“దర్శకులు అశ్లీల చిత్రాలు తీసుకోండి, మీ ప్రేక్షకులు మీకు వుంటారు. కనీసం మంతో వాక్యాలను మాత్రం అడ్డం పెట్టుకోకండి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఆశ్చర్యచకిత్‘ సినిమాని సమీక్షిస్తూ.
ఇది Netflix ఒరిజినల్ చిత్రం. మామూలుగానైతే ఒరిజినల్స్ కాస్త బాగుంటాయి. వాళ్ళకు అన్ని విధాలా స్వేచ్చ వుండడం, పెద్ద సినెమాగా తీయడానికి అవసరం పడే మసాలాలు పరిహరించి, కథను సూటిగా, కొత్తగా చెప్పే వీలుంటుంది. కానీ ఒక్కోసారి మనం ఇప్పుడు నాలా బలైపోతాము.
ఆశ్చర్య ఫక్ ఇట్ అన్న పదాలు సూచించేలా ఆశ్చర్యచకిత్ అని శీర్షిక. పేరుకు తగ్గ సినెమా.
కాంత (ప్రియంకా బోస్) వో వేశ్య. ఆమె మీద మనసుపడ్డ బ్రోకరు ఖుషియా (సంతోష్ జువేకర్). కరణ్ కుమార్ (అంకిత్ రాజ్) వొక ప్రఖ్యాత సినెమా హీరో. అయితే అతను వొక సెక్సువల్ పర్వర్ట్. అమ్మాయిలని తన పక్క మీదకు రప్పించుకోవడం, వాళ్ళ బలహీనతల మీద ఆడడమే కాకుండా ఆ కార్యాలన్నీ వీడియో షూట్ చేయించి; తర్వాత వాటినే చూసి ఉద్రేకం పొందడానికి వాడుకుంటాడు. అతని దగ్గర డ్రైవర్ గా పనిచేసినతని మరణం తర్వాత అతని కొడుకు రాజు (వైభవ్ రాజ్) అతని దగ్గర డ్రైవర్ గా జేరుతాడు. వాస్తవానికి ఇద్దరూ చిన్నప్పుడు కలిసి ఆడుకున్న వాళ్ళే. ఆ చనువుతో మొదటిసారి పేరు పెట్టి పిలిస్తే అప్పుడే నీ హద్దుల్లో నువ్వుండు, సర్ అని పిలువు అని దూరం పెడతాడు. తర్వాత అతనికి కెమెరా వాడటం నేర్పి తన శృంగారాలు షూట్ చేయించుకుంటాడు. వొకసారి అమ్మాయిని తెమ్మని పురమాయిస్తే, రాజు కాంత ను తీసుకెళ్తాడు. కాంతకి నోటి దురుసు ఎక్కువ. కరణ్ కి స్తంభన సమస్య వుందని గమనించి, నవ్వుతుంది, వెక్కిరిస్తుంది. రోషంతో కరణ్ ఆమెను కొట్టి పంపించేస్తాడు, ఇలాంటి అమ్మాయిలను ఇంట్లోకి రానివ్వకూడదని రాజుతో అంటాడు. ఈ కారు ప్రయాణాల్లో (ఆమెను తేవడం, మళ్ళీ దించడం) రాజు కాంత ప్రేమలో పడతాడు. కాంత అతనితో పారిపోవాలని చూస్తుందని పసిగట్టిన ఖుషియా కోటి రూపాయలు తేకపోతే ఆమెను చంపేస్తానని రాజు తో చేబుతాడు. ఇక ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని రాజు కరణ్ ని బ్లాక్మేల్ చేసి కోటి రూపాయలతో పారిపోతాడు. చివర్న అర్థం పర్థం లేని (వాస్తవానికి మొదటి షాట్ నుంచీ) గొడవలు, వాదనలు, కొట్లాటలు, చంపడాలూ అన్నీ అయ్యాక బుల్లెట్లు తగిలినా చావని రాజు, కాంతలు వొక్కటవుతారు.
ఈ వారం ఇలాంటి చిత్రాన్ని పరిచయం చేస్తున్నానని నా మీద కోపం రావచ్చు. నా మీద నాకే వచ్చింది. మరే చిత్రమూ చూడకపోవడంవల్ల తప్పట్లేదు. సినెమా మొదట్లోనే సాదత్ హసన్ మంతో వాక్యం : If you find my stories dirty, the society you live in is dirty. With my stories I only expose the truth”. ఇది చూసి ఎవరైనా బోల్తా పడతారు. మంతో కథల్లో వేశ్యలుంటారు. బూతులుంటాయి. కాని అదంతా చాలా సహజ వాతావరణంలో వుంటాయి. వొక సజీవ జీవన చిత్రాన్ని, సమాజంలోని కొన్ని చీకటి కోణాలనీ అవి చూపిస్తాయి. చదివిన మనకు అసహ్యం కలగదు. బాధ కలుగుతుంది. సినెమాలో బూతులు గాని, నగ్నత గానీ వుండకూడదని నేను భావించను. అయితే ఆ బూతులు ఆ పాత్రలకు, ఆ వర్గానికి, ఆ సమాజం, ప్రాంతంలో సహజంగా వుంటే అప్పుడు ఎబ్బెట్టు అనిపించదు. నగ్నత్వం కూడా సినెమా కి అవసరమైనది అయితే ఎబ్బెట్టు అనిపించదు. కాని సమిత్ కక్కడ్ అనాఎ ఈ దర్శకుడు తెలివిగా ఇలాంటి కథనెంచుకుని, మంతో వాక్యం ప్రేరణ అని చెబుతూ వొక పోర్న్ చిత్రంలా తీశాడు. బూతులు కూడా కావాలని చూసేవాళ్ళకు వొక వల్గర్ ఆనందం కలిగించేలా వున్నాయి తప్ప ఏ విధంగానూ సమర్థనీయంగా లేదు. ఇక నటన, సాంకేతిక విలువలు అన్నీ అదే స్థాయిలో వున్నాయి.
దర్శకులు అశ్లీల చిత్రాలు తీసుకోండి, మీ ప్రేక్షకులు మీకు వుంటారు. కనీసం మంతో వాక్యాలను మాత్రం అడ్డం పెట్టుకోకండి.