులుగా తాను పిల్లలను తయారు చేయదల్చుకున్నానని అతను చెప్పినప్పుడు, పిల్లల ఉత్సాహం చూసి అమె మౌనంగా ఊరుకుంటుంది.

ఒక నెలలో తాము తమ కిష్టమైన వస్తువులు కొనుక్కోవచ్చని ముగ్గురు పిల్లలూ అనుకుంటారు. కాని ఇంటి ఖర్చులలో ఎంత పొదుపు చేసినా అదనంగా ప్రతి నెల వచ్చే సమస్యలు ఉంటూనే ఉంటాయి. రాజా పొరపాటున జూదం ఆడే ప్రయత్నంలో కొంత డబ్బు పోగొట్టుకోవడం, ఇంటికి వచ్చిన చుట్టాల ఖర్చు, బాధ్యత, తల్లి అనారోగ్యం వీటన్నిటి  మధ్యన డబ్బు మిగలదు.

ఈ డబ్బు పొదుపు చేసే ప్రయత్నంలో పిల్లలు ముగ్గురు ఇంటి పనులు చేయడం మొదలెడతారు. పని మనిషిని పెట్టుకోవడం అదనపు ఖర్చు అనిపిస్తూ ఉంటుంది వారికి. పొదుపు చేసే ప్రయత్నంలో ముగ్గురు పిల్లలలో గొప్ప ఐకమత్యం ఏర్పడుతుంది. బాధ్యతగాప్రవర్తించడం  నేర్చుకుంటారు. విలాసాలకు అవసరాలకు  మధ్య ఉన్న తేడా అర్థం అవుతుంది. రవి పార్ట్ టైం ఉద్యోగం కూడా చేయాలనుకుంటాడు. కష్టం విలువ రూపాయి విలువ అర్థం అవుతుంది. పైగా నిజాయితీగా ఇలా జీవించడంలోని నైతిక ధైర్యం వారికి గొప్ప బలాన్నిస్తుంది. ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కునే శక్తి వారికి వస్తుంది.

పద్మ అన్న ధనవంతుడు. అతనికి ఒక్కడే కొడుకు. తల్లి అతి గారాబంతో చెడు స్నేహాల బాట పట్టి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు. తండ్రి అతన్ని దండించబోతే తల్లి అడ్డుకుంటుంది. తల్లి చాటున గోపి దొంగతనాలకు కూడా అలవాటు పడతాడు. అబద్దాలు చెప్పడం, స్కూలు ఎగ్గొట్టి జూదం ఆడడం అతని దినచర్యలో భాగం అవుతుంది. ఓ సారి జూదంలో పెద్ద మొత్తం పోగొట్టుకుంటాడు గోపి. శంకర్నాధ్ ఇంటికి వచ్చినప్పుడు రవి ఇంటి ఖర్చుల కోసం డబ్బు దాచే స్థలం చూసి అది దొంగతనం చేస్తాడు. ఆ డబ్బు తీసుకుని వెళ్లి తాను జూదం ఆడే చోట ఇచ్చి తన వస్తువులు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కాని ఆ పిల్లలు గోపిని కొట్టడం మొదలెడతారు. తన డబ్బు కోసం గోపిని వెతుక్కుంటూ అక్కడకి వెళ్ళిన రవి, రవి కోసం వెళ్ళిన శంకర్నాధ్, గోపి తండ్రి, పిల్లల్ని ఆపి గోపికి బుద్ది చెప్పి ఇంటికి తీసుకుని వస్తారు.

శంకర్నాధ్ దగ్గర గుమస్తాగా పని చేసే సాధూరాం పెద్ద కూతురు సీమ సురేష్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ విషయం తెలుసుకుని పెద్దలు పెళ్ళి నిర్ణయిస్తారు. కాని సాధూరాం లంచం తీసుకుంటూ పట్టుబడి జైలుకి వెళ్ళడంతో ఆ పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు శంకర్నాధ్ పెళ్లి కొడుకు తల్లిని ఒప్పించి వారి వివాహం జరిపిస్తాడు. డబ్బు కన్నా వ్యక్తిత్వం, మంచితనం, నిజాయితీ గొప్పవని, డబ్బుతో వచ్చే ఆడంబరాలు అశాశ్వతం అని, నిజాయితీతో జీవించే వ్యక్తి కున్న గౌరవం శాశ్వతం అని ఈ సంఘటన నిరూపిస్తుంది. 

గోపి తన తప్పు తెలుసుకుని మంచిదారిలోకి రావడం, సాధూరాం కుటుంబం తమ తండ్రి ఎలా డబ్బు తెస్తున్నాడో తమకు చూచాయిగా తెలిసి కూడా అడ్డు చెప్పకుండా తమ అవసరాలు పెంచుకుంటూ పోవడం కూడా తండ్రి లంచగొండితనాన్ని ప్రోత్సహించిందని తెలుసుకోవడం సినిమా ముగింపు.

బిడ్డలకు చిన్నతనంలోనే బాధ్యతలు అప్పజెప్పడం వలన చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆలోచన ఈ సినిమా కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఇంటిలో పిల్లల అసంతృప్తులు, పిల్లలతో వచ్చే సమస్యలు చూస్తున్నప్పుడు ఈ సినిమా చాలా వాటికి జవాబు ఇస్తుందనిపిస్తుంది.

శంకర్నాధ్ గా బల్రాజ్ నటన గురించి చెప్పుకోవాలి. చాలా ఈజ్‌తో ఈ పాత్ర చేస్తారాయన. ఎంతో ఆలోచన ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. పిల్లలను అర్థం చేసుకునే తండ్రిగా వారికి నచ్చచెప్పే బాధ్యతగల పెద్దగా ఆయన చూపే బాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా ఆయనది నటన అనిపించదు. పిల్లలను కూర్చోబెట్టుకుని పెద్ద కొడుకుతో “నేను నిన్ను నాతో సమానంగా చూస్తాను. ఓ స్నేహితుడిగా నీతో మాట్లాడుతున్నాను నువ్వు కూడా ఒక పిల్లవాడిలా కాక ఓ  మగవాడిలా నా మాట విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నేను నా చిన్న జీవితంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ అబద్దం చెప్పలేదు, ఈ రోజు చెప్పను” అంటూ ఆయన మాట్లాడే సన్నివేశం, ఇంటి ఖర్చులను, బాధ్యతను పంచుకొమ్మని పిల్లలను అడగడం, పెద్దలకు గొప్ప పాఠంలా అనిపిస్తుంది. ఈ సీన్ లో బల్రాజ్ గారి నటన చాలా బావుంటుంది.

చాలా మంది పెద్దలు తమ పిల్లల ముందు నా తాహతింతే అని చెప్పడం అవమానంగా అనుకుంటారు. పైగా అది తమ తప్పని అనుకుంటూ ఆపరాధ భావనలోకి వెళ్ళిపోతారు. ఇది ఎంతగా చాలా మంది తండ్రుల మెదళ్ళలోకి చొప్పించబడిందంటే, నేను సంపాదించేది ఇంతే అని తండ్రులు ఒప్పుకోవడం చేతకానితనంగా వారే అనుకుని ఒక రకమైన న్యూనతా భావంతో పిల్లల ముందు నిలబడాల్సి వస్తుందని దాని కోసం పిల్లల ప్రతి కోరికను తీర్చడం తమ జీవితంలో మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇదే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. కాని ఇది తెలిసే సరికి పిల్లల స్థాయి  మారిపోతుంది. కాని ఈ సినిమాలో నేను సంపాదించేది ఇంతే, ఇంత కన్నా ఎక్కువ సంపాదించాలంటే నేను లంచగొండినవ్వాలి అది నేను చేయ్యను అని ఖచ్చితంగానూ అంతే ఆత్మవిశ్వాసంతోనూ, స్నేహభావంతోనూ బల్రాజ్ సహ్ని చెప్పే సన్నివేశం వారి గొప్ప బాలెన్స్డ్ నటనకు నిదర్శనం. 

“నా కంతా తెలుసు” అనే కొడుకును చూస్తూ ఆ పసి వాని వయసుని దృష్టిలో పెట్టుకుని అనుభవంతో పండిన ఆ తండ్రి అంతే సౌమ్యంగా “సరే అయితే  ఈ రోజు నించి ఇంటిని నువ్వే నడిపించు” అని బాధ్యత అప్పజెప్పుతాడు. ఆ కొడుకు దగ్గర తన రోజువారి ఖర్చుకు డబ్బు తీసుకోవడానికి ఆయన వెనుకాడడు. బస్‌కి, సిగరెట్లకు కూడా డబ్బు కొడుకు నుండి తీసుకుంటూ చివరకు పిల్లల త్యాగాలు చూసి తన సిగరెట్లను కూడా మానేస్తాడు ఆ తండ్రి. పిల్లలు పని పిల్లను  మానిపించి అన్ని పనులు వారే చేస్తున్నారని తెలుసుకుని తాను బస్‌లో కాకుండా నడిచి రావడం మొదలెడతాడు. పిల్లల మార్పు కోసం వారి అలకలకు మొండి వైఖరికి లొంగకుండా తాను కూడ కష్టపడుతూ వారితో పాటు తానూ ప్రయాణిస్తున్నానని తెలియజేస్తూ వారి కష్టంలో పాలు పంచుకుంటూ, తన పెద్దరికాన్ని మాత్రం వదలకుండా నిలబెట్టుకుంటాడు. ఈ పాత్ర ద్వారా ఏ పిల్లల సైకాలజిస్టు చెప్పలేని విషయాలని కూడా ఆచరించి చూపుతాడు బల్రాజ్ సహ్ని. ముఖ్యంగా ఆ క్రమంలో ఆయన నిబ్బరం, ఓపిక, ఆయన పలికే ప్రతి డైలాగులోనూ కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలోని ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని పెద్దలు ఆయనలో తమను, తమ ఆలోచనలను చూసుకుంటారు.

మన సినిమా హీరోలు మన కలల నుండి ఉద్బవిస్తారు. సగటు  మనిషి ఎలా ఉండాలనుకుని ఉండలేకపోతారో ఆ కలలకు ప్రతిరూపాలు వాళ్లు. అందుకే వాళ్లు ప్రేక్షకుల క్రేజ్ ని సంపాదించుకుంటారు. ఆ క్రేజ్ లో ఓ చరిష్మా ఉంది. ఆ హీరోలు మన కలల రాకుమారులు అవుతారు. కాని బల్రాజ్ సహ్ని పోషించిన పాత్రలన్నీ మన జీవితలలోంచి వచ్చినవి. అందుకే ఆయన పై క్రేజ్ కన్నా గౌరవం కలుగుతుంది ప్రేక్షకులకు. మన జీవితాలలోని ఎన్నో ప్రశ్నలకు ఆయన పాత్రలు సమాధానం అవుతాయి. క్రేజ్ పెంచుకున్న హీరోలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటారు. కాని బల్రాజ్ తన పాత్రలతో సంపాదించుకున్న గౌరవం ఎందరో తమ జీవితాలలో నేలపై నిలుచుని ఉండడానికి ఉపయోగపడతాయి. ఆయనను మనలో ఒకరిగా చేశాయి.

జీవితాంతం సోషలిస్టు భావజలంతో ఐక్యం అయిన వ్యక్తి బల్రాజ్. జనజీవితాన్నే ఆయన ఇష్టపడేవారు. వారితో కలిసి నడవడంలోనే ఆనందం వెతుక్కునే వారు. అయన కూడ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. తన ఆదర్శాలను కుదువ పెట్టలేదు. ఏది నమ్మేవారో అటువంటి పాత్రలనే ఎన్నుకుని అందులోకి ఒదిగిపోయి నటించేవారు. “సాధారణ జీవితం ఉన్నతమైన ఆలోచన” అనే గాంధీ సూత్రాన్ని ఆయన ఆచరించి చూపించారు. జీవితంలో చాలా సార్లు దురదృష్టం వెన్నంటే ఉండి దెబ్బతీసినా ఎంతో కృంగదీసినా ఆయన బాధపడి ముళ్ళ బాటన నడిచారే కాని తన ఆలోచనలను మార్చుకోలేదు. ఆయన గడిపిన అరవై సంవత్సరాల జీవితంలో ఆయన పోగొట్టుకున్న ఆనందాలే ఎక్కువ అయినా మహోన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన గొప్ప వ్యక్తి బల్రాజ్ సహ్ని.

సాధారణంగా నటులపై ఎవో కొన్ని కథలు పుడుతూనే ఉంటాయి. కాని తన నటనా జీవితంలో అలాంటి కథలన్నిటికీ దూరంగా ఉన్నారు బల్రాజ్ సహ్ని. ఆయన్ని ఎరిగిన వారు ఒక్కరు కూడా వారి గురించి తప్పుగా  మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది ఆయన వ్యక్తిత్వం. అలాగే ఎవరికీ, ఏ ప్రలోభాలకూ లొంగే వ్యక్తి కూడా అయన కాదు అని తెలియజెప్పే ఉదాహరణలు ఎన్నో ఆయన జీవితంలో. “ఘర్ ఘర్ కీ కహానీ” లో శంకర్నాధ్ పాత్రలో  మరో నటుడిని ఊహించుకోలేం. 

సాధూరాం కూతురు “సీమ” పాత్రలో దక్షిణాది నటి భారతి కనిపిస్తుంది. ఇక ఆమె ప్రేమించిన సురేష్ పాత్రలో రాకేశ్ రోషన్ కనువిందు చేస్తారు. వీరి పై చిత్రించిన “సమా హై సుహానా” అనే పాట ఈ రోజుకీ కిషోర్ కుమార్ హిట్ గీతంగా వినిపిస్తూనే ఉంటుంది. 

దక్షిణాది దర్శక నిర్మాతలు నిర్మించిన లో-బడ్జెట్ సినిమా అయినా ఈ సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది. రాకేశ్ రోషన్ ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించినా, ఇదే ఇతివృత్తంతో అనీల్ కపూర్, జాకీ ష్రాప్ లతో “కాలా బాజార్” అనే సినిమాను తరువాతి కాలంలో తీశారు. ఈ సినిమా ప్రభావం ఆయనపై ఎంత ఉందో ఆయన తీసిన “కాలా బాజార్” నిరూపిస్తుంది. “ఘర్ ఘర్ కీ కహానీ” లో బాల నటులుగా నటించిన మహేష్ కొఠారే తరువాతి కాలంలో మరాఠీ చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప నిర్మాతగా దర్శకుడిగా ఎదిగారు. రూప పాత్ర చేసిన నీతూ సింగ్ తరువాతి కాలంలో హీందీలో పెద్ద హీరోయిన్ అయ్యారు. ఇక తల్లి పాత్ర వేసిన నిరూపా రాయ్ ఎందరో స్టార్ హీరొలకు తల్లిగా చేసి అసమాన్యమైన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ సినిమాకు గొప్ప అవార్డులు రివార్డులు రాకపోవచ్చు. కాని ఇన్ని సంవత్సరాల తరువాత చూసినా అది మనల్ని ఎంతో ఆనందింపజేస్తుందన్నది నిజం. 

మనం తప్పకుండా చూడవల్సిన మంచి సినిమాలలో “ఘర్ ఘర్ కీ కహానీ” ఒకటి.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here