Site icon Sanchika

అరుదైన నటవహ్ని- బలరాజ్ సహ్ని – 8 బిందియా

[బలరాజ్ సహ్ని నటనా వైదుష్యాన్ని విశ్లేషిస్తూ పి. జ్యోతి గారు అందిస్తున్న వ్యాస పరంపరలో భాగంగా ‘బిందియా’ చిత్రం విశ్లేషణ.]

[dropcap]బ[/dropcap]లరాజ్ సహ్ని జె.యెన్.యూ. ప్రసంగంలో ప్రత్యేకంగా పాశ్చాత్య అనుకరణ భారతీయులను ఎలా బానిసలుగా మార్చివేసిందో చెప్పే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉదాహరణలు మనల్ని ఆలోచనలో పడవేస్తాయి. ఒక సినీ కళాకారుడిగా కన్నా ఓ నిజమైన భారతీయుడిగా, మాతృదేశపు ఔన్నత్యాన్ని పెంపొందించవలసిన బాధ్యత గల పౌరుడిగా ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలు..

“మీరు హిందీ చిత్రాలను చూసి నవ్వితే, మిమ్మల్ని చూసి మీరు నవ్వుకున్నట్లే. మన ఆస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవించుకోవడం మన కర్తవ్యం. మీకు నాదొక అనుభవం చెబుతాను. ఈ సంవత్సరం గురునానక్ యూనివర్శిటీ సెనేట్‌కు నన్ను నామినేట్ చేయడం ద్వారా నా స్వంత ప్రావిన్స్ నన్ను గౌరవించింది. మొదటి సమావేశానికి హాజరవ్వమని ఆహ్వానం వచ్చినప్పుడు, నేను పంజాబ్‌లో ఉన్నాను. ప్రీత్ నగర్ సమీపంలోని కొన్ని గ్రామాలలో తిరిగాను. మహా రచయిత ఎస్. గుర్బక్ష్ సింగ్ స్థాపించిన సాంస్కృతిక కేంద్రంలో సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ, నేను ఈ సమావేశానికి హాజరు కావడానికి అమృత్‌సర్‌కు వెళ్లాలని, నా కారులో ఎవరైనా లిఫ్ట్ కావాలనుకుంటే రావచ్చని నా గ్రామస్థులతో చెప్పాను. అది విని ఒకరు ఇలా అన్నారు, ‘ఇప్పుడు మా మధ్య మీరు తెహ్మత్-కుర్తా, రైతు ఫ్యాషన్ దుస్తులు ధరించి వచ్చారు. కాని రేపు మీరు సూట్ వేసుకుని మళ్ళీ సాహిబ్ బహదూర్ అయిపోతారు’. నేను నవ్వుతూ, ‘మీరు కోరుకుంటే నేను ఇలాగే సభకు వెళతాను’ అన్నాను. ‘మీరు ఎప్పటికీ ధైర్యం చేయలేరు’ అని మరో రైతు సవాలు విసిరాడు. ‘ఇక్కడ మా సర్పంచ్ సాహెబ్ అధికారిక పని మీద నగరానికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా తన తహమత్ తీసేసి పైజామా వేసుకుంటాడు. తను అలాగే వెళ్ళాలని, లేకపోతే అక్కడ తనకు గౌరవం ఇవ్వరని అంటాడు. అలాంటిది ఇంత పెద్ద యూనివర్శిటీ సమావేశానికి మీరు రైతు బట్టలలో ఎలా వెళ్లగలరు?’

వరి నాట్లు కోసం సెలవుపై ఇంటికి వచ్చిన ఒక జవాన్, ‘మా సర్పంచ్ పిరికివాడు. నగరాల్లో ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా లుంగీలు కట్టుకుని తిరుగుతున్నారు. అలాంటప్పుడు అతని రైతు వేషాన్ని నాగరికులు ఎందుకు గౌరవించకూడదు?’ అని ప్రశ్నించాడు. గాసిప్ కొనసాగింది. వారి సవాలును అంగీకరించినట్లుగా, నేను తెహ్మత్-కుర్తాలోనే సెనేట్ సమావేశానికి వెళ్ళాను. అక్కడ నేను సృష్టించిన సంచలనం నా అంచనాకు మించినది.

కాలేజీలో అతిథులకు గౌనులు పంచుతున్న ప్రొఫెసర్ నన్ను గుర్తుపట్టలేకపోయాడు. తరువాత నవ్వుతూ ‘మిస్టర్ సహ్నీ, తహ్మత్‌తో మీరు ఖోసాలు ధరించాల్సింది, బూట్లు కాదు’ అన్నడు. ‘నేను మరో సారి అలాగే వేసుకుంటాను’ అని అతనికి బదులిచ్చి ముందుకు వెళ్ళాను. ఒక్క క్షణం తరువాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా దుస్తులపై కామెంట్ చేయడం ప్రొఫెసర్ చేసిన తప్పు కదా. నేను ఆ విషయన్ని అతనికి ఎందుకు సూచించలేకపోయాను? ఇది నా ఆత్మన్యూనతా భావమా? అని ఆలోచించాను.

సమావేశం తరువాత విద్యార్థులను కలిసేందుకు వెళ్లాం. నన్ను చూసిన వారి ముఖాలలో స్పష్టంగా వినోదం కనిపించింది. నేను తెహ్మత్‌తో బూట్లు ధరించడం చూసి చాలా మంది నవ్వకుండా ఉండలేకపోయారు. ప్యాంటుతో చప్పల్స్ ధరించడం వారికి అసాధారణంగా ఏమీ అనిపించలేదు. పాశ్చాత్య వేషధారణతో భారతీయ చెప్పులు ధరించడాన్ని స్వీకరించగలిగినప్పుడు భారతీయ దుస్తులతో బూట్లను ధరించడంలో అంత వినోదం ఏముందో నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ఆలోచన లేని గుడ్డి అనుకరణ కాదా. పంజాబీ రైతు కోణం నుంచి ఆలోచించండి.

హరిత విప్లవానికి పంజాబీ రైతు చేసిన కృషికి మనమందరం మెచ్చుకుంటున్నాము. అతను మన సాయుధ దళాలకు వెన్నెముక. అతని దుస్తులు లేదా అతని జీవన విధానం వినోదభరితమైన అంశంగా పరిగణించబడినప్పుడు అతను ఏం అనుకోవాలి? పల్లెటూరి కుర్రాడు కాలేజీ విద్యను అభ్యసించిన వెంటనే ఆ గ్రామం పట్ల ఉదాసీనంగా ఉంటాడని పంజాబ్‌లో అందరికీ తెలిసిందే. అతను పూర్తిగా ఒక ప్రత్యేక ప్రపంచానికి చెందినవాడిగా తనను తాను ఉన్నతంగా మరియు విభిన్నంగా భావించడం ప్రారంభిస్తాడు. ఎలాగైనా గ్రామాన్ని వదిలి నగరానికి పారిపోవాలనేది అతని ఆశయం అవుతుంది. ఇది విద్యా ప్రపంచానికి చెంపపెట్టు కాదా?

అన్ని ప్రదేశాలు ఒకేలా ఉండవని నేను అంగీకరిస్తున్నాను. తమిళనాడు లేదా బెంగాల్‌లో స్థానిక దుస్తులకు వ్యతిరేకంగా ఎలాంటి కాంప్లెక్స్ లేదని నాకు బాగా తెలుసు. రైతు నుండి ప్రొఫెసర్ వరకు ఎవరైనా ఏ సందర్భంలోనైనా ధోతి ధరించవచ్చు. కాని అరువు తీసుకున్న ఆదర్శాలతో ఆలోచించే అలవాటు అక్కడ కూడా ఉందని నేను చెప్పగలను. ఇది ప్రతిచోటా, ఏదో ఒక రూపంలో ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినా, గుమాస్తాలను, మానసిక బానిసలను పెంచేందుకు మెకాలే అండ్ కో రూపొందించిన విద్యావిధానాన్నే మనం ఆనందంగా కొనసాగిస్తున్నాం. తమ బ్రిటీష్ యజమానుల గురించి స్వతంత్రంగా ఆలోచించలేని బానిసలు, యజమానులను ద్వేషిస్తున్నప్పుడు కూడా వారి గురించిన ప్రతి విషయాన్ని మెచ్చుకునే బానిసలు; యజమానుల ప్రక్కన నిలబడటం, యజమానుల భాషలో మాట్లాడటం, యజమానుల వలె దుస్తులు ధరించడం, ఆంగ్లేయిల లాగా పాడటం, నృత్యం చేయడం గౌరవంగా భావించే బానిసలే కదా వీరంతా. ఈ బానిసలే వారి స్వంత ప్రజలను ద్వేషిస్తారు. ఈ ద్వేషాన్నే నాగరికత పేరుతో బోధిస్తూ ఉంటారు

యూనివర్శిటీల్లో అత్యధిక మంది విద్యార్థులు ఈ విద్యా విధానంపై విశ్వాసం కోల్పోతుంటే అందులో ఆశ్చర్యం ఏం ఉంది? పదేళ్ల క్రితం ఢిల్లీలో ఫ్యాషనబుల్ స్టూడెంట్‌ని ప్యాంట్‌తో కుర్తా ధరించమని అడిగితే, అతను మమ్మల్ని చూసి నవ్వాడు. నేడు, హిప్పీలు, ‘హరే రామ హరే కృష్ణ’ కల్ట్, కారణంగా కుర్తా-ట్రౌజర్ కలయిక చట్టబద్ధం కావడమే కాకుండా, కుర్తా అనే పదం కూడా గురు-షర్ట్ గా మారిపోయింది. యాభై ఏళ్ల క్రితం స్వీడన్ నుంచి నోబెల్ బహుమతి అందుకున్న తర్వాతనే ఠాగూర్ భారతదేశమంతటా గురుదేవ్‌గా అంగీకరించబడ్డారు. రవిశంకర్‌కు అమెరికన్లు ఘన స్వాగతం పలికిన తర్వాతే సితార్ మనకు స్టార్ వాద్యంగా మారింది.

ప్రస్తుతం మీరు కాలేజీ విద్యార్థిని తల, మీసాలు, గడ్డం తీయమని అడిగే ధైర్యం చేయగలరా? కానీ రేపు, యోగా ప్రభావంతో, యూరప్ విద్యార్థులు తలలు మరియు ముఖాలు షేవ్ చేయడం ప్రారంభిస్తే, మరుసటి రోజు కన్నాట్ సర్కస్‌లో మీరు గుండు, పుర్రెల పంటను చూడటం ప్రారంభిస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను. యోగా పుట్టిన ఇంటిని ప్రభావితం చేయడానికి ముందు యూరప్ నుండి సర్టిఫికేట్ పొందాలి. ఆ స్థితిలో ఉన్నది మన యువత, మన భారతీయత.”

బలరాజ్ చేసిన ఈ ప్రసంగంలో భారతీయులలో తమ సంస్కృతి పట్ల, ఆచారాల పట్ల ఉన్న న్యూనతాభావం వారిని బానిసలుగానే ఉంచితీరుతుంది అనే భావం కనిపిస్తుంది. అచ్చంగా ఇదే ఆలోచనలతో ఆయన తన సినీ పాత్రలను ఒప్పుకుని చేసేవారు. అప్పటి హీరోలు పాశ్చాత పద్ధతిలో తమను తాము మలచుకుంటుంటే, ఈయన అత్యధిక శాతం, భారతీయ సగటు వ్యక్తి పాత్రలను, గ్రామీణ పాంతపు వ్యక్తుల జీవిత కథలను తెరపైకి తీసుకురావడానికి సహాయపడ్డారు. ఆ పాత్రలను జీవం పోశారు. చదువుకున్నది, ఉద్యోగం చేసింది పాశ్చాత్య పోకడల మధ్యే అయినా, విదేశీ అనుభవం ఉన్నా, అన్నిటిని చూసిన వారిగా తన దేశపు సగటి వ్యక్తి జీవితాన్ని రికార్డ్ చేయడమే తన కర్తవ్యం అని నమ్మారు. ఎన్నో సినిమాలలో సాధారణమైన వేషభాషలతో భారతీయ వస్త్రధారణతోనే ఆయన కనిపిస్తారు.

కృష్ణణ్-పంజు దర్శకత్వంలో 1960లో తమిళ భాషలో ‘దైవపిరవి’ అనే సినిమా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలను శివాజీ గణేశన్, పద్మిని పోషించారు. తెలుగులో ‘అనుమానం’ పేరుతో ఇది డబ్ అయి వచ్చింది. ఎనిమిదవ జాతీయ సినీ పురస్కారాలలో దీనికి మూడవ ఉత్తమ చిత్రంగా బహుమతి లభించింది. పూర్తి కుటుంబ కథా చిత్రం అయిన ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు చాలా అదరించారు. దీన్ని హిందీలో తీయాలని ఏ.వీ.ఎం సంస్థ అనుకున్నప్పుడు, ఇది పూర్తిగా దక్షిణ ప్రాంతపు కుటుంబ కథా చిత్రమని దీన్ని హిందీలో తీస్తే ఆడదని శివాజీ గణేశన్ చెప్పారు. కాని దర్శకులకు హిందీలో ప్రయత్నించాలని అనిపించింది. అలా వచ్చిందే ‘బిందియా’. ఇదీ 1960లోనే రిలీజ్ అయింది కాని హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చలేదు. బలరాజ్ సహ్నీ, శివాజీ గణేశన్ పోషించిన పాత్రను చేసి గొప్పగా నటించినా, పద్మిని అంతే పోటీగా ప్రతిభ చూపినా ఈ సినిమా ఉత్తరాదిన ఫెయిల్ అయింది.

తల్లితండ్రులు చనిపోయిన తరువాత దేవరాజ్ తన చిన్న తమ్ముడు రాజుతో కలిసి జీవిస్తుంటాడు. మేస్త్రీగా నిజాయితీగా పని చేసే ఇతను బిందియా అనే శ్రామిక పేద యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. బిందియాకు తల్లి, రాము అనే చిన్న తమ్ముడు ఉంటారు. వారి బాధ్యతను కూడా తానే స్వీకరిస్తాడు దేవరాజ్. భర్త మంచితనం చూసి బిందియా సంతోషిస్తుంది. జీవితాంతం అతని సంతోషం కోసం శ్రమించాలని నిశ్చయించుకుంటుంది. దేవరాజ్ తమ్ముడు రాజు చిన్నప్పటి నుండి చెడు సహవాసాలకు అలవాటుపడతాడు. కాని భర్త మీద కృతజ్ఞతను మరిది మీద ప్రేమగా మార్చుకున్న బిందియా రాజుని అవసరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతనే తన బిడ్డ అన్నట్లుగా జీవిస్తుంది. రాము మొదటి నుండి కష్టపడే తత్వం ఉన్నవాడు. నిజాయితీపరుడు. కష్టపడి చదువుకుంటాడు. అతనంటే దేవరాజ్‌కు చాలా ప్రేమ.

ధనవంతులయిన ఈ కుటుంబం అందరి మన్ననలు పొంది జీవిస్తూ ఉంటుంది. కేదార్నాథ్ అనే ఓ ధనవంతుని కూతురు రమని రాజు ప్రేమిస్తాడు. కాని రమ రాముని ఇష్టపడుతుంది. రాము కూడా రమను ప్రేమిస్తాడు. కాని రాజు రమను ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న బిందియా రాముని రమను త్యాగం చేయమని అడుగుతుంది. రాము ఒప్పుకుంటాడు. కాని రమ రాజుతో సంబంధానికి ఇష్టపడదు. దేవరాజ్ తండ్రి తల్లిని దేవరాజ్‌ను చిన్నప్పుడే వదిలేసి మరో యువతిలో వెళ్లిపోతాడు. ఇది తెలిస్తే పరువు పోతుందని దేవరాజ్ తండ్రి గతం గురించి ఎవరికీ చెప్పడు. కాని తండ్రి చేసుకున్న ఆ స్త్రీ తన కూతురితో తండ్రి మరణం తరువాత దేవరాజ్ ఇంట చేరుతుంది. వారి బీద స్థితికి జాలి పడి దేవరాజ్ వారికి తన ఇంట ఆశ్రయం ఇస్తాడు. ఆ తల్లి కూతుర్ల కుట్రతో ఆ ఇంట కలకలం మొదలవుతుంది. బిందియా బీదగా ఉన్న రోజుల్లో ఆమె కుటుంబానికి అండగా నిలిచిన చందన్ తరువాత బిందియా ఇంట వంటవానిగా చేరతాడు. అతన్ని సోదరుడిగా భావిస్తుంది బిందియా. కాని దేవరాజ్ మారుటి తల్లి చెల్లి చందన్‌తో బిందియాకు సంబంధం ఉందని దేవరాజ్‌లో అనుమానం నాటుతారు. అలాగే దేవరాజ్‌కు మారుటి చెల్లెలు నందినికి మధ్య ఏదో ఉందని బిందియా అనుమానించేలా ప్రవర్తిస్తారు. చివరికి ఈ అపార్థాలు అన్ని తొలిగి భార్యాభర్తలు కలవడం, నందిని తన భర్తకు చెల్లెలు అని తెలుసుకుని ఆమె దొంగలించిన నగలన్నిటినీ బిందియా ఆమె పెళ్ళి కోసం ఇచ్చి తన మంచి మనసును చాటుకోవడం, రాజులో మార్పు రావడం, రాము, రమల వివాహం అవడం సినిమా ముగింపు.

ఈ సినిమాకు ఇక్బాల్ ఖురేషీ సంగీతం అందించారు. సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. పాటలు బావుంటాయి. ‘దేఖీయే యూ నా షర్మాయియేగా’ అనే డ్యూయెట్ ముఖేష్, ఉషా ఖన్నాల ప్లేబాక్‌తో బలరాజ్ సాహ్ని, పద్మినీలపై చిత్రించిన డ్యూయెట్. ఇది మధురంగా ఉండే గీతం. ఇదే కాకుండా రఫీ గొంతులో ‘మై అప్నే ఆప్ సే’ అన్న పాట రఫీ హిట్ గీతలలో ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది. లతా, ఆశా గొంతులో వచ్చే ఇతర పాటలూ బావుంటాయి. కాని సినిమా ఫెయిల్యూర్ కారణంగా ఇవి కూడా మరుగునపడిపోయాయి. పాటలన్నీ రాజేంద్ర కిషన్ గారు రాసారు. సాహిత్యపరంగా కూడా అవి ఉన్నతమైన గీతాలనే చెప్పవచ్చు.

సినిమాలో బల్‌రాజ్ సహ్ని నటన చాలా బావుంటుంది. ఒక సగటు వ్యక్తిలోని మంచితనం, బలహీనతలు అన్నిటికి సమపాళ్లలో చూపించే పాత్ర ఇది. తన గతం పట్ల అతనిలో ఉండే అభద్రతాభావం ప్రతి నిముషం అతని వ్యక్తిత్వంలో కనిపిస్తూ ఉంటుంది. దేవరాజ్ గొప్ప హీరో కాదు. మంచి వ్యక్తి. కాని ప్రపంచం అంటే విపరీతమైన భయం, భార్యపై అధారపడే తత్వం అతనిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే లోలోపల ఓ అహం కూడా అతనిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్మేసే బలహీనమైన మనస్తత్వం, ఈ షేడ్స్ అన్నిటిని బలరాజ్ తన పాత్రలో చూపించే విధానం బావుంటుంది. అందుకే చాలా మంది ఈ పాత్రలో తమ ఇంటి మగవారిని చూసుకునే అవకాశం ఉంది. అంతగా ఓ సాధరణమైన మగవానికి ఆ పాత్రలోకి ఒదిగిపోవడం బలరాజ్‌కే చెల్లింది. రాముగా జగ్దీప్ కూడా చక్కగా నటించారు. ఎందుకో ఆయనకు తరువాత హీరో పాత్రలు రాక కామెడీకి మళ్ళారు.

బలరాజ్ సహజ నటన కోసం ఈ సినిమా చూడాలి. ప్రతి సీన్‌లో ఆయన చూపే ఆ హావభావాలు, ముచ్చట గొలుపుతాయి. ఎంత సహజంగా దేవరాజ్ పాత్రలో ఒదిగిపోయారంటే, హీరోలంటే సూపర్ మెన్‌గా భావించే వారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇందులో ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కుటుంబంలో అన్ని రకాల అసహాయతలు, బలహీన క్షణాలు, కుటుంబ వ్యక్తుల మధ్య అపార్థాలు, సమాజంలో పేరు కోసం తపించే అతి సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తులు, ఈ సినిమాలో కనిపిస్తారు. సమాజాన్ని, ప్రపంచాన్ని ఎదిరించాలనే స్వభావం కన్నా సమాజపు మూసలో కొట్టుకుపోయే వ్యక్తులే వీరంతా. సహజంగా సినిమానుండి ఆశించే హీరోయిజం ఇందులో కనిపించదు. తమిళంలో శివాజీ గణేశన్ పాత్రలో ఒక లౌడ్‌నెస్ ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీలో అది స్పష్టంగా కనిపిస్తుంది. అదే పాత్రను బలరాజ్ ఎటువంటి లౌడ్‌నెస్ లేకుండా తన శైలిలో చేయడంతో కొన్ని సీన్లలో అతని పక్కన పద్మిని కూడా తన తమిళ పంథా మార్చుకుని నటించడం కనిపిస్తుంది. అయినా ఆమెలో ఆ దక్షిణాది డ్రామా మధ్య మధ్యలో కనిపిస్తుంది. రాముని దేవరాజ్ కొట్టే సీన్, దేవరాజ్‌పై రాము చేయి చేసుకునే సీన్‌ని తమిళంలోనూ హిందీలోను గమనిస్తే బలరాజ్ శైలిలోని భిన్నత్వం కనిపిస్తుంది. లౌడ్ యాక్టింగ్‌కు బలరాజ్ ఎప్పుడూ దూరంగా ఉండేవారు. ఎంతటి ఎమోషనల్ సీన్ అయినా కంట్రోల్డ్ టోన్‌లో నటించడం అతనికి అలవాటు. గొంతు పెంచి హీరోయిక్‌గా డైలాగులను వినండి నా మాటలు అన్నట్లుగా వినిపించే పంథా బలరాజ్‌ది కాదు. ఈ సినిమాలో పాత్రను కూడా ఆయన అదే పంథాలో నడిపించడంతో సహజత్వాన్ని ఇష్టపడేవారికి బలరాజ్ శైలి ఆకట్టుకుంటుంది. హీరోయిజాన్ని యిష్టపడేవారికి శివాజీ గణేశన్ శైలి నచ్చుతుంది. జీవితంలో మనం సంభాషణలను ఉచ్చరిస్తాం కాని డ్రామా డైలాగుల స్థాయిలో మాట్లాడం అన్న పాయింట్‌ని అంటిపెట్టుకుని బలరాజ్ సహ్ని నటన సాగుతుంది. అందువలన భారతీయ చిత్రసీమలోనే ఆయన ‘ది మోస్ట్ నాచురల్ యాక్టర్’ అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Exit mobile version