అరుణ షాన్‌బాగ్… మూర్తీభవించిన దురదృష్టం, విషాదం

0
1

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ఈ[/dropcap] ప్రపంచంలో ఎన్నో విషాద జీవితాలను చూసి ఉంటాం, విని ఉంటాం. బొంబాయి నగరంలో ఒక యువతి ఒంటరిగా, అనాథగా హాస్పిటల్‌లో ఒక గదిలో 42 సంవత్సరాలు చేసిన ఒంటరి పోరాటాన్ని చెప్పే పుస్తకం ఇది. ఇది కల్పన కాదు నిజం. ఒక యువతి మరణానికి ముందు నిత్యం బ్రతికుండగానే కాలిపోతూ గడిపిన పచ్చి నిజం. ప్రపంచంలో ఏ వ్యక్తీ ఊహించని విషాద జీవితం అరుణ షాన్‌బాగ్‌ది. మెదడు సగం పని చేయక కోమా స్థితిలో 42 సంవత్సరాలు అపరిచితుల దయా దాక్షణ్యాల మీద బ్రతికిన ఆ శరీరం ప్రతిక్షణం బాధను అనుభవిస్తూ జీవచ్ఛవంలా పడి ఉండే స్థితి ఎవరికీ రాకూడదు. ఆమె బాధను యుతనేషియాతో అంతం చేయాలని పింకీ వీరాని చేసిన పోరాటం చాలా మందికి తెలుసు. కాని ఆమె ఆ కేసులో ఓడిపోయింది. అరుణ 42 సంవత్సరాలు కొమటొస్ స్థితిలో ఉండి సహజ మరణం పొందింది. కుటుంబం, స్నేహితులు ఎవ్వరూ ఆమె భాధ్యత తీసుకోవడానికి ముందుకు రానప్పుడు ఒంటరిగా హాస్పటల్ నర్సుల మధ్య 18 మే 2015 న తన చిరకాల బాధ నుండి విముక్తి పొందింది.

ARUNA’s STORY – The true account of a rape and its aftermath అన్నది పింకీ వీరాని 1998లో వ్రాసిన పుస్తకం. ఇందులో అరుణ జీవితాన్ని ఆవిడ రికార్డ్ చేసారు. ఎన్నో కలలతో బొంబాయి నగరంలో అడుగుపెట్టిన నాటి నుండీ ఇలా కొమటిస్ స్థితిలో ఆమె పడి ఉండడం వరకు ఆమె జీవితానికి సంబంధించి తాను సేకరించిన ప్రతి విషయాన్ని పాఠకులతో పంచుకున్నారు రచయిత్రి. ఒక పేద కొంకిణి కుటుంబంలో హల్దిపూర్ అనే చిన్న ఊరిలో పుట్టిన అరుణ మంచి జీవితాన్ని ఆశిస్తూ బొంబాయి చేరుతుంది. చదువుకుని KEM హస్పిటల్‌లో నర్సుగా ఉద్యోగం సంపాదించుకుంటుంది. నర్సింగ్ లోనే ఉన్నత చదువు కోసం విదేశాలకు కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంది. పెళ్ళి చేసుకుని గృహీణిగా ఉండిపోవాలని ఆమె ఎప్పుడు కోరుకోలేదు. చిన్నతనం నుండి మధ్య తరగతి గృహిణుల బాధలు చూసి ఉన్నందున ఆర్ధికంగా ఎదగాలని అనుకుంటుంది. తాను కోరుకున్న జీవితాన్ని తృప్తిగా అనుభవించాలన్న ఏకైక కోరిక ఆమెను నిత్యం ప్రేరేపిస్తుండగా ఆమె ఎంతో ఆత్మ విశ్వాసంతో పరిచయస్తులు ఎవ్వరూ లేని ఆ నగరంలో కూడా ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. సందీప్ సర్దేశాయ్ అనే ఒక యువ డాక్టర్ ఆమెతో ప్రేమలో పడతాడు. అంత దాకా వివాహం గురించి ఎప్పుడూ ఆలోచించని అరుణ విదేశీ ప్రయాణాన్ని మానుకుని అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది.

సందీప్ ఎమ్.డీ. పరిక్షల కోసం తయారవుతున్నాడు. అరుణ వివాహం తరువాత అతనితో కలిసి సొంత క్లీనిక్ తెరిచి ఇద్దరూ అందులో పని చేయాలను అనుకుంటారు. ఇద్దరివీ సాధారణ కుటుంబాలు కాబట్టి ఆ హాస్పిటల్ కోసం డబ్బులు ఆదా చేయాలని అరుణ విపరీతంగా కష్టపడుతూ ఉంటుంది. అదే హాస్పిటల్‌లో టెంపరరీ స్వీపర్‌గా పని చేస్తున్న సోహన్‌లాల్ అరుణ పై ఒక రాత్రి అత్యాచారం చేస్తాడు. హాస్పిటల్ క్రింది బేస్మెంట్ సౌకర్యంగా ఉంటుంది అని అక్కడ డ్యూటీ తరువాత బట్టలు మార్చుకోవడం కొందరి నర్సులకు అలవాటు. సోహన్‌లాల్ అది కనిపెట్టి కాపు కాసి అక్కడ అరుణ పై అత్యాచారం చేస్తాడు. ప్రతిఘటించిందని కుక్కలను కట్టేసే ఇనప గొలుసుతో ఆమె మెడ నులిమేస్తాడు.

పింకీ వీరాని ఈ అత్యాచారానికి సంబంధించి తాను సేకరించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఇచ్చారు. అరుణపై ఈ అత్యాచారం జరిగినప్పుడు ఆమెకి బహిష్టు సమయం. అందుకని సోహన్‌లాల్ వెనుక నుండి ఆమెపై రేప్ జరుపుతాడు, అందువల్ల రేప్ జరిగినట్లు కోర్టు ముందుకు ఏ సాక్షం తీసుకురాలేకపోతారు. మెడికల్ రిపోర్ట్స్‌లో ఆమె కన్నె పొర సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అందువలన లీగల్‌గా, వైద్యపరంగా ఆమెపై రేప్ జరిగినట్లు నిర్ధారించలేకపోతారు. 15 గంటలు అలా అపస్మారక స్థితిలో పడి ఉన్న తరువాత మరుసటి రోజు ప్రొద్దున ఆమెను చూసి వైద్యం మొదలెడతారు సిబ్బంది. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోతుంది.

ఇనప గొలుసుతో ఆమె గొంతుకు ఉరి బిగించడం వల్ల ఆమె గొంతులోని గాలి గొట్టం విరిగి ఆమె మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆ స్థితిలో ఆమె మెదడు కణాలు చాలా చనిపోతాయి. ఒక ముప్పై సెకండ్ల తన కామ తృప్తి కోసం ఒక మగవాడు చేసిన పని ఒక స్త్రీని జీవితాంతం శవంలా మిగిలిపోయేలా చేసింది. ఆమె మెదడుకు జరిగిన నష్టం ఎంత భయంకరంగా ఉండిందంటే ఆమె మామూలు మనిషయ్యే అవకాశాలే లేకుండా పోయాయి. ఆమె మెదడు ఎటువంటి సంకేతాలు తీసుకునే స్థితిలో లేదు. కనుగుడ్లు అరోగ్యంగానే ఉన్నా దృష్టి శాశ్వతంగా పోయింది. అలా అరుణ గుడ్డిదయి సగం మెదడు చనిపోయి మంచంపై పడి ఉండవలసిన స్థితిలోకి వెళ్ళిపోయింది.

అరుణ తమ్ముడు చెల్లెలు పోలీస్ కంప్లేంట్ ఇవ్వడానికి కూడా సముఖంగా లేరు. అందువలన పోలీస్ కంప్లేంట్ కోసం పోలేసులే సబ్ ఇన్‌స్పెక్టర్ లక్షణ్ నాయక్ ద్వారా ఆ కంప్లేంట్ ఇప్పించవలసి వచ్చింది. రక్తం అంటిన బట్టలు, ఒక బంగారు గొలుసు, కొంత డబ్బు సోహన్‌లాల్ ఇంటి నుండి స్వాధీన పరుచుకున్నాక, పోలీసులను పూణాలోని సోహన్‌లాల్ ఇంటికి చేర్చిన టాక్సీ డ్రైవర్ను సాక్షం కోసం పిలిపించవల్సి వచ్చింది. ఐ.పీ.సి. సెక్షన్ 307, 397 అధారంగా సోహన్‌లాల్‍కు ఏడు సంవత్సరాల శిక్ష పడింది. హత్యా ప్రయత్నం, దొంగతనం ఆధారంగా ఈ శిక్ష వేసారు కాని రేప్ జరిగినట్లు వైద్యపరమైన సాక్షాలు లేనందువలన అతను జైలు నుండి తరువాత విడుదలయి ఢిల్లీలో కొత్త జీవితం ప్రారంభించాడు. కాని అరుణ అదే స్థితిలో 2015 దాకా జీవించి అతి దీనమైన స్థితిలో మరణించింది.

ఈ సంఘటన తరువాత నర్సులు అరుణ పక్షాణ నిలబడి హాస్పిటల్ యాజమాన్యం ఆమె బాధ్యత తీసుకోవాలని స్ట్రైక్ చేసారు. మొట్టమొదటిసారి భారత దేశ చరిత్రలో నర్సులు చేసిన స్ట్రైక్ అదే. అరుణ జీవించినంత కాలం ఆ నర్సులే ఆమెను పరిచర్యలు చేసారు. కొన్నిసార్లు తాము అరుణకు అలా సేవ చేయడం ఎంత వరకు సమంజసం, ఆమె బాధను తాము ఇంకా పెంచుతున్నామా అని కూడా వాళ్ళూ బాధపడేవారు. అరుణ సమయంలో మేట్రిన్‌గా పని చేసిన ఒక సీనియర్ నర్సు, ఆమె పరిస్థితి చూసి ఆమె మరణించడం మంచిది అని తాను అనుకున్న సందర్భాలు కూడా ఉనాయని ఒప్పుకున్నారు.

అరుణను హాస్పిటల్ నుండి హోమ్‌లకు మార్చాలని మేనేజ్మెంట్ ఎన్నిసార్లు అనుకున్నా నర్సులు అది పడనివ్వలేదు. ఒక పది సంవత్సరాల తరువాత అరుణను యాజమాన్యం ఒక హోమ్‌కు పంపిస్తే నర్సులు పోరాడి ఆమెను తిరిగి హాస్పిటల్‌కు రప్పించుకున్నారు. అక్కడ ఆమెకు సరిగ్గా వైద్యం అందట్లేదని ఆమెను నిర్లక్ష్యం చేస్తునారని చూసి అది భరించలేక వారే ఆమెను మళ్ళీ హాస్పిటల్‌లో తమ మధ్యకు తెచ్చుకుని ఆమె బాధ్యత తీసుకున్నారు. అప్పటి హాస్పిటల్ డీన్ డా. దేశ్‌పాండే అరుణ పట్ల చాలా శ్రద్ద వహించారు. ఆయనకు అప్పట్లో ఎన్నో వింత ఉత్తరాలు కూడా వచ్చేవి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి మరో సారి అరుణ పై అత్యాచారం చేస్తే ఆమె మామూలు స్థితికి వస్తుందని దానికి తనకు అనుమతి ఇవ్వమని ఉత్తరం రాసాడట. ఆ షాక్ వల్ల ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందని తన వాదం వినిపించాడట. అలాంటి పరిస్థితులలో అరుణ క్షేమం కోసం దేశ్‌పాండే గారు చాలా కష్టపడవలసి వచ్చింది. అరుణతో వివాహానికి సిద్దపడిన డాక్టర్ ఒక మూడు సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆమెను చూడడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆమె మాతృభాష కొంకిణీలో ఆమెతో మాట్లాడుతూ ఆమెతో ఎన్నో విషయాలు పంచుకునేవాడు. కాని తరువాత అతనికి మరో స్త్రీని వివాహం చేసుకోవడం తప్పలేదు.

అరుణ చాలా ముక్కుసూటి మనిషి, కోపం కూడా ఎక్కువే. సోహన్‌లాల్ కుక్కల ఆహారం దొంగలిస్తున్నాడని అతన్ని అందరి ముందు తిట్టేది. సోహన్‌లాల్ అరుణపై కసి పెంచుకోవడానికి కారణం ఇదే. కొందరు నర్సులు అరుణ ఇలా అందరి ముందు సోహన్‌లాల్‌ను తిట్టడం ఇష్టపడక ఆమెను తప్పు పట్టేవారు కూడా. స్త్రీ చాలా అణుకువగా ఒంచిన తల ఎత్తకుండా మగవారి పై మాట మీర కుండా ఉండాలనే సాంప్రదాయం ఎక్కువ ఉన్న రోజులు అవి. కాని అరుణ ఇవేవి పట్టించుకునేది కాదు. తనకు తాను పురుషునితో సమానమనే భావించేది. నర్సులు దుస్తులు మార్చుకోవడానికి ఐదవ అంతస్తులో ఒక గది ఉన్నా బేస్మెట్ సౌకర్యంగా ఉంటుందని అక్కడే దుస్తులు మార్చుకోవడం ఆమెకు అలవాటు. ఇవన్నీ ఆమెపై సోహన్‌లాల్ అంత సులువుగా అత్యాచారం చేయడానికి కారణాలు. సీనియర్ నర్సులు అరుణ తొందరపాటు స్వభావాన్ని విమర్శించినా ఆమెపై జరిగిన అత్యాచార ప్రయత్నాన్ని, అందులోని రాక్షస చర్యను వారెప్పుడు సమర్థించలేదు.

సోహన్‌లాల్ జైలు నుండి విడుదలయిన కొన్ని రోజుల తరువాత ఒక రోజు అరుణను నేలపై పడి ఉండగా నర్సులు చూసారు. ఆమెను చూసుకుంటున్న నర్సులు ఆమె మంచంపై మెష్ ఉంచామని ఒట్టు పెట్టుకుని మరీ చెప్పారు. కొందరు ఒక మగవ్యక్తిని ఆ గది కిటికీ దగ్గర చూసామని చెప్పారు. అప్పటి నుండి అరుణ గదికి తాళం వేయడం మొదలెట్టారు హాస్పిటల్ సిబ్బంది. ఆ స్థితిలో కూడా అరుణ శరీర భాధ ఆమెకు తెలుస్తూ ఉండేది. ఆమె కీళ్ళూ విపరీతంగా నొప్పి పుట్టేవి. ప్రతి నెల ఖచ్చితంగా మెన్సెస్ వచ్చేది. పైగా నెలసరి ముందు, తరువాత ఆమె శరీరం నొప్పితో అల్లాడేది. బాధతో విపరీతంగా అరిచేది ఆమె. కొత్తవారిని గుర్తు పట్టేది. వారు ఆమెను ముట్టుకోవాలని ప్రయత్నిస్తే ముడుచుకుపోయేది. ఆమె కాబోయే భర్త తప్ప మరే పురుషుడు ముట్టుకున్నా ఆమె ఇబ్బంది పడేది. మగ గొంతు పాడుతూ రేడియో వినిపిస్తే విపరీతంగా అరిచేది. స్నానం చేయించుతున్న ప్రతి సారి నొప్పితో గిలగిలలాడిపోయేది. కాని ఓపిగ్గా ఆమెకు అన్ని చేసే నర్సులు సేవ మాత్రం మరువలేనిది.

పింకీ వీరాని ఈ పుస్తకంలో చివరన అరుణ గురించి చెప్తూ ఇలాంటి రోగులకు యుతనేషియా వరమే కదా అని రాస్తారు. ఆమె ఈ పుస్తకం 98 లో రాసారు. అప్పటికే అరుణ స్నేహితులు, పరిచయస్తులు అందరూ ఆ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోయారు. ఆమెను చూసుకుంటున్న నర్సులకు ఆమెతో పరిచయం లేదు. అపరిచితుల మధ్య ఏడుస్తూ, అరుస్తూ, నిత్య నరకం అనుభవిస్తూ కొన్ని సార్లు ఎందుకు నవ్వుతుందో తెలీక నవ్వుతూ ఆమె అలా రెండు దశాబ్దాల పాటు జీవించింది. స్వతంత్రంగా జీవించాలనే కోరికున్న స్త్రీ మన దేశంలో ఎన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కోవాలో అరుణ కథ చెబుతుంది. తరువాత పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన వైద్య వ్యవస్థ కూడా ఇటువంటి వారికి తోడ్పాటు అందించే స్థితిలో లేదు. KEM హాస్పిటల్ తరువాతి డీన్ డా. ప్రజ్ఞా పా మాట్లల్లో “ఒకప్పుడు వైద్యం ఉద్దేశం మనిషికి బాధ నుండి ఉపశమనాన్ని ఇవ్వడం. మేము పేషంట్ చేయి పట్టుకునే వాళ్ళం, వారికి ఓదార్పు ఇచ్చేవాళ్ళం, వారి కళ్ళలోకి చూసి మాట్లాడేవాళ్ళం. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అంతా వ్యాపారమే” అన్నారు.

KEM హాప్సిటల్ కూడా అటువంటి మార్పులన్నీ చూసింది. ఎంతో లంచగొండితనాన్ని, వ్యాపారాత్మక ధోరణిని అనుభవించింది. కాని అలాంటి స్థితిలో కూడా అరుణ షాన్‌బాగ్‌ను చూసుకుంటున్న నర్సులలో మాత్రం మార్పు రాలేదు. 42 సంవత్సరాలు వారు ఆమెను అదే ప్రేమతో, దయతో వంతులు వేసుకుని వారు చూసుకున్నారు. ఇది మనదేశంలోనే జరిగిన సంఘటన అంటే నమ్మలేనంత నిజాయితితో, కమిట్‌మెంట్‌తో ఆ నర్సులు ఆమెను చూసుకున్న విధానం మర్చిపోలేనిది. ఆమె కుటుంబం, ఆమెను తెలిసిన వ్యక్తులే ఆమెను పట్టించుకోని సమయంలో నర్సులు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అరుణ షాన్‌బాగ్ ఈ భూమిపై పుట్టిన స్త్రీ. ఇక్కడే ఎవరికీ జరగకూడని అన్యాయం ఆమెకు జరిగింది. అలాగే ఎవరూ పొందలేని సేవ ఎందరితోనే ఆమె పొందగలిగింది. అందుకే ఆమె జీవితాన్ని చదవాలి, స్త్రీల పరిస్థితి ఈ దేశంలో ఎంత హీనంగా ఉందో, చట్టం పరిధి నుండి నేరస్థులు అనాదిగా ఎలా తప్పించుకుంటున్నారో ఒక అవగాహన వస్తుంది. అలాగే స్త్రీలు ఒక శక్తిగా సంఘటితం అయితే ఒకరికొకరు ఎటువంటీ తోడుగా మిగలగలరో అర్థం చేసుకోవాలన్నా ఈ కథ చదవాలి. ప్రపంచంలో అరుణ షాన్‌బాగ్ అనుభవం సాధారణం కాదు. ఆమె నిజంగా దురదృష్టవంతురాలు. ఎన్నో సంవత్సరాల నరకం అనుభవించి, భయంకర ఒంటరితనాన్ని అనుభవించి మరణించిన అతి విషాదమూర్తి. ఈ పుస్తకంలో ప్రస్తావించిన యుతనేషియా పట్ల కూడా మనలో ఆలోచనలను రేకిత్తింస్తుంది అరుణ కథ…

నిజ జీవిత విషాద కథను మన ముందుకు తీసుకురావడానికి పింకీ వీరాని పడిన శ్రమ ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. వైద్య, న్యాయ, నైతికపరమైన ఎన్నో అంశాలు ఈ పుస్తకం చర్చకు తీసుకువస్తుంది. అందుకే తప్పకుండా చదవవలసిన పుస్తకంగా దీన్ని ప్రస్తావించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here