Site icon Sanchika

అరుగు

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి స్మృతిలో లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీలలో ప్రత్యేక బహుమతి ₹1,000/- గెలుచుకున్న కథ ఇది. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. [/box]

[dropcap]”ఏ[/dropcap]మండీ” పిలిచింది శాంతమ్మ.

“ఏమిటి” అడిగాడు భర్త శంకరం. వెంటనే పలకకపోతే కష్టం. ఎందుకంటే ఆమె పేరుకు శాంతమ్మ అయినా లక్షణాలు సూర్యకాంతమ్మవి. వెంటనే పలకకపోయినా, చెప్పినది చేయకపోయినా మనశ్శాంతి ఉండదు. అందుకే వెంటనే చేసేస్తాడు శంకరం.

“ఈ నీళ్ళు తీసుకెళ్ళి అరుగు మీద పొయ్యండి” అంది. బక్కెట్‍లో ఇల్లు వత్తిన మురికి నీళ్ళు ఉన్నాయి.

నిట్టురుస్తూ లేచాడు శంకరయ్య. ఎందుకో తెలుసు. తమది అరుగుల ఇల్లు. ఆ అరుగుల మీద గొడుగులాగా పరచుకొన్నట్లుగా నేరేడు చెట్టు ఉంది. పగలు బాటసారులు గాని, రాత్రిళ్ళు ముష్టివాళ్ళు గాని ఆ అరుగుల మీద పడుకోవటమో, కూర్చోవటమో చెయ్యటం; రాలినవే కాక, అందిన నేరేడుపళ్ళు కోసుకుని, లేదా రాళ్ళతో కొట్టి కూడా తినటం జరుగుతుంది.

ఇవన్నీ శాంతమ్మకి కంటగింపుగా ఉండేవి. అటు మంచి గాలి నీడ, ఆకలి తీర్చటానికే కాక ఆరోగ్యానికి పనికివచ్చే పళ్ళు. అంత అనాయాసముగా ఎవరైనా సుఖపడటం అమెకిష్టం ఉండదు.

అందులోనూ ఎంతో కొంత ప్రమేయం ఉన్న తమని అడగకుండా, అలా అని పోనీ ఆడిగితే ఒప్పుకుంటుందా అంటే అదీ లేదు. కాని వాళ్ళు అసలు అడగటము లేదు కదా; వద్దని చెప్పినా మానరు.

అందుకే అసలు కూర్చోలేకుండగా ఈ పద్ధతి మొదలుపెట్టింది. అరుగుల మీద నీరు, చెత్త పోసేది, పోయించేది. అవి కూడా మురికివి, సబ్బు నీళ్ళు, వాసన వచ్చేవి. చెత్తా అలాగే కుళ్ళిపోయినది వాసన వచ్చేది.

“పోనీ లేవే బయటేకదా ఉంటారు, ఆ చెట్టూ మనం వెయ్యలేదు కదా” అనబోయీ ఊరుకున్నాడు శంకరయ్య. ఎలాగూ వినదు. పైనించి ఓ యుద్ధం ఎదురుకోవాలి. వానాకాలం ఎలాగూ తడిగానే ఉంటాయి. చలికాలం ఎవరూ ఎక్కువగా తిరగరు. మిగిలింది వేసవికాలం అయినా ఓర్చుకోదు.

అసలు ఆ అరుగులు కొట్టించి వెయ్యాలని చాల ప్రయత్నించింది. కాని శంకరయ్య ఆ విషయములో చాల మొండికేసాడు. అలా చేస్తే విషయం చాలా దూరం వెడుతుందని బెదిరించాడు. ఎందుకంటే ఆ అరుగుల ఇల్లు అతను ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాడు. ఆ అరుగులు చూస్తే అతనికి తన చిన్నతనం, తల్లి గుర్తుకొస్తాయి.

తమకి పూర్వం ఊరిలో అరుగుల ఇల్లే ఉండేది. తన తల్లి అరుగు మీద పడుకునే ముష్టివాళ్ళు “ఏమి దొరకలేదమ్మ ఈ రోజు” అంటే, తనకి మిగలకున్నా అన్నం పెట్టేసేది. అప్పుడు పొయ్యిలు కదా. కడిగేసుకుంటే మళ్ళీ వెలిగించటమంటే కష్టం. అయినా తను తినటం మానేసైనా పెట్టేది. చలికి పాత బట్టలు ఇచ్చేది.

ఎండాకాలం అయితే బాటసారులకి ‘దాహం’ పోసేది. దాహం అంటే ఒత్తి నీళ్ళు కావు. తమకోసం ఒక కుండలో పలచగా మజ్జిగ చేసి పోసి అందులో దబ్బాకు, లేక నిమ్మాకు వేసి ఉంచేది. ఇంట్లో పిల్లలు, పెద్దలు అదే తాగేవారు దాహం వేస్తే ఎండవేళ. వడదెబ్బ కూడా తగలదు అనేది. బాటసారులు దాహమంటే వాళ్ళకూ అవే పోసేది. వాళ్ళు కుండలోని చల్లని ఆ మజ్జిగ తాగి కాసేపు అరుగు మీద సేదతీరి, సంతోషముగా దీవించి వెళ్ళేవారు.

తను, అక్కలు ఆ అరుగు మీదే వైకుంఠపాళి ఆడుకునేవారు. అక్క, ఆమె స్నేహితులు చింతగింజలు, గచ్చకాయలు, అష్టా-చెమ్మా ఆడుకునేవారు. ఆ మధుర స్మృతుల కోసమే సుందరయ్య గట్టిగా శాంతమ్మని బెదిరించాడు.

ఎప్పుడూ మెత్తగా ఉండే సుందరయ్య కోపానికి శాంతమ్మ భయపడి ఊరుకొన్నా, నస మాత్రం పోలేదు. అక్కడితో సుందరయ్య సరిపెట్టుకున్నాడు.

***

శాంతమ్మ పుట్టింటికి దగ్గరలో ఉన్న ఒక చిన్న కుగ్రామములో ‘గోగులమ్మ’ గుడి ఉంది. ఆ గుడి ఏడాదికి ఒక్కసారే తెరుస్తారు. జాతర చేసి, మూసేస్తారు మళ్ళీ ఏడాదికే తెరిచేది. ఆ జాతరకే శాంతమ్మ,శంకరయ్య వచ్చారు నిరుడు. శాంతమ్మకి ఒకసారి బాగా జబ్బుచేస్తే శాంతమ్మ తల్లి మొక్కుకుందిట. చాలా మహిమగల దేవత, మొక్కు తీర్చకపోతే తప్పు (కీడు) అని భయపెట్టింది.

శాంతమ్మకి చిన్నప్పుడు కూడా ఇలాగే జబ్బు చేస్తే ఈ తల్లికే మొక్కుకున్నానని, గండం గడిచిందనీ చెప్పింది. శాంతమ్మ పెద్దగా నమ్మకపోయినా తల్లి పోరు, దైవభక్తి ఎక్కువున్న శంకరయ్య పోరు వల్లా బయలుదేరింది.

నేల ఈనినట్లున్నారు జనం. గుడి వరకు వాహనాలు వెళ్ళనివ్వటం లేదు. అరమైలు ముందరే ఆపేసారు కారు. ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళటం, స్పెషల్ దర్సనాలు, లేదా స్పెషల్ టికెట్స్ దర్శనాలు, త్వరగా పనులు పూర్తిచేసుకోవటం అలవాటైన శాంతమ్మ ఆ దూరం, లైను చూసే కళ్ళు వెళ్ళబెట్టింది. పైనించి ఎండా, షుగరు.

రెండు గంటలు గడిచాయి. రెండు గజాల దూరములో ఉంది ప్రాంగణం.

అప్పటికే ఎండకి, షుగర్ తోటి గొంతు ఎండిపోతున్నట్లు అనిపించింది శాంతమ్మకి. శాంతమ్మ తల్లి ఎప్పుడో వెళ్లి ఉండటం వల్ల, ఏర్పాట్ల గురించిన సరి అయిన సమాచారం ఆమెకీ తెలియదేమో సరిగా ఇవ్వలేకపోయింది. మోయలేక వెంట తెచుకున్న కొద్ది నీరు అయిపోయాయి. దుకాణాలూ వాహనాల ఆపిన చోటే ఉన్నాయి.

శాంతమ్మకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించసాగింది. పడిపోతానేమోనని భయం కలగసాగింది. కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. ఇలాంటి పరిస్థితి వస్తే స్వీట్ తినాలి. కనీసం ఏదో ఒకటి. కాని ఇక్కడ నీళ్ళే దొరకటం లేదు.

ఏమి చెయ్యాలి? లైన్ తప్పితే వేరే మార్గం లేదు. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళలేరు. వెళ్ళినా మళ్లీ ఎప్పుడైనా రావాలి కదా. అప్పుడెలా ఉంటుందో. అయినా వెనక్కి వెళ్ళాలంటే శంకరయ్య ఇష్టపడడు, తనకీ కొంచెం ప్రాణభయం. శంకరయ్య వైపు చూసింది. అతను భక్తి పారవశ్యములో ఉన్నాడు. అమ్మవారి స్తోత్రం కాబోలు చదువుతూ, గుడివైపే చూస్తూ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాడు.

***

శాంతమ్మ కళ్ళు తెరిచేసరికి ఆత్రముగా తనవంకే చూస్తున్న భర్త, ఒక స్త్రీ, మరో వ్యక్తి ఉన్నారు.

“ఏమైయ్యింది” అంటూ లేవబోయింది.

“లేవకు” అంటూ అప్పటికే లేవబోతున్న శాంతమ్మ భుజాలు పట్టి కూర్చోబెట్టాడు శంకరయ్య.

“ఏమైంది” మళ్ళీ అడిగింది.

“ఏమీ లేదు నీకు షుగర్ వల్ల ఎండకి కళ్ళు తిరిగాయి. పడిపోయావు. ఈ మహానుభావులు తమ ఇంటికి తెచ్చారు” అన్నాడు శంకరయ్య వాళ్ళకి దండం పెడుతూ.

ఆ స్త్రీ మజ్జిగ ఇచ్చింది. చల్లగా, కమ్మగా ఉంది. ఆత్రముగా ఆమె ఇచ్చిన రెండు గ్లాసులు తాగేసింది. ప్రాణం తేరుకున్నట్లు అయ్యింది. దిగబోతే చేతికి గట్టిగా తగిలింది. ఏమిటా అని చూసింది.

పేడ అలికి ముగ్గు పెట్టిన మట్టి అరుగు. చాలని దుప్పటి, దిండు ఉన్నాయి.

“మాకు మంచం అవీ లేవమ్మ అందుకే ఇక్కడ” అంటూ సిగ్గుపడింది ఆమె. అది పూజారి ఇల్లులా ఉంది. ఒక్కటే గది, సామాను ఎక్కువ లేదు. కాని ఇరుగ్గానే ఉంది. ఆ గదికి ఆనుకుని చిన్న అరుగు. తను ఉన్నది దాని మీద.

“ఇదుగో ఈ ఉప్మా తినండి. ఈ రోజు మేమంతా ఉపవాసం, వంట చెయ్యలేదు” అంది.

“వద్దండి బాగానే ఉన్నాను. వెళ్లిపోతాము” అంది నిలబడుతూ.

“ఫరవాలేదు తినేయ్యండి. ఎప్పటికి ఇంటికెళతారో. మా వారు కూడా ఇందులో ఒక పూజారి. ఒకేసారి దర్శనం చేయిస్తారు, వెళ్ళిపోవచ్చు” అంది బలవంతంగా ప్లీట్ చేతికిస్తూ.

మొహమాటానికి వద్దన్నా అది తిన్నాక నిజంగానే ప్రాణం తేరుకుంది. పూజారి గారు దర్శనం, పూజా చేయించారు. ఆనందముగా ఇల్లు చేరారు.

ఇంటికొచ్చే సరికి అరుగు మీద ఇద్దరు ముష్టివాళ్ళు అన్నం తింటూ కనిపించారు.

“మంగా” పిలిచింది. తలుపు తీసింది పనిపిల్ల మంగ. శంకరయ్య దిగులుగా చూడసాగాడు. అప్పటికే ఆ ముష్టివాళ్ళు కూడా కిందకు దిగి భయంగా చూడసాగారు. వాళ్ళు శాంతమ్మ గురించి విన్నారు. కాని ఊరిలో లేదని తెలిసి ధైర్యముగా కూర్చున్నారు.

“ఏంటమ్మా” అడిగింది. ఆమెకీ భయముగానే ఉంది. పనిలో ఉండి బిచ్చగాళ్ళను గమనించనే లేదు.

“వాళ్ళకు మంచినీళ్ళయినా, పచ్చడైనా కావాలేమో అడుగు” అంటూ లోపలి నడిచింది శాంతమ్మ.

Exit mobile version