Site icon Sanchika

అసాధారణ స్త్రీ

[మాయా ఏంజిలో రచించిన Phenomenal Woman అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. ఆత్మవిశ్వాసం కలిగిన ఒక వేశ్య అంతరంగ చిత్రణగా ఈ కవితను చూడవచ్చు.]

~

[dropcap]అం[/dropcap]దమైన భద్ర మహిళలెందరో
నా రహస్యం ఏమిటో
ఎక్కడుందోనని ఆశ్చర్యపడతారు
నేను మరీ అంత అందంగా ఏమీ ఉండను
ఫ్యాషన్ మోడల్ కొలతల
సుందరాకృతీ నాకు లేదు
అయినా
నేను చెప్పడం మొదలెడితే
వాళ్ళు అవన్నీ అబద్ధాలనుకుంటారు
నేనంటాను – ఆ రహస్యం
నా చేతుల చేరువలో ఉందని
నా తుంటి పొడవు
నా పెదవి వంపు
నేను వేసే అడుగులు
నా ప్రతి కదలిక..

నేనొక స్త్రీని
అసాధారణ స్త్రీని
నేనొక ఆకర్షణీయ ఆత్మవిశ్వాసాన్ని
అదే నేను

మీరంతా కోరుకున్నంత ప్రశాంతంగా
నేనో గదిలోకి వెళతానా
ఆ మగవాడు అతని సహచరులు
లేచి నిలబడతారు
అమాంతం మోకాళ్ళపై కూర్చుండిపోతారు
తేనెపట్టు చుట్టూ తిరిగే తేనెటీగల్లా
వారంతా నా చుట్టూ గుమిగూడతారు
నేనంటాను
అది నా కళ్ళల్లో వెలిగే జ్వాల వలన అని
నా దంతాల మెరుపు
నా నడుము వంపులోని తూగు
నా అడుగుల్లో కనబడే విలాసం..
నేనో స్త్రీని
అసాధారణమైన స్త్రీని
అదే నేను

మగవాళ్ళు వారిలో వారు
విస్మయపడతారు
నాలో ఏం చూసి
ఇంతగా నా ఆకర్షణలో పడ్డామని
వారెంతో ప్రయత్నిస్తారు గానీ
నా అంతరంగపు లోతును
వారెన్నటికీ తెలుసుకోలేరు
నేను బహిర్గతం చెయ్యాలనుకున్నా
వారు ఆ మార్మికతను
అందుకోలేకపోతున్నామని చెపుతారు

అందమైన నా వంపుసొంపులు
సూర్యునిలా వెలిగే నా చిరునవ్వు
ఎగిసిపడే నా వక్షోజాలు
విభిన్నమైన నా శైలి
నేనో స్త్రీని
విలక్షణమైన స్త్రీని
నేనో అసాధారణాన్ని

మీకర్థమైందనుకుంటా
నా తలని నేనెందుకు దించుకోలేదో
నేను అరవను, తప్పు చేసినట్టు పారిపోను
తప్పించుకు తిరగను
నా ఎత్తు మడమల చెప్పులు టకటకలాడిస్తూ
నేను మిమ్మల్ని దాటిపోతున్నపుడు
నన్ను చూసి మీరు గర్వపడాలి
అదే నేను
ఆత్మవిశ్వాసమే నా అతిశయం
అదే నా రహస్యం

వంకీలు తిరిగిన నా శిరోజాలు
సుతిమెత్తని నా అరచేతులు
నా సౌందర్యాన్ని నేను సంరక్షించుకోవాలి
ఎందుకంటే
నేనొక అసాధారణ స్త్రీని
నేనొక ఆకర్షణీయ ఆత్మవిశ్వాసాన్ని!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

 

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని  చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

Exit mobile version